24, మే 2019, శుక్రవారం

రెడ్డొచ్చె మొదలాడా?

 రెడ్డొచ్చె మొదలాడా? (24-May-2019)


ఎట్టెకేలకు ఎన్నికల యుద్ధం ముగిసింది. దాదాపు 40 రోజులకు పైగా కొనసాగిన ఈ యుద్ధ ఫలితాలు, దేశ ప్రజల తీర్పులోని విలక్షణతకు, విచక్షణతకు అద్దం పట్టింది. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టి. అమలు, నల్లధన వ్యవహారంలోని వైఫల్యాల మధ్య కూడా నరేంద్రమోడీ నేతృత్వంలోని భాజపా మరోసారి గద్దెనెక్కింది. చాలామంది విశ్లేషకుల అంచనాల ప్రకారం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఈ అద్భుతమైన విజయం దక్కిందిట! ఆశ్చర్యం ఎందుకంటే, మునుపు వాజ్‌పేయి నేతృత్వంలో కార్గిల్ యుద్ధం గెలిచిన తర్వాత కూడా భాజపా 200 సీట్లు కూడా తాకలేకపోయింది. ఈసారి, కేవలం సర్జికల్ స్ట్రైక్స్ వల్ల 303 సీట్లు గెలుచుకోవటం ఆశ్చర్యమే కదా! ఎన్నెన్నో ఒడుదుడుకుల మధ్య, మరెన్నో ఆశల మధ్య 2014లో ఏర్పడిన భాజపా ప్రభుత్వం  చెప్పుకోదగ్గ విజయాలేమీ లేకుండానే 2019లో విజయబావుటా ఎగరవేసిందనేది వాస్తవం.


ఇక ఆంధ్రా విషయానికి వస్తే, చాలామందికి కలిగే అనుమానం ఒక్కటే. దేశస్థాయిలో మోడీ చేసిందేమిటి, రాష్ట్రస్థాయిలో బాబు చేయనిదేమిటి? రాష్ట్ర విభజన దరిమిలా జరిగిన 2014 ఎన్నికల సమయానికి, ఆంధ్ర రాష్ట్రం నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుమొక్కులేక దైన్యంగా నడిరోడ్డు మీద నిలబడి ఉంది. సమైక్య రాష్ట్రంలో ఒక దార్శనికుడుగా నిలచిన బాబుకు, గుజరాత్ దార్శనికుడుగా పేరు గడించిన మోడీ అండగా నిలబడతాననే వాగ్దానానికి ప్రజలు ఉప్పొంగి రాష్ట్రంలో బాబును గెలిపించారు. ఆ తర్వాతి సంఘటనల నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అటక ఎక్కింది. దాదాపు నాలుగు సంవత్సరాలు నలిగిన తెలుగుదేశం, భాజపాల సంబంధం కూడా చివరికి ఊపిరి వదిలింది.


ఈ వైఫల్యానికి తప్పొప్పులు వెదికే సందర్భం కాకపోయినా కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు. ప్రత్యేకహోదా విషయంలో ఇటు భాజపా బాబును మోసం చేస్తే, ఆంధ్రాలోని ప్రతిపక్షాలు బాబును మోసగాడిగా చిత్రించే ప్రయత్నాలు చేసాయి. నలువైపులా వస్తున్న ఒత్తిళ్ళ మధ్య చివరికి భాజపాతో బాబుకు తెగదెంపులు చేసుకోక తప్పలేదనేది మరో వాస్తవం. బాబు ఎన్.డి.ఏ.లో ఉంటే, ఇప్పుడు గెలిచి ఉండేవారా? బయటకు రావటం వల్ల ఓడిపోయారా? అనే ప్రశ్నలు విశ్లేషణకు అందనివి. ఎందుకంటే, ఒకవేళ, ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా, బాబు భాజపాతోనే అంటకాగి ఉంటే, అప్పటికే ప్రత్యేకహోదా కోసం ఉద్యమాలు లేవదీసిన పార్టీలు, ఇది మరింత అనువుగా తీసుకొని ఉండేవి.


మరి, కూటమి నుండి బయటకు వచ్చి ప్రత్యేకహోదా కోసం పోరాడినా తెలుగుదేశం ఎందుకు ఓడిందనేదానికి ఏం సమాధానం చెబుతారు?  ప్రజలు మార్పు కోరుకున్నారనే సమాధానం ఒక్కటే సరిపోయే అవకాశం ఉంది. బాబు నేతృత్వంలో తీసుకురాలేకపోయిన ప్రత్యేకహోదా, బహుశా జగన్ తీసుకువచ్చే అవకాశం ఉంటుందని ప్రజలు భావించి ఉంటారని చెప్పుకోవచ్చేమో! ఏదేమైనా, పట్టిసీమ పూర్తిచేసినా, కేంద్రప్రభుత్వం సరైన తోడ్పాటు అందించకపోయినా పోలవరం, అమరావతి నిర్మాణాలకి పూనుకున్నా, ఎన్నెన్నో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురాగలిగినా, ప్రకృతి వైపరిత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నా, ప్రజలు మాత్రం బాబుకు విరామాన్ని ఇచ్చారు.


మరి, ప్రజలు ఏమాశించి జగన్‌కు ఓట్లు వేసారు? బాబు అసమర్ధతను భరించలేకనా? బాబు ప్రభుత్వంలోని అవినీతి భరించలేకనా? మరి జగన్ సమర్ధత గురించి ఎలా అంచనా వేసి ఉంటారు? జగన్ మీద ఉన్న అక్రమ సంపాదన కేసులు మర్చిపోయారనుకోవాలా? నాకు తెలిసీ, ప్రైవేటుగా చాలామంది ప్రతిపక్ష పార్టీల నేతలు ఒప్పుకునే విషయం ఏమిటంటే, బాబు రాష్ట్రాన్ని సరైన పథంలో నిలబెట్టాడు. అభివృద్ధికి సరైన బాటలు పరిచాడు. కానీ, కేంద్రంతో సయోధ్య లేని కారణంగా అనుకున్నంత వేగంగా అభివృద్ధి జరగలేకపోతున్నది అని. బహుశా, ఆ ఉద్దేశ్యంతోనే, ప్రజలు జగన్‌కు ఓటు వేసి ఉంటారు.


అమరావతి నిర్మాణాన్ని అటక ఎక్కించటం ద్వారా, పోలవరం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పరచటం ద్వారా, నదుల అనుసంధానాన్ని నిలిపేయాలనుకోవటం ద్వారా, హైద్రాబాదులోని ఆంధ్ర రాష్ట్ర భవనాలు అప్పనంగా తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించటం ద్వారా, జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సరైన సంకేతాలు ఇవ్వటంలేదు. రెడ్డొచ్చె మొదలాడు అన్నట్లుగా, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని అడ్డుకొని మళ్ళీ మొదటి నుంచి మొదలేయాలనుకునే అడ్డగోలు నిర్ణయాలవల్ల నష్టపోయేది రాష్ట్రమే. ఇప్పటికే, కేంద్రప్రభుత్వ వివక్ష వల్ల, రాష్ట్రం విలువైన సమయాన్ని కోల్పోయింది. మరింత దగా జరిగే అవకాశం కూడా త్రోసిపుచ్చలేం. కాబట్టి, ఇప్పటికే బాబు వేసిన పునాదుల మీద ఆంధ్రుల భవిష్యత్తును రూపుదిద్దే అవకాశం కల్పించిన ప్రజల అంచనాలకు, ఆశలకు జగన్ తూగగలడనే ఆశిద్దాం. ఒక చారిత్రాత్మక అవకాశాన్ని వృధా చేయడనే ఆశిద్దాం.


30, ఏప్రిల్ 2019, మంగళవారం

ఆంధ్రాకి 'బాబు' అవసరం

ఆంధ్రాకి 'బాబు' అవసరం (30-April-2019)

లోటు బడ్జెట్టు. రాజధాని లేదు. ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. మౌలిక వసతులు లేవు. సమైక్య రాష్ట్రం నుంచి అంటించబడ్డ అప్పులు, అందజేయని ఆదాయాలు. అన్నిటికన్నా ముఖ్యంగా, నేతలపై ప్రజలలో రగులుతున్న అపనమ్మకం. పార్లమెంటులో అప్పటి ప్రధాని ప్రకటించిన ప్రత్యేక హోదా ఒక్కటే, కొసప్రాణానికి ఊపిరులూది ఆంధ్రులకు ఓ నమ్మకాన్ని కలిగించింది. సమస్యలను ఎదుర్కొనే సాహసాన్ని రగిలించింది. 2014 నాటికి, పాతపేరుతో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి స్థూలంగా ఇది.

అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు...రాజకీయలబ్ది కోసం హడావుడిగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ అయినా, ఆ గంతకు తగ్గ బొంతలా విభజన పాపంలో పాలుపంచుకొన్న భాజపా అయినా, రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళలాంటివన్న తెదేపా అయినా, తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించాయే కానీ, ఆంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోలేదనేది యధార్థం. ఆంధ్రాకు ఆలంబనగా నిలవాల్సిన అవసరాన్ని ఏ పార్టీ గుర్తెరగలేదు. ప్రత్యేక హోదాపై సరైన ప్రస్తావన లేకుండానే విభజన బిల్లు ఆమోదించారు. తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా, అప్పటి ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించటమే కాకుండా, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరు కూడా మంత్రిమండలి సమావేశంలో తీర్మానించి ఆమోదించారు.

ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో రాష్ట్రానికి ఓ సమర్ధవంతమైన నాయకత్వం అవసరమని ప్రజలకు తెలుసు. దాదాపు ఒక దశాబ్దం పాటు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనాదక్షుడుగా పేరుపొందిన బాబు మీద ఆశలన్నీ నిలుపుకున్నారు. అంతేకాక, బాబుకు తోడుగా ఉంటూ, రాష్ట్రానికి నీడలా ఉండి, ప్రత్యేక హోదా ఇచ్చి, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రాని తీర్చిదిద్దే ప్రయత్నంలో నేను కూడా భాగస్వామినౌతాననే నరేంద్రమోడీని నమ్మారు. అరమరికలు లేకుండా, ఆంధ్రులు వేసిన వోటుతో ఎన్.డి.ఏ. భాగస్వామిగా తెదేపా ఘన విజయం సాధించింది.

అయ్యవారు అంతంత, అయ్యవారి పెళ్ళాం ముంతంత...ముందుగా, ప్రత్యేక హోదా విభజన బిల్లులో లేదు అంటూ మీనమేషాలు లెక్కించారు. ఆనక, ప్రత్యేక హోదా చట్రంలో ఆంధ్రప్రదేశ్ ను ఇరికించలేమని తేల్చారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నసిగారు ఇంకొన్నాళ్ళు. ప్రత్యేక ప్యాకేజీ కూడా చట్టబద్ధం చేయలేమని గునుస్తూ చేతులెత్తేసారు. కావాలంటే, ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని కుండ బద్దలు కొట్టేసారు... అయ్యవారు.  

బీహార్ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి ప్రకటించిన లక్షకోట్ల సాయంలాగా, కర్ణాటక ఎన్నికల ముందు ఆ రాష్ట్రానికి ప్రకటించిన మూడు లక్షల కోట్ల సాయంలాగా, ప్రత్యేక సాయం మాత్రమే చేస్తారట! కొత్తగా ఏర్పడ్డ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో పోలికేమిటనేది మనకు అర్ధం కాదు. పోనీ విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ చేసారా అంటే అదీ లేదు. ఉదాహరణకు; దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోను, రాయలసీమ ఉక్కు కార్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, పోలవరం, విశాఖ మెట్రో తదితరాలు. ఇకపైగా, వాటి సంభావ్యత గురించి మాత్రమే విభజన చట్టంలో ఉన్నదనే ముక్తాయింపు.

అర ఘడియ భోగం, ఆర్నెల్ల రోగం అన్నట్లు... ఎన్.డి.ఏ. భాగస్వామిగా తెదేపా బావుకున్నది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే, మోడీలాంటి ఓ చపలచిత్తునితో సఖ్యత తెదేపా అస్థిత్వానికే ముప్పు తెచ్చిపెట్టింది. దేశప్రధాని హోదాలో ఒక కొత్త రాష్ట్ర రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన మోడీ గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్ళు, ఇస్తాడని బహుశా బాబు కూడా ఊహించి ఉండడు. మొహమాటానికైనా చేయబోయే సాయం గురించైనా ఓ ప్రకటన చేస్తాడని ఆశించి భంగపడి ఉంటాడు.

పోనీ, ఓ బాధ్యతగల ప్రధానిగా, అయిదుకోట్ల ఆంధ్రులకు ప్రత్యేక హోదా విషయంపై వివరణ ఇచ్చారా అంటే, అదీ లేదు. ఇంకా విచిత్రం ఏమిటంటే, రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులతో అడ్డుతెరల వెనక అంటకాగుతూ, ప్రత్యేక హోదా విషయంలో బాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయటం! ఇకపైగా, ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ నేత జగన్ పెట్టిన వత్తిళ్ళకు బాబు భయపడ్డాడని ప్రకటనలు చేయించటం.

ప్రత్యేకహోదా ప్రత్యేక ప్యాకేజిలా మారినప్పుడు, ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక సాయంలా మారినప్పుడు బాబుతో చర్చలు జరిపారా లేదా? బాబు ఒప్పుకుని ఉంటే, ఆ చర్చల వివరాలు బయటపెట్టాలిగా? ఆ పని చేయలేదంటే ఏమని అర్ధం చేసుకోవాలి? అదేమైనా రెండు పార్టీల మధ్య జరిగే లోపాయికారి ఒప్పందమా లేక అయిదుకోట్ల ఆంధ్రులతో ముడిపడ్డ విషయమా? నిజానికి కేంద్రంలోని భాజపాతో తెదేపా సఖ్యత, రాష్ట్రానికి వీసమెత్తు ఉపయోగం లేకపోగా, తెదేపాకి తీవ్ర నష్టాన్ని మాత్రం కలిగించింది.

అత్తపేరు పెట్టి కూతురిని కొట్టినట్లు...దరిమిలా బాబుకున్న మూడో కన్ను తెరుచుకుంది. సామరస్యంతో పొత్తులో కొనసాగి, రాష్ట్రానికి మేలు చేయగలమనే నమ్మకానికి తూట్లు పడ్డాయి. తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాడు. తెగదెంపులు చేసుకున్నాడు. ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలేసాడు. అప్పటిదాకా, కేంద్ర సాయం మురిగిపోయిన లడ్లుగా తీసిపారేసిన పవన్, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తామని గర్జించిన జగన్ ఒక్కసారిగా చల్లబడ్డారు. ఆ పోరాటానికి సంఘీభావం తెలుపకుండా, అన్ని మాటలు మార్చిన తెదేపాని మేము నమ్మం అని ఎక్కెసెక్కాలాడారు. పిల్లపార్టీలు కాబట్టి, వారి రాజకీయ విజ్ఞత వారికే వదిలేద్దాం. మరి భాజపా చేసిందేమిటి?

రాష్ట్రానికి నిధులు ఇవ్వటం లేదంటే, యు.సి.లు ఇవ్వట్లేదని అబద్ధాలు చెప్పింది. ఫలానా ఆసుపత్రులు, కళాశాలలు కట్టలేదంటే, రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదని నెపం బాబు మీదకు తోసింది. ఫలానా ప్రాజెక్టు గురించి వివరణ కోరితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వలేదని అబద్ధాలు చెప్పింది. సాక్షాత్తు దేశ ప్రధాని, పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యు.సి.లు ఇవ్వలేదని ప్రకటించాడంటే తిమ్మినిబమ్మి చేయాలనే భాజపా కుటిల ప్రయత్నాలు మనకు తెలిసివస్తాయి. 

మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కేంద్ర ఆర్ధిక శాఖకు నీతి ఆయోగ్ వ్రాసిన లేఖలో చాలా స్పష్టంగా యు.సి.లు ఉన్నాయని చెప్పినా, మోడీ ఈ దుర్మార్గపు అబద్ధాలు చెప్పటం మానలేదు. ఆర్ధికశాఖ సహాయమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం కూడా మోడీ అబద్ధాలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. అతిపెద్ద వింత ఏమిటంటే, ఇటుపక్క ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతిమయమైన తెదేపా నాశనం చేస్తున్నదని భాజపా నాయకులు విమర్శిస్తుంటే, అటుపక్క వివిధ కేంద్రప్రభుత్వ సంస్థలు ఆయా శాఖలలో సాధించిన ప్రగతికి ఆంధ్రా రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు ఇస్తున్నాయి!

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను పక్కదారి పట్టించటం నుంచి, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలను నియంత్రించటం వరకు, రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అనే అర్ధంపర్ధంలేని విమర్శల నుంచి, రాష్ట్ర మంత్రులు, తెదేపా నాయకుల మీదకు దర్యాప్తు సంస్థలను పురిగొల్పటం వరకు, అన్నిరకాల దండోపాయాలని ఉపయోగించి విఫలమైంది మోడీ ప్రభుత్వం. మొత్తానికి బాబు మీది తన పగను, రాష్ట్రం మీద చూపిస్తున్నాడు మోడీ.

నంగనాచి చీర నడివీధిలో ఊడినట్లు...ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో నరేంద్రమోడీ నిజాయితీలేమి నిలువెత్తు నగ్నంగా ఆవిష్కృతమయ్యింది. పట్టుమని పదిమంది సభ్యుల మద్దతు లేక జగన్ ప్రతిపాదించిన అవిశ్వాసతీర్మానం కూలబడితే, బాబుకు చేయూతనందిస్తూ వందకుపైగా సభ్యులు చేసిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కూడా మోడీ సిద్ధం కాలేకపోయాడు. ఎట్టకేలకు తలవొగ్గి చర్చ ప్రారంభించినా, ఆరుకోట్ల ఆంధ్రుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక నీళ్లు నమిలాడు. ఎన్.టీ.ఆర్.ను బాబు వెన్నుపోటు పొడిచినట్లుగా పరోక్షంగా ప్రస్తావించిన పెద్దమనిషి, ఆ బాబుతో ఎన్నికల పొత్తు ఎందుకు పెట్టుకున్నాడనే ప్రశ్నకు ఈనాటివరకూ సమాధానం ఇవ్వలేకపోయాడు.

***

2014 ఎన్నికల ముందు, మోడీ-బాబుల కూటమి దేశానికి రాష్ట్రానికి చక్కని దిశానిర్దేశం చేస్తుందని ఆశించినవాళ్ళలో నేను ఒకడిని. ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రానికి కేంద్రం మొండి చేతులు చూపిస్తున్నా కిమ్మనకుండా కూర్చున్న బాబును విమర్శించిన రోజులు చాలా ఉన్నాయి. తన ప్రభుత్వ అసమర్ధత, అవినీతి కారణంగా పెదవి మెదపకుండా ఉన్నాడనే అందరిలా భావించా కానీ, ఓ దార్శనికుడుగా సహనంతో వేచి చూస్తున్నాడని భావించలేదు. అసలు పొత్తే లేకుండా ఉన్నా, 2015 నాటికే పొత్తు నుంచి బాబు దూరమైనా, రాష్ట్రం అధోగతిలో ఉండేది. ఏటికి ఎదురీదుతూనే, తన గమ్యాన్ని నిర్దేశించుకుంటూ బాబు చేస్తున్న ప్రయాణం నిజంగా ఓ అద్భుతం.

ఎట్టకేలకు రాష్ట్రం ఓ గాడిన పడిందనే నమ్మకం కలుగుతున్నది. 
అన్నం పెట్టినవాడిని, తన్నులు తన్నినవాడిని ఆంధ్రులు అంత తేలికగా మరచిపోరు. ఏదేమైనా, తెలివితక్కువగా విభజన చేసి, ఆంధ్రులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ అయితే, ఆసరాగా నిలబడతారనుకున్న భాజపా, ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచి, నోటిలో మట్టి కొట్టింది. 

ఆదాయం లేకున్నా, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టినా, మిత్రులే శత్రువులుగా మారినా, సంక్షోభాలెన్ని చుట్టుముట్టినా, రాష్ట్ర సంక్షేమానికి బాబు కృషి చేస్తున్నాడనేది నిజం. బాబులాంటి రాజకీయ దురంధరుడికే చెమటలు పోస్తున్న పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్, జగన్ లతో రాబోయే కేంద్ర ప్రభుత్వాలు ఓ ఆట ఆడుకుంటాయనేది నిష్టూరమైన నిజం. 2019లో ఏ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో బాబు ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్ట్ర భవిష్యత్తును 2019 ఎన్నికలు నిర్దేశించబోతున్నాయని ఆంధ్రులు గ్రహించాలి. జాతీయ పార్టీలను పెకిలించి వేయాలి. రాష్ట్రానికి బాబు మాత్రమే అవసరం.



25, ఏప్రిల్ 2018, బుధవారం

జనసేన నేత పవన్‌కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ...

 జనసేన నేత పవన్‌కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ...


గౌరవనీయులు పవన్‌కళ్యాణ్ గారికి - నమస్కారాలతో...


ఈమధ్య ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మీతో నా భావాలు పంచుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఈ బహిరంగ లేఖ. మిమ్మల్ని అవమానించాలనో, మీ అభిమానులను కవ్వించాలనో ఉద్దేశ్యంతో మాత్రం వ్రాయలేదని గ్రహించగలరు.


ఈ లేఖకు సంబంధించి అప్రస్తుతమైనా, నేను ఒకప్పుడు ఎన్.టి.రామారావు, శోభన్‌బాబు గార్ల అభిమానిని. ఆ తరువాతి తరంలో చిరంజీవి, బాలకృష్ణలకు అభిమానిని. ఇప్పటితరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్.టి.ఆర్.ల అభిమానిని అని చెప్పదలచుకున్నాను.


***


ఇక అసలు విషయానికి వస్తే, నేను ప్రస్తావించాలని భావించిన విషయాలు ముఖ్యంగా రెండు ఉన్నాయి. అందులో మొదటిది, ప్రజారాజ్యం నేపథ్యం - నిష్క్రమణ. రెండవది, జనసేన నేపథ్యం - లోటుపాట్లు.

ప్రజారాజ్యం నేపథ్యం - నిష్క్రమణ

ఎన్.టి.ఆర్. తరువాత అంతటి ప్రజాదరణ కల హీరోగా మేము భావించిన చిరంజీవి 2008 నాటి  ప్రజారాజ్యాన్ని, 1980ల నాటి ఎన్.టి.ఆర్ తెలుగుదేశంతో సరిపోల్చటం తప్పు కాదు. 1980ల నాటి రాజకీయాలలోని శూన్యత, ప్రత్యామ్నాయంలేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగించిన దుష్పరిపాలన నేపధ్యంలో "తెలుగువాడి ఆత్మగౌరవం" ఒక నినాదమై సహజంగానే ప్రజలను ఆకర్షించింది. నిర్లిప్తంగా నిర్వికారంగా నిద్రాణమై ఉన్న తెలుగుజాతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.

ఎన్.టి.ఆర్ సామాజిక న్యాయమంటూ నంగి మాటలు మాట్లాడలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ గర్జించాడు. కొత్త రాజకీయాలంటూ దిక్కులు చూడలేదు, రాత్రికి రాత్రి కొత్త నాయకులను తయారుచేసాడు. ఎన్నికలలో వారికి దన్నుగా తాను నిలిచాడే కానీ, వారి డబ్బుతో తాను నుంచోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పెకిలించివేయాలనే లక్ష్యంతో, స్థిరచిత్తంతో అడుగులు వేసాడే కానీ, ఒకడుగు ముందుకువేసి రెండు అడుగులు వెనక్కు తగ్గే తరహాలో కాదు.

ఎన్.టి.ఆర్ కు పూర్తి విరుద్ధమైన తరహాలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భవించే నాటికి, సమైక్యాంధ్రలో ఎటువంటి రాజకీయ శూన్యతా లేనప్పటికీ, చిరంజీవి ఎలుగెత్తిన సామాజిక న్యాయం అనే నినాదాన్ని ప్రజలు తలకెత్తుకోవాలనే భావించారు. కానీ, ఏ ప్రశ్నకైనా, కప్పదాటు సమాధానాలే తప్ప, ఖచ్చితమైన సమాధానం ఏనాడు చిరంజీవి ఇవ్వలేదు. తన పార్టీవారే, తననే తిట్టిపోస్తున్నా, తమలో తామే కోట్లాడుకుంటున్నా ఒక సామాన్య ప్రేక్షకుడిలా దిక్కులు చూసాడే కానీ, ఒక నాయకుడుగా దిశానిర్దేశం చేయలేకపోయాడు. రాజకీయ అవగాహన, విషయ పరిజ్ఞాన లేమి కొట్టొచ్చినట్లుగా కనిపించేది.

Page No. 1/4

విచిత్రం ఏమిటంటే, 2009 ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?

వీటన్నిటికన్నా ప్రధానకారణం, ప్రజారాజ్యం పార్టీలోని మేధోపరమైన శూన్యత. సరైన సమయంలో సరైన అవగాహన కల్పించి, సరైన నిర్ణయాలు తీసుకోగలిగే నేతలు లేకపోవటం. దూరాలోచనలు చేయగలిగే నాయకులు లేకపోవటం.


***


జనసేన నేపథ్యం - లోటుపాట్లు



రాష్ట్ర విభజన గాయాల నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల సమయంలో, చాలామందికి చిరంజీవి ప్రజారాజ్యం ఉండిఉంటే బాగుండేదని అనిపించిన మాట వాస్తవం. అప్పటికి కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నా, కనీసమాత్రంగానైనా రాష్ట్ర విభజనను ఖండించింది చిరంజీవే. తెలంగాణాలో తనకన్ను తాను పొడుచుకోలేని పరిస్థితుల్లో రెండు కళ్ళ సిద్ధాంతంతో ఒకవైపు తెలుగుదేశం, విభజన పాపాన్ని కాంగ్రెస్‌కు కాకుండా చంద్రబాబుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఇటు వైయస్సార్పీ. పోటీ ప్రధానంగా సాగింది ఈ రెండు పార్టీల మధ్యే. 


రాజకీయాల్లో, అయితేలు - గియితేలు, కానీలు - అరకానీలు ఉండవు, అయినా కూడా, 2014లో ప్రజారాజ్యం ఉండి ఉంటే, ఆంధ్రా ప్రజలు 2009నాటికన్నా కూడా ప్రజారాజ్యాన్ని ఆదరించి ఉండే వారని నేను ఖచ్చితంగా చెప్పగలను. సరిగ్గా ఆ సమయంలోనే మీరు ప్రకటించిన జనసేన ప్రజలలో ఆశలు రేకెత్తించిందనేది అతిశయోక్తి కాదు.


"సామాన్యుడి హక్కుల కోసం పోరాడదాం" అనే స్ఫూర్తితో అప్పుడే కళ్ళు తెరిచిన పసికూన జనసేన; భా.జ.పా., తెలుగుదేశంకు మద్దతుగా నిలవటం, 'రాజకీయాల్లో చంటబ్బాయి చిరంజీవినే' గుర్తుకు తెచ్చింది. ఎన్నికల అవగాహనలు తప్పు కాదు. కానీ, జనసేనకు ప్రాతినిధ్యం లేని అవగాహనలోని ఔచిత్యం ఏమిటి? ఒకవేళ, రాజకీయ పార్టీగా పూర్తి సంసిద్ధత లేని పక్షంలో, తన అభ్యర్ధులను స్వతంత్రులుగా నిలబెట్టి ఉండవచ్చు కదా! చట్టసభలలో ప్రాతినిథ్యం లేకుండా సామాన్యుల హక్కులు ఎలా సాధించగలం అనే ప్రాథమిక ప్రశ్న కూడా వేసుకోలేకపోవటం జనసేనలో లోపాన్ని ఎత్తి చూపిస్తుంది. అధికారం ముఖ్యం కాదు, హక్కుల పోరాటమే ముఖ్యం అనుకోవటం రాజకీయ పరిజ్ఞాన లేమినే సూచిస్తుంది.


Page No. 2/4

 


నిన్న మొన్నటి శ్రీరెడ్డి విషయంలో కూడా, అనవసరమైన వివాదాన్ని పూస్తుకున్నట్లే కనిపిస్తుంటే ఎవరిది తప్పు. ఒక అమ్మాయి సినీ ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలపై గొంతెత్తింది. సామాన్యుల హక్కుల కోసం పోరాడే జనసేన కార్యకర్త ఏం చేయాలి? వెంటనే, మందీ మార్బలంతో పోరాటానికి ఉపక్రమించాలి. మరి మీరు చేసిందేమిటి? ఆ అమ్మాయిని పోలీసులకు ఫిర్యాదు చేసుకోమని చెప్పటమా, హక్కుల కోసం పోరాటమంటే! అందుకు ప్రతిస్పందిస్తూ ఆ అమ్మాయి మిమ్మల్ని బూతులు మాట్లాడిన వెంటనే, ఆఘమేఘాల మీద పోరాటం ప్రకటించారే! ఎవరి మీద? ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి చేసిన బూతు ప్రసంగాన్ని మ్యూట్ చేసి ప్రసారం చేసిన మీడియా మీద! ఇంత రాజకీయ అపరిపక్వతతో ఏం సాధించగలరని మీ ఉద్దేశ్యం?


మీ మీది అభిమానంతో, రాళ్ళు రువ్వి, ఆస్తులు ధ్వంసం చేసి పోలీసులచే నిర్భంధించబడ్డ ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? అసలు, ఈ పిల్లలు మీకు జరిగిందనుకున్న అవమానంపై ఎందుకు పోరాటం చేయాలి? అభిమానులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో మీరు చేస్తున్న ప్రసంగాలు దీనికి కారణం కాదని అనగలరా? రాజకీయాల్లో వచ్చే వివాదాలు రాజకీయంగానే పరిష్కరించుకో గలిగే నేర్పు ఓర్పు లేనప్పుడు రేపు ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎన్నికైతే, రాష్ట్రం పరిస్థితి ఏమిటి? 


రైట్, ప్రత్యేక హోదా విషయంలో మన రాష్ట్రాన్ని భా.జ.పా. మోసం చేసింది. ఆ తిలా పాపంలో తెలుగుదేశంది కూడా ఓ పిడికెడు ఉంది. మరి, మీ భాగస్వామ్యంతో ఏర్పాటైన ప్రభుత్వమేగా ఇది. మీ పిడికెడు పాపం లేదని అనగలరా? ఈ రెండు పార్టీలతో 2014లో మీరు చేసుకున్న అవగాహనకు క్షమాపణ చెప్పలేదే, తెగతెంపులు చేస్తుకుంటున్నామని ప్రకటించలేదే? 


ప్రత్యేక ప్యాకేజీ కంపుకొడుతున్న లడ్డు అని అభివర్ణించిన మీరు, కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసివచ్చిన మీరు, ఆంధ్రుల హక్కుల పోరాటానికి పాంచజన్యాన్ని పూరించలేదే? రైట్, రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో అవినీతి ఉందని కూడా మీరు ఆరోపిస్తున్నారు, ఆవేదన పడుతున్నారు. సరే, ఆ అవినీతి చిట్టా పద్దులు చెప్పమని అడగగానే, బయట ప్రజలు అనుకుంటున్న విషయమే నేను చెప్పాను అనే నంగి మాటలు దేనికి? రాజకీయాలంటే సినీ గాస్సిప్పులని భావిస్తున్నారా? నేను లేస్తే మనిషిని కాదు అన్న బెదిరింపులే తప్ప, ఈ నాలుగు సంవత్సరాలలో ప్రజల కోసం మీరు చేసిన పోరాటం ఒక్కటి చూపగలరా? 


అప్పట్లో చిరంజీవి చేసిన తప్పులు తిరిగి చేయరాదనే ఉద్దేశ్యంతో తొందరపడి పక్క పార్టీ నేతలను చేరదీయటంలేదు. మంచిదే. కానీ, మీ పార్టీలో మేధోమథనం చేయగల నాయకుడు ఏడి? రాజకీయపు ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగే దురంధరులు ఏరి? కనీసం, ఆలోచనలు సక్రమంగా ప్రజలకు చేరవేయగలిగే సమాచార వ్యవస్థ ఏది? అయినదానికి, కానిదానికి ఉద్రేకంతో ఊగిపోయే అభిమానుల ఎనర్జీని గాడిలో పెట్టగలిగే వ్యవస్థ ఏది? వారి కారణంగా అభాసుపాలౌతున్న పార్టీగానీ, మీ పలుకుబడి గురించి గానీ ఆలోచించి మీకు నచ్చజెప్పే సలహాదారులు ఏరి? 


Page No. 3/4



మొన్నటిదాకా, తెలుగుదేశం, తెరాసా, కాంగ్రెస్  పార్టీలు విదిలించిన ఎంగిలి మెతుకులతో సీట్లు గెలుచుకున్న పరాన్నభుక్కులైన కమ్యూనిస్టులు మీ వెంటే సదా నడిచివస్తారని మీరు భావిస్తున్నారా? ప్రపంచమంతా ఏరిపారేసిన కమ్యూనిస్టులతో అంటకాగుతూ, మీరు ప్రత్యామ్నాయం అందించ గలరని భావిస్తున్నారా?


2014 ఎన్నికల ఫలితాల తర్వాత మన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత కనిపిస్తున్నది. విభజన పాపం కారణంగా కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. ఇప్పట్లో లేచే అవకాశం లేదు. ప్రత్యేక హోదా పక్కన పెట్టిన కారణంగా భా.జ.పా.కి కూడా కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుంది. అవినీతి మంకిలం అంటుకున్నా, కొద్దోగొప్పో ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషిస్తూనే ఉన్నాడు జగన్. చంద్రబాబుని కాదు అనుకుంటే, మనకు ఉన్న ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి జగనే. ఆనాడు చిరంజీవికి ఏమాత్రం అనుకూలంగాలేని పరిస్థితులు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కానీ, మీరు వివేకం కోల్పోయి, వస్తున్న అవకాశాలు మట్టిపాలు చేస్తున్నారనేది నా అభియోగం.


ప్రత్యామ్నాయం కోరుకునే ప్రజలకు మీరు అందివస్తారనే ఆశతో.... ఈ నాలుగు వాక్యాలు.


భవదీయుడు,

కొండముది సాయికిరణ్ కుమార్

25-ఏప్రిల్-2018


Page No. 4/4


20, మార్చి 2018, మంగళవారం

కుక్క తోక - గోదారి ఈత

 కుక్క తోక - గోదారి ఈత (20-Mar-2018)

అది 2014 ఏప్రిల్ నెల. మండు వేసవి. బాబు గోదారి గట్టున ఓ చెట్టు నీడలో పిట్టలా కూర్చున్నాడు. రకరకాల ఆలోచనలతో మనసు పరితాపం చెందుతోంది బాబుకి. అప్పటికి 10 సంవత్సరాలుగా వేయిటింగ్ చేస్తున్నాడు, గట్టు దిగి ఎదురుగా కనిపిస్తున్న నది దాటటానికి. ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. మొన్నటిదాకా తనను వేటాడిన ఓ పెద్ద నక్క, మరో పిల్ల నక్క అక్కడే ఓ గుంటలో పడి కొట్టుమిట్టాడుతున్నాయి. బయటకు రావటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అవి ఏమాత్రం బయటకు వచ్చినా, తను ప్రాణాలతో మిగలడని తెలుసు. అవి వచ్చేలోపే, తట్టా బుట్టా సర్దేసుకొని నది దాటేయాలి. 


ఈసారి గట్టు దాటటం తేలికగానే అనిపించినా, నది దాటటానికి సర్వ శక్తియుక్తులు అవసరమౌతాయని తెలుస్తూనే ఉంది. కడుపులో దాచిపెట్టుకున్న తాళపత్ర గ్రంధాలు తీసాడు. అవి చాణుక్యుడు వ్రాసిన రాజకీయ తంత్రాలు. అప్పటికే, రాజకీయాలను కరకరా నమిలి మింగేసి అపర చాణుక్యుడని పిల్లపిట్టలు పొగిడేస్తుంటే మురిసిపోయిన రోజులు గుర్తుకు వచ్చాయి. ఎంతో కాలంగా ఔపోసన పట్టేసిన ఈ తంత్రాలు, తన సామర్ధ్యం మీద నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే ఎదురుగా ఓ విచిత్ర జీవి కనిపించింది.


నాలుగు కాళ్ళతో, ముచ్చటైన కుచ్చు తోకతో, అప్పుడే కొద్దికొద్దిగా నెరుస్తున్న గడ్డంతో, నెత్తిన తలపాగాతో చూడగానే ముచ్చటపడేలా కనిపించింది ఆ జీవి. అక్కడి గుంట మీద అప్పుడే కాలెత్తి వస్తున్నది. తన చుట్టూ రెండు సార్లు తిరిగి అప్యాయంగా నాలుక తెరిచి ముందుకాళ్ళ మీద సాగిలపడితే ముద్దుగా సైగ చేస్తూ చేయి అందించాడు. మచ్చల జీవి ముద్దుగానే ఉన్నా, విచిత్రంగా కనిపించింది. హావభావాలతో ఆకట్టుకోవాలని అది చేస్తున్న ప్రయత్నాలకి అప్రయత్నంగా బాబు ముఖం మీద నవ్వు పొడచూపింది. పదేళ్ళ తర్వాత, ఇంత ఆహ్లాదకరంగా బాబు నవ్వటం ఇదే మొదటిసారి.


హఠాత్తుగా ఆ జీవి మాట్లాడటం మొదలేసింది. "బాబూ, నువ్వు తేలికగానే గట్టు దిగగలవు. కానీ, నాకు కొద్దిగా కష్టమే. నువ్వు చేయి అందించి గట్టు దాటిస్తే, నేను నిన్ను నది దాటిస్తాను" అంది. ఓసారి, తన తట్టా బుట్ట వైపు తేరిపార చూసాడు. ఇవన్నీ తానైతే మోసుకొని వెళ్ళలేడు. మరి ఈ జీవి తనను దాటిస్తూ, ఇవన్నీ మోసుకెళ్ళగలదా అనే అనుమానం కొద్దిగా వచ్చింది. వెంటనే వాసన పసిగట్టింది ఆ జీవి. "అనుమానం పెట్టుకోవద్దు, ఆ తట్టా బుట్ట నా మీద పెట్టి, నువ్వు సింపుల్‌గా నా తోక పట్టుకో, నది దాటటం చిటికెలో పని" అంటూ మెటికెలు విరిచింది ఆ జీవి.


మెటికలు ఎందుకు విరిచిందో అర్ధం కాలేదు బాబుకి. తన జీవితంలో, ఇంతవరకూ ఎవ్వరినీ అంత తేలికగా నమ్మలేదు. ఎందుకో ఈ జీవిని చూస్తుంటే నమ్మాలని అనిపిస్తున్నది అనుకున్నాడు. "వేరే ఛాయిస్ ఏముందోయ్ బడుద్ధాయ్ ..." అని ఎవరో అన్నట్లు వినిపించి చుట్టూ చూసాడు. ఎవరూ కనిపించలేదు. వెనుక కాళ్ళపై నుంచొని, ముందు కాళ్ళు ముందుకు చాస్తూ ముసిముసిగా నవ్వుతూ ఆ జీవే కనిపిస్తున్నది. విశ్వాసానికి మారుపేరైన కుక్కలా కనిపిస్తున్న ఈ జీవిని నమ్మితే తప్పేంటి అనిపించింది. ఎందుకో, అప్పుడే ఆ పక్క గట్టు దాటుతూ ఓ తెలంగాణా పిట్ట తుమ్మినట్లు అనిపించింది. శకునం బాగోలేదు, కాసేపు ఆగుదామని అనుకున్నాడు. "అక్కర్లేదు, వెనుక తుమ్ము ముందుకు మంచిదే" అంటూ నమ్మించింది ఆ జీవి.


తట్టా బుట్ట అన్నీ ఆ జీవి మీద సర్దేసాడు. నెమ్మదిగా గట్టు దిగించాడు. ఓ చేత్తో, తట్టా బుట్టా సంభాళించుకుంటూ, మరో చేత్తో తోక పట్టుకున్నాడు. నెమ్మదిగా నదిలోకి దిగింది ఆ జీవి, ఓ ఫర్లాంగు వెళ్ళగానే సంఝాయించటం మొదలేసింది. "ఆ బుట్టలో ప్యాంటు షర్టు అవసరమా? చెడ్డీ బనీను సరిపోదా? బరువు తగ్గితే దాటటం ఈజీ, అవి తీసేస్తే బాగుంటుంది" అని మెల్లగా మెటికలు విరిచింది. నిజమే కదా అనుకొని, ఆ రెండూ పారేసాడు. 


మరో ఫర్లాంగు వెళ్ళగానే, అప్యాయంగా చెప్పింది. "చెడ్డీ బనీను మాత్రం దేనికి? ఒంటికి ఒక గోచీ గుడ్డ సరిపోతుందిగా, ఆ రెండూ తీసేస్తే ఇంకా తేలిగ్గా ఉంటుంది" అని నచ్చచెబుతూ, మళ్ళీ మెటికలు విరిచింది. కొద్దిగా అనుమానిస్తూనే, నిజమే కదా అనుకుంటూ, ఆ రెండూ తీసిపారేసాడు బాబు.


మరో ఫర్లాంగు వెళ్ళగానే మళ్ళీ మెత్తగా చెప్పింది. "ఒక్క గోచీ గుడ్డ కోసం ఆ బుట్ట ఎందుకు. ఓ నిముషం నేను ఆగుతా, నువ్వు వేసుకున్న ఆ బట్టలు తీసేసి, ఈ గోచీ చుట్టేసుకో. బుట్ట తీసిపారేయొచ్చు, బరువు తగ్గి తేలిగ్గా ఉంటుంది అని గదమాయిస్తూ, మెటికలు విరిచింది. నిజం అని నమ్మేసి అలానే చేసాడు. ఈత కొడుతూ ఆ జీవి, జీవి మీద ఓ తట్ట, తట్ట వెనుక తోక పట్టుకుని గోచీతో బాబు.


విక్రమార్కుడిని మోస్తున్న బేతాళుడిలా ఫీలౌతూ, అటుకులు బొక్కిన నోళ్ళు, ఆడిపోసుకునే నోళ్ళు తనని ఎలా ఆరళ్ళు పెట్టాయో ఊకదంపుడుగా చెబుతూనే ఉంది ఆ జీవి. పదేళ్ళ క్రితం తన ఉపన్యాసాలు గుర్తుకొచ్చాయి బాబుకి. తన్మయత్వంతో వింటూ ఈడ్చుకుపోతున్న విషయం కూడా గుర్తించలేదు. ఇంకొద్ది దూరం వెళ్ళగానే ఇకిలిస్తూ "నది దాటగానే, ఆ గట్టు మీద నాక్కూడా ఓ పేద్ద బుట్ట ఉంది. అందులో బోల్డు బోల్దు గుడ్డలున్నాయి. నీకో నలభై జతలిస్తాను. కాబట్టి, ఈ గోచీ కూడా తీసేస్తే, ఇంకా తేలిగ్గా ఉంటుంది మనం తొందరగ చేరొచ్చు" అంది ఆ జీవి. 


దాదాపుగా గోచీ తీసేయబోయాడు. వెంటనే కడుపులో దాచుకున్న చాణక్యుడి తాళపత్ర గంథం  "ఒరేయ్ బాబు, నీకింకా లైటు వెలగలేదా? దాని ఇకిలింపుల వెనక మెరుస్తున్న పదునైన కోరలు కనిపించలేదా? అది కుక్కతోలు కప్పుకున్న తోడేలురా, గట్టు చేరేలోపలే నిన్ను నలుచుకు తినేస్తుంది, దాని తోక వదిలేయ్" అంటూ పెద్దగా అరిచింది. ఇప్పటిదాకా, ఆ జీవి అరవలేదనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే మనసులో మతాబులా వెలిగింది "కరిచే కుక్కలు అరవవు" అని.


చప్పున తోక వదిలేసాడు బాబు. కళ్ళు తెరిచే నాటికి, 2018 మార్చి! కథ హస్తినకి, మనం అమరావతికి.


15, ఫిబ్రవరి 2018, గురువారం

కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు

 కూసే గాడిదలు, మేసే గాడిదలు, మోరెత్తని గాడిదలు (15-Feb-2018)

 

కాల్‌షీట్లు ఖాళీ ఉన్నప్పుడల్లా రాజకీయ కంకణం తొడుక్కునే పవన్‌కళ్యాణ్, నాలుగేళ్ళ నిద్ర తర్వాత, మురిగిపోయిన లడ్లలాంటి ప్యాకేజీ గురించిగాను తను చేస్తున్న పోరాటంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వానికి తప్పును సరిదిద్దుకునేందుకు 15 ఫిబ్రవరి దాకా టైమిచ్చాడు.

 

నాలుగు సంవత్సరాలు తానా అంటే తందనా అంటూ, ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీగా, ప్రత్యేక ప్యాకేజీని ప్రత్యేక సాయంగా ఇష్టం వచ్చినట్లు ప్రస్తావిస్తున్నా నోరు మెదపని నారా బాబుగారు మార్చి 5 దాకా వేచి చూస్తామంటున్నారు.

 

ప్రత్యేక హోదా కోసం ఈయన చేసే పోరాటం ప్రజల కోసమా, లేకుంటే ఎన్.డి.ఎ.కు తెదేపాని దూరం చేసి తను దగ్గరయ్యే పథకమో తెలీదు కానీ, ప్రత్యేక హోదా ప్రకటించేందుకు కేంద్రప్రభుత్వానికి 16 ఏప్రిల్ దాకా సమయమిచ్చాడు జగన్‌మోహనుడు.

 

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో కూడా దాదాపు ఇలాంటి తంతులన్నీ నడిపారు, ఇప్పుడు మరోసారి రీ ప్లే అవుతున్నారు అంతే. నిజంగా ప్రజల ఆకాంక్షల పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల వీరందరికీ నిజాయితీ ఉండి ఉంటే, తమ తమ రాజకీయ స్వార్థాలను పక్కనపెట్టి, ఐకమత్యంతో పోరాడి ఉండేవారు. కనీసం, ఆ దిశగా ప్రయత్నమైనా చేసి ఉండేవాళ్ళు.

 

ఆయా తారీఖుల తర్వాత వీరంతా ఏమేం పీక గలరో, ప్రజలు ఆల్రెడీ ఒక అంచనాకు వచ్చే ఉంటారు. నిష్ఠూరంగా చెప్పాలంటే, వీరు పీకి పారేసేదీ లేదు, పొడి చేసేదీ లేదు. పేనుకు పెత్తనం ఇచ్చినట్లు, కేంద్ర ప్రభుత్వం ముందు ఒకరినొకళ్ళు నగ్నంగా నిలబెట్టుకొని, రాష్ట్ర శ్రేయస్సును పణంగా పెట్టిన మొనగాళ్ళే వీళ్లందరూ. వీళ్ళ నగ్న స్వరూపాలు చూసి, ఓసోస్, ఆంధ్రులంతా ఇంతేనా అని కేంద్ర నాయకులు చేసే వెటకారాలు, వేళాకోళాలు వాళ్ళ బడ్జెట్టుల ద్వారా ప్రస్ఫుటమౌతున్నాయంటే ఆశ్చర్యం లేదు.

 

ఇప్పుడు కొందరు చేసే రాజీనామాల ప్రస్తావన 2014నాటి సంగతులు కొన్ని గుర్తుకుతెస్తున్నాయి. విభజనకు ముందు "రాజీనామా వల్ల తెలంగాణా వస్తుందా" అని తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించేవాళ్ళు. విభజన తర్వాత, "రాజీనామా వల్ల సమైక్యాంధ్ర వస్తుందా" అని ఆంధ్రా కాంగీయులు కూడా ప్రశ్నించారు. చివరికి, రాజకీయాల్లో చిరుజీవి చిరంజీవి కూడా అవేలాంటి ప్రశ్నలు వేసి ప్రజలను మభ్యపెట్టాడు. కావూరి లాంటి వాళ్ళైతే, "రాజీనామాల వల్ల ఉపయోగంలేదు. కనీసం ఇప్పుడు ఈ పదవి అడ్డంపెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడొచ్చు" అనే నీతి వాక్యాలు కూడా చెప్పాడు.

 

ఆ కావూరి సాంబశివరావే, ఆంధ్రాలో కాంగ్రెస్‌కు పుట్టుగతులుండవని భాజపాలోకి దూకేసి మనపాలిట మళ్ళీ దాపురించాడు. అధికార పార్టీ సభ్యుడైనా, పదవి లేక పాపం ఈయన పోరాటం చేస్తున్నట్లు లేడు! అవేలాంటి మాటలు తెదేపా నేతల నోటి నుంచి కూడా వస్తున్నాయంటే ఆశ్చర్యం లేదు. అన్నీ ఆ తాను గుడ్డలే.

 

నిజానికి ఇలాంటి రాజకీయులకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కానేకాదు. వారివారి వ్యాపార ప్రయోజనాల కోసం ఏ పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి దూకటం, లేదంటే అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు పెట్టుకుంటూ తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రాకులాడటం మాత్రమే ముఖ్యం. 18-ఫిబ్రవరి-2014 దాకా, తెలంగాణా వచ్చే వ్యవహారం కాదు, మా తడాఖా చూపిస్తామని ఉత్తరకుమార ప్రతిజ్ఞలు చేసిన ధీరులు వీళ్ళే. ఇలాంటి ఆంధ్రా నేతలకే బిస్కెట్లు ఇచ్చినట్లు రోడ్ల కాంట్రాక్టులు పడేసి, విభజనలో వాళ్ళెవరూ నోరెత్తకుండా కుక్కిన పేనుల్లా పడి ఉండేట్లు చేసింది సోనియమ్మ. ఆ తర్వాతి కథ మనకందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ కాంగీయులను దులిపిపారేసిన తెదేపా, ఇప్పుడు చేస్తున్నది అదే పని.

 

రాజీనామలు అనేవి ప్రజాస్వామికంగా ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచే సాధనాలు మాత్రమే కావు. ప్రజల పట్ల తమ బాధ్యతను తాము నెరెవేర్చలేకపోతున్నందుకు కారణాలు వివరించి, మళ్ళీ ఆ ప్రజల తీర్పును కోరుకునే అరుదైన అవకాశం. నిజాయితీగా వాడితే దీనినిమించిన ఆయుధం లేదు. అంచెలంచెలుగా కాదు, ఒక్కసారిగా, ఒకే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎం.పీ.లు పార్టీల కతీతంగా ప్రజల శ్రేయస్సు కొసం రాజీనామాలు చేస్తే, ఏ ప్రభుత్వం దిగిరాదు? ఆ తెగువ, ఐకమత్యం మన ఆంధ్రా నేతల నుంచి మనం ఆశించలేం. పొరుగు రాష్ట్రాలలో వారి ఉనికికి సంబంధించిన ఏ విషయమైనా వివాదమైతే, ఆయా రాష్ట్రాలలోని పార్టీలన్నీ కలిసి బలంగా వాళ్ళ గొంతు వినిపిస్తాయి. మన దౌర్భాగ్యం మనకు అటువంటి ఆలోచనలే రావు, అటువంటి నాయకులే లేరు.

 

అయినదానికి కానిదానికి అల్లరిచేసే చిల్లరపార్టీలు కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు, నాలుగేళ్ళ తర్వాత!  చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే విభజన జరిగిందని ఇప్పటికీ దుమ్మెత్తిపోస్తున్నారు కానీ, కనీసం ఆంధ్ర ప్రజలకు సంఘీ భావమైనా ప్రకటించలేదు ఆంధ్రా కాంగీ నాయకులు. తిమ్మిని బమ్మి చేయటానికే అన్న అపఖ్యాతి మూటకట్టుకుంటూ పవన్ కళ్యాణ్ ఓ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసాడు. ఇంకా ఏ నిజం నిర్ధారించాలని ఈ ప్రయత్నం? నిజానికి, పాత రాజధానితో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణా కన్నా, పాత పేరుతో కొత్త రాష్ట్రంగా అవతరించిన ఆంధ్రాకు అన్యాయం జరిగిందనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానమే లేదు. ఇప్పటివరకూ దాదాపు 13 వేల కోట్లు ఇచ్చామని భాజపా అధికారికంగానే ప్రకటించింది. రాజధానే కాకుండా, తగినంత మౌలిక సదుపాయాలేవీ లేని ఈ కొత్తరాష్ట్రానికి 13వేల కోట్లు ఏ రకంగా సరిపోతాయి?

9, ఫిబ్రవరి 2018, శుక్రవారం

మనకెందుకు ఈ మోడీ దరిద్రం?

 మనకెందుకు ఈ మోడీ దరిద్రం? (9-Feb-18)

2014 ఎన్నికలనాటికి అయ్యో పాపం అనుకున్న మోడీ, 2017 నాటికి అధికారమదంతో, తలకెక్కిన అహంకారంతో రోజుకో రూపంలో అక్కడాఇక్కడా కాదు, సాక్షాత్తు తానే నమస్కరించి అడుగుపెట్టిన పార్లమెంటులోనే వికృతంగా ఆవిష్కృతమౌతున్నాడు. సమయాసమయ విచక్షణలేకుండా పార్లమెంటును ఓ ఎన్నికల సభగా మార్చిన మతిహీనత్వం పది తలలతో వికటాట్టహాసం చేస్తున్నది. అవినీతిరహిత దేశాన్ని నిర్మించటానికి, అభివృద్ధే ఏజెండాగా పనిచేస్తానని ప్రజలకు చేసిన వాగ్దానాలు సముద్రమంత నీటిమూటలై పార్లమెంటునే ముంచెత్తుతున్నా నంగిమాటలతో ఇకిలించటమే సరిపోతున్నది నరేంద్ర మోడీకి.  ప్రజలకు జవాబుదారీ కావల్సిన పాలకవ్యవస్థ, పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజల గోడును పరిహాసాస్పదం చేస్తూనే ఉంది. చిన్న గీత పక్కన పెద్ద గీతలా, కాంగ్రెస్ అవినీతి పక్కన భాజపా అవినీతి , అసమర్ధత పెనుభూతంలా దేశాన్ని ఆవరిస్తున్నది.


భాజపా ప్రభుత్వపు అయిదవ బడ్జెట్‌పై పేద, మధ్యతరగతి ప్రజలు ఎన్నెన్నో ఆశలు పెంచుకున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ ప్రతి బడ్జెట్‌లోనూ పన్ను రాయితీలు ఆశించటం సరికాదు అని కొందరి వాదన. వారికి కొన్ని విషయాలు మనవి చేసుకోవాలనుకుంటున్నాను.


ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మోడీ చేపట్టిన కార్యక్రమం ఏమిటి? పేద ప్రజల చేత బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయించటం. ఆ అవసరానికి ప్రధాన కారణం, ప్రభుత్వం నుండి అందాల్సిన ఫలాలు పేదలకు నేరుగా చేరాలనే సత్సంకల్పం. అదో ఉద్యమంలా నడిపారు. కోట్లాది మంది ప్రజలు సానుకూలంగా స్పందించటం కూడా జరిగింది. అదో అద్భుతమైన ఘనకార్యమే. ఆ సమయంలోనే, వేరు వేరు స్టేట్ బ్యాంకులని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసారు. ఇప్పుడు అదే స్టేట్ బ్యాంకు, ఖాతాలో కనీస మొత్తం లేకపోతే రూ 40 నుంచి 50 వరకు జరిమానా విధిస్తున్నది! ఆ రకంగా దాదాపు రూ 1750 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈమధ్యనే చదివాను. 


ఇదే ప్రభుత్వ హయాంలో 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకి పారిపోయాడు విజయ్ మల్లయ్య. పారిపోయేదాకా ఊరుకొని, అతడిని వెనక్కు తీసుకురావటానికి కోట్లు ఖర్చు పెడుతున్నది ఈ ప్రభుత్వం! ఇంకా విచిత్రం, అతని ఋణాలకు సంబంధించిన వివరాలున్న ఫైలు, కేంద్ర ఆర్ధిక మంత్రి కార్యాలయం నుంచి మాయమయ్యింది. గతంలో, బొగ్గు కుంభకోణానికి సంబంధిచిన ఫైలు కూడా అప్పటి ప్రధాని మన్‌మోహన్‌సింగ్ కార్యాలయం నుంచి మాయమైన విషయం ప్రజలకు గుర్తు ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ఎన్నికల సభలలో కూడా ప్రస్ఫుటంగా ప్రస్తావించిన విషయం కూడా మరిచిపోయి ఉండరు. అంతే కాదు, యుపిఎ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చిదంబరం ఇంట్లో సోదాలు చేసినప్పుడు, అతని మీద కేసులకు సంబంధించి కోర్టులకు ఇంకా సమర్పించని నివేదికలు దొరికాయని వార్తలు. ప్రభుత్వంలో అవినీతి లేదని చెప్పగలరా?


దేశంలోని నల్లడబ్బును వెలికి తీయటానికి పెద్దనోట్ల రద్దు మాత్రమే మార్గం అని మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందించి  ముఖ్యంగా, పేదలు, దిగువ, మధ్యతరగతి ప్రజలు దాదాపు సంవత్సరం పైగా అష్టకష్టాలు పడి మరీ మద్దతు ఇచ్చారు. చివరికి తేలిందేమిటి? 95% పైగా డబ్బు రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చింది. ఇది నల్లడబ్బును పట్టుకోటానికి నడిపిన కార్యక్రమమా, లేక నల్లధనాన్ని తెలుపు చేసుకోటానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశమా ఎవరికీ తెలియదు! ఇంతకన్నా దారుణమైన విషయం ఏమిటంటే, ఈ పెద్దనోట్ల రాదు ఉద్దేశ్యం ప్రజలను ఆదాయపు పన్ను వలలోకి లాగటానికి చేసిన ప్రక్రియగా ఆర్ధిక మంత్రి చెబితే, వ్యభిచారం తగ్గించటానికి కూడా ఉపయోగపడిన కార్యక్రమం అని మరో కేంద్ర మంత్రి దరువులు వేసారు! ఈనాటి వరకూ, ఈ పనివల్ల లాభపడింది ఎవరనేది ఎవరికీ తెలియదు. ఇక స్విస్ బ్యాంకుల్లో ఉన్నాయని చెప్పిన 15 లక్షల కోట్ల సంగతి ఏమయ్యిందో ఏమీ తెలియదు.


2జి స్కాములో ముద్దాయిలుగా ఉన్న నేతలందరూ, ప్రభుత్వం తరుఫు న్యాయవాదుల చేతకానితనం కారణంగా బయటకి వచ్చినట్లు కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రభుత్వంలో అవినీతి లేదని ఎవరిని మోసం చేస్తారండి? ఇకపైగా, ఆ న్యాయవాదులు సమర్పించిన వాదనలు మునుపటి యు.పి.ఎ. ప్రభుత్వం తయారుచేసినవే, వాటికి మా ప్రభుత్వంతో సంబంధం లేదని కూడా కొందరు మసిపూసే ప్రయత్నం చేసారు. అది నిజమే అనుకున్నా, భాజపా చేతకానితనం కొట్టొచ్చినట్లు తెలుస్తున్నది కదా? ఈ విషయపరంగా, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చిన సుబ్రహ్మణ్య స్వామిని, స్వయానా ఆయన పార్టీకే చెందిన ఇతరులు గేలి చేయటం కూడా జరిగింది.


2014తో పోలిస్తే, డీజల్, పెట్రోలు రేట్లు అంత పెరగలేదనుకున్నా, వీటి ధరల మీద ప్రభుత్వ పెత్తనం తీసేసిన తర్వాత ధరలు తగ్గిన దాఖలాలు ఏమంత లేవు. ఒకే దేశం, ఒకే పన్ను అంటూ జి.ఎస్.టి. మొదలేసిన ప్రభుత్వం పెట్రోల్, డీజల్‌లను మాత్రం ఎందుకు మినహాయించిందో అర్ధం కాదు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో కిందమీద ఔతున్నారు ప్రజలు. సానుభూతితో అర్ధం చేసుకోవాల్సిన ప్రభుత్వం, అడిగిన పాపానికి ఆ ప్రజలనే ఆడిపోసుకుంటుంటే ఏమనుకోవాలి? ఇన్ని కిలోమీటర్లు రోడ్లు వేసాం, ఇన్ని గ్రామాల్లో ఇన్నేసి దీపాలు వెలిగించాం, ఇంతమందికి ఇళ్ళు కట్టించాం, మరిన్ని మరుగుదొడ్లు కట్టించామని డప్పులు కొట్టుకుంటూ నేల విడిచి సాము చేయటమే కానీ, నేల మీది నిజాలు ఎవరైనా పరిశీలిస్తున్నారా అనేది అనుమానమే.


కొన్ని స్నాప్ షాట్స్ మీ కోసం :


దేశం వెలిగిపోతుందనే ప్రచారాలు చేసుకొని, ఎన్నికలు ముందుకు జరిపి మరీ బోల్తాకొట్టాడు వాజ్‌పేయి 2004లో. దేశాన్ని ఎలాగైనా వెలిగించి పారేయాలనే దీక్షతో గ్రామాల విద్యుదీరణ గురించి మొన్నటిదాకా ఆ శాఖకు మంత్రిగా ఉన్న పీయుష్ గోయల్ ఏమంటున్నాడో చూడండి. 2016 కు పూర్తి చేయాల్సిన వ్యవహారాన్ని 2022 దాకా ఎలా పొడిగిస్తున్నారో చూడండి. పని పూర్తిగా కాక ముందే ప్రచారాలెందుకు చేస్తున్నారు అని అడగకూడదు.

అధికారంలో లేము అని ప్రతిపక్షాలు, పన్ను మినహాయింపులు ఇవ్వలేదని ప్రజలు ఆడిపోసుకుంటున్నారంటే, ఫర్లేదు వాళ్ళ ఏడుపు ఎప్పుడూ ఉండేదే కదా అని తేలిగ్గా కొట్టి పారేయొచ్చు. స్వయానా, భాజపా రాజ్యసభ ఎం.పి. అనూప్ మిశ్రా (మొరేనా, మధ్యప్రదేశ్)  గుక్క తిప్పుకోకుండా ఎలా ఏడుస్తున్నాడో చదవండి. మోడీని, అరుణ్ జైట్లీని నగ్నంగా చూపించే నిలువుటద్దం ఈ వ్యాఖ్య.

ఈ దేశంలో పుడితే, దరిద్రాతి దరిద్రంలోనైనా పుట్టాలి, లేదంటే డబ్బుల గోడల మధ్య సంపన్నుడిగానైనా జన్మించాలి. మధ్య తరగతైతే మటాషే. పన్నులు కట్టటానికి, డబ్బుతో మదించినవాడికి నిజానికి ఏ ఇబ్బందీ ఉండకూడదు. అయినా కట్టడు. కాదు కూడదు అంటే వాడి వ్యాపారాలు ఐ.పి.లు పెట్టేసి కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చేసుకుంటాడు. పైగా, దేశాభివృద్ధికి, వ్యాపారాభివృద్ధికి అన్ని ప్రభుత్వాలు రకరకాల మినహాయింపులు ఇస్తాయి వీడికి. ఇక బి.పి.ఎల్.కి ఐతే ఎటువంటి సమస్యా లేనేలేదు. 70 ఏళ్ళ నుంచీ ప్రతి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళని ఉద్ధరించటానికి ఖర్చు చేస్తూనే ఉంటుంది. వాళ్ళు మాత్రం పైకి రాలేక పోతున్నారు. దిగువ, ఎగువ మధ్యతరగతి ప్రజలంటే మాత్రం అందరికీ చాలా చులకన. ఏ ప్రభుత్వం వచ్చినా ముందుగా పీల్చి పిప్పి చేసేది వీళ్ళనీ, వీళ్ళ బ్రతుకులనే. అటువంటి, మధ్య తరగతి వాడు, ఉద్యోగస్తులు ఆదాయపు పన్నులో మినహాయింపులు అడిగితే వాడిని దేశానికి శత్రువుగా పరిగణిస్తారు భాజపా జనాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ అనే రాజకీయ కీచకుడు ఉద్యోగస్తులపై కనీసం 5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు ఉండాలని కాంగ్రెస్‌తో యుద్ధం చేసేవాడు. ఆర్ధిక మంత్రి అయ్యాక, క్రమం తప్పకుండా మధ్యతరగతికి ముష్టి వేస్తున్నాడు. ఈ సంవత్సరానికి ఈయన వేసిన ముష్టి కూడి, తీసి, గుణకారాలు, భాగహారాలు చేస్తే వచ్చింది ముప్ఫై రూపాయలు కూడా లేదు.


 సరే, మనం అని నోరు పారేసుకోవటం దేనికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ చైర్మన్ ఆదాయ పన్ను కట్టే "మధ్య తరగతి" వారి గురించి ఏమంటున్నాడో చూడండి.


కనీసం కాంగ్రెస్ ఏలుబడిలో ప్రజలు ఉద్యమాలు చేస్తే వినే పరిస్థితి ఉంది. భాజపా ఏలుబడిలో, పోరాడే ప్రజలను తస్మదీయులుగా భావించటం, మూతి ముడుచుకు కూర్చోవటం మోడీకే చెల్లు.


ఆధార్ కార్డులు చేయించుకోవటం, వాటిని బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవటం, బ్యాంకు ఖాతాలు మొబైలుతో అనుసంధానించుకోవటం, మొబైలును మళ్ళీ ఆధార్‌తో అనుసంధానించు కోవటం, పాన్ కార్డులు బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవటం, అదే పాన్ కార్డు ఆధార్‌తో అనుసంధానించుకోవటం, వీటన్నిటినీ రేషన్‌కార్డుతో కలుపుకోవటం, మోడీ ఏలుబడిలో బ్రతుకంతా అనుసంధానించుకోటానికే సరిపోతున్నది. మాట్లాడితే, స్ట్రక్చరల్ ఛేంజెస్ ఇవి అనే ఉపన్యాసాలు వినాల్సి రావటం! మనకెందుకు ఈ మోడీ దరిద్రం?


ఏతా వాతా తేల్చేదేమిటంటే, అక్కరకు రాని వ్యాపారాలు చేయలేం. తింటానికి మిగిలింది పన్నులు కట్టుకోటానికి మాత్రమే సంపాదన చేసే ఉద్యోగి బతుకులు బతకలేం. ఏదో బాబాలానో, అమ్మలానో అవతరించి దుకాణం పెట్టుకోవటం బెస్టు.


*అభివృద్ధి, అవినీతి ప్రాతిపదికగా 2014లో మోడీకి వేసిన వోటుకు పశ్చాత్తాపపడుతున్న ఆపసోపాలు మాత్రమే. ఒక హిందువుగా నేనాశించిన మోడీ ఈ ప్రభుత్వంలో లేడు. ఆ విషయాలు వీలువెంట.




8, ఫిబ్రవరి 2018, గురువారం

భారతంలో శిఖండి నరేంద్ర మోడీ

 భారతంలో శిఖండి నరేంద్ర మోడీ (08-Feb-18)


సమాఖ్య పద్ధతికి కాంగ్రెస్ తూట్లు పెట్టిందని అందుకని ప్రణాళికా సంఘం స్థానంలో మరో సంస్థ అవసరమని చెప్పి, జనవరి, 2015లో నీతీ ఆయోగ్‌ని మొదలుపెట్టాడు నరేంద్ర మోడి. అన్ని రాష్ట్రాలకు సమాన హోదా అని మొదలు పెట్టిన ఈ వ్యవస్థ, ఆదిలోనే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆంధ్రాకు ప్రత్యేకహోదా ఇవ్వకూడదని చెప్పింది. దానికి కారణాలు ఏమిటంటే, మరో తొమ్మిది రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి కాబట్టి ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నా, నీతీ ఆయోగ్ కారణంగా ఇవ్వలేకపోతున్నట్లు వెంకయ్య 19-సెప్టెంబరు-2016లో హిందు వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి చెప్పాడు. ఈ నిర్ణయం 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల కనుగుణంగానే ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతున్నామని చెప్పాడు ఈ పెద్దమనిషి.


26-మే-2014లో ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసాడు. దాదాపు ఏడు నెలల తర్వాత, 1-జనవరి-2015న నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసాడు. ఆ తర్వాత దాదాపు 22 నెలలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదనే విషయం ప్రజలకు చెప్పాడు వెంకయ్య. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నట్లు? అధికారంలో ఉన్న మొదటి ఏడు నెలలలో ప్రణాళికా సంఘం ద్వారా ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు. ఆ తర్వాత, 22 నెలల పాటు తాత్సారం చేసి, చావు కబురు చల్లగా ఎలా చెప్పగలిగారు. ఆంధ్ర ప్రత్యేక హోదా విషయం ఏ ఇతర రాష్త్రపు డిమాండుతో పోల్చినా ప్రత్యేకమని మోడీకి తెలియదా? చాలా ప్రత్యేక పరిస్థితుల్లో రాజధానిలేని రాష్ట్రంగా అవతరించింది ఆంధ్రా అన్న విషయం ఈ మనిషికి తెలియదా? పోనీ, దానికి బదులుగా ఏమిస్తారనే విషయం మీద ఇంతవరకూ మోడీ ప్రభుత్వం స్పష్టత ఎందుకు ఇవ్వటంలేదు. 


తాను ఏర్పాటు చేయబోయే నీతీ ఆయోగ్ ద్వారా ప్రత్యేక హోదా కష్టమౌతుంది, కాబట్టి ముందే అది ఇచ్చేసి, ఆ తర్వాత నీతి ఆయోగ్ మొదలేద్దామనే ఆలోచన ఆయన ఎందుకు చేయలేదు. పోనీ, నీతి ఆయోగ్ చైర్‌మన్ గా ఆంధ్రాకు ఇచ్చే తీరాలి అని ఆయన పట్టుబడితే పని కాదా?


పనులన్నీ ఆపుకొని మన్ కీ బాత్ పేరుతో ప్రజలకు ప్రవచనాలు చేసే ప్రధానికి, ఈ విషయాలన్నీ ఆంధ్రులకు లేదంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత ఉన్నదని ఎందుకు అనిపించలేదు.? అన్ని రాష్ట్రాలకు సమాన హోదా, సమైఖ్య స్ఫూర్తి బొంగు భోషాణం అని ఉపన్యాసాలు దంచిన దుర్గ్మార్గుడు, చెంబుడు నీళ్ళతో ఆంధ్రుల ఆశలపై నీళ్ళు చల్లి, గుప్పెడు మట్టి మొహాన పూసి వెళ్ళిన ఈ పెద్దమనిషి, ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రధానిగా కొనసాగుతున్నాడు? సిగ్గెగ్గులు లేని ఈ ప్రధానికి, ఈ పార్టీకీ మద్దతు ఎందుకు ఉపసంహరించ కూడదు?


మోడీ భక్తజనసందోహం, మహాత్ముడు మోడీ మన రాష్ట్రానికి పంపు సెట్లు ఇచ్చాడని, ఎల్.ఇ.డి. బల్బులిచ్చాడని, స్మార్ట్ సిటీలిస్తున్నాడని, రెండు పట్టాలేసాడని, మూడు చెరువులు తవ్వించాడని ఇవన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతో చేయించి, తన పథకాలని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని గోల చేస్తున్నారు. అయ్యా, ఈ చెంబులు చాంతాళ్ళు ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇస్తున్నారా? మరే రాష్ట్రానికి ఇవి ఇవ్వటంలేదా అని అడిగితే ఒక్క సమాధానం లేదు. భాజపా పాలిత రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల వివరాలు సేకరిస్తే కానీ, ఇతర రాష్ట్రాలకు ఈ దుర్మార్గుడు చేసిన ద్రోహం మనకు పూర్తిగా తెలియదు. 


ఇంకా, చంద్రబాబు నిధులు వేరే పథకాలకు తరలిస్తున్నాడని, కాగ్ నివేదికలు అవే చెబుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఏం చేయగలడని కూడా ఈ భక్తజనసందోహం ఆక్రోశం వెలిబుస్తున్నాయి. అయ్యా, దాదాపు 15 వేల కోట్ల నిధులు తరలించిందని కొన్నాళ్ళ క్రితం అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ మీద కూడా వర్తాలు వచ్చాయి. గత పది సంవత్సరాలలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కూడా ఇటువంటి ఆరోపణలు ఎన్నో వచ్చాయి. ఇక కాగ్ విషయానికి వస్తే, ఒక్క మన రాష్ట్రమే కాదు, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల పద్దుల మీద ఇటువంటి వ్యాఖ్యలే కనిపిస్తాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలానే వ్యాఖ్యలు చేసింది. మరి వాటి మాటేమిటి?


రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాల్సిన వేదిక మీద తొంభై నిముషాలు కాంగ్రెస్‌ను అన్నిరకాలుగా ఆడిపోసుకున్న మోడీ, కనీసం ఒక్క నిముషమైనా, ఆంధ్రుల అందోళనను ప్రస్తావించాడా? అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా జరిగిన రాష్ట్ర విభజన పాపంలో భాజపా పాత్ర ఏమీలేదా? అప్పటి ప్రధాన మంత్రి అయిదు సంవత్సరాల ప్రత్యేక హోదా ప్రస్తావిస్తే, కాదు కూడదు కనీసం పది సంవత్సరాలు ఇస్తేగానీ, విభజన చట్టాన్ని ఆమోదించమని మొసలి కన్నీళ్ళు పెట్టింది ఈ వెంకయ్యే కాదా? ఆ పిమ్మట వచ్చిన ఎన్నికలలో తెదేపాతో చెట్టపట్టాలేసుకుని, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామన్న వాగ్దానం చేసింది ఈ మేకవన్నెపులి ఈ మోడీ కాదా? విశాఖపట్నం రైల్వే జోను కచ్చితం ఏర్పాటు చేస్తామని నాలుగేళ్ళుగా మభ్యపెడుతూ, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల సమస్య వల్లే కుదరటంలేదని చెబుతున్నది ఈ తేనె పూసిన కత్తి మోడీ కాదా? ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు పక్కన పెట్టినా, విభజన చట్టంలో చేసిన వాగ్దానాలపై కూడా ఏ స్పందన లేకపోవటానికి కారణాలేమిటి? ఈ సవతి ప్రేమకు కారణం ఏమిటి? ఇది నిజంగా సవతి ప్రేమేనా, వేరే కోణం ఏదైనా ఉన్నదా? ఆలోచించాల్సిన ప్రశ్నలే ఇవన్నీ. వీటికి జవాబు కూడా ఉంది.


"నాగు పాము పగ పన్నెండేళ్ళు, నాలో రగిలే పగ నూరేళ్ళు". ఇది తెలుగు సినిమా పాటే కాదు, నరేంద్ర మోడీ గుజరాతీలో పాడుకునే పాట. అలానే, ఏరు దాటాక తెప్ప తగలేసే మోడీ వ్యక్తిత్వం కూడా మరో కారణం. వ్యక్తిగత విషయాలు ప్రస్తావించటం కాదు కాబట్టి, ఆయన తల్లిని, భార్యను ఎందుకు దూరం పెట్టాడనే విషయం మాట్లాడను. 


మోడీ రాజకీయ సోపానానికి వెన్నుదన్నుగా నిల్చిన అద్వానీ, మురళీమనోహర్ జోషీ లాంటి భాజపా దిగ్గజ నేతలకు ఈనాడు పట్టిన దుర్గతి చూడండి. ఎప్పటికీ పి.ఎం. ఇన్ వెయిటింగ్‌లా మిగిలిపోతానేమో అని మధనపడ్డ అద్వానీని, మోడీ ప్రధాని అయిన తర్వాత భారత రాష్ట్రపతి చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, తన ఒంటెద్దు పోకడలకి రాష్ట్రపతిగా అద్వాని ముసలి పెత్తనం తనకు ఎలాంటి సవాళ్ళు విసురుతుందో అన్న అనుమానంతో మోడీ కుదేలైపోతుంటే, సి.బి.ఐ. అద్వానీ మీద సమయానుకూలంగా మళ్ళీ కేసు తిరిగితోడటం కలిసొచ్చింది. ఇక్కడి సమయానుకూలాన్ని గమనించండి.


తనకన్నా ముందే, ప్రధాని పదవికి అర్హురాలని పేరొందిన సుష్మా స్వరాజ్‌కి విదేశాంగ మంత్రిగా ఆయన ఇచ్చిన బాధ్యతలు గమనించండి. కేవలం వీసాలు ఇప్పించటం, పాస్‌పోర్టులు చేయించటం తప్ప, విదేశాంగ విధానంలోని విధివిధానాల రూపుకల్పనలో ఆమెకు ఏమాత్రం పాత్ర లేదు.


స్వంత పార్టీలోనే ప్రత్యర్ధులుగా భావించిన వారిని మట్టి కరిపిస్తున్న మోడీ, చంద్రబాబును ఎలా నిర్లక్ష్యం చేయగలడు? అందులోను, 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా అప్పటి ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన చంద్రబాబును ఎలా క్షమిస్తాడు? పార్లమెంటులో రేణుకా చౌదరిని శూర్పణఖ గా అభివర్ణించిన మోడీ, నిజానికి భారతంలోని శిఖండి పాత్ర పోషిస్తున్నాడని గ్రహించాలి. బాబు మీది పగను, ఆంధ్రుల మీద చూపిస్తున్నాడు నరేంద్ర మోడీ. అంతేకాక, తన పార్టీ ప్రతినిధుల ద్వారా బాబు మీద బురదజల్లి ప్రజలలో ఆయన మీద వైషమ్యాన్ని పెంచి రాజకీయంగా రాష్ట్రంలో లబ్దిపొందాలని ఆశిస్తున్నాడు నరేంద్ర మోడీ. తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిల్చిన ఎన్.టి.ఆర్. పేరును పార్లమెంటులో ఉదహరించటం కూడా అంతర్లీనంగా బాబును అధిక్షేపించే ప్రయత్నమే. రేపు తెలుగుదేశం నిట్టనిలువుగా చీలినా, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అస్థిరపరచే విధంగా మతకల్లోలాలు రేగినా, దానికి పరోక్ష బాధ్యత నరేంద్ర మోడీదే.


రాష్ట్ర ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలని భాజపా దుర్మార్గులు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. రాష్ట్రంలో భాజపాని తరిమికొట్టాలి. ప్రత్యేక హోదా మన హక్కు అని ఎలుగెత్తి చాటుదాం. మోడీకి దాసోహం అనాల్సిన అవసరం ఏమాత్రమూ మనకు లేదు. పోరాడైనా సాధించుకుందాం.