13, డిసెంబర్ 2012, గురువారం

విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి

 విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి (13-December-2012)

పార్లమెంటు ప్రాంగణంలో ఎన్.టి.ఆర్. విగ్రహం ఏర్పాటు విషయంపై పెద్ద దుమారమే రేగుతున్నది. అటు విగ్రహం ఏర్పాటుకు అనుమతి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ. ఇవ్వటం ఒక విశేషమైతే, ఇటు విగ్రహం ఏర్పాటుపై ఎన్.టి.ఆర్. కుటుంబసభ్యులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటం మరో విచిత్రం!

తెలుగు ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో అజరామరం చేసిన ఎన్.టి.ఆర్. నిత్యస్మరణీయుడే అనటంలో ఎటువంటి అనౌచిత్యం లేదు. ఏనాడూ పార్లమెంటు సభ్యుడు కాకపోయినా, దేశస్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేసి ప్రతిపక్షాలను సంఘటితం చేసి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్.టి.ఆర్. చేసిన కృషి అనితరసాధ్యమనేది కూడా మనం మర్చిపోకూడదు. అయినా, తెలుగువాడిగా ఎన్.టి.ఆర్. పై ఉన్న అభిమానాన్ని పక్కనపెట్టి, ఇప్పటి నేపథ్యంలో కొన్ని విషయాలు నిజాయితీగా, నిష్కర్షగా మాట్లాడుకుంటే బాగుంటుంది. 

నైతిక విలువలన్నిటికీ తిలోదకాలిచ్చిన నేతలు రాజ్యాలేలుతున్న కాలం ఇది. దేశ స్వాతంత్ర్యానికి పోరాడిన త్యాగధనులను, ప్రజలకు స్ఫూర్తిగా నిలచిన నేతలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, వారు బోధించిన విలువలన్నీ తుంగలో తొక్కేసిన తర్వాత, వారి విగ్రహాలు, పటాలు పెట్టటంవలన ఉపయోగం ఏముంది? 

దేశ స్వాతంత్ర్యంకోసం, దేశ సంక్షేమం కోసం అసువులు బాసిన మహనీయులకు, అధ్యాత్మిక, కళా, సాంస్కృతిక వారసత్వ సంపదలుగా జ్ఞాన ప్రదీప్తులై, దీప్తిధారులై స్ఫూర్తిదాయకులైన మహానుభావులకు విగ్రహాలు పెట్టటంలో ఎంతమాత్రమూ తప్పులేదు. వారి వారసత్వాన్ని గర్వంగా చెప్పుకోటానికి, భావిపౌరులకు వారి గురించి తెలియపరచటానికి ఆమాత్రం చేయటం అవసరమే. 

కానీ, 1980 తర్వాత దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని నాయకుడు లేడు. కుల, మత, ప్రాంతీయ వాదాలతో ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోని నాయకుడు లేడు. ఆ మహామహుల పక్కన, ఇప్పుడు ఈ నాయకులకి కూడా చోటు కల్పించటమా? మురసోలి మారన్లు, దేవీ లాల్సు, ఎంజీ రామచంద్రన్లు... వీళ్ళ పక్క ఇప్పుడు ఎన్.టి.ఆర్.! రేపు వైయస్సార్లు, థాక్రేలు, మాయవతీలు, ములాయంలు, లాలూ యాదవులు, కరుణానిధులు, జయలలితలు! 

ఆల్రెడీ, "విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి" టైపులో ఉలుకు పలుకు లేకుండా లోక్ సభ, రాజ్య సభలలో తిష్టవేసుకుని కూర్చున్న ఎం.పి.లు వందల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తోడుగా ఇప్పటికే మన పార్లమెంటు ప్రాంగణంలో 48 విగ్రహాలు, 84 చిత్రపటాలు ఉన్నాయట! ఎవరు ఎవరికి స్ఫూర్తి? పార్లమెంటులో ధర్నాలు చేసుకోటానికి తప్పించి ఈ విగ్రహాల వల్ల వీసమెత్తైనా ఉపయోగం కనిపిస్తుందా? 

ఆ మాటకొస్తే, బయటపెట్టే విగ్రహాల ఉపయోగం మాత్రం ఏముంది? మన రాష్ట్రమే చూసుకుంటే నడిరోడ్డు మీదే విగ్రహాలు దిగబెడుతున్నారు. అసలు రోడ్డు ఉన్నా లేకపోయినా విగ్రహాలు మాత్రం ఉండితీరాల్సిందే. ఒకప్పుడు విగ్రహాలు పెట్టిన చోట్లు పెద్ద సెంటర్లయ్యేవి. ఇప్పుడు పెద్ద సెంటర్సులోనే విగ్రహాలు పాతేస్తున్నారు! ఒకప్పుడు, ఫలానా సినిమా హాలు ఎక్కడ ఉంది అంటే, బోసుబొమ్మ సెంటర్ దగ్గరనో, భగత్సింగ్ సెంటరు పక్క సందు అనో చెప్పుకునేవాళ్ళు. కనీసం ముష్టివాళ్ళో, ముసలీ ముతకో సాయంత్రాలు ఆ మహానుభావుల విగ్రహాల నీడలో సేదదీరేవాళ్ళు. 

ఇప్పుడో! ఫలానా బస్టాండ్ దగ్గర ఉన్న ఎన్.టీ.ఆర్. విగ్రహమా, ఫలానా హోటల్ దగ్గర ఉన్న వైయస్సార్ విగ్రహమా అని అడుగుతున్నారు. అంతే కాదు, విగ్రహం పెట్టటమే కాకుండా, 24 గంటల సెక్యూరిటీ కూడా ఆ విగ్రహానికి కావాల్సివస్తున్నది! - పిట్టలు రెట్టలు వేయకుండా, ఎగస్ పార్టీవాళ్ళు రంగులు పులమకుండా! 

అయిదేళ్ళు పరిపాలించినా, ప్రజలు మర్చిపోతారేమోననే అనుమానంతో ఊరూరా విగ్రహాలు పెట్టించుకున్న మాయావతులే దేశం నిండా ఉన్నారు. మాననీయులే అయితే, ఏ విగ్రహాలు లేకుండానే ప్రజల మనసుల్లో పదికాలాలపాటు నిలచిపోతారు; రుద్రమదేవి, కృష్ణదేవరాయలు, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, యోగి వేమన, కందుకూరి, గురజాడ....ల మాదిరిగా. మన్నికేలేని నాయకుల విగ్రహాలు పెట్టినందువల్ల ఉపయోగం వీసమెత్తు ఉండదు.



21, నవంబర్ 2012, బుధవారం

వాడు చచ్చాడు!

 వాడు చచ్చాడు! (21-November-12)


వాడు చచ్చాడు! 26 నవంబరు, 2008 ముంబాయిలో జరిగిన తీవ్రవాదుల దాడిలో పట్టుబడిన దుర్మార్గుడు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత చచ్చాడు. దాదాపు మూడు రోజులు ముంబాయిని అల్లకల్లోలం చేసి చిన్నపిల్లలని కూడా చూడకుండా కనిపించిన వారందరినీ కాల్చిపారేసిన దుర్మార్గుడు ఎట్టకేలకు చచ్చాడు. నేర నిరూపణకు గాను నాలుగు సంవత్సరాలు కొన్ని కోట్ల ప్రజాధనంతో వాడిని మేపి చివరికి వాడికి ఉరి శిక్షను అమలు చేసింది మన ప్రభుత్వం. నిజానికి మరో నరకాసురుడు చచ్చాడన్నంతగా మనమందరం జరుపుకోవాల్సిన మరో దీపావళి పర్వదినం ఇది.

వాడికి ఉరిశిక్ష అమలుచేయటానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందనేది ఓ ప్రధాన ప్రశ్న కాదు. ఎందుకంటే ప్రజల సహనాన్ని న్యాయస్థానాల కంటే మన రాజకీయ నాయకులే ఎక్కువగా పరీక్షిస్తున్నారు. తీవ్రవాద నిరోధంలో మనకున్న సమస్యల్లా మన రాజకీయ నాయకుల బాధ్యతా రాహిత్యమే. కసబ్ అరెస్టు దరిమిలా జరిగిన కొన్ని సంఘటనలు మనం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముందుగా అప్పటి హోం శాఖా మంత్రి (శివరాజ్ పాటిల్), అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంఘటన తదనంతరం ఇచ్చిన ప్రకటనలు, ప్రసంగాలు మన దౌర్భాగ్య పరిస్థితులకు అద్దం పడతాయి. పాటిల్ మహాశయులవారికి తీవ్రవాదులు ఘాతుకానికి పాల్పడతారని ముందే తెలుసుట. కాని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో తెలియక చర్యలు చేపట్టలేదట! తమని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చంపేస్తారోనని జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే ఈ నాయకులకు ప్రజల ప్రాణాల విలువ ఎలా తెలుస్తుంది? ఇక మన ప్రధాని గారు మాత్రం పాకిస్తాన్ వైపు వేలు చూపించి చేతులు దులిపేసుకున్నారు! పోటా వల్ల ఓ మతం వారిపై దాష్టీకాలు పెరుగుతాయని, పార్లమెంటులో పోటా పీకేసి, మోకా తెచ్చిన ఘనులు. అది మాత్రం తెచ్చి సాధించినదేముంది, పాకిస్తాన్ ను వేలెత్తి చూపటం తప్పించి?

అతనికంటే ఘనులైన అంతూలేలు, దిగ్విజయ్ సింగులు ఆ సమయంలో ఇచ్చిన వివాదాస్పద ప్రకటనలు కూడా గుర్తుతెచ్చుకోవాలి. అంతూలే ప్రకారం అప్పటి ఎ.టి.సి. ఛీఫ్ హేమంత్ కర్కరేను హత్య చేయించటానికి హిందు తీవ్రవాదులు ఆడిన నాటకమట ఆ ముంబాయి దాడులు! ఆయనకు తోడుగా దిగ్విజయ్ సింగ్.... దాడులు జరగటానికి కొన్ని రోజుల ముందు హేమంత్ కర్కరే ఆయనతో మాట్లాడి ఏవో చెప్పి వాపోయారట! జరిగిన దాడులను ఖండించటంపోయి, ఆ నెపంతో రాజకీయ నాటకాలకు తెర లేపే ఇటువంటి రాజకీయ నాయకుల చేతుల్లో ప్రజల, దేశ భవిష్యత్తు ఏరకంగా ఉంటుందో ఊహించటం కష్టమేమీ కాదు.

వారం పదిరోజుల క్రితం ఇప్పటి మన హోం మంత్రి సుశీల్ షిండే గారు, భారత్ లో పర్యటించబోయే పాకిస్తాన్ క్రికెట్ టీమును మనం స్వాగతించాలని చెబుతూ, రాజకీయాలకు క్రీడలకు ముడిపెట్టకూడదని ఉపదేశం చేసారు! ముంబాయి దాడులు జరిగిన క్షణం నుంచి ఈరోజు ఉరి శిక్ష అమలు జరిగిన దాకా, ఆ దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయమున్నదని ప్రధాన మంత్రి నుంచి అప్రధాన మంత్రుల వరకు ఎవరో ఒకళ్ళు రోజూ కోళ్ళై కూస్తూనే ఉన్నారు. రెండు నెలలకోసారి పాకిస్తాన్ కు ఆధారాలు పంపుతూ, కసబ్ పాకిస్తాన్ వాడే అని ఒప్పుకోమని పాకిస్తాన్ ను దేబిరిస్తూనే ఉన్నారు. ఆ కారణంతోనే, దాడులు జరిగిన తక్షణం పాకిస్తాన్ తో సంబంధాలు తెగదెంపులు చేసుకుంటున్నామని ప్రకటించారు. మరి ఈరోజు సుశీల్ షిండే గారు తీవ్రవాద దాడుల వెనుక పాకిస్తాన్ ప్రమేయంలేదని సర్టిఫికెట్ ఇచ్చినట్లు భావించాలా?

దాదాపు గత ఆరు దశాబ్దాలుగా ఇటువంటి విషమపరిస్థితుల్లో మనం మగ్గుతూనే ఉన్నాం. నిజానికి, తీవ్రవాదుల దాడులవల్ల కన్నా, మన రాజకీయ నాయకుల నిర్లక్ష్యం, అలసత్వం, రాజకీయ కారణాల వల్ల మనం ఎక్కువ నష్టపోతున్నాం. తీవ్రవాదాన్ని దునుమాడటంలో నిర్మాణాత్మక వైఖరి లేక ప్రపంచానికి అలుసైపోతున్నాం. ఈనాడు దేశ ప్రజలకు కావల్సింది అభద్రతాభావంతో కూడిన జీవనం కాదు. ప్రజలకు ఆ మాత్రం చేయలేని ప్రభుత్వాలు, ప్రజా నాయకులు నిరర్ధకం. 


20, జూన్ 2012, బుధవారం

స్వయంకృతమా, సాను 'భూతమా'?

 స్వయంకృతమా, సాను 'భూతమా'? (20-June-2012)

మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను ఆసక్తి రేకెత్తించిన ఉప ఎన్నికలు ముగిసాయి. 18 అసెంబ్లీ సీట్లలో 15, ఒక పార్లమెంటు సీటును కైవసం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ గెలుపు కూడా అత్తెసరి మెజారిటీతో కాకుండా అద్భుతమైన మెజారిటీతో కైవసం చేసుకుంది. వెర్రి గొర్రెల మందలా, గుడ్డెద్దుల్లా జనాలు వోట్లు వేసి అవినీతిపరులను గెలిపించారని కొందరు ఆక్షేపిస్తే, మరికొందరు ఇదో నీటి బుడగలాంటి సానుభూతి గెలుపుగా అభివర్ణించారు. ఎవరెలా ఏడ్చినా, కాంగ్రెస్ తెలుగుదేశంలకు కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లతో వైయస్సార్ పార్టీ గెలిచిందనేది సుస్పష్టం. ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి కాబట్టి, ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లా, సానుభూతిగా వచ్చిన ఓట్లా అనే లెక్కలు ఇప్పుడిప్పుడే తెమల్చరు.

వైయస్సార్ మరణం దరిమిలా, గత రెండున్నర ఏళ్ళుగా అసలు రాష్ట్రంలో ఓ ప్రభుత్వం ఉన్నదా అనే సందేహం కలిగేంతగా కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతున్నది. రోశయ్య పగ్గాలు పట్టిన సమయంలో రేగిన తెలంగాణా చిచ్చు ఆరనే లేదు. ఆ తర్వాత కుర్చీ ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నత్తకన్నా నాలుగింతల నిదానంగా నడుస్తుండటమే కాకుండా రోజుకో అవినీతి పుట్ట పగులుతూ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరౌతున్నది. ఈయన ప్రభుత్వంలో దాదాపుగా మచ్చలేని మంత్రంటూ ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జగన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సెలవిచ్చిన పెద్దలు, మద్యం మాఫియాకు సంబంధించి బొత్స విషయానికొచ్చేసరికి తెరచాటు వ్యవహారాలతో చట్టానికి పని పెట్టనేలేదు! బహుశా బొత్స కూడా రెఫు జగన్ తో కలిస్తే, చట్టం తన పని తాను చేసుకోటానికి బయలుదేరుతుందేమో!

 ఇక అసలు విషయానికి వద్దాం. జగన్ ను సానుభూతి ఓట్లే గెలిపించాయంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే, ఈ సానుభూతి ఓట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇందిరా గాంధీ పోయినప్పుడు రాజీవ్ గాంధీకి వచ్చినంతగా, రాజీవ్ గాంధీ పోయినప్పుడు కాంగ్రెస్ కు రాలేదు. బహుశా, రాజీవ్ పోయినప్పుడు గాంధీ పుత్రులు ఎన్నికల రాజకీయాల్లో లేకపోవటం కారణం అయ్యుండవచ్చు అని సరిపెట్టుకున్నా, ఎంటీఆర్ పేరుతో పార్టీలు పెట్టి అడ్రస్ గల్లంతైన లక్ష్మి పార్వతి, హరికృష్ణలు కూడా కేవలం సానుభూతి వల్లే ఓట్లు రాలవనే తెలుసుకొని ఉంటారు. అలానే 2003 లో అలిపిరి ఘటనతో సానుభూతి సంపాదించుకోవాలని చూసిన చంద్రబాబు నాయుడుకు కూడా నిరాశే మిగిలింది. జగన్ కు సానుభూతి ఓట్లు పడ్డాయంటే, ఏ ఏ కారణాలతో పడ్డాయనుకోవాలి?? ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోయాడనా? ఆ ముఖ్యమంత్రి మరణించిన తర్వాత జగన్ ను వారసుడిగా ప్రకటించి ముఖ్యమంత్రి చేయలేదనా? కోర్టుల్లో కేసులు పెట్టారనా? సి.బి.ఐ.తో అరెస్టు చేయించారనా? అసలు సానుభూతి ఓట్లు పడటానికి పైన చెప్పిన ఒక్క కారణమైనా సరైనదని అనిపిస్తోందా?

 అవినీతిని కాసేపు పక్కన పెట్టి చూస్తే, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిపాలన కుంటుపడలేదు, స్తంభించలేదు. ఆయన తదనంతరం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాల అసమర్ధ నిర్వాకాలకి, ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన తెలుగుదేశం వైఫల్యానికి ప్రజలు విసిగి వేసారిపోయారన్నది నిజం. ప్రత్యామ్నాయంగా ఉంటుందనుకున్న ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమవ్వటం చిరంజీవి దౌర్భాగ్యం! తనను ముఖ్యమంత్రిని చేయలేదని కినుక వహించో, లేక అవినీతి సంపాదనకు అధికారమే అండగా ఉంటుందన్న నమ్మకమో, లేక స్తబ్దంగా ఉన్న ప్రజలకు మరో ప్రత్యామ్నాయాన్ని చూపించాలనే ఆశతోనో, లేక పై కారణాలన్నిటివల్లనో మొత్తానికి జగన్ పార్టీ పెట్టాడు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ను గెలిపించటానికి చేసిన రాష్ట్రవ్యాప్త పర్యటనల తర్వాత ఆ స్థాయిలో మరో నేత ఎవ్వరూ ప్రజలకు దగ్గర కావటానికి ప్రయత్నించలేదు. జగన్ తండ్రి బాట పట్టి ప్రజలతో మమేకమవ్వటానికి ఓదార్పు యాత్రలు చేపట్టాడు. ఇదే ముఖ్యంగా జగన్ కు అనుకూలించిన అంశం.

 సాథారణంగా రాజకీయాల్లో కొత్త పార్టీ వస్తున్నదంటే, దాన్ని అణగదొక్కటానికే అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ముఖ్యంగా అరిచే  పార్టీలను ఎవరూ పట్టించుకోరు. ఉదాహరణకి లోక్ సత్తాలాంటి పార్టీలన్నమాట. కానీ, కొత్త పార్టీ కరుస్తుందనే అనుమానముంటే, దానికి పాతర వేయటానికే చేయని ప్రయత్నం అంటూ మిగలదు. అలా చరిత్రలో కనుమరుగైన పార్టీలు చాలానే ఉన్నాయి. అటువంటిదే ప్రజారాజ్యం కూడా. ప్రజారాజ్యంలో కోవర్టులను ప్రవేశపెట్టి, ఆ నేతలచేతే చిరంజీవిపైన దుమ్మెత్తి పోయించి, డబ్బులకు సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు గుప్పించి, చిరంజీవిని భయపెట్టి కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు! ఇలాంటి సామ దాన బేధ దండోపాయాలన్నీ జగన్ విషయంలో వికటించాయి. సై అంటే సై అన్న జగన్ ప్రజల అభిమానాన్ని గెల్చుకోవటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, తనని ఒక్కడిని చేసి అందరూ యుద్ధం ప్రకటించారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటంలో జగన్ కృతకృత్యుడయ్యాడు. ఇది కూడా జగన్ కు అనుకూలించిన మరో అంశం.

 ఈ ఎన్నికల సందర్భంలో ప్రజల ముందు ఉన్న ఛాయిస్ లు మూడు. అసమర్ధులు, అవినీతిపరులతో నిండిన ప్రభుత్వానికి ఓటు వేయడమా, ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మకంగాను, నిర్మాణాత్మకంగాను వ్యవహరించలేక అవకాశవాది పార్టీగా ఉన్న తెలుగుదేశానికి ఓటు వేయడమా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కు ఓటు వేయడమా? ప్రజలు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. ఈ తీర్పు సానుభూతికో మరోదానికో అంటగట్టాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఉండదు. ఫలితాలను సక్రమంగా సమీక్షించుకుని, ఆచరణలో మార్పు చూపించగలిగినప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు ప్రధాన ప్రతిపక్షానికి 2014 ఎన్నికలు ఆశావహంగా ఉండే అవకాశాలున్నాయి.

 ఏదేమైనా, దేశ, రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త శకం మొదలయ్యింది. అంతా ఒకే తాను ముక్కలే అయినా, మన రాజకీయ నాయకుల్లో నిజాయితీపరులని ఏరటం గొంగట్లో తింటు వెంట్రుకలు ఏరటం లాంటిదే అయినా, కొత్త పార్టీ కనుక ప్రజలు జగన్ కు ఓ అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని జగన్ 2014 వరకు ఎలా అందిపుచ్చుకోగలడో కాలమే చెప్పాలి. ఎ టు జెడ్ లాంటి కాంగ్రెస్ పార్టీలలా కాకుండా, వైయస్సార్ కాంగ్రెస్ తన ఉనికి చాటుకుంటుందని, తిరిగి కాంగ్రెస్ లో కలిసిపోదని, ప్రజలకు సరైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని ప్రస్తుతానికి ప్రజలు ఆశిస్తున్నారు. 


25, మే 2012, శుక్రవారం

ఎవడు తవ్విన గోతిలో ఎవరు?

 ఎవడు తవ్విన గోతిలో ఎవరు? (25-May-2012)


జగన్ అక్రమ ఆస్తుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్నది. వైయస్సార్ ప్రాపకంతో ఆయన అడుగులకు మడుగులొత్తి చక్రాలు తిప్పిన అతిరధ మహారధులైన మంత్రులకు, అధికారులకు, కార్పొరేట్ దిగ్గజాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మంత్రి మోపిదేవి వెంకటరమణను సి.బి.ఐ. అరెస్టు చేసిన నేపధ్యంలో, ఇవాళో రేపో జగన్ అరెస్టు కావొచ్చనే ఊహాగానాల మధ్య రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.

ఎత్తులు పైఎత్తులతో సాగుతున్న ఈ జిత్తులమారి రాజకీయాలు నాలాంటి సగటు పౌరుడికి చాలా ప్రశ్నలు సంధిస్తున్నాయి. సత్యం కుంభకోణం నుంచి, 2 జి, కామన్వెల్త్, ఆదర్శ్, వాన్ పిక్, తదితర అక్రమాల వరకు "చట్టం తన పని తాను చేసుకుపోతుందని" ఏలిన్నాటి పాలకులు చిలక పలుకులు పలుకుతూనే ఉన్నారు. ఎవడి గోతి ఎవడు తవ్వుతున్నాడో తెలీకుండా సస్పెన్సు థ్రిల్లర్ లాగా రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే, అరెస్టైన ప్రతివాడు తను చేసినదాన్లో తప్పేం లేదంటున్నాడు! మోపిదేవి ముఖ్యమంత్రికి వ్రాసిన రాజీనామా లేఖలో జీ.ఓ. 29 కి, పోర్టు పరిధికి సంబంధించిన అంశాల్లో నూటికి నూరుశాతం బాధ్యత వహిస్తానని చెబుతూనే, ఆ జీ.ఓ. మాత్రం తన స్వంత నిర్ణయంకాదని, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే చేసానని చెబుతున్నాడు! బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఓ మంత్రి, బాధ్యతారాహిత్యంతో అడిగినచోటల్లా సంతకాలు పెట్టి వందలవేల కోట్లు నష్టం కలిగించటమే కాకుండా, ఈరోజు అదంతా తూచ్ అనేస్తే తూచ్ ఐపోతుందా?

నీతి, నిజాయితీ లేకుండా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇలాంటి రాజకీయ నాయకులు తమ గోతులు తామే తవ్వుకుంటారని ఈ ఉదంతం నిరూపిస్తున్నది. ఏ.రాజా, కణిమొళి, సురేష్ కల్మాడీ లా ఈయన ఏమాత్రం అదృష్టవంతుడనేది కాలమే చెబుతుంది. శిక్షపడుతుందనే గ్యారంటీ మాత్రం లేదు.

తిలా పాపం తలా పిడికెడు అన్న విషయం మర్చిపోయి, అక్రమాలతో ఆస్తులు సంపాదించింది ఒకరైతే, అరెస్టులు అరదండాలు మాకా అంటున్నారట మరికొందరు సీనియర్ మంత్రులు. తమ మంత్రిత్వ శాఖలో అక్రమాలు జరుగుతున్నా కబోదుల్లా కళ్ళు మూసుకొని సంతకాలు చేయకుండా ఆరోజే, ఆ ముఖ్యమంత్రిని ఆక్షేపించి ఉండవచ్చుకదా!

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు మంత్రులంతా బాధ్యులే, కానీ చాటుమాటున జరిగే లావాదేవీలతో సంబంధం ఉండదని బొత్స స్పష్టం చేసారట! ఇది చాలా ఆసక్తికరమైన అంశం. లిక్కర్ సామ్రాజ్య పునాదులు కదిలించిన పోలీసు అధికారిని చాటుమాటు వ్యవహారాలతో కాదా బదిలీ వేటు వేయించింది? రేపు మరో పార్టీ అధికారంలోకి వచ్చి, ఇదే లిక్కర్ వ్యవహారాన్ని తిరగదోడితే ఆయన ఏమంటారో!

వైయస్సార్ హయాంలో జగన్ అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు ఈరోజు శంకరరావు చేస్తేనే తెలిసిందా? ఆరోజు మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నా, ఈ వ్యవహారాల్లో అక్రమాలు కనిపించలేదా? అప్పుడు కుక్కిన పేనుల్లా ఉన్నవారికి ఈరోజు ఇన్నేసి కోరలు ఎలా వచ్చాయి? అంతే కాకుండా, ఆరోజుల్లోనే ఈ అక్రమాస్తులతో కాంగ్రెస్ అధిష్టానానికి మూటలు మోస్తున్నారనే ఆరోపణలు వచ్చింది నిజం కాదా? అప్పట్లో ఇన్నేసి అక్రమాలు జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం గుడ్లప్పిగించి చూస్తూ ఎందుకు ఉంది? అసలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తెలియకుండానే వేలకోట్ల అక్రమాలు జరిగాయంటే నమ్మశక్యమేనా? చట్టం తన పని తాను చేసుకుపోటానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? అసలీ వ్యవహారం జగన్ ను రాజకీయంగా మట్టుపెట్టటానికేనా? లేక ఈ అక్రమార్జనలో కాంగ్రెస్ అధిష్టానానికి ఉన్న భాగస్వామ్యానికి మసిపూయటానికా? గాంధీ కుటుంబాన్ని కాపాడటానికి రాష్ట్ర మంత్రులు బలిపశువులౌతున్నారా?



22, మార్చి 2012, గురువారం

ఉప ఎన్నికలు - అందని ద్రాక్షలు

 ఉప ఎన్నికలు - అందని ద్రాక్షలు (22-March-2012)


"రాష్ట్రంలో నైతిక రాజకీయాలకు, హేతుబద్ధమైన వాదనలకు చోటు లేదు. ప్రజలు సరైన ప్రత్యామ్నాయం గురించి ఆలోచించటం లేదు" - జయప్రకాశ్ నారాయణ్.

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత లోక్ సత్తా అధినేత శ్రీ జయప్రకాశ్ నారాయణ్ గారి స్పందన ఇది. ఒక మేధావి నుంచి ఇటువంటి దిక్కుమాలిన స్పందనేమిటా అని ఆలోచించాల్సి వచ్చింది. నైతిక రాజకీయాలకు హేతుబద్ధమైన వాదనలకు రాష్ట్రంలో చోటు లేదని వాపోయారు.... బానే ఉంది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు, ఓట్లేసే ప్రజలు సరైన ప్రత్యామ్నాయాం గురించి ఆలోచించటంలేదని ఆరోపణలు చేయటంలో అసలు ఉద్దేశ్యం ఏమిటి? ప్రజలు ఎవరిని గెలిపిస్తే, ఆయన మెచ్చుకొని ఉండేవారు? లోక్ సత్తానా? కమ్యూనిస్టులనా? తె.రా.స., భా.జ.పా., వైఎస్సార్ కాంగ్రెస్ మినహా ఎవరికి ఓటు వేసినా ఫర్వాలేదా?

తెలంగాణాలో ప్రజలు హేతుబద్ధంగానే ఆలోచించారు. తెలంగాణా పై కాంగ్రెస్ నాంచుడు ధోరణితో విసిగిపోయారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం పనికిరాదని తేల్చేసారు. ఇచ్చినా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదనే లోక్ సత్త ను గెలిపిస్తే ఉపయోగం లేదనే తీర్మానించారు. ఉద్యమంలో ఊగిపొవటమే కాని, ఉద్యమాన్ని ఊపే సత్తా సి.పి.ఐ.కి లేదనే నిర్ణయించారు. ప్రస్తుతానికి తెలంగాణాకు జాతీయస్థాయిలో మద్దతు ఇస్తున్న భా.జ.పా.ను, రాష్ట్రంలో తెలంగాణా పల్లకీలో ఊరేగుతున్న తె.రా.సా.ను మరోసారి మోద్దామనే నిశ్చయించుకున్నారు. తెలంగాణా కావాలనుకునే తెలంగాణా ప్రజలకు ఇక వేరే ప్రత్యామ్నాయం ఏముంది?

ఎవరికి ఎప్పుడు ఓటు వేయాలో, వేటు వేయాలో అన్నీ ఈయన చెప్పిన తర్వాతే ప్రజలు ఆచరించాలన్నట్లుగా ఉంది. ఆయన మాటల్లో అహంకారం తప్పా, నిజాయితీగా వెలిబుచ్చిన బాదైతే నాకేమీ కనిపించటంలేదు. అందని ద్రాక్షలు పుల్లనే కాబట్టి, ఆయన సంగతి పక్కన బెట్టి, ఉప ఎన్నికల ఫలితాలు ఓసారి విశ్లేషించుకుందాం.

అయిదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయింది కాంగ్రెస్ కు. యు.పి.లో సైకిల్, ఎ.పి.లోనూ సైకిలే అంటూ చంద్రబాబు కూడా చంకలు గుద్దుకోవటం మొదలేసారు. ఈలోపలే ఆంధ్రాలో ఉప ఎన్నికలు మొదలైనాయి. కార్యకర్తలకన్నా కూడా ఇనుమడించిన ఉత్సాహంతో ఉప ఎన్నికల్లో ప్రచారం చేసారు ఈయన. మధ్యంతర ఎన్నికల దిశలో దేశం పయనిస్తున్న సూచనలు కూడా తన మూడో కన్నుకు కనిపిస్తున్నాయని ప్రజలకు వివరించాలని ప్రయత్నించారు. అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పి.సి.సి. ఛీఫ్ బొత్సాలు కూడా చిటికెల పందిళ్ళు వేసి ఏడింట కనీసం నాలుగైనా గెలుస్తామన్న ధీమా ప్రకటించారు. చివరికి ఫలితాల్లో "గుండు" సున్నాలే మిగిలాయి ఈ రెండు పార్టీలకు. తెలంగాణాలోని ఆరు నియోజకవర్గాల్లో కనీసం చెరొకటైనా గెల్చుకొని ఉంటే, తెలంగాణా వాదమే లేదని, తె.రా.స.ను ప్రజలు తిరస్కరించారని మరిన్ని పందిళ్ళు వేసే అవకాశం దొరికేది. కనీసం ఆమాత్రంగానైనా అవకాశం కలిసిరాలేదు.

తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల్లో తె.రా.స. గెలిచిందా, తెలంగాణా వాదం గెలిచిందా అన్న మీమాంస పక్కనబెడితే, ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్, తెలుగుదేశం కన్నా, తె.రా.స.నే మరిన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం విషయంలో తె.రా.స. అనుసరించిన విధానం ప్రత్యేక తెలంగాణా ఉద్యమస్ఫూర్తికే విరుద్ధంగా ఉంది. మునుపు భా.జ.పా. తో రాసుకుపూసుకు తిరిగినప్పుడు లేని అభ్యంతరం మహబూబ్ నగర్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు మాత్రం దేనికి? ఐ.కా.స.లో భా.జ.పా.కు చోటిచ్చినప్పుడు మతవాదం గుర్తుకు రాలేదా? తెలంగాణా వరకు తన తర్వాతే మరే పార్టీ అయినా అనే దుస్సాహసంతో పెద్దన్న తరహా పిడివాదనతో తె.రా.స. ప్రవర్తిస్తున్న తీరు గర్హనీయం.

ఇంతవరకూ చాలాసార్లు ఒంటెద్దుపోకడలతో తెలంగాణా ఉద్యమాన్ని ఓ జోకులా మార్చేసిన కె.సి.ఆర్. కనీసం ఇప్పుడైనా సరైన విజ్ఞత ప్రదర్శించాలి. తె.రా.స.కు భా.జ.పా. అవసరమా కాదా అని కాకుండా, తెలంగాణా ఉద్యమానికి భా.జ.పా. ఏమేరకు అవసరమౌతుందనే ఆలోచించాలి. ఎందుకంటే, తెలంగాణాలోని ఆ ఆరు నియోజకవర్గాలలో భా.జ.పా. పోటీ చేసి ఉంటే తె.రా.స. పరిస్థితి ఏవిధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాలి! అలా చేసి ఉంటే, ఖచ్చితంగా తెలుగుదేశం, కాంగ్రెస్ లకు మేలు జరిగుండేది.

తెలుగుదేశం విషయానికి వస్తే, ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు తెలుగుదేశం సరైన ప్రత్యామ్నాయం కాలేకపోతున్నదనే మాట వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రినని, కేంద్రంలో చక్రాలు తిప్పేది, చేగోడీలు తినేది తానేనని సంబరపడిపోయారు చంద్రబాబు. దానికి కారణాలు యు.పి., పంజాబ్, గోవా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భంగపడటం, మూడో ఫ్రంటు ముసలి కాపు ములాయం సింగ్ యు.పి.లో అద్భుతంగా గెలుపొందటం. అక్కడ ఫలితాలు రావటమే ఆలస్యం, ప్రాంతీయపార్టీలతో మూడో ఫ్రంటు గురించి కూడా ముచ్చట్లు మొదలేసారు. ఇంత చేసీ, ఏడు చోట్ల పోరాడితే మూడు చోట్ల డిపాజిట్లు పోయి, అన్నిచోట్లా ఓడిపోవాల్సి వచ్చింది. కిందపడ్డా మీసాలకు మట్టి అంటలేదన్నట్లు, ఓడిపోయినా మునుపటి కంటే ఓట్లు ఎక్కువ వచ్చాయనే ఆనందబాష్పాలు ఈ అయ్యవారికి! కనీసం ఇప్పటి నుంచైనా ప్రతిపక్షంగా సరైన ప్రత్యామ్నాయంగా నిర్మాణాత్మక వైఖరితో వ్యవహరించకుంటే 2014 నాటికి కొంప కొల్లేరే అవుతుంది.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే, యు.పి.లో పృష్ఠ తాడనమైతే, ఏ.పీ.లో దంతభంగమయ్యింది! ఈ రెంటి మధ్యలో గుజరాత్, కర్ణాటక ఉప ఎన్నికల్లో గెల్చింది. ఏది వాపో ఏది బలుపో తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతున్నది కాంగ్రెస్ అధిష్టానం. కొశ్శెన్ మార్కులో ఉన్నది యువరాజైతే ఓటమికి అందరూ బాధ్యత వహించేస్తారు కాంగ్రెస్ లో. కాకపోతేనే సమస్యల్లా! ఏదో మొహమాటానికి సి.ఎం. గా ఓటమికి బాధ్యత వహిస్తున్నానని చెబుతూనే, గడుసుగా నా వద్ద అద్భుతదీపాలేమీ లేవు, బాధ్యతలు ఒంటి చేత్తో మోసేవి కావని కూడా స్పష్టం చేసారు కిరణ్ కుమార్ రెడ్డి. పి.సి.సి. బాస్ బొత్సా మాత్రం తె.రా.స., వైయెస్సార్ కాంగ్రెస్ ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్నాయని కాబట్టి అవి గెలవటంలో విశేషం లేదని తేల్చేసారు! తనది కాకపోతే కాశీ దాకా దేకించే ఈ బాపతు ఆలోచనల వల్లే కాంగ్రెస్ కుంటి నడక నడుస్తున్నది రాష్ట్రంలో. కేంద్రంలోనూ అలాంటి ఆమాం బాపతే దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది.

వైయెస్సార్ కాంగ్రెస్ గురించి ప్రస్తుతానికి చెప్పుకోవాల్సిందేమీ లేదు. చాప కింద నీరులా రాష్ట్రంలో ప్రవహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణాలో పోటీకి నిలబడకపోవటం మంచి ఎత్తుగడలా అనిపిస్తున్నది. భవిష్యత్తు ఎన్నికల కోసం తెలంగాణా దారులు తెరిచే ఉంచినట్లుగా తెలుస్తోంది.

రాబోయే మలివిడత ఉప ఎన్నికల తర్వాత ప్రజలు ఎటువంటి ప్రత్యామ్నాయం కోరుతున్నారో ఇంకా స్పష్టంగా తెలిసొస్తుంది.



8, ఫిబ్రవరి 2012, బుధవారం

చిటపటలు 16 - 20

 చిటపటలు-16 "దండోపాఖ్యానం - భోళా శంకరులు" (02-August-2011)

ఈమధ్య డిగ్గీరాజా వారి "దండోపాఖ్యానం" వినే మహద్భాగ్యం మరోసారి కలిగింది. అయ్యవారి "దండబోధ"లో మన రాజకీయ నాయకులెంత భోళా శంకరులనే విషయం తెలిసి కళ్ళు తెరుచుకున్నాయి. అదేలానో మీరూ తెలుసుకోండి.

* * *

2007 లో ఏదో దద్దమ్మల సామాజిక సేవా సంస్థ శీతలపానీయాల్లో పురుగుల మందులు వాడుతున్నారని ఆ రిపోర్టులు, ఈ రిపోర్టులు ఉటంకించి నానా రభస చేసింది. దేశంలో శీతల పానీయాలని నిషేధించాలని కూడా గొడవ చేసింది. 

ఎందరెందరో సినీ తారలు, క్రికెటర్లు శీతలపానీయాలతో ప్రజలని ఉత్తేజితులని చేస్తుంటే, ప్రజలని త్యాగం చేయమనటానికి దద్దమ్మలకు నోరెలా వచ్చిందని అందరూ ఆడిపోసుకున్నారు. 

ప్రజల నెత్తిన భారాన్ని పెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం మాత్రం త్యాగం చేసే భారాన్ని తన నెత్తిన వేసుకుంది. పార్లమెంటు క్యాంటీన్ నుంచి శీతల పానీయాలని నిషేధించింది. శీతల పానీయాలు వదిలేసి, కేవలం లస్సీలు, జ్యూసులతోనే కాలం గడిపేస్తున్నారట మన ఎంపీలు. చూశారా, ప్రజల కోసం మన ప్రజా ప్రతినిధులు ఎంతెంత త్యాగం చేస్తున్నారో!

* * *

అన్నా హజారే పుణ్యమా అని, ప్రభుత్వం ఎట్టకేలకు పార్లమెంటులో లోక్ పాల్ బిల్లు ప్రవేశ పెడుతున్నది. ప్రధానిని, ఉన్నత న్యాయస్థానాలని, పార్లమెంటులో ఎంపీల వ్యవహారానికి, నిర్వాకాలకి కూడా లోక్ పాల్ పరిధి నుంచి మినహాయింపు ఇచ్చేసారు! 

లోక్ పాల్ బిల్లు ప్రేరణతో, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్త కూడా ఇలాంటి మినహాయింపులే ఇచ్చే దిశగా మరెన్నో రాష్ట్రాలు ఆలోచిస్తున్నట్లు భోగట్టా. ఇకమీదట బయట కాకుండా పార్లమెంటులోనో అసెంబ్లీలో మాత్రమే లంచాలు మేయాల్సి రావటం త్యాగమే కదా!!

దీనివల్ల, అవినీతి అనే జాడ్యం అసెంబ్లీ, పార్లమెంటు వరకే పరిమితమౌతుందిట. సాధారణ జన బాహుళ్యం అవినీతికి దూరంగా హాయిగ బతుకులు వెళ్ళబుచ్చొట!

శీతల పానీయాలు త్యాగం చేసి, అవినీతి అనే గరళాన్ని మింగుతున్న మన ప్రతినిధులు భోళా శంకరులే... కాదనగలమా?

 

చిటపటలు-17 "కాంగ్రెస్ లో యువరక్తం" (09-August-2011)


రాష్ట్ర కాంగ్రెస్ ను యువరక్తంతో నింపే దిశగా రాష్ట్ర పి.సి.సి. అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. యువరాజును మోయటానికైనా, యువనేతను తోయటానికైనా ఇప్పుడున్న నేతల్లో చేవ చచ్చిందని, అందుకే వారి వారసులకు వల వేస్తున్నాడని గిట్టనోళ్ళు కోళ్ళలా కూస్తున్నట్లు సమాచారం.

 

కేంద్రంలో కూడా కాంగ్రెస్ నేతలు ఆ దిశగానే పావులు కదుపుతున్నట్లు భోగట్టా. అందులో భాగంగానే, నిన్నటి దాకా గాలిపటాలు ఎగరేసిన నలభై ఒక్క ఏళ్ళ యువరాజు చేత ఈసారి జెండా ఎగరేయిస్తారట.

 * * *

కాంగ్రెస్ పంచలో చేరి, కాంగ్రెస్ పంచె కట్టి సోనియా పెట్టే శఠగోపం కోసం ఆర్నెల్లుగా ఇంట్లోనే గర్వంగా ఎదురుచూస్తున్న చంటబ్బాయికి మొత్తానికి ముహూర్తం కుదిరినట్లుంది. ఈ నెల ఇరవైన యువరాజు ఇచ్చే తీర్ధం పుచ్చుకోటానికి మరోసారి గర్వంగా ఎదురుచూస్తున్నాడట కాంగ్రెస్ గేట్ల వంక, గొళ్ళేల వంకా.! ప్రసాదంగా దద్ధోజనమే దక్కేనో, చక్రపొంగలే దక్కేనో!

 

* * *

చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అనే గాంధీ మూడు కోతుల సూత్రాలని మన ప్రభుత్వాలు అవినీతి పరంగా ఎంత చక్కగా పాటిస్తున్నాయో చూడండి.

 

మన్ మోహన్ సింగ్ - మాట్లాడమన్నా మాట్లాడడు*

యడ్యూరప్ప - వినమన్నా వినడు

కరుణానిధి - చూడమన్నా చూడడు.

గాంధీ చెప్పని నాలుగో కోతి, మరిచిపోతుంది కూడా!

 

చిటపటలు-18 "తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ ల వలన..." (17-August-2011)


ఏకు మేకవ్వటం మనకు తెల్సిందే. కొన్ని నెలల క్రితం కొన్ని వందలమందితో జంతర్ మంతర్ దగ్గర అన్నా నిరాహార దీక్ష చేసారు అవినీతికి వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఆయనకు బాసటగా నిల్చారు. ప్రభుత్వం దిగొచ్చింది. లోక్ పాల్ బిల్లు ముసాయిదా కమిటీలో చోటు కల్పించింది. అప్పటికే మహారాష్ట్రలో మహామహులనదగ్గ నేతలను అవినీతి కారణంగా మట్టి కరిపించిన అన్నాను తక్కువ అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వం తీరిగ్గా పొగ బెట్టింది. ఢాక్కాముక్కీలు తిన్న అన్నా అక్కడితో వదిలేస్తే మేకు ఎలా ఔతాడు... బాబా రాందేవ్ ఔతాడు కానీ...

ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా వల్ల వీసమెత్తు ఉపయోగం లేదని గాండ్రించాడు. డేటు, టైము, ప్లేసు అన్నీ చెప్పి మరీ ఆమరణ దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మళ్ళీ, ఇదేదో రాందేవ్ వ్యవహారమేలే అని ప్రభుత్వం మరోసారి తక్కువ అంచనా వేసి, బురిడీ కొట్టేసింది. ఇక్కడో కధ చెప్పుకుందాం.

అక్బర్ తో ఒకసారి యాధాలాపంగా బీర్బల్ అంటాడు "ఒక్కోసారి తప్పు చేయటం కన్నా, ఆ తప్పుకు ఇచ్చే సంజాయిషీ అపాయకరంగా ఉంటుంది జహపనా" అని. నిరూపించకపోతే తల తీస్తానంటాడు అక్బర్. సీను మారింది. అక్బర్ పూలతోటలో విహరిస్తూ ఉంటాడు. వెనక నుంచి బీర్బల్ వచ్చి పాదుషా పిర్ర గిల్లుతాడు. ఏదోలే పొరపాటేమో అని కొంచెం ముందుకు వెళ్తాడు అక్బర్. మళ్ళీ గిల్లుతాడు బీర్బల్. ఆగ్రహంతో ఊగిపోతాడు అక్బర్. ఎందుకు గిల్లావని అడిగితే, "క్షమించండి జహపనా, మీరనుకోలేదు, మహారాణి వారనుకున్నాను" అంటాడు.

ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఏకులా ఏదో నిరాహార దీక్ష చేస్తా అంటున్నవాడిని గిల్లింది ప్రభుత్వం. ఆనక, ఆయన శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తాడని అరెస్టు చేసామని సంజాయిషీ ఇచ్చింది. మొన్నటిదాకా వేలల్లో వెంట నడిచిన ప్రజలు ఒక్కసారిగా లక్షల్లో మద్దతుగా నిలుస్తున్నారు అన్నాకు. అడకత్తెరలో పోకచెక్కలా ఉన్న ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే, యాభై ఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఇంతటి దివాలాకోరు రాజకీయాలు నడుపుతున్నదా అని ఆశ్చర్యం కలుగుతున్నది.

అన్నాను అరెస్టు చేయమన్న దద్దమ్మలెవరు? ఆ పని చేసి ఆనక సంజాయిషీల మీద సంజాయిషీలు ఇప్పించిన చవటలెవరు? చివరికి వదిలేయమని చెప్పిన తుగ్లక్ లెవరు? చూస్తుంటే, తుగ్లక్ ల చేత, తుగ్లక్ ల కొరకు, తుగ్లక్ వలన మనం పరిపాలించబడుతున్నట్లుంది.

అయ్యా తుగ్లక్ మోహన్ సింగ్ గారు.... కపిల్ సిబల్సు, చిందంబరాలు, అభిషేక్ సింఘ్వీలు పదవులు పోయినా ప్రాక్టీస్ చేసుకు బతుకుతారు. వీళ్ళ సలహాలతో తమరు చరిత్రలో జోకర్ గా నిలబడటమే కాకుండా అమ్మకు, యువరాజుకు భారత్ లో బఠాణీలు అమ్మే పరిస్థితి కలిగిస్తున్నట్లున్నారు. జర భద్రం.

 

చిటపటలు-19 "చంటబ్బాయిలు - చంద్రబాబు" (25-Nov-2011)


పాపం చంటబ్బాయ్. తెలుగు సినిమాలలో ఎన్నెన్నో "పాత్రలు" అవలీలగా పోషించేసాడు. రాష్ట్ర రాజకీయాల్లో కూడా తనో "పాత్ర" ధరిద్దామనుకుంటే, ప్రజలు వేరే "పాత్ర" ఇచ్చేసారు. ప్రజలిచ్చిన "పాత్ర" ఈ జగదేకవీరుడికి నచ్చలేదు. ఈ "పాత్ర" మారాలంటే మరో అయిదేళ్ళు పట్టేస్తుంది. త్రినేత్రుడి మూడో నేత్రం జ్ఞాన బోధ చేసే సరికి బంపర్ ఆఫర్ కోసం కాంగ్రెస్ అంట కాగాలనే నిర్ణయించాడు. తన పార్టీలోనైతే ఒక్కటే "పాత్ర". అదే వందేళ్ళ పైబడ్డ కాంగ్రెసైతే, కావల్సినన్ని "పాత్రలు", కాకపోతే "చెంచాలు, గరిటెలు" ఉండనే ఉన్నాయి.

ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో కాంగ్రెస్ ముందు నీ "పాత్ర" ఇచ్చేయమంది, ఇచ్చేసాడు. నా "పాత్ర" ఏదని అడిగితే, కాంగ్రెస్ లో "పాత్ర" అంటే చాలా వ్యవహారాలున్నాయి, ముందు తీర్ధం పోస్తాం, శఠగోపం పెడతాం, ఆ తర్వాత ప్రసాదం ఇవ్వబడుతుందని సర్ది చెప్పారు. ఇవ్వబోయేది కేంద్రంలో "పెద్ద పాత్ర" అని కొన్నాళ్ళు ఊరించారు. కాదు కాదంటూ రాష్ట్రంలోనే "చాలా పెద్ద పాత్ర" అని ఊహించుకున్నాడు. చిన్న పాత్రలైనా, చితక పాత్రలైనా ఏదో ఒక "పాత్ర" పడేస్తారనే నమ్మకంతో ఇంట్లో "పాత పాత్రలు" అన్నీ ముందేసుకొని మీనమేషాలు లెక్కిస్తున్నాడట "కొదమసింహం"

* * *


సింహమంటే గుర్తొచ్చింది. "కరువుప్రాంత రైతులకు సహాయం అందించకపోతే, ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతా" నంటూ చంద్రబాబుగారు గర్జించారని వార్తలు. మొన్నగాక అటుమొన్న, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని భరోసా ఇచ్చిన పెద్దమనిషి ఇలా గర్జించటం ఏంటో! తమ గుండెలు వదిలేసి ఆయన ఎక్కడ బబ్బున్నా బాధలేదని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారట! తెలుగు తమ్ముళ్ళు మాత్రం బస్టాండుల్లో బఠానీలు తింటూ... ఈయనెప్పుడు నిద్రలేస్తారా అని నిట్టూర్పులు విడుస్తున్నారని భోగట్టా!

* * *


బస్టాండులో బఠానీలంటే గుర్తొచ్చింది. ఈ మధ్య దేశంలోని ఏ ఊరికెళ్ళినా అక్కడ రైల్వే స్టేషన్ల దగ్గర అడుక్కునే వాళ్ళ మీద గుగ్గిలమౌతున్నాడట యువరాజు. సంగతేమిటా అని ఆరా తీస్తే, అలా అడుక్కునేవాళ్ళలో చాలామంది మాది ఉత్తర ప్రదేశ్ అని గర్వంగా చెప్పుకుంటున్నారట! అలా అడుక్కోటానికి సిగ్గుగా లేదా, కనీసం ఇప్పుడైనా హస్తానికి ఓటేయండి యు.పి.లోనే అడుక్కునే అవకాశం ఇస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాడట.

యు.పి.లో అడుక్కునే ట్రైనింగు కూడా ఆల్రెడీ మొదలేసాడని ప్రతిపక్షాలు ఆడిపోసుకుంటున్నాయి. పూటకో గుడిసెలో దూరి "చాయ్ పానీ మై యెహీ పీవుంగా, రోటీ భీ యెహీ ఖావూంగా" అని గుడిసెల్లో రొట్టెలన్నీ లాగించిగాని బయటకు రావటంలేదుట! ఓట్ల కోసం ఇన్నేసి డ్రామాలా అని యు.పి. పార్టీలు ముక్కున వేలేసుకుంటుంటే, నేను మీలా స్టూడియోల్లో కన్నీళ్ళు కార్చే డ్రామాలాడను. భారతదేశం స్టూడియోల్లో లేదు, గుడిసెల్లోనే ఉందని ప్రూవ్ చేయటానికే అడుక్కొచ్చిన రొట్టెలు లాక్కొని మరీ తింటాను అని వీరంగాలు కూడా వేస్తున్నాడట!


చిటపటలు-20 "దున్నపోతులు - వడగళ్ళ వానలు" (08-February-2012)


ఈమధ్య రాష్ట్రంలో మద్యం సిండికేట్ల మీద ఎ.సి.బి. దాడులు చేస్తున్నది. అందులో భాగంగా అరెస్టైన ఓ మద్యం వ్యాపారి రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి రమణతోపాటుగా తెలుగుదేశం, సి.పి.ఎం, సి.పి.ఐ., సి.పి.ఐ (న్యూ డెమొక్రసి), భా.జ.పా. నేతలకు కూడా లక్షల్లో లంచం ఇచ్చినట్లుగా వాంగ్మూలం ఇచ్చాడట!

 

రోజుకో కొత్త కుంభకోణాన్ని తవ్వి తలకెత్తుకొని అవినీతిలో రోజుకో కొత్త లోతుని చూపిస్తున్న కాంగ్రెస్ చేసే ఎదురుదాడి చూడ ముచ్చటగా ఉంటుంది. ముందుగా ఇవన్నీ ఆరోపణలే అని అవహేళన చేస్తారు. పైగా వైరిపక్షాల కుట్ర అని కూడా తీర్మానిస్తారు. అంతేకాదు, ఫలానా సంవత్సరం, పలానా దుర్ముహూర్తంలో ఫలానా పార్టీ నాయకుడు చేసింది కూడా ఇదే అని ఆధారాలు చూపిస్తారు. అస్సలు ఇవ్వనేలేదని ఆరోపణలు తిప్పికొట్టే బేరం మొదలేస్తారు. ఆ తర్వాత, ఇచ్చినా తీసుకోలేదంటారు. ఒప్పుకోకపోతే కొంప కొల్లేరౌతుందన్న పరిస్థితి వస్తే, ఎవడో కార్యకర్తనో, లేదంటే కల్మాడినో, సరిపోకపోతే మరెవరో అధికారినో ముందుకు తోసి, వీడే పార్టీ గౌరవాన్ని భంగపరిచాడు, డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడని వాడి బండారం బట్టబయలుచేసామని దరువులు వేసుకుంటారు. ఈ రంగంలో ఢక్కాముక్కీలు తిన్న కాంగ్రెస్, అనుభవం నేర్పిన పాఠాలతో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరికీ అందనంత లోతుల్లో పవిత్రంగా ముక్కిపోతూ ఉంటుంది. కుళ్ళి కంపుకొట్టేది కార్యకర్తలే కానీ, పార్టీ కాదని ముక్కు చీదుకుంటుంది.

 

చేతివాటం చేతకాక కక్కుర్తిపడే కొన్ని పార్టీలు మాత్రం పరువుని బజారులో పాతరవేసుకుంటాయి. ఆ కోవలోదే రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రస్తుత పరిస్థితి. ఈ ముడుపుల భాగోతంలో భంగపడ్డ ఈ పార్టీలు తాము తీసుకున్నది లంచం కాదని, పార్టీ కోసం, పార్టీ మహాసభ కోసం తీసుకున్న చందాలని చెవుల్లో పూలు పెట్టుకుంటున్నాయి. గతంలో బంగారు లచ్చన్న భా.జ.పా. ప్రెసిడెంటుగా ముడుపులు తీసుకుంటు, దొరికిపోయి పాడిన పాత పాటే ఇది. ఆ తర్వాత భా.జ.పా. కూడా కాంగ్రెస్ లెవెల్లో కొత్త రాగాలు, సరికొత్త పాటలు నేర్చుకుంది. మొత్తానికి తర తమ బేధాలు లేకుండా పార్టీలన్నీ దున్నపోతులే అని తీర్మానించేయొచ్చు. వాన పడితే ఏం, వడగళ్ళు పడితే ఏం, సుబ్బరంగా తుడిచేసుకొని మన మీదే ముక్కు చీది పోతారు!