చిటపటలు-16 "దండోపాఖ్యానం - భోళా శంకరులు" (02-August-2011)
ఈమధ్య డిగ్గీరాజా వారి "దండోపాఖ్యానం" వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి "దండబోధ"లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి.
* * *
2007 లో ఏదో దద్దమ్మల సామాజిక సేవా సంస్థ శీతలపానీయాల్లో పురుగుల మందులు వాడుతున్నారని ఆ రిపోర్టులు, ఈ రిపోర్టులు ఉటంకించి నానా రభస చేసింది. దేశంలో శీతల పానీయాలని నిషేధించాలని కూడా గొడవ చేసింది.
ఎందరెందరో సినీ తారలు, క్రికెటర్లు శీతలపానీయాలతో ప్రజలని ఉత్తేజితులని చేస్తుంటే, ప్రజలని త్యాగం చేయమనటానికి దద్దమ్మలకు నోరెలా వచ్చిందని అందరూ ఆడిపోసుకున్నారు.
ప్రజల నెత్తిన భారాన్ని పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం మాత్రం త్యాగం చేసే భారాన్ని తన నెత్తిన వేసుకుంది. పార్లమెంటు క్యాంటీన్ నుంచి శీతల పానీయాలని నిషేధించింది. శీతల పానీయాలు వదిలేసి, కేవలం లస్సీలు, జ్యూసులతోనే కాలం గడిపేస్తున్నారట మన ఎంపీలు. చూశారా, ప్రజల కోసం మన ప్రజా ప్రతినిధులు ఎంతెంత త్యాగం చేస్తున్నారో!
* * *
అన్నా హజారే పుణ్యమా అని, ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటులో లోక్ పాల్ బిల్లు ప్రవేశ పెడుతున్నది. ప్రధానిని, ఉన్నత న్యాయస్థానాలని, పార్లమెంటులో ఎంపీల వ్యవహారానికి, నిర్వాకాలకి కూడా లోక్ పాల్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చేసారు!
లోక్ పాల్ బిల్లు ప్రేరణతో, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్త కూడా ఇలాంటి మినహాయింపులే ఇచ్చే దిశగా మరెన్నో రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లు భోగట్టా. ఇకమీదట బయట కాకుండా పార్లమెంటులోనో అసెంబ్లీలో మాత్రమే లంచాలు మేయాల్సి రావటం త్యాగమే కదా!!
దీనివల్ల, అవినీతి అనే జాడ్యం అసెంబ్లీ, పార్లమెంటు వరకే పరిమితమౌతుందిట. సాధారణ జన బాహుళ్యం అవినీతికి దూరంగా హాయిగ బతుకులు వెళ్ళబుచ్చొట!
శీతల పానీయాలు త్యాగం చేసి, అవినీతి అనే గరళాన్ని మింగుతున్న మన ప్రతినిధులు భోళా శంకరులే... కాదనగలమా?
చిటపటలు-17 "కాంగ్రెస్ లో యువరక్తం" (09-August-2011)
రాష్ట్ర కాంగ్రెస్ ను యువరక్తంతో నింపే దిశగా రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. యువరాజును మోయటానికైనా, యువనేతను తోయటానికైనా ఇప్పుడున్న నేతల్లో చేవ చచ్చిందని, అందుకే వారి వారసులకు వల వేస్తున్నాడని గిట్టనోళ్ళు కోళ్ళలా కూస్తున్నట్లు సమాచారం.
కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతలు ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు భోగట్టా. అందులో భాగంగానే, నిన్నటి దాకా గాలిపటాలు ఎగరేసిన నలభై ఒక్క ఏళ్ళ యువరాజు చేత ఈసారి జెండా ఎగరేయిస్తారట.
* * *
కాంగ్రెస్ పంచలో చేరి, కాంగ్రెస్ పంచె కట్టి సోనియా పెట్టే శఠగోపం కోసం ఆర్నెల్లుగా ఇంట్లోనే గర్వంగా ఎదురుచూస్తున్న చంటబ్బాయికి మొత్తానికి ముహూర్తం కుదిరినట్లుంది. ఈ నెల ఇరవైన యువరాజు ఇచ్చే తీర్ధం పుచ్చుకోటానికి మరోసారి గర్వంగా ఎదురుచూస్తున్నాడట కాంగ్రెస్ గేట్ల వంక, గొళ్ళేల వంకా.! ప్రసాదంగా దద్ధోజనమే దక్కేనో, చక్రపొంగలే దక్కేనో!
* * *
చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అనే గాంధీ మూడు కోతుల సూత్రాలని మన ప్రభుత్వాలు అవినీతి పరంగా ఎంత చక్కగా పాటిస్తున్నాయో చూడండి.
మన్ మోహన్ సింగ్ - మాట్లాడమన్నా మాట్లాడడు*
యడ్యూరప్ప - వినమన్నా వినడు
కరుణానిధి - చూడమన్నా చూడడు.
గాంధీ చెప్పని నాలుగో కోతి, మరిచిపోతుంది కూడా!
చిటపటలు-18 "తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన..." (17-August-2011)
ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో చోటు కల్పించింది. అప్పటికే మహారాష్ట్రలో మహామహులనదగ్గ నేతలను అవినీతి కారణంగా మట్టి కరిపించిన అన్నాను తక్కువ అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వం తీరిగ్గా పొగ బెట్టింది. ఢాక్కాముక్కీలు తిన్న అన్నా అక్కడితో వదిలేస్తే మేకు ఎలా ఔతాడు... బాబా రాందేవ్ ఔతాడు కానీ...
ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా వల్ల వీసమెత్తు ఉపయోగం లేదని గాండ్రించాడు. డేటు, టైము, ప్లేసు అన్నీ చెప్పి మరీ ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మళ్ళీ, ఇదేదో రాందేవ్ వ్యవహారమేలే అని ప్రభుత్వం మరోసారి తక్కువ అంచనా వేసి, బురిడీ కొట్టేసింది. ఇక్కడో కధ చెప్పుకుందాం.
అక్బర్ తో ఒకసారి యాధాలాపంగా బీర్బల్ అంటాడు "ఒక్కోసారి తప్పు చేయటం కన్నా, ఆ తప్పుకు ఇచ్చే సంజాయిషీ అపాయకరంగా ఉంటుంది జహపనా" అని. నిరూపించకపోతే తల తీస్తానంటాడు అక్బర్. సీను మారింది. అక్బర్ పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. వెనక నుంచి బీర్బల్ వచ్చి పాదుషా పిర్ర గిల్లుతాడు. ఏదోలే పొరపాటేమో అని కొంచెం ముందుకు వెళ్తాడు అక్బర్. మళ్ళీ గిల్లుతాడు బీర్బల్. ఆగ్రహంతో ఊగిపోతాడు అక్బర్. ఎందుకు గిల్లావని అడిగితే, "క్షమించండి జహపనా, మీరనుకోలేదు, మహారాణి వారనుకున్నాను" అంటాడు.
ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఏకులా ఏదో నిరాహార దీక్ష చేస్తా అంటున్నవాడిని గిల్లింది ప్రభుత్వం. ఆనక, ఆయన శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తాడని అరెస్టు చేసామని సంజాయిషీ ఇచ్చింది. మొన్నటిదాకా వేలల్లో వెంట నడిచిన ప్రజలు ఒక్కసారిగా లక్షల్లో మద్దతుగా నిలుస్తున్నారు అన్నాకు. అడకత్తెరలో పోకచెక్కలా ఉన్న ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే, యాభై ఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇంతటి దివాలాకోరు రాజకీయాలు నడుపుతున్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.
అన్నాను అరెస్టు చేయమన్న దద్దమ్మలెవరు? ఆ పని చేసి ఆనక సంజాయిషీల మీద సంజాయిషీలు ఇప్పించిన చవటలెవరు? చివరికి వదిలేయమని చెప్పిన తుగ్లక్ లెవరు? చూస్తుంటే, తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ వలన మనం పరిపాలించబడుతున్నట్లుంది.
అయ్యా తుగ్లక్ మోహన్ సింగ్ గారు.... కపిల్ సిబల్సు, చిందంబరాలు, అభిషేక్ సింఘ్వీలు పదవులు పోయినా ప్రాక్టీస్ చేసుకు బతుకుతారు. వీళ్ళ సలహాలతో తమరు చరిత్రలో జోకర్ గా నిలబడటమే కాకుండా అమ్మకు, యువరాజుకు భారత్ లో బఠాణీలు అమ్మే పరిస్థితి కలిగిస్తున్నట్లున్నారు. జర భద్రం.
చిటపటలు-19 "చంటబ్బాయిలు - చంద్రబాబు" (25-Nov-2011)
పాపం చంటబ్బాయ్. తెలుగు సినిమాలలో ఎన్నెన్నో "పాత్రలు" అవలీలగా పోషించేసాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనో "పాత్ర" ధరిద్దామనుకుంటే, ప్రజలు వేరే "పాత్ర" ఇచ్చేసారు. ప్రజలిచ్చిన "పాత్ర" ఈ జగదేకవీరుడికి నచ్చలేదు. ఈ "పాత్ర" మారాలంటే మరో అయిదేళ్ళు పట్టేస్తుంది. త్రినేత్రుడి మూడో నేత్రం జ్ఞాన బోధ చేసే సరికి బంపర్ ఆఫర్ కోసం కాంగ్రెస్ అంట కాగాలనే నిర్ణయించాడు. తన పార్టీలోనైతే ఒక్కటే "పాత్ర". అదే వందేళ్ళ పైబడ్డ కాంగ్రెసైతే, కావల్సినన్ని "పాత్రలు", కాకపోతే "చెంచాలు, గరిటెలు" ఉండనే ఉన్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో కాంగ్రెస్ ముందు నీ "పాత్ర" ఇచ్చేయమంది, ఇచ్చేసాడు. నా "పాత్ర" ఏదని అడిగితే, కాంగ్రెస్ లో "పాత్ర" అంటే చాలా వ్యవహారాలున్నాయి, ముందు తీర్ధం పోస్తాం, శఠగోపం పెడతాం, ఆ తర్వాత ప్రసాదం ఇవ్వబడుతుందని సర్ది చెప్పారు. ఇవ్వబోయేది కేంద్రంలో "పెద్ద పాత్ర" అని కొన్నాళ్ళు ఊరించారు. కాదు కాదంటూ రాష్ట్రంలోనే "చాలా పెద్ద పాత్ర" అని ఊహించుకున్నాడు. చిన్న పాత్రలైనా, చితక పాత్రలైనా ఏదో ఒక "పాత్ర" పడేస్తారనే నమ్మకంతో ఇంట్లో "పాత పాత్రలు" అన్నీ ముందేసుకొని మీనమేషాలు లెక్కిస్తున్నాడట "కొదమసింహం"
* * *
సింహమంటే గుర్తొచ్చింది. "కరువుప్రాంత రైతులకు సహాయం అందించకపోతే, ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతా" నంటూ చంద్రబాబుగారు గర్జించారని వార్తలు. మొన్నగాక అటుమొన్న, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని భరోసా ఇచ్చిన పెద్దమనిషి ఇలా గర్జించటం ఏంటో! తమ గుండెలు వదిలేసి ఆయన ఎక్కడ బబ్బున్నా బాధలేదని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారట! తెలుగు తమ్ముళ్ళు మాత్రం బస్టాండుల్లో బఠానీలు తింటూ... ఈయనెప్పుడు నిద్రలేస్తారా అని నిట్టూర్పులు విడుస్తున్నారని భోగట్టా!
* * *
బస్టాండులో బఠానీలంటే గుర్తొచ్చింది. ఈ మధ్య దేశంలోని ఏ ఊరికెళ్ళినా అక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర అడుక్కునే వాళ్ళ మీద గుగ్గిలమౌతున్నాడట యువరాజు. సంగతేమిటా అని ఆరా తీస్తే, అలా అడుక్కునేవాళ్ళలో చాలామంది మాది ఉత్తర ప్రదేశ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారట! అలా అడుక్కోటానికి సిగ్గుగా లేదా, కనీసం ఇప్పుడైనా హస్తానికి ఓటేయండి యు.పి.లోనే అడుక్కునే అవకాశం ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాడట.
యు.పి.లో అడుక్కునే ట్రైనింగు కూడా ఆల్రెడీ మొదలేసాడని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. పూటకో గుడిసెలో దూరి "చాయ్ పానీ మై యెహీ పీవుంగా, రోటీ భీ యెహీ ఖావూంగా" అని గుడిసెల్లో రొట్టెలన్నీ లాగించిగాని బయటకు రావటంలేదుట! ఓట్ల కోసం ఇన్నేసి డ్రామాలా అని యు.పి. పార్టీలు ముక్కున వేలేసుకుంటుంటే, నేను మీలా స్టూడియోల్లో కన్నీళ్ళు కార్చే డ్రామాలాడను. భారతదేశం స్టూడియోల్లో లేదు, గుడిసెల్లోనే ఉందని ప్రూవ్ చేయటానికే అడుక్కొచ్చిన రొట్టెలు లాక్కొని మరీ తింటాను అని వీరంగాలు కూడా వేస్తున్నాడట!
చిటపటలు-20 "దున్నపోతులు - వడగళ్ళ వానలు" (08-February-2012)
ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో లంచం ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడట!
రోజుకో కొత్త కుంభకోణాన్ని తవ్వి తలకెత్తుకొని అవినీతిలో రోజుకో కొత్త లోతుని చూపిస్తున్న కాంగ్రెస్ చేసే ఎదురుదాడి చూడ ముచ్చటగా ఉంటుంది. ముందుగా ఇవన్నీ ఆరోపణలే అని అవహేళన చేస్తారు. పైగా వైరిపక్షాల కుట్ర అని కూడా తీర్మానిస్తారు. అంతేకాదు, ఫలానా సంవత్సరం, పలానా దుర్ముహూర్తంలో ఫలానా పార్టీ నాయకుడు చేసింది కూడా ఇదే అని ఆధారాలు చూపిస్తారు. అస్సలు ఇవ్వనేలేదని ఆరోపణలు తిప్పికొట్టే బేరం మొదలేస్తారు. ఆ తర్వాత, ఇచ్చినా తీసుకోలేదంటారు. ఒప్పుకోకపోతే కొంప కొల్లేరౌతుందన్న పరిస్థితి వస్తే, ఎవడో కార్యకర్తనో, లేదంటే కల్మాడినో, సరిపోకపోతే మరెవరో అధికారినో ముందుకు తోసి, వీడే పార్టీ గౌరవాన్ని భంగపరిచాడు, డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడని వాడి బండారం బట్టబయలుచేసామని దరువులు వేసుకుంటారు. ఈ రంగంలో ఢక్కాముక్కీలు తిన్న కాంగ్రెస్, అనుభవం నేర్పిన పాఠాలతో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరికీ అందనంత లోతుల్లో పవిత్రంగా ముక్కిపోతూ ఉంటుంది. కుళ్ళి కంపుకొట్టేది కార్యకర్తలే కానీ, పార్టీ కాదని ముక్కు చీదుకుంటుంది.
చేతివాటం చేతకాక కక్కుర్తిపడే కొన్ని పార్టీలు మాత్రం పరువుని బజారులో పాతరవేసుకుంటాయి. ఆ కోవలోదే రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రస్తుత పరిస్థితి. ఈ ముడుపుల భాగోతంలో భంగపడ్డ ఈ పార్టీలు తాము తీసుకున్నది లంచం కాదని, పార్టీ కోసం, పార్టీ మహాసభ కోసం తీసుకున్న చందాలని చెవుల్లో పూలు పెట్టుకుంటున్నాయి. గతంలో బంగారు లచ్చన్న భా.జ.పా. ప్రెసిడెంటుగా ముడుపులు తీసుకుంటు, దొరికిపోయి పాడిన పాత పాటే ఇది. ఆ తర్వాత భా.జ.పా. కూడా కాంగ్రెస్ లెవెల్లో కొత్త రాగాలు, సరికొత్త పాటలు నేర్చుకుంది. మొత్తానికి తర తమ బేధాలు లేకుండా పార్టీలన్నీ దున్నపోతులే అని తీర్మానించేయొచ్చు. వాన పడితే ఏం, వడగళ్ళు పడితే ఏం, సుబ్బరంగా తుడిచేసుకొని మన మీదే ముక్కు చీది పోతారు!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి