19, మే 2014, సోమవారం

మరో చరిత్రలో మొదటి అడుగు

 మరో చరిత్రలో మొదటి అడుగు (19-May-2014)


“To destroy is the first step to any creation” – EE Cummings.

ఒక పీడా విరగడయ్యింది! ఒక అవినీతి, అసమర్ధ ప్రభుత్వం ధ్వంసమయ్యింది! దాదాపు పది రాష్ట్రాలలో నామరూపాలు లేకుండా చిత్తుచిత్తయ్యింది! ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన పార్టీ ప్రధాన ప్రతిపక్షపు హోదా కూడా దక్కే అవకాశం లేక దిక్కులేనిదయ్యింది! మరో చరిత్రకు ముందుమాటగా మోడీ ప్రభుత్వం ఏర్పాటవ్వబోతున్నది.

ఇదొక ప్రజాస్వామిక విప్లవం! దాదాపు నెలరోజులకు పైగా జరిగిన అవినీతి బకాసుర సంహార క్రతువు ఆశించిన రీతిలోనే సరైన ముగింపు పలికింది. పది సంవత్సరాల అసమర్ధుల పాలనకు ప్రజలు ఎట్టకేలకు భరతవాక్యం పలికారు. విభజించి పాలించే దుర్రాజకీయ నాయకుల పీచమణిచే రీతిలో ప్రజలు ప్రతిస్పందించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ప్రజలు పాలుపంచుకున్న ఈ ప్రజాస్వామ్య యజ్ఞం దేశాన్ని మలుపు తిప్పే మరో చరిత్రకు మైలురాయిగా మిగిలిపోతుందనేది వాస్తవం!

ఈ ఎన్నికలలో ప్రధాన పాలకపక్షమైన కాంగ్రెస్‌కే కాక, ఇతర ప్రతిపక్షాలకు కూడా ప్రజలు సరైన గుణపాఠం నేర్పారు. 70వ దశకంలో ఇందిరాగాంధీ అరాచకాలకి అడ్డుకట్ట వేసేందుకు ఆరోజుల్లో జయప్రకాష్‌ నారాయణ్ విప్లవశంఖాన్ని పూరించి ప్రధాన పార్టీలన్నిటినీ సమీకరిస్తే, ఈనాడు ఒక్కడే అందరిగా, అందరికీ ఒక్కడిగా ప్రజా చైతన్యానికి కారణభూతుడైనాడు నరేంద్ర మోడీ. సాథారణంగా, పాలకపక్షానికి వ్యతిరేకంగా ఎన్నికలు పోరాడే పార్టీలు, ఈ ఎన్నికలలో మాత్రం పాలకపక్ష వైఫల్యాలను ఏమాత్రమూ  పరామర్శించకుండా, ప్రధాన ప్రతిపక్షమైన భా.జ.పా.కు అడ్డుకట్ట వేయబూనటం విచిత్రం! మోడీకు అమెరికా వీసా ఇవ్వరాదని కాంగ్రెస్‌తో సహా అమెరికాని దేబిరించిన పార్టీలే ఇవి!! గుళ్ళుగోపురాలు తిరిగాడని, మసీదులు, చర్చులు తిరగలేదని, సిక్కుల తలపాగా చుట్టాడని, ముస్లీముల టోపీ పెట్టుకోలేదనీ, కాషాయం కోటు కట్టాడని, క్రైస్తవులకు గౌరవం ఇవ్వలేదనీ,... ఇలా నానారకాల కారణాలు చూపిస్తూ… ఆరు నూరైనా, మోడీ ప్రధాని కాకూడదని, దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని ప్రజలను భయభ్రాంతులను చేయటానికే కాంగ్రెస్ సహా ప్రతి పార్టీ ప్రయత్నించిందనేది నిజం. 

కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీకి ఈ దేశమన్నా, దేశ ప్రజలన్నా చాలా చులకన భావం ఉంది. ఆ పార్టీ నాయకులకి ప్రజా సేవ కన్నా అధినేత, అధినేత్రుల కాళ్ళు కడగటమే పరమార్ధమన్న విషయం అందరికీ తెలిసిందే.. ఆ పార్టీ నేతల దృష్టిలో దేశమంటే నెహ్రూ కుటుంబమే కానీ మరెవరూ వారి దృష్టికి ఆనరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అహంకారానికి అడ్డు అదుపు లేకుండా పోయిందనేది వాస్తవం.  పబ్లిక్ పాయిఖానాల నుంచి విమానాశ్రయాల వరకు దేశాన్ని గాంధీ నెహ్రూ మయంగా చేయాలనే వాళ్ళ బానిస మనస్తత్వంతోపాటు, రెండోసారి అధికారం సాధించామన్న అహంకారంతో జనలోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన అన్నాహజారేలాంటి స్వాతంత్రయోధుడిని అవమానించిన తీరులో, పార్లమెంటు తలుపులు మూసి మరీ తెలంగాణా ఏర్పాటు చేయటంలో వారి మనోవైకల్యాలు ప్రజలకు ప్రస్ఫుటంగా కనిపించాయి. 

ప్రతి ఎన్నికల సభలోనూ, మోడీని రాక్షసుడుగా అభివర్ణించింది సోనియా గాంధీ. మత ప్రసక్తి లేకుండా మరే ఇతర కాంగ్రెస్ నాయకుడు ఏనాడూ, ఎక్కడా ఉపన్యసించకుండా ఉండలేదు. తమ పార్టీ సమావేశాలలో టీ అమ్ముకోమని ఈసడించాడు మణిశంకర్అయ్యర్‌లాంటి ప్రబుద్ధుడు. పెళ్ళాన్ని వదిలేసిన మోడీ ప్రజలని ఏలా పాలించగలడని తన చాటుమాటు వ్యవహారం బట్టబయలయ్యేదాకా రాజగురువు దిగ్విజయ సింగ్ ఘోషిస్తూనే వచ్చాడు. గుజరాత్ మోడల్ ఓ బెలూన్ అని, అభివృద్ధంటే జూపిటర్ మీది ఎస్కేప్ వెలాసిటీ అంటూ ప్రజలకు దిశానిర్దేశం చేయబోయాడో పప్పు! అవినీతిని అణచివేయటానికే లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెట్టామని చంకలు గుద్దుకొని మరీ వాడివేడి ప్రసంగాలు చేసిన రాహుల్, ప్రభుత్వంలోని అవినీతి గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు, సరికదా మోడీని మించిన అవినీతిపరుడు లేడని తీర్మానించాడు! అంతే కాక, మోడీ అధికారంలో వస్తే 22 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని భవిషత్తు పురాణం ప్రవచించాడు! ఇవేవీ కాదని, అభివృద్ధి ప్రాతిపదికగా వోట్లు అడిగిన మోడీవి నీచరాజకీయాలని ఎద్దేవా చేసింది ప్రియాంకా! అన్నీ తీరిగ్గా విన్నారు ప్రజలు. 

వందేమాతరమంటూ భారతమాతకి జయజయధ్వానాలు చేసిన నరేంద్రమోడీ ప్రజలలో నివురుగప్పిన జాతీయతా భావాన్ని వెలికితీసి నిలువెత్తుగా నిలబెట్టాడు. అసమానతలకు అసలైన విరుగుడు అభివృద్ధే అన్న మంత్రాన్ని ప్రజలకు అర్ధమయ్యే భాషలో చెప్పగలిగాడు. యు.పి.ఎ. ప్రభుత్వంపై విమర్శలైనా కానీ, ప్రభుత్వం ఎలా ఉండకూడదో అన్న విషయంపైన కాకుండా, ప్రభుత్వం ఎలా ఉండాలో అన్న విషయంపైనే తన ఆలోచనలు పంచుకున్న మోడీ తన రాబోయే ప్రభుత్వం ఎలా ఉండబోతుందో కూడా ప్రజలు ఓ అంచనాకు వచ్చేట్లు చేయగలిగాడు. అందుకే కుల మత ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా ప్రజలు వోట్లు వేసారు, మోడీని గెలిపించారు. ఆ పాఠాన్ని ఇతర పార్టీలు ఇంకా నేర్చిన జాడలైతే ప్రస్తుతానికి కనిపించటంలేదు. కేవలం మతాధారంగా ప్రజలను చీల్చి భా.జ.పా. వోట్లు గెలుచుకుందని చెప్పే ఆస్కారం కూడా లేకుండా, హైందవేతర మతస్థులు ఎక్కువగా ఉన్న గోవా లాంటి చోట్ల కూడా ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. ముస్లీములు ఎక్కువగా ఉన్న యు.పి., బీహార్ తదితర రాష్ట్రాలలో వారి వోట్లు పడకుండానే భా.జ.పా. గెలిచిందని చెప్పటం కూడా మూర్ఖత్వమే! అసలు ఈ ఎన్నికలను కుల, మతాల కళ్ళజోడులు పెట్టుకొని విశ్లేషించటం కూడా మూర్ఖత్వమే ఔతుందని నా అభిప్రాయం.

ఈరోజుకు కూడా యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి, వారి వైఫల్యాలకు తాము బలి అయ్యామని ఎస్పీ, బీఎస్పీ పార్టీల ప్రబుద్ధులు భావిస్తున్నారు కానీ, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేకపోతున్నారు, ఆ తీర్పుకు కారణాలు వెతకలేకపోతున్నారు! తమను తాము సెక్యులర్ నేతలుగా పరిగణించుకునే ఎస్పీ, ఆర్జేడీ, జె.డి.(యు)లకే కాకుండా సున్నాలతో ఎన్నికలు చుట్టేసిన బీఎస్పీ, నేషనల్ కాన్‌ఫరెన్సు, రాష్ట్రీయ లోక్‌దళ్‌లకు ప్రజలు ఇచ్చిన తీర్పు పెద్ద చెంప పెట్టు. ఈ పార్టీల అస్తిత్వానికి పెద్ద ముప్పుగా పరిణమించిన ఈ ఎన్నికల నుంచి వారు నిజమైన పాఠాలు నేర్వనంతవరకూ బహుశా ప్రజలు అలా మాడు పగలగొడుతూనే ఉంటారు. ఎందుకంటే, అదిగో బూచి, ఇదిగో బూచి అని ప్రజలను భయపెట్టిన పాతరోజులు పోయాయి. సోషల్ మీడియా పుణ్యమా అని, ప్రజలకు పాత చరిత్రలే కొత్తగా తెలిసివస్తున్నాయి.

ఈ ఎన్నికలలో తమ వోట్ల ద్వారా, యు.పి., బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్, జమ్ము కాశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్,  ఇలా దాదాపు ఉత్తారాదిన ప్రతి రాష్ట్రంలోనూ ఆయా ప్రాంతీయ పార్టీలనే కాకుండా జాతీయ పార్టీగా కాంగ్రెస్ మనుగడను ప్రశ్నార్ధకం చేసారు ప్రజలు. అందలమెక్కించిన ప్రభుత్వాలు ఆశించిన రీతిలో పనిచేయకపోగా, కుల మత వైషమ్యాలతో తమ మధ్య చిచ్చు పెడుతున్న విషయాన్ని పసిగట్టిన ప్రజలు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా, తమ వోట్లతో బదులిచ్చారు. 

ప్రభుత్వంలో అవినీతిపైనా మౌనం! పరిశ్రమలు మూసుకుపోతున్నా మౌనం! ధరలు ఆకాశాన్ని అంటుతున్నా మౌనం! రైతులు ఆత్మహత్యలకు తెగబడుతున్నా మౌనం! అరుణాచల్‌లో చైనా చొచ్చుకు వచ్చినా మౌనం! పాకిస్తాన్ మన సైనికుల తలలు తెగేసి వెళుతున్నా మౌనమే! పది సంవత్సరాల అసమర్ధుల పాలనలో దేశం పట్టాలు తప్పింది. అరవై నెలలో దేశాన్ని గాడిన పెట్టబోవటం ఓ సాహసమే. తానే కాకుండా తన మంత్రివర్గ సహచరులు కూడా నిజాయితీతో కృషి చేస్తే కష్టసాధ్యమే కానీ, అసాధ్యం కాదు. కనీసం ఆ కోణంలో ప్రభుత్వం పని చేస్తున్నదన్న స్పృహ ప్రజలకు కలగాలి. కనీస ఫలితాలతో ప్రజలకు వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించగలగాలి. ఏదేమైనా, మిన్నంటుతున్న ప్రజల అంచనాలను, తాను ప్రధానిగా ఎన్నికైన నేపథ్యాన్ని నరేంద్ర మోడీ విస్మరించడనే భావిస్తాను. అవినీతిరహిత ఆదర్శ రాజ్యాన్ని, అభివృద్ధిని ఆయన సాధించగలడనే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడనే ఆశిస్తాను.

7, ఏప్రిల్ 2014, సోమవారం

ఎన్నిక(ల)లు - 05 (చివరి భాగం)

 ఎన్నిక(ల)లు - 05 (చివరి భాగం) (7-April-2014)


ప్రత్యామ్నాయం

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకూ, ప్రతిరోజూ పరమ దుర్మార్గులుగా దూషింపబడుతూ, దాదాపు అన్ని రాజకీయ పక్షాలచే అంటరానివాళ్ళుగా పరిగణింపబడిన వ్యక్తులు ఇద్దరే; నాథూరాం వినాయక్ గాడ్సే, నరేంద్ర దామోదర్‌దాస్ మోడీ! జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసినందుకు గాడ్సేని, 2002 గుజరాత్ అల్లర్ల కారణంగా మోడీని రాక్షసులుగా ప్రతి రాజకీయ పార్టీ చిత్రీకరిస్తూనే ఉంది. గాడ్సేనైతే పూర్తి చరిత్రహీనుడుగా చిత్రీకరించిన పాఠాలు కూడా మనం చదువుకున్నాం! గాడ్సే ప్రస్తుతానికి అప్రస్తుతం. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధిగా మోడీ నియామకపు నేపథ్యంలో ఆయన్ని మరింత వివాదాస్పదుడుగా చూపించాలనే ప్రయత్నాలు మాత్రం రోజువారీ రాజకీయ తంతులో చూస్తూనే ఉన్నాం.

గుజరాత్ అల్లర్లలో మోడీ నిజంగానే ముస్లీములను చంపించాడా? తనే పకడ్బందీ వ్యూహం అమలుచేసి వందలాది హత్యలకు కారకుడయ్యాడా? లేక, నీరో లాగా రాష్ట్రం తగలబడుతుంటే చర్యలేవీ తీసుకోకుండా చూస్తూ కూర్చున్నాడా? అసలు మోడీ దుర్మార్గుడా, మంచివాడా? ఒకవేళ రేపు మోడీ ప్రధాని అయితే మరో మత మారణహోమానికి ఈయన కారకుడౌతాడా? దేశ ప్రధానమంత్రి కాగల అభ్యర్ధిగా ఉన్న మోడీ నిష్కళంకుడుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదనిపించే ప్రశ్నలు ఇవి. మోడీ వ్యతిరేకులకు అందివచ్చిన ఆయుధాలు కూడా ఈ ప్రశ్నలే అనటంలో ఆశ్చర్యం లేదు. గుజరాత్ అల్లర్ల దరిమిలా, అప్పటి ప్రధాని వాజ్‌పేయి నుంచి లాలూ యాదవ్, ములాయమ్‌సింగ్ యాదవ్ దాకా అందరూ మోడీకి రాజధర్మాన్ని ప్రభోధించినవాళ్ళే! అలా రాజధర్మాన్ని బోధించినవారి పరిపాలన ఎంత ఘోరంగా ఏడ్చిందో కూడా మనకు తెలుసు.

ఫిబ్రవరి 5, 2014 ఇండియన్ఎక్స్‌ప్రెస్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం 2012 (668 సంఘటనలు) తో పోలిస్తే, 2013లో (823 సంఘటనలు) మతఘర్షణలు దాదాపు 30 శాతం పెరిగాయి. ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వపు హోమ్‌మంత్రిత్వ శాఖ అందించినవే. ఒక్క యు.పి.లోనే, 247 సంఘటనలు నమోదు కాగా, బీహారులో 63, గుజరాత్‌లో 68, రాజస్థాన్‌లో 52, తమిళనాడులో 36 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాక, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడా మతఘర్షణలు చెలరేగాయి. లౌకికవాదులమని రోజుకో పదిసార్లు గర్జించే ములాయమ్‌సింగ్‌లు, నితీష్‌కుమార్‌లు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో! ఇక, కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలు కర్ణాటక, రాజస్థాన్ (2013 డిసెంబరులో భా.జ.పా. ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చదువరులు గమనించగలరు) ల పరిస్థితి కూడా యు.పి., బీహారులకు ఏమాత్రమూ తీసిపోలేదు! వీళ్ళా, మతసామరస్యం గురించి మరొకరికి ఉపన్యాసాలు దంచే లౌకిక నేతలు!


దేశంలో మతఘర్షణలు 2002లో మొదలు కాలేదు, అక్కడితో అప్పటికి ఆగిపోనూలేదు. స్వాతంత్ర్యం ముందు, ఆ తర్వాత కూడా లక్షలాది ప్రజలు వీటికి ఆహుతయ్యారు, అవుతూనే ఉన్నారు. వీటికి ప్రధాన కారణం చర్చించటం ప్రస్తుత వ్యాసపరిధిలో లేకపోయినా, లౌకికత్వం పేరుతో ఆయా ప్రభుత్వాలు చేసిన, చేస్తున్న ఘనకార్యాలు మెజారిటీ, మైనారిటీ ప్రజల మధ్య విద్వేషాగ్నులు రగిలించటానికే కారణమౌతున్నాయనేది నిర్వివాదాంశం. ఓటు బ్యాంక్ రాజకీయాలతో పాచికలాడుతూ, ఒక పార్టీ మరోపార్టీని బూచిగా చూపించి ఆయా మతాల ప్రజలను బెదిరిస్తున్నాయనేది అందరూ గమనిస్తున్న విషయమే. ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తే, ఎన్.డి.ఎ.కు వ్యతిరేకమైన దాదాపు అన్ని పార్టీలూ మోడీని అలా ఓ రాక్షసుడుగా చూపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత, మోడీ ప్రధాని అయితే ముస్లీములకు ఈ దేశంలో రక్షణ ఉండదనే భయాలను ముస్లీములలో పెంచాలనే ప్రయత్నిస్తున్నాయి. కొందరు ముస్లీం పెద్దలు కూడా తెలిసీ తెలిసీ అటువంటి పార్టీల వలలో చిక్కుకుపోతున్నారు. అటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం భా.జ.పా చేస్తూనే ఉన్నా, ఒక్క మోడీ మాత్రం ఆ విషయాలను చూచాయగా కూడా ప్రస్తావించకుండా, అవినీతి, అభివృద్ధి గురించి, వాటి కోసం చేయాల్సిన పనుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. విభజించి గెలవాలనుకునే ములాయమ్‌సింగ్‌లు, నితీష్‌కుమార్‌లు, రాహుల్‌గాంధీలు ఇంతవరకూ ఒక్కసారి కూడా కేవలం అభివృద్ధి, అవినీతి ప్రాతిపదికగా చర్చించటానికి ఇష్టపడటంలేదు!

ఇక్కడ రేకెత్తే మరో ప్రశ్న ఏమిటంటే, మోడీ తరచుగా ప్రస్తావిస్తున్న గుజరాత్ మోడల్ నిజంగానే ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నదా, లేక అవి మోడీ చేస్తున్న ఊకదంపుడు ఉపన్యాసాలేనా? లభ్యమయ్యే రకరకాల గణాంకాల ఆధారంగా ఒక రాష్ట్ర ప్రగతిని అంచనా వేసే అవకాశం చాలా తక్కువ. కానీ, మోడీ ఉపన్యాసాల ఆధారంగా చూస్తే, దేశం ప్రగతిపథంలో నడవటానికి అవసరమైన మౌలికాంశాలపై, మోడీకి ఉన్న అవగాహన స్పష్టంగా తెలుస్తున్నది. ఆ స్పష్టతే, వైరి పార్టీలలో కనిపించటంలేదు. నిజానికి, అసలు ఆ విషయాలేవీ ఇతర పార్టీలు ప్రస్తావించటంలేదు.

గత దశాబ్దకాలంగా కేంద్రంలో కొలువుతీరిన ప్రభుత్వం అవినీతికి మరో అడ్రసుగా మారింది. బొగ్గు కుంభకోణం పత్రాలు సాక్షాత్తూ ప్రధాని కార్యాలయం నుంచే మాయం కావటం ఆ అవినీతికి పరాకాష్ట. ఆ అవినీతిలో వ్యక్తిగా మన్‌మోహన్‌సింగ్ పాత్ర లేకపోవచ్చు. కానీ, బొగ్గుశాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రిగాను, ప్రభుత్వాధినేతగా ప్రధాని పదవిలో ఉన్న మన్‌మోహన్‌సింగ్ ఆ బాధ్యతను కాదనలేడు! అంతే కాకుండా, మిత్ర పక్షాల అవినీతిని వెనకేసుకొచ్చే విధంగా, సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలే తమ మిత్రపక్షాల అవినీతికి ఈయన కారణమని చెప్పుకోవటం ఆక్షేపణీయం. పోనీ, స్వపక్షీయుల కుంభకోణాలను అడ్డుకున్నారా అంటే, అదీ లేదని కామన్‌వెల్త్ గేమ్‌స్, ఆదర్శ్ లాంటి కుంభకోణాలు ప్రభుత్వాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. ఉత్తమ ప్రభుత్వాధికారిగా, మేధావిగా మన్ననలందుకున్న మన్‌మోహన్‌సింగ్, మిన్ను విరిగి మీద పడినా చలించని మేరునగధీరుడుగా పేరొందిన వ్యక్తిత్వం ఉలుకూ పలుకూ లేకుండా అధినేత్రికి అడుగులకు మడుగులొత్తటం, దేశ ప్రయోజనాలను పార్టీకి తాకట్టు పెట్టటం విస్మయం కలిగిస్తుంది.  ఒక్క అవినీతే కాక, దేశ సార్వభౌమత్వానికి, సాధికారతకు కూడా యు.పి.ఎ. ప్రభుత్వం ఎటువంటి బాధ్యత వహించలేదని, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా అక్రమ చొరబాట్లులాంటి విదేశీవ్యవహారాలు కూడా నిరూపించాయి. ఆర్ధికరంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ చెప్పుకోదగ్గ ప్రగతి కూడా కనిపించదు.

ఇటువంటి పరిస్థితుల్లో సహజంగా ప్రజలు చూసేది వెంటనే లభించే ప్రత్యామ్నాయం వైపే. ఒంటి పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పరచే స్థాయి ఇప్పటి కాంగ్రెస్‌కు లేదని మూడు రాష్ట్రాలకు జరిగిన డిసెంబరు ఎన్నికలలో తెలిసిపోయింది. దానికితోడు, ఒంటరిపార్టీగా అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ ఊడబీకిందేదీ లేదన్నది కూడా నిరూపితమయ్యింది. జాతీయ పార్టీలుగా గతంలో చలామణి అయిన కమ్యూనిస్టులు తదితర పార్టీలు కూడా దాదాపు కాలం చేసాయనే చెప్పొచ్చు. ఇక మిగిలిందల్లా భా.జ.పా. కాకపోతే, పది రకాల పార్టీలతో ఏర్పడే ప్రభుత్వాలు అవినీతికి ఎలా ఆలవాలమౌతాయో చూసాం కాబట్టి, ఒక్క పార్టీగా భా.జ.పా.కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించి, ఒక్కసారైనా దేశాన్ని పరిపాలించే అవకాశం కలిగించాలి. దాదాపు డెబ్భై ఏళ్ళ దరిద్రపు పాలనలో బతికిన మనం ఓ అరవై నెలలు మరో పార్టీకి అవకాశం ఇస్తే ఇప్పటికన్నా నాశనమయ్యేది ఏదీ లేదు.

ఇప్పుడు దేశంలో నాయకత్వ లేమి మనలను పీడిస్తున్నది. దేశానికి కొత్త ఆలోచనా సరళి, సరికొత్త విధానాలతో పరిపాలన అత్యవసరం. ఆ ఖాళీని మోడీ పూరించగలడనే నమ్మకమూ కలుగుతున్నది. మోడీ నేతృత్వంలోని భా.జ.పా.కు ఓ అయిదేళ్ళు అవకాశం ఇస్తే ప్రత్యేకంగా పోయేదేమీ లేదని నా అభిప్రాయం.


26, మార్చి 2014, బుధవారం

ఎన్నిక(ల)లు – 04

 ఎన్నిక(ల)లు – 04 (26- March -2014)


ముఠాల కూటములు!

స్థూలంగా చూస్తే, 1970-1980ల నాటికి కూడా దేశంలోని కొన్ని పార్టీలు వేరువేరు సిద్ధాంతాలని తలకెత్తుకునే ఉన్నాయి. అయినప్పటికీ, దేశాన్ని ఇందిరాగాంధీ కబంధ హస్తాల నుండి ముక్తం చేయటానికి ఆయా సిద్ధాంతాలతో రాజీపడ్డ విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, ఆయా నేతల రాద్ధాంతాలే జనతా ప్రయోగాన్ని నిర్వీర్యం చేసిన దాఖలాలు కూడా కనిపిస్తాయి. 

1951 లో ఆరెస్సెస్‌కు అనుబంధంగా మొదలైన ఓ రాజకీయ సంస్థ భారతీయ జన్‌సంఘ్ అయితే, ఇందిరకు వ్యతిరేకంగా మొదలైన కాంగ్రెస్ వర్గం కాంగ్రెస్ (ఓ). దీని గురించి మరోసారి విపులంగా చర్చించుకోవచ్చు. ఇక మిగిలింది భారతీయ లోక్‌దళ్. ఇందులో భారతీయ క్రాంతిదళ్, స్వతంత్ర, ఉత్కళ్ కాంగ్రెస్, సోషలిస్టులు భాగస్తులు. 1974లో ఇందిరకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ప్రతిపక్ష కూటమి ఇది. ఆ తర్వాత, జె.పి. ఇచ్చిన పిలుపుకు స్పందించి అయిదు పార్టీలతో ఏర్పడిన భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ చీలిక వర్గం, భా.జ.సం. ఓ పార్టీగా అవతరించారు. అంటే ఇక్కడికే దాదాపు ఏడు పార్టీల సిద్ధాంత వైరుధ్యాలతో జనతా పార్టీ అవతరించింది. దానికితోడుగా మరికొన్ని పార్టీల బయటి మద్దతు! 

ప్రతి పార్టీ చరిత్రను విశ్లేషించుకోవటం కన్నా, ఉదాహరణకు సోషలిస్టు పార్టీ గురించి తెలుసుకుంటే, అప్పటి రాజకీయాల సంక్లిష్టత కొద్దిగా అర్ధమౌతుంది. భారత జాతీయ కాంగ్రెస్‌లోని సోషలిస్టులతో 1948లో ఏర్పడింది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (బొల్షెవిక్ లెనినిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిలోన్, బర్మా). ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్‌నారాయణ్‌లు వీరిని బయటకు తెచ్చి భారత సోషలిస్టు పార్టీగా చేసారు. 1951 సార్వత్రిక ఎన్నికలలో జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని సోషలిస్టు పార్టీ 12 సీట్లు గెలిచుకుంది. కాంగ్రెస్ నుంచి విడిపోయి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ స్థాపించిన జె.బి.కృపలాని పార్టీలో ఈ సోషలిస్టులు కలిసిపోయి ప్రజా సోషలిస్టులుగా అవతరించారు. అప్పుడు రామ్‌మనోహర్‌లోహియా నేతృత్వంలో విడిపోయిన కొందరు మళ్ళీ సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసారు. ప్రజా సోషలిస్టుల నుంచి జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో మరో వర్గం సంయుక్త సోషలిస్టులుగా విడిపోయారు. 1972లో ప్రజా సోషలిస్టు పార్టీ సంయుక్త సోషలిస్టులతో కలిసిపోయి మళ్ళీ సోషలిస్టు పార్టీ అయ్యింది. ఒక్క సోషలిస్టులలోనే ఇన్నేసి అంతర్గత విబేధాలు కలిగి, మళ్ళీ మళ్ళీ కలుస్తూ విడిపోతూ ఉన్నారన్న మాట. వీరికి మరో మూడు పార్టీలు చేర్చి చరణ్‌సింగ్ భారతీయ లోక్‌దళ్ ఏర్పాటు చేసాడు. దీనికి మరో రెండు పార్టీలు భారతీయ జనసంఘ్, కాంగ్రెస్ (ఒ) కలిసి జనతాపార్టీ ఏర్పడింది! 

ఇన్నేసి వైరుధ్యాలు, వైమనస్యాలు ఉన్న పార్టీకి ఎవరు నాయకుడవ్వాలి? ఆదిలోనే హంసపాదు ఇది. అలానే అయ్యింది. స్వతంత్రపార్టీ వంటి రైట్ వింగ్ ఆలోచనాపరులకు భా.జ.సం.తో విబేధాలు లేవు. అలానే మొరార్జీ దేశాయ్ వంటి రాజనీతిజ్ఞుడికీ లేవు. ఇప్పటి లౌకికవాదులకు మల్లే, అప్పటి సామ్యవాదులకు ఆరెస్సెస్ పొడ గిట్టలేదు. దానికితోడు, భా.జ.సం. పట్ల ఉదారంగా ప్రవర్తించే మొరార్జీ దేశాయిని పార్లమెంటరీ నేతగా ఎన్నుకోటానికి చరణ్‌సింగ్, ఫెర్నాండెజ్, జగ్‌జీవన్‌రామ్‌లాంటి నాయకులు ఒప్పుకోలేదు. అలా కొనసాగిన విబేధాలు, ఇందిరాగాంధీని అరెస్టు చేయనందుకు నిరసన తెలుపుతూ, తమ ప్రభుత్వాన్ని నపుంసక ప్రభుత్వంగా పరిగణిస్తూ చరణ్‌సింగ్ రాజీనామా చేయటం, ఆ వెంటనే ఆయన్ని ఉపప్రధానిగా చేయటంతో అప్పటికి ఆ విబేధాలు సమసిపోవటం... చూస్తుంటే,. పదవులకు ఎర వేయటానికే సిద్ధాంతాల ముసుగులు ధరించటం అప్పటికే మొదలయ్యిందన్న మాట! అయినా, జె.పి.లాంటి నాయకుల మాట మీద కొద్దో గొప్పో గౌరవం ఆయా పార్టీలను ఒక త్రాటి మీదకు మాత్రం రప్పించగలిగింది. కానీ ఆయా నాయకుల పదవీ లాలసత్వం, అవకాశవాద రాజకీయాలు కూడా ఆనాటి నుంచి ఈనాటికీ ప్రజలు నమ్మి ఓటెసినా వారిని వంచిస్తూనే ఉన్నాయి. అనాటి అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట రాజ్‌నారాయణ్ ఉదంతం. ఇలా చెప్పుకుంటూ పోతే, స్వాతంత్ర సమరయోధులుగాను, ప్రజాక్షేమమే పరమార్ధంగా భావించిన అప్పటి నేతలే చివరికి అధికారం కోసం వాళ్ళల్లో వాళ్ళే తగువులు పడి, చివరికి జనతాపార్టీలో ముసలం పుట్టటానికి కారకులయ్యారనేది ఇప్పుడో  చరిత్ర. 

దాదాపుగా ఇదే చరిత్ర నేషనల్‌ఫ్రంట్ హయాంలోనూ, యునైటెడ్‌ఫ్రంట్ హయాంలోనూ పునరావృతమయ్యింది. ప్రతి పార్టీ నాయకుడు తానే ప్రధాని కావాలని కోరుకునేవాడే! ఇద్దరు ముగ్గురు ఎం.పీ.ల మద్దతే అయినా, ఇద్దరికీ మంత్రివర్గాలు కావాలనుకునేవాళ్ళే! ఈ జనతా-లోక్‌దళ్ పరివార్ నుంచి ఆవిర్భవించిన కప్పలే రాష్ట్రీయ లోక్‌దళ్, భారత జాతీయ లోక్‌దళ్, సమాజ్‌వాదీలు, జనతాదళ్ సెక్యులర్లు, జనతాదళ్ యునైటెడ్లు, లోక్‌జనశక్తులు, రాష్ట్రీయ జనతాదళ్, బిజు జనతా దళ్ ఇత్యాదులు. ఇందులో కొందరు ముందుతరం స్వామ్యవాద నేతల వారసులైతే, మరికొందరు ఆ నేతల ఆశయాలు వల్లిస్తూ వారసత్వ రాజకీయాలు చేసే సామ్యవాద లౌకికవాదులు! వీరి ఉద్దేశ్యంలో దేశసేవ అంటే, ఏదో విధంగా మూడోదో, ముప్ఫైయ్యోదో ఫ్రంటు  ఏర్పాటు చేయటం. ఎన్నికల ముందు ఓ కూటమి, ఎన్నికలైన తర్వాత మరో కూటమి - దేనికి అధికారం అందివస్తుందనుకుంటే అందులో దూరటం, పదవులు పొందటం, తమ మీది కేసులు మాఫీ చేయించుకోవటం. తమ భవిష్యత్తు కోసం దేశాన్ని కులాలవారీగా విభజించే కొత్త కొత్త ఉపాయాలు చరణ్‌సింగ్, వి.పి.సింగ్‌ల అడుగుజాడల్లో వెతుక్కోవటం. తీరా, ఏ పార్టీలకు వ్యతిరేకంగా తమకు ఓట్లు వేయమని అడుక్కున్నారో ఆ పార్టీల మద్దతుతోనే తమ పదవులు నిలుపుకోవటం, అవి ఉపసంహరించుకుంటే ఆయా పార్టీలు ప్రజాస్వామ్య ద్రోహులని మళ్ళీ ఎన్నికల్లోకి దూకటం.

కొన్ని దశాబ్దాల దేశాభివృద్ధి ఈ ముఠాల వల్ల ఒక అడుగు ముందుకేస్తే, రెండు అడుగులు వెనక్కు వేస్తున్న చందంగా నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో మరోసారి ఇటువంటి ఆయారాం గయారాం ముఠాలకు అవకాశం కల్పిస్తే, మన కళ్ళు మనం పొడుచుకున్నట్లే ఔతుంది. కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఈ కూటముల ముఠాలు అనవసరమే కాదు, అనర్ధం కూడా.



21, మార్చి 2014, శుక్రవారం

ఎన్నిక(ల)లు – 03

 ఎన్నిక(ల)లు – 03 (21- March -2014)


కూటములా, కాలకూటములా?

 

1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితుల పుణ్యమా అని, దేశంలో మొట్టమొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (ఒ) పార్టీల కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్న జనతా పార్టీ 542 సీట్లకు గాను, 298 సీట్లు గెలిచింది. ఆ తర్వాత, కమ్యూనిస్టులు తదితర 7 పార్టీల అలయెన్సుతో 345 మంది సభ్యుల బలంతో మొరార్జీ దేశాయి ప్రధానిగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏడు పార్టీల కాంగ్రెస్ కూటమి 189 సీట్లు గెలుచుకోగా, అందులో కాంగ్రెస్ గెలుచుకోగలిగింది 153 సీట్లు.  కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయంలా కనిపించినా, ఆనాటి ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలిచి దక్షిణాదిన ఎటువంటి ప్రభావాన్ని జనతాపార్టీ చూపలేకపోయింది. ఆ వెంటనే, పది రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో, అన్నిటా ఇందిరాగాంధి కాంగ్రెస్ (ఆర్) ఓడిపోగా, అందులో ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఉత్తరాదిన కాంగ్రెస్‌ను దాదాపుగా తుడిచేసి జనతా పార్టీ ఓ ప్రభంజనాన్నే సృష్టించిందంటే అతిశయోక్తి కాదు.

 

ఎంతో అద్భుతంగా మొదలైన జనతాపార్టీ ప్రయాణం అంత అధ్వాన్నంగానే ముగిసింది. ఎన్నికలైన వెంటనే లుకలుకలు ప్రారంభమైనాయి. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే వేళకు చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్, జార్జ్ ఫెర్నాండేజ్‌ల అసంతృప్తి మొదలయ్యింది. చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్‌లను ఉపప్రధానులుగా ప్రకటించాకా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినట్లు అనిపించినా, కూటమిలోని సామ్యవాదులకు, లౌకికవాదులకు కూటమిలోని హిందుత్వవాదులుగా ముద్రపడ్డ వాజ్‌పేయి, అద్వానీలతో పొరాపొచ్ఛాలు మొదలైనాయి. ప్రభుత్వంలో ఉండాలో, ఆరెస్సెస్‌లో ఉండాలో తేల్చుకోమని వారిని హెచ్చరించేంతగా పరిస్థితులు విషమించాయి. ఆరెస్సెస్ వైపే మొగ్గు చూపిన భారతీయ జన్‌సంఘ్ నేతలు ప్రభుత్వాన్ని వదులుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన మొండి వైఖరితో ఉపప్రధానులైన చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్‌లతో సర్దుకోలేకపోయాడు. చివరికి చరణ్‌సింగ్ ప్రభుత్వం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య కోకాకోలా, ఐ.బి.ఎమ్ లాంటి కంపెనీలు ప్రభుత్వ ఆర్ధిక సంస్కరణలతో వేగలేమని భారత్ నుంచి నిష్క్రమించటం, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌వారు చేసిన అత్యాచారాలపై మొరార్జీ ప్రభుత్వం వేసిన కేసులు సాక్ష్యాలు లేక వీగిపోవటం లాంటి సవాలక్షా కారణాలతో దాదాపు 27 నెలలు ప్రధానిగా కొనసాగిన మొరార్జీ దేశాయి చివరికి రాజీనామ చేసాడు.

 

కేవలం 64 మంది ఎం.పీ.లతో, కాంగ్రెస్ మద్దతుతో చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, నెలరోజులకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో, రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాతి ఎన్నికల్లో (1980) ఇందిరా కాంగ్రెస్ 351 సీట్లు గెలిచి జయకేతనం ఎగురవేస్తే, 31 సీట్లు మాత్రమే గెలిచి జనతాపార్టీ తన అవసానదశకు చేరువయ్యింది.

***


దాదాపు ఓ దశాబ్దం తర్వాత, 1989లో ఎన్‌టి రామారావు చొరవతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. జనతాదళ్, డి.ఎం.కె., అస్సాం గణపరిషత్ తదితర పార్టీలతో ఏర్పడ్డ ఈ కూటమి 1989 ఎన్నికలలో 146 సీట్లు గెలుచుకోగా, అందులో జనతాదళ్ 143, తెలుగుదేశం 2, ఇండియన్ సోషలిస్ట్ కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. 197 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపించలేదు. 86 సీట్లతో భారతీయ జనతా పార్టీ, 52 సీట్లతో కమ్యూనిస్టులు బయటి నుండి మద్దతు ప్రకటించగా నేషనల్ ఫ్రంట్ విపి సింగ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు. ఇప్పటి అరవింద్‌కేజ్రీవాల్‌కు అప్పటి విపి సింగ్‌కు ఒక్క విషయంలో మంచి పోలిక కనిపిస్తుంది. బోఫోర్స్ కుంభకోణం బయటపడ్డ దరిమిలా జరిగిన ఆ ఎన్నికలలో, కేజ్రీవాల్ షీలా దీక్షిత్ అవినీతిపై 400 పేజీల ఆధారాలు ఉన్నాయని చూపించినట్లుగా, బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ పాత్రపై తన దగ్గర ఆధారాలు జేబులో ఉన్నాయని విపి సింగ్ ప్రతి సభలోనూ ఏదో ఓ కాగితాన్ని చూపిస్తూ ప్రకటించేవాడు. ప్రధాని అయిన తర్వాత ఆ ఆధారాలు ఏమైనాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఆ కేసు అలా సా....గుతూనే ఉంది.

 

జనతాపార్టీ ప్రయోగంలో ఆయా పార్టీల మధ్య లుకలుకలు మొదలైతే, నేషనల్‌ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి, జనతాదళ్‌లోనే లుకలుకలు మొదలయ్యాయి. చంద్రశేఖర్ మొదటి నుంచి విపి సింగ్‌కు వ్యతిరేకమే. దేవీలాల్ తనని కనీసం ఉపప్రధానిగానైనా చేయాలని మొదటి నుంచి దేబిరిస్తూనే దబాయించటం మొదలేసాడు. కొడుకు చౌతాలా ముఖ్యమంత్రిత్వపరంగా దేవీలాల్ విపి సింగ్‌ల మధ్య గొడవలు మొదలైనాయి. చరణ్‌సింగ్ కొడుకు అజిత్‌సింగ్‌తో దేవీలాల్‌కు సరిపడదు. దేవీలాల్‌తో ఒక్క చంద్రశేఖర్‌కు తప్ప మరెవరికీ సరిపడదు. చివరికి చౌతాల ఎన్నిక వివాదాస్పదం కావటం, అయినా అతనినే మళ్ళీ ముఖ్యమంత్రిగా దేవీలాల్ చేయబూనటం, మొదటిసారి విపి సింగ్ రాజీనామా చేసి, వెనక్కి తీసుకోవటం, అరుణ్‌నెహ్రూ, దేవీలాల్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ ప్రభుత్వం పూర్తి సమయాన్ని అంతర్గత కుమ్ములాటల్లోనే గడిపేసింది. మండల్ కమిషన్ నివేదిక అమలుదాకా, చెప్పుకోతగ్గ విధానపరమైన నిర్ణయాలేవీ విపి.సింగ్ తీసుకోలేదు. విపి.సింగ్ ఏకపక్షంగా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నేషనల్‌ఫ్రంట్ ప్రభుత్వానికి సమాధి కట్టింది. ఆ సమయంలోనే అయోధ్యలో రామ మందిరం కోసం అద్వాని రథయాత్ర మొదలేయటం జరిగింది. బీహారులో అద్వానిని అరెస్టు చేసినందుకు నిరసనగా, విపి.సింగ్ ప్రభుత్వానికి భా.జ.పా. మద్దతు ఉపసంహరించటం, విపి సింగ్ రాజీనామా చేయటం, ఆ వెంటనే 58 మంది ఎంపీలు, కాంగ్రెస్ బయటి మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని అవ్వటం, ఆయన రాజీవ్ గాంధీ మీద నిఘా ఏర్పాటు చేసాడన్న ఆరోపణలతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటం చకచకా జరిగిపోయాయి. దాదాపు 11 నెలల విపి.సింగ్ పాలన, 4 నెలల చంద్రశేఖర్ పాలన చరిత్ర పుస్తకాలు నింపటానికే కానీ, దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు.

 

***

 

ప్రజాస్వామ్యంలోని ఎన్నికల రాజకీయాల వికృతరూపం 1996 ఎన్నికల్లో మరింత వికృతంగా ప్రదర్శితమయ్యింది. ఆ ఎన్నికల తర్వాత. భా.జ.పా. (161) కూటమి 187 సీట్లతో పెద్ద కూటమిగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక 13 రోజుల్లోనే వాజ్‌పేయి చేతులెత్తేసాడు. 140 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా నిలచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించింది. 79 సీట్లు గెలుచుకున్న మూడు పార్టీల నేషనల్‌ఫ్రంట్, మరో పది పార్టీలను కలుపుకొని యునైటెడ్ ఫ్రంట్‌గా అవతరించి కాంగ్రెస్ బయటి మద్దతుతో దేవెగౌడ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 10 నెలల దేవెగౌడ ముచ్చట తీరిన తర్వాత, 7 నెలల గుజ్రాల్ ముచ్చట కూడా తీర్చి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది కాంగ్రెస్! నిజానికి ప్రధానమంత్రిగా యునైటెడ్‌ఫ్రంట్ మొదటి ప్రాధాన్యత దేవెగౌడ కాదు. విపి సింగ్, జ్యోతిబసులు నిరాకరించిన పిమ్మట దేవెగౌడ ప్రధానిగా రాజీ పడటం జరిగింది. అప్పుడు అవకాశాన్ని వదులుకోవటం చారిత్రాత్మక తప్పిదమని కమ్యూనిస్టులు ఇప్పుడు భావిస్తారు.

 

అద్వానీ కొనసాగించిన అయోధ్య రథయాత్రలో, ఆయన్ని బీహారులో అరెస్టు చేయటం వి.పి.సింగ్ ప్రభుత్వానికి భా.జ.పా. మద్దతు వెనక్కి తీసుకోటానికి కారణమైతే;  స్లీపింగ్ పి.ఎం.గా పేరొందిన దేవెగౌడ తన హయాంలో తీసుకున్న నిర్ణయాలలో తమను భాగస్వాముల చేయలేదనే కారణంతో కాంగ్రెస్ ఆయన్ని తప్పించాలని డిమాండు చేయటం ఓ వింత. ఆ తర్వాత ప్రధానిగా నియమింపబడ్డ ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోటానికి కారణం మరెంత విచిత్రమో చూడండి. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డి.ఎం.కె.కు రాజీవ్‌గాంధీ హత్యలో ప్రమేయముందన్న మిషతో ఆ పార్టీని ప్రభుత్వం నుండి తీసివేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అది ఒప్పుకోనందుకు మద్దతు వెనక్కి తీసుకుంది. అదే కాంగ్రెస్ తన యు.పి.ఎ.1, యు.పి.ఎ.2 ప్రభుత్వాలలో (అందులోనూ సోనియా గాంధి నాయకత్వంలో) డి.ఎం.కె.ను చేర్చుకోవటమే కాకుండా ప్రాధాన్యమున్న మంత్రివర్గాలు కూడా కేటాయించింది!

 

1998లో ఏర్పాటైన ఎన్.డి.ఎ. ప్రభుత్వం 13 నెలలకే కుప్పకూలిపోయింది. దానికి కారణం జయలలిత! అప్పటి తమిళనాడు ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని కోరిన జయలలిత తన డిమాండు నెరవేర్చనందుకు నిరసనగా ఎన్.డి.ఎ. ప్రభుత్వాన్ని కూలదోసింది. అంతాచేసి అప్పటి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.కి ఉన్న బలం 18! అప్పటి అవిశ్వాస తీర్మానంలో ఒకే ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.

***

 

ఓ అయిదు సంవత్సరాలు భా.జ.పా. పెద్ద పార్టీగా ఎన్.డి.ఎ. కూటమి, ఓ పది సంవత్సరాలు కాంగ్రెస్ పెద్ద పార్టీగా యు.పి.ఎ. కూటమి ప్రభుత్వాలు నడపగలిగినా, ఆయా ప్రభుత్వాలు అంతులేని అవినీతికి అడ్రసులుగా మారాయనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలు ఆ అవినీతికి కారణం అని చెబుతున్నా, అవి నమ్మేంత అమాయకత్వంతో ప్రజలు లేరు. ఇక కప్పల తక్కెడలాంటి మూడో ఫ్రంటు ప్రభుత్వాలు ఆయా కాలాల్లో ఆరుగురు ప్రధాన మంత్రులు అయిదేళ్ళు పరిపాలించగలిగారంటేనే,  ఏమాత్రం ఉధ్ధరించాయనేది కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. అలానే, ఏకపార్టీ పాలనగా కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్నే చాలా సంవత్సరాలు భరించాం. అలాంటి ఏకపార్టీ పాలన అవకాశాన్ని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భా.జ.పా.కు ఇవ్వాల్సిన చారిత్రక అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ ముచ్చట కూడా మనం తీర్చుకుంటే, మనకు కూటముల ప్రభుత్వాలు అభివృద్ధిని చూపిస్తాయా, ఏకపార్టీలా అనే సందేహం కూడా పూర్తిగా తొలగిపోతుంది.


7, మార్చి 2014, శుక్రవారం

ఎన్నిక(ల)లు – 02

 ఎన్నిక(ల)లు – 02 (7-March-2014)


పది సంవత్సరాల యు.పి.ఎ. పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు. సహజంగానే సరైన ప్రత్యామ్నాయం ఎవరనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమదైన అభిప్రాయాన్ని చూచాయగా స్పష్టం చేసే ప్రయత్నం కూడా ప్రజలు చేసారు. కేంద్రంలో ఎన్.డి.ఎ. పాలన చూసారు. కలగాపులగపు పార్టీల కలయికతో ఏర్పడ్డ మూడోఫ్రంటును చూసారు. అంతకు మునుపు ఏకపార్టీగా కాంగ్రెస్ పాలనా చూసారు, జనతా ప్రయోగమూ చూసారు. ఇక యు.పి.ఎ. సరేసరి.  మిగతా అన్ని పార్టీలనూ ఆయాదశల్లో లేదంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికారంలో చూసే ఉన్నారు. కాబట్టి, ప్రస్తుతానికి కొత్త ప్రత్యామ్నాయంగా కనబడే కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తప్ప మరోటి లేదు. పాత పార్టీలన్నిటికి కొత్త రాజకీయాలు నేర్పుతామని గర్వంగా ప్రకటించిన పార్టీ ఇది. అవినీతికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న పార్టీ ఇది. ఈ పార్టీని అంచనా వేయాల్సిన అవసరం చాలా ఉంది.

 

ఆ.ఆ.పా.తో ఎటువంటి సంబంధమూ లేదని అన్నా హజారే ప్రకటించినా, ఆ.ఆ.పా. అనగానే ప్రజలకు గుర్తుకొచ్చే వ్యక్తి అన్నా హజారే అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సందర్భంగా అన్నాహజారే గురించి కొంత తెలుసుకోవాలి. దాదాపు నాలుగయిదు దశాబ్దాలుగా నిజాయితీగా, నిస్వార్ధంగా సమాజసేవ చేస్తున్న వ్యక్తి ఆయన. రెండు మూడు ఖద్దరు పంచెలు, కుర్తాలు, గాంధీ టోపీలతో ఉన్న ఓ ముతక సంచి ఆయన చరాస్తి. ఒక చిన్న స్టవ్, రెండు మూడు అన్నం వండుకునే గిన్నెలు, గరిటెలు ఆయనకున్న స్థిరాస్తి. నిరాహార దీక్షలు ఆయనకు కొత్త కాదు. గతంలో, మహారాష్ట్రలో మహామహులనుకున్న కొందరు అవినీతి మంత్రులను రాజీనామా చేయించేదాకా నిరాహార దీక్షలు ఆపని దీక్షాదక్షుడు. అనేక పార్టీలు రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించమని బ్రతిమిలాడినా, గవర్నర్ పదవి ఇస్తామని ఆశలు పెట్టినా, చివరికి పద్మ పురస్కారాలు ఇస్తామని ప్రలోభపెట్టినా, వీటన్నిటినీ తృణప్రాయంగా వద్దనుకున్న నిరాడంబర జీవి ఈయన. ఒక్క వ్యక్తిగా ఉద్యమిస్తూనే, కోట్లాది ప్రజలలో చైతన్యస్ఫూర్తి రగిలించిన మహాశక్తి అన్నాహజారే. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రజాసేవ, దేశ సేవ చేయటానికి అధికారం అవసరంలేదని, సంకల్ప బలం ఉంటే చాలని రాలేగావ్ అనే ఆదర్శగ్రామాన్ని తీర్చిదిద్ది నిరూపించిన మహానుభావుడు అన్నా హజారే. ఈనాటికీ గాంధీ ఆదర్శాలకు ఊపిరులూదుతున్న మరో గాంధి అన్నాహజారే. ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో ముఖ్యవిషయం ఏమిటంటే, ఈరోజు ఆమ్ఆద్మీ పార్టీ ప్రముఖులుగా ప్రస్తావించబడుతున్న అరవింద్‌కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్, అశుతోష్, సోమనాధ్‌భారతి, షాజియా ఇల్మీ లాంటి నేతలెవరూ ఇంతకు మునుపు ఏనాడూ అన్నాహజారే ఉద్యమాలలో పాలు పంచుకోలేదు, కనీసం సంఘీభావం కూడా కనబరచలేదు.

 

ఒక సగటు పౌరుడుగా యు.పి.ఎ. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతి చూసి చలించిపోయాడు అన్నాహజారే. ఆరు దశాబ్దాలుగా పార్లమెంటులో మగ్గిపోతున్న జనలోక్‌పాల్ బిల్లు వెలికితీసి, అవినీతి అంతమొందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో నిరాహారదీక్ష మొదలేసాడు ఈయన. అప్పటికి డెబ్భై ఏళ్ళ పైబడిన వయసులో ఆయన మొదలేసిన ఉద్యమం కోట్లాది ప్రజలను ఆలోచింపచేసింది. లక్షలాదిగా ప్రజలు ఆయన ఉద్యమంలో భాగం పంచుకోటానికి ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికే, కొన్ని సామాజిక సంస్థలు నిర్వహిస్తున్న అరవింద్‌కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్, కిరణ్ బేడి, బాబా రాందేవ్  లాంటి వ్యక్తులు కూడా ఆయన ఉద్యమంలోకి దూసుకువచ్చారు. పార్టీలకు అతీతంగా మొదలైన ఆ ప్రజా ఉద్యమం పాలకులను వణికించిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి ఉద్యమాలను అణగదొక్కడంలో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులు, అన్నాహజారే మీదనే అవినితీ పంకిలాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేసినా, ప్రజలే వాటిని తిప్పికొట్టారు. సామ దాన దండోపాయాలన్ని ప్రయత్నించిన కాంగ్రెస్ బేధోపాయాన్ని కూడా ప్రయోగించి, తదనుగుణంగానే కపిల్‌సిబ్బల్, సల్మాన్‌ఖుర్షీద్ లాంటి నేతల ద్వారా, దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనాలని, కావాల్సిన చట్టాలు చేసుకోవాలని సవాళ్ళు విసిరింది కాంగ్రెస్ పార్టీ. అరవింద్‌కేజ్రీవాల్ లాంటి నాయకులు ఆ సవాలును ప్రజల కోసమే స్వీకరిస్తున్నామని ఆమ్ఆద్మీ పార్టీని మొదలుపెట్టటం ఇప్పుడు చరిత్ర. మొదటి నుంచీ, అధికారం పరమావధి కాదని, ప్రజాసేవే పరమావధి అనే ఆదర్శంతో ఉద్యమాలు కొనసాగించిన అన్నాహజారే, సహజంగానే ఆ పార్టీకి తాను దూరమని ప్రకటించాడు. అయినా, ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళతామని ప్రకటించిన ఆ పార్టీ అధికారం హస్తగతం చేసుకునే దిశగా తమ రాజకీయ రంగాన్ని సిద్ధం చేసుకుంది. అందుకు ఢిల్లీ ఓ ప్రయోగవేదిక అయ్యింది.

 

ఇక్కడ ఆమ్ఆద్మీ పార్టీ నేతల, ముఖ్యంగా అరవింద్‌కేజ్రీవాల్ నిజాయితీ, నిబద్ధత మనం ప్రశ్నించుకోవాలి. జనలోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొన్న రోజుల నుంచే తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరిన్ని సమస్యలకు కారణమయ్యేవాడు.

 

• ఆనాడు, ప్రత్యక్ష ఎన్నికలలో ఏనాడు పాల్గోబోయేది లేదని తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరీ ప్రకటించిన మూణ్ణాళ్ళకే పార్టీ కూడా మొదలుపెట్టాడు.

• ఎన్నికల సమయంలో కూడా, ఏ పార్టీకి కూడా తాము మద్దతు ప్రకటించమని, వారి మద్దతు కూడా తీసుకోమని ప్రకటించిన రెణ్ణాళ్ళకే ఏ కాంగ్రెస్ అవినీతి మీద అన్నా ఉద్యమంలో భాగమయ్యాడో, అదే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.

• అన్ని పార్టీలలోని అవినీతిని తూర్పారబెట్టే అరవింద్‌ కేజ్రీవాల్, తన పార్టీ సహచరులు ఢిల్లీ ఎన్నికల ముందు అవినీతికి పాల్పడినట్లు నిఘాకెమేరాలకు చిక్కినా, అన్ని పార్టీలలాగానే ఓ అంతర్గత కమిటీ ఏర్పాటుచేసి, వారికి క్లీన్‌చిట్ ఇప్పించాడు.

• తనవారికి కాంగ్రెస్ దేశాన్ని దోచిపెడుతున్నదని విమర్శించిన కేజ్రీవాల్, ఢిల్లీలో తాను చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తల కరెంటు బిల్లులు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాఫీ చేసాడు!

• ప్రతి ఇంటికీ 700 లీటర్ల నీళ్ళు ఉచితంగా అందిస్తానన్న వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత, 700 కు ఒక్క లీటరు ఎక్కువ వాడినా మొత్తం అన్ని లీటర్ల నీళ్ళకూ డబ్బులు కట్టాలనే మెలిక పెట్టి, తానూ కాంగ్రెస్ స్థాయి రాజకీయాలకు తీసిపోనని నిరూపించాడు.

• నిర్భయ అత్యాచార ఉదంతంతో ఢిల్లీ అట్టుడికిపోయినప్పుడు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను ఏకిపెట్టిన వ్యక్తి, తన మంత్రివర్గ సహచరుడే స్వయానా విదేశీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించినా వెనకేసుకు రావటమే కాకుండా, తనను తానో అరాచకవాదిగా ప్రజలకు స్పష్టం చేస్తూ, ఢిల్లీ రైలుభవన్ దగ్గర ధర్నా చేసి ముఖ్యమంత్రి పదవినే బజారుకీడ్చిన ఘనుడు.

• ఇకపైగా, ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి, లక్షలాది ప్రజలను సమీకరించి రిపబ్లిక్‌డే వేడుకలు అడ్డుకుంటామని, పోలీసులను ఉద్యోగాలు వదిలేసి తమ ఉద్యమంలో పాలుపంచుకోమని కోరటంలోని ఔచిత్యం అర్ధం కాదు.

• కాంగ్రెస్ సమర్ధనతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజల అభిప్రాయాలు సేకరించిన పెద్దమనిషి, ప్రభుత్వ రాజీనామాకు ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏనాడూ అడగలేదు.

• పోలీసులకు స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరిన ఈ పార్టీ, స్వతంత్రంగాను, చట్టబద్ధంగానూ వ్యవహరించిన ఇద్దరు ఢిల్లీ పోలీసు ఆఫీసర్లను సస్పెండు చేయించేదాకా దేశ రాజధానిలో గందరగోళం సృష్టించింది.

• ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని గుజరాత్‌లో కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తే, ఆయనను గుజరాత్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసారనే అబద్ధపు ప్రచారం చేసి, నిన్నగాక మొన్ననే మరోసారి ఢిల్లీలో భీతావహ పరిస్థితులకు ఆజ్యం పోసింది ఈ పార్టీ.

• నిన్నటిదాకా, అవినీతి నిర్మూలనే ఏకైక లక్ష్యంగా ప్రకటించిన ఈ పార్టీ ఈరోజు ఓట్ల కోసం ప్రజలకు లౌకిత్వం ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నది.

 

కేంద్ర ప్రభుత్వపు జనలోక్‌పాల్ బిల్లు నచ్చలేదు. సరే, తమ ఆలోచనాధోరణికి అనుగుణంగా మరో బిల్లు రూపొందించారు. అంతవరకూ బానే ఉంది. ఆ బిల్లును రాజ్యంగబద్ధమైన పద్ధతిలో ఢిల్లీ లెఫ్టినెంటు గవర్నరుకు పంపకుండానే, శాసనసభలో ఆమోదింపచేయాలని ప్రయత్నించటం, అందుకు ఒప్పుకోని కాంగ్రెస్, భా.జ.పా. పార్టీలను బిల్లుకు వ్యతిరేకులుగా ప్రకటించి వారిని ప్రజా వ్యతిరేకులుగా మరోమారు నిరూపించాలని ప్రయత్నించటం విచిత్రంగా కనిపిస్తుంది. వారు నిజంగానే ప్రజా వ్యతిరేకులైతే, ఆ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ బిల్లు పంపి, దాన్ని ఆయన ఆమోదించినప్పుడో, ఆమోదించనప్పుడో శాసనసభలో ఈ వ్యవహారం నడిపిస్తే, ఎటువంటి అనుమానాలు రాకపోను. ఈ విషయంలో ఆ.ఆ.పా. నిజాయితీ లేమి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇది కేవలం ఓ మిష. 49 రోజుల పాలనలో ప్రజలకు చేసిన ఉపకారం కన్నా, తమ మీద తామే చల్లుకున్న బురద ఎక్కువయ్యిందని గ్రహించబట్టే, సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ ప్రభుత్వపు మొహంచాటేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని ప్రజలకు అర్ధమయ్యే ఉంటుంది.

 

అంతేకాకుండా, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై, విషయాలపై ఎటువంటి విధివిధానాల రూపుకల్పన చేసుకోలేని పార్టీ రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే అరాచకత్వం తప్ప మరేదీ మిగలదని మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిన ఆ.ఆ.పా. ఢిల్లీ తంతు స్పష్టం చేస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక అరాచక పరిస్థితి సృష్టించి, మీడియాలోనూ ప్రజల నోళ్ళలోనూ నానటమే ఈ పార్టీ ధ్యేయంగా కనిపిస్తున్నది. దీనివల్ల ఒనగూడే ప్రచారమే, తమ అధికారానికి సోపానాలుగా భావిస్తున్నది. ఇప్పటి రాజకీయ పార్టీల మీద ప్రజలకు - ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉన్న అసంతృప్తిని సాధ్యమైనంతమేరా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలే కనిపిస్తున్నాయి కానీ, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మాత్రం ఈ పార్టీలోనూ కనిపించటం లేదు. కాబట్టి కొత్త పేరుతో పాత రాజకీయాలకన్నా ఘోరంగా నీచాతినీచమైన రాజకీయాలాడుతున్న ఆమ్ఆద్మీ పార్టీ ప్రజలకు అవసరమైన సరైన ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఈ పార్టీ వల్ల దేశానికి జరిగే కీడే ఎక్కువ.


5, మార్చి 2014, బుధవారం

ఎన్నిక(ల)లు – 01

 ఎన్నిక(ల)లు – 01 (5- March -2014)


ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ సామాన్య కార్యకర్తగా నరేంద్ర మోడీలు ఇరువురు తమతమ వ్యక్తిగత ప్రతిష్టలు పణంగా పెట్టి అటు యు.పి.ఎ.,  ఇటు ఎన్.డి.ఎ. ల తరుఫున శంఖనాదాలు చేస్తున్నారు. గంతకు తగ్గ బొంతలుగా మూడో కూటమి, అతుకుల బొంతగా నాలుగో కూటమి, అరువు తెచ్చుకున్న ఆదర్శాలతో వామపక్షాలు, వాపు చూసి బలుపుగా భావిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ, గోడమీద పిల్లుల్లా కాచుకు కూర్చున్న మరికొన్ని చిల్లరమల్లర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేయగలమని ఆశిస్తున్నాయి.

 

ఒకింత నిరాశ, నిస్పృహలతో ఆలోచిస్తే, ఏ కూటమి అయినా దేశాన్ని ఉద్ధరిస్తుందనే నమ్మకం పోయి చాలా కాలమయ్యింది. సగటు పౌరుడికి అయిదేళ్ళకి ఒకసారి ఉపయోగపడే ఆయుధంగానే ఓటు పనికొస్తున్నది కానీ, గెలుపు గుర్రాలు మారినా ప్రజలకు ఓటమే ఎదురౌతున్నది. అధికారంలోకి వచ్చే పార్టీలు మారినా, అభివృద్ధి మృగ్యంగానే ఉంది. ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకుంటున్నామే కానీ, ఆ హక్కు ద్వారా మనకు లభించాల్సిన సుపరిపాలన లభించకపోయినా, ఆ దుస్థితికి దాసోహమంటూ మరో అయిదేళ్ళు నిరీక్షణలో గడిపేస్తున్నాం. పనికిరాని పాలకులను వెనక్కు లాగే హక్కు లేకపోవటం కూడా మన దుస్థితికి మరో కారణం.

 

1977 సార్వత్రిక ఎన్నికలు తప్పించి ఇంతవరకూ జరిగిన ఎన్నికలన్నీ ప్రజలకు పనికొచ్చే అంశాల మీద, అభివృద్ధి ప్రాతిపదికగా జరిగినవి కాదు. తండ్రి పోయాడని కూతురుని, అమ్మ పోయిందని కొడుకుని, ఆయన పోయాడని ఆయన పార్టీని, పాకిస్తాన్‌తో యుద్ధంలో గెలిచారనో, మందిరం కావాలనో, మసీదు కూల్చారనో జరిగిన ఎన్నికలే! ఇప్పుడు జరగబోయే ఎన్నికలు, నిజానికి ఆయా పార్టీలకన్నా కూడా ప్రజలకే ఓ విషమ పరీక్ష.

 

ఇంతకాలమూ, ఏ ముసుగులో ఎవరి చాటున ఉంటే ఎంత లాభమో బేరీజు వేసుకొని ప్రజలకు పోటు పొడుస్తున్న పార్టీలకు ప్రజలు సరయిన గుణపాఠం చెప్పకపోతే, మరో అయిదు సంవత్సరాలు అవినీతి అశుద్ధాన్ని భరించకతప్పదు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాల్సింది ప్రజలే కానీ, పార్టీలు కాదన్న విషయాన్ని ఓటర్లు గుర్తెరగాలి. అభివృద్ధి పేరుతో అవినీతికి కొత్తమార్గాలు అన్వేషిస్తూ నైతికవిలువలన్నీ అడుసులో తొక్కేసిన అరాచక పార్టీలను భూస్థాపితం చేయగల అవకాశం ఇప్పుడు వచ్చిందని ప్రజలు గమనించాలి. అధికారానికి నిచ్చెనలుగా ప్రజల పేదరికాన్ని, నిరక్షరాస్యతను వాడుకునే పార్టీలకు బుద్ధి చెబుతూ వందకో, మందుకో కక్కుర్తిపడటం మాని, బడి కోసమో, మంచి బతుకు కోసమో ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాలి.

 

1977లో చీలికపీలిక పార్టీలతో జనతా ప్రభుత్వ ప్రహసనం తర్వాత, 1991 నుంచి ఇప్పటి దాకా దేశంలో ఏ ఒక్క పార్టీకీ ప్రజలు పట్టం కట్టలేదు. ఆయా పార్టీల కూటములతో మాత్రమే ప్రభుత్వాలు ఏర్పడటం జరిగింది. అందులో ముఖ్యంగా యు.పి.ఎ., ఎన్.డి.ఎ. కూటములు మాత్రమే అయిదేళ్ళ అధికారాన్ని నిలుపుకోగలిగాయి. అత్తెసరు పార్టీలతో అంట కాగటమనే వంకలతో అవినీతి పంకిలాన్ని ప్రతి ప్రభుత్వమూ అంటించుకుంది.  పట్టుమని పది ఎం.పీ.లు కూడా లేని పార్టీలు కూడా తమ తమ ప్రాంతీయ రాజకీయాల కళ్ళద్దాలతో దేశ భవిష్యత్తును దిద్దటానికి పూనుకుంటున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, కొన్ని పార్టీల ప్రాంతీయ అవసరాలకు దేశ అవసరాలని తాకట్టు పెట్టటం కూడా జరుగుతున్నది. కాదంటే అధికారం కొడిగొట్టే దీపం కాబట్టి, పెద్ద పార్టీలు కూడా సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాలను నడపటానికి ఆపసోపాలు పడుతున్నాయనేది కూడా వాస్తవం.

 

ఈ స్థితికి దేశం చెల్లించుకున్న మూల్యం దాదాపు 23 సంవత్సరాల అభివృద్ధి! కాబట్టే, స్వతంత్ర భారతావనిలో మహాప్రహసనంలా ఇప్పటివరకూ కొనసాగిన సార్వత్రిక ఎన్నికలు, మునుపెన్నడూ లేనివిధంగా దేశానికి దిశానిర్దేశం కావించబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకి ప్రత్యామ్నాయం అవసరమా? అవసరమైతే అది భా.జ.పా.నా లేక ఆ.ఆ.పా.నా లేక చిల్లరమల్లర పార్టీలతో కూటములు కట్టే కమ్యూనిస్టులా? ఇవేమీ కాని మరో అతుకుల బొంతా? ఆ మాటకొస్తే, అసలు ప్రజలకి తామకు కావలసినదేమిటో ఎరుకేనా? ఉచితానుచితాలు మరచి ఉచితంగా అందించే ఉచ్ఛిష్టం కోసం కక్కుర్తిపడితే దేశం ఏమైపోవాలి? ఇన్ని గందరగోళాల మధ్య ప్రజలను తొలిచే ప్రశ్న - ఏకపార్టీ పాలన కోరుకోవటమా, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా పరిపాలన చేసే కూటమిని ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవటమా?

 

ఒకే పార్టీగానూ, కూటమితోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ దేశాన్ని ఎలా భ్రష్టుపట్టించిందో ఓసారి గమనిద్దాం. స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలైనా, మనం ఇంకా "అభివృద్ధి చెందుతున్న దేశం"గానే మిగలటానికి వ్యవస్థీకృతమైన అవినీతే కారణం. ఆ పాపంలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్సే! మొదటి ముప్ఫై సంవత్సరాలలో జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ కలుపుకొని దాదాపు 28 సంవత్సరాలు పరిపాలించగా, లాల్‌బహదూర్‌శాస్త్రి, గుల్జారీలాల్‌నందా కలుపుకొని రెండు సంవత్సరాలు పరిపాలించారు. 1977 తర్వాత 25 సంవత్సరాలు కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అంటే, మొత్తం 67 సంవత్సరాలలో 53 సంవత్సరాలు కాంగ్రెస్సే పాలించింది. గడచిన పదేళ్ళ పాలనలో సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలే అభివృద్ధి లేకపోవటానికి కారణం అనుకున్నా, 43 సంవత్సరాలు దేశం ఏకపార్టీ పాలనలోనే (కాంగ్రెస్) ఉన్నా అభివృద్ధి శూన్యమే అయ్యింది. పదేళ్ళ సంకీర్ణ ప్రభుత్వమూ వెలగబెట్టిందేమీ లేదు.

 

1991-96 మధ్యకాలంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా మన్‌మోహన్‌సింగ్ ఉన్నప్పుడు కూడా హర్షద్‌మెహతా స్టాక్ఎక్స్ఛేంజ్ కుంభకోణం, అబ్దుల్‌కరీం తెల్గీ స్టాంపుల కుంభకోణంలో వేలాదికోట్ల అవినీతి బయటపడినా ఆ ప్రభుత్వం ఓ లక్ష్యం దిశగా నడిచిందనే నమ్మకం ఉండేది. గడచిన పది సంవత్సరాలలో వెలుగు చూసిన అవినీతి లక్షల కోట్లలో దిగటమే కాకుండా "సంకీర్ణ ప్రభుత్వపు మొహమాటాలే" దీనికి పరోక్ష కారణంగా ప్రధానిగా మన్‌మోహన్‌సింగ్ ప్రకటించటం అందరికన్నా అసమర్ధుడైన ప్రధానిగా ఆయన్ని నిరూపించాయి. చరిత్ర తనను వేరే దృష్టికోణంలో చూడాలని ఆశించిన మన ప్రధాని, సమర్ధుడైన అధికారిగా పేరుపొందినా, ఒక మంత్రిగానూ, ఒక ప్రధానమంత్రిగానూ అసమర్ధుడిగానే మిగిలిపోయాడు. పేరుకే ప్రధానిగా మిగిలిన మన్‌మోహన్ అధిష్టానం ఆడిన ఆటలో పావుగా మిగిలిపోయాడు. మూడోసారి ఈ కీలుబొమ్మ ఆశించినా, ప్రజలు యు.పి.ఎ.ను గెలిపించినా, అధిష్టానం ఈయన్ని ప్రధాని చేసే అవకాశం లేదు.

 

డిసెంబరులో వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టమయ్యింది. ఆ విషయం గ్రహించబట్టే, ప్రధాని అభ్యర్ధిని ప్రకటించటం మా అనవాయితీ కాదని కాంగ్రెస్ కబుర్లు చెబుతున్నదనేది వాస్తవం. ఇదే కాంగ్రెస్ గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగకుండా, మూడో ఫ్రంటును ప్రధాని అభ్యర్ధిని ప్రకటించమని ఎద్దేవా చేసిన విషయం కూడా మరిచిపోరాదు. ఏదేమైనా అప్రకటిత కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహుల్‌గాంధీ అనేది బహిరంగ రహస్యమే.

 

అవినీతి మీద రాహుల్ గాంధీ ఆలోచనా విధానానికి, ఆచరణలో పాటిస్తున్న విధానాలకి ఏమాత్రమూ పొంతన లేదనేది వాస్తవం. ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ తర్వాత, రాహుల్ గాంధి జోక్యంతో, ఆ నివేదికలోని కొన్ని అంశాలనే పాక్షికంగా ఆమోదిస్తూ ఆదర్శ్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన కాంగ్రెస్ నాయకులను పక్కనపెట్టి, వారికి వంతపాడిన అధికారులను కుంభకోణానికి బాధ్యులుగా ప్రకటించి వారి మీద చర్యలు తీసుకుంటున్నది. ఆ అవినీతికి అంతే బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ నాయకుల గురించి పల్లెత్తు మాట అనలేకపోయాడు రాహుల్ గాంధీ.

 

అలానే, కోర్టు తీర్పును అవహేళన చేసే విధంగా, అవినీతి ఆరోపణలతో జైలు పాలైన వ్యక్తులకు కూడా ఎన్నికల్లో పాల్గొనే అర్హత కల్పించటానికి హడావుడిగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ఆర్డినెన్సును చించి బుట్ట దాఖలా చేయాలని రాహుల్ గాంధీ కోరటం ఆ వెంటనే ఆ ఆర్డినెన్సు ఆగిపోవటం కూడా మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఆర్డినెన్సు రూపొందించే సమయంలో దిక్కులు చూసిన నేత, రాష్ట్రపతి ఆ ఆర్డినెన్సుపై తన సందేహాలు వ్యక్తం చేసిన తక్షణం ఆఘమేఘాల మీద అడ్డుకోవటం. ఇంత ముఖ్యమైన ఆర్డినెన్సు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే, పార్టీ వేదికపై చర్చించకుండానే తయారయ్యాయని ప్రజలకు నమ్మబలుకుతున్నారా?

 

చూస్తుంటే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అవినీతి అనేది ఒక అంశమే కాదనిపిస్తున్నది. ఆ అంశంతో పోరాడుతున్న ఆమ్ఆద్మీ పార్టీకి ఢిల్లీలో మద్దతు పలికినా, అది భా.జ.పా.ను పక్కన పెట్టటానికే కానీ, రాహుల్ గాంధీ చెబుతున్నట్లు ఆ.ఆ.పా. ఆలోచనలు నచ్చి మాత్రం కాదు. పది సంవత్సరాల పరిపాలన గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం కాంగ్రెస్‌కు మిగిలే అంశాలు, మొన్న తీసుకొచ్చిన లోక్‌పాల్, తెలంగాణా, అంతకన్నా ముందు తీసుకొచ్చిన కోరలు లేని ఆర్.టి.ఐ.లు మాత్రమే. మొన్నటి టైమ్‌స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా సాధికారత గురించి చిలకపలుకులు వల్లె వేసిన రాహుల్‌గాంధీ పదేళ్ళల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురాలేకపోవటానికి కారణాలు అడిగినా చెప్పలేడేమో! అమెరికాతో చేసుకున్న అణుఒప్పందాన్ని ఖరారు చేస్తూ పార్లమెంటులో అడ్డదిడ్డంగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకున్న సర్కారుకు, మహిళా రిజర్వేషన్‌బిల్లు మాత్రం కొరకరాని కొయ్యలా అయ్యిందంటే ఎవరు నమ్ముతారు? ఏదేమైనా, పదేళ్ళ పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమాత్రమూ సాధించలేకపోయినా, అవినీతిలో మాత్రం పాతాళపు అంచులను మాత్రం తాకారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఆ రెండు అంశాల గురించి మాట్లాడే ధైర్యం, నైతిక స్థైర్యం కాంగ్రెస్‌కు, యు.పి.ఎ. భాగస్వాములకు లేదు. కాబట్టే, 2002 గుజరాత్ అల్లర్లే వారి ఆశలకు ఊపిరులు పోస్తున్నాయి.

 ఏదేమైనా, మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ.కు అధికారాన్ని కట్టబెట్టే యోచనలో ప్రజలు లేరని మొన్నడి డిసెంబరు ఎన్నికల్లోనే స్పష్టమయ్యింది. అలానే, ఏకపార్టీ పాలనకు మొగ్గి, కాంగ్రెస్‌కు మాత్రమే ప్రజలు అధికారం కట్టబెట్టగలరనుకోవటం కూడా అత్యాశే! మరి ప్రత్యామ్నాయాలేమిటనేది చర్చించాల్సిన అవసరం ఉంది.



19, ఫిబ్రవరి 2014, బుధవారం

రెండు రాష్ట్రాలు - ఓ పరామర్శ

 రెండు రాష్ట్రాలు - ఓ పరామర్శ (19-Feb-2014)


న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ|

కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా||

మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు లేకుండా చేయబడ్డ ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఇది సరైనా ముగింపేనా? అసలు ఇది ముగింపా, మరో అధ్యాయానికి పొడుగింపా? పోరాడి సాధించిన గెలుపే అయినా, పార్లమెంటులో జరిగిన అంతిమ యుద్ధం తెలంగాణా పోరాటానికి చివరి మలుపు కాదు, మలి మలుపే. ప్రస్తుతానికి ఇది గెలుపోటములకు సంబంధించిన విషయం కాకపోవచ్చు. గెలిచి ఓడిందెవరో, ఓడి గెలిచిందెవరో ప్రస్తుతానికి నిర్వచించలేకపోవచ్చు.

ప్రత్యేక తెలంగాణా ఎన్ని సంవత్సరాల పోరాటమో అన్న విషయం పక్కనబెడితే, ఇప్పటి విజయానికి కారణమైన పోరాటాన్ని డిసెంబరు 2009 ప్రకటనకు ముందు ప్రకటనకు తర్వాతగా విశ్లేషించుకోవచ్చు. ప్రకటనకు ముందు జరిగిన పోరాటం ఎన్నో అవహేళనలకు గురయ్యిందనే మాట వాస్తవమే. దానికితోడుగా చేవలేని కె.సి.ఆర్. నాయకత్వం కూడా ఉద్యమాన్ని పరిహాసాస్పదం చేసింది. ప్రజాస్వామ్యంలో పది రకాల అభిప్రాయల కన్నా, మెజారిటీ అభిప్రాయానికే విలువనివ్వాలన్న ఇంగితం లేకుండా ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని చెప్పుకున్న పార్టీతో అంటకాగిన కె.సి.ఆర్. ఆనాడు చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లే! అరపూట కూడా ఉపవాసం ఉండలేని అర్భకుడు ఆసుపత్రిలో  ఆమరణదీక్ష కొనసాగించటం ఓ విచిత్రమైతే, దానికి బెదిరి కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 2009లో తెలంగాణా ప్రకటన చేయటం మరో వింత.

ఏదేమైనా, ప్రత్యేక తెలంగాణా మొదటి నుంచి ప్రజల ఉద్యమంగానే ఉన్నదనే మాట వాస్తవం. ఉద్యమాన్ని వాడుకుని అందలాలు ఎక్కిన నాయకులు ఉన్నా, ప్రజల మనస్సుల నుంచి ప్రత్యేక తెలంగాణా స్వప్నాలు చెరిపివేయబడలేదనే మాట కూడా వాస్తవమే. 1970 దశకంలో ముగించివేయబడ్డ పోరాటం, రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అదే ఊపుతో కనబడటం దీనికి ఉదాహరణ. ఈ ఉద్యమ పరిష్కారం రాజకీయపరమైనది కాబట్టి, ఆయా సమయాలలో ఉద్యమానికి ఊతమిచ్చిన రాజకీయ నాయకులకు తెలంగాణా ప్రజలు తోడుగా నిలిచారు. పూటకో అబద్ధంతో, రోజుకో వాగ్దానంతో, పార్టీ వైషమ్యాలతో అప్పుడప్పుడు నాయకులు పక్కదోవ పట్టినా, పట్టించినా, ప్రజలు మాత్రం ఉద్యమంతోనే మమేకమయ్యారు. 

సమైక్య ఉద్యమాన్ని చూసుకుంటే, 2009 డిసెంబరు ప్రకటనకు ముందు వరకు, తెలంగాణా ఉద్యమాన్ని, ఉద్యమకారులను, ఉద్యమ తీరుతెన్నులను అపహాస్యం చేస్తూనే గడిపారు సమైక్యవాదులు. అర్ధనగ్న ప్రదర్శనలు, రోడ్ల మీద వంటలు, బతుకమ్మ పాటలా ఉద్యమమంటే అనే ఈసడింపులతో ఎగతాళి చేస్తూనే గడిపారు సమైక్య నాయకులు, ప్రజలు. అక్కడక్కడ సమైక్య  ప్రదర్శనలు జరిగినా, అవి తెలంగాణా ప్రదర్శనలకు ప్రతిక్రియగా జరిగినవే కానీ, సమైక్య ఉద్యమ ధ్యేయంతో చేసినవి కావు. డిసెంబరు 2009 ప్రకటన తరువాతి నాటకీయ పరిణామాలలో సమైక్య ఉద్యమం కూడా ఊపందుకొని ఇవే అర్ధనగ్న ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు, విగ్రహాల విధ్వంసము, రోడ్ల మీద వంటలు, సంక్రాంతి గొబ్బెమ్మలతో కొనసాగింది.


ప్రజా ఉద్యమానికి లొంగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణా కల సాకారమయ్యేలా చర్యలు తీసుకున్నదనేది అబద్ధం. తెలంగాణా ప్రజల ఆకాంక్షే అయినా, తద్విరుద్ధమైన కారణాలతోనే తెలంగాణా ప్రకటన చేయబడిందనేది బహిరంగ రహస్యం. ఏకాభిప్రాయంతోనే తెలంగాణా ఏర్పాటు చేస్తామన్న కేంద్రప్రభుత్వం ఎవరి అభిప్రాయాలకూ విలువ ఇవ్వలేదనేది కూడా సుస్పష్టం.  ఏకాభిప్రాయమంటే అందరి అభిప్రాయాలు ఒక్కటిగా ఉండాలనే అర్ధం కాదని, తనదొక్కటే అభిప్రాయం అని, దానికి అనుగుణంగానే వేయాల్సిన పిల్లిమొగ్గలన్నీ కేంద్రప్రభుత్వం వేసిందని అర్ధంకాని ప్రబుద్ధులు ఎవరూ ఉండరు.

 

తెలంగాణా లక్ష్యంగా సీమాంధ్రలో అంగబలం అర్ధబలం ఉన్నదనుకున్న నాయకులకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి కుడితిలో పడేసింది కాంగ్రెస్ అధిష్టానం. అధికార పిపాసులై, సమైక్యాంధ్ర ప్రజల ఆకాంక్షలను ఈ ప్రతినిధులు విస్మరించారు. అధికార, ధనమదంతో విర్రవీగిన సీమాంధ్ర నాయకులు తెలంగాణా అయ్యే పని కాదని కధలు చెబుతూ కులాసాగా కాలం గడిపేసారు. ముసాయిదా బిల్లు తయారయ్యే సమయానికి కూడా పదవులకు రాజీనామాలు చేస్తే ఉపయోగంలేదనే కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసారు సమైక్య నాయకులు.

అప్పటికే చేతులు కాలిపోయాయి. డిసెంబరు ప్రకటనకు ముందు అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్న నాయకులకు ఆ అధిష్టానాన్ని ప్రశ్నించే దమ్ములేక, ఇటు ప్రజలకు సమాధాన మివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినా స్వార్ధ ప్రయోజనాలను మాత్రం విస్మరించలేకపోయారు! రెండు కళ్ళ సిద్ధాంతాలని, సమ న్యాయమని ఓ నాయకుడు గర్జిస్తే, ఆత్మాహుతి చేసుకుంటామని మరో నాయకుడు బెదిరింపులు. రోజుకో వేషంతో పార్లమెంటును రక్తి కట్టించానని ఒక నాయకుడు భావిస్తే, బ్రహ్మాస్త్రం దాచిపెట్టానన్న నాయకుడు మిరియాలపొడితో సాక్షాత్తు పార్లమెంటులో అరాచకం సృష్టించాడు. సమైక్యాంధ్రకు దిక్కుతెన్ను నేనేనంటూ జగన్ రంగంలోకి దిగేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చివరికి నాయకులు లేకుండానే సమైక్య ఉద్యమం కొనసాగింది. నమ్మదగ్గ నాయకుడు ఎవరూ కనపడక ఆంధ్ర ఎన్.జి.వో. నాయకుడినే నెత్తిన మోసారు. రాజకీయ పరపతిలేని ఆ నాయకుడు చేయగలిగిందేమీ లేకపోయింది. డిసెంబరు 2009 ప్రకటనకు ముందు తెలంగాణా ప్రజల పరిస్థితే, ఇప్పటి సీమాంధ్ర ప్రజల పరిస్థితి. ప్రజల గౌరవాభిమానాలు అందుకోగలిగే నాయకుడు లేకపోగా, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుల గుంపు కార్చిన మొసలి కన్నీళ్ళతో సమైక్య ఉద్యమం నీరుగారిపోయింది.

సామరస్యంగా బ్రతుకుతున్న ప్రజల మధ్య పార్టీలు పెట్టిన చిచ్చు గత రెండు దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. రాజకీయ దురుద్దేశాలతో పాచికలాడిన పార్టీలు, ప్రభుత్వాలు తెలంగాణా కలను సాకారమైతే చేసాయి కానీ, ప్రజల మధ్య వైషమ్యాన్ని మాత్రం దూరం చేయలేకపోయాయనేది నిష్టూరమైన నిజం. కాలం రేపిన ఈ గాయాలు ఎటువంటి దుష్ఫలితాలకు దారితీస్తాయో ఊహించలేం. ఏదేమైనా, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఓ నిజం. సీమాంధ్ర రాష్ట్రం మరో నిజం. ఓ ఫేస్‌బుక్ మిత్రుడు చెప్పినట్లు పాత సమస్యలతో కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలతో పాత రాష్ట్రం - రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలని ప్రభావితం చేయబోయే పరిణామాలకు కారణం కాబోతాయనే విషయంలో ఎటువంటి అనుమానాలూ లేవు. ఇరు రాష్ట్రాల ప్రజలు విజ్ఞతను, సంయమనాన్ని ప్రదర్శించాల్సిన నిజమైన తరుణం ఇదే.



30, జనవరి 2014, గురువారం

‘చేతి'లో... చీపురేసి చెప్పు ఆ.ఆ.పా!

 ‘చేతి'లో... చీపురేసి చెప్పు ఆ.ఆ.పా! (30-January-2014)


చేతిలో... చీపురేసి చెప్పు ఆ.ఆ.పాచేసినన్ని బాసలు చెరిగిపోవనీ, మరచిపోననీ…

 

కాపురం చేసే కళ కాలు పెట్టిన రోజే తెలుస్తుందని... ‘చేతికి’ చీపురిచ్చిన ఆమ్ఆద్మీ ఢిల్లీని ఏదో ఉద్ధరిస్తుందనుకోవటం భ్రమల్లో బతకటమే! కాంగ్రెస్ ఊదే గాలితో ఆమ్ఆద్మీ బూర ఎన్నాళ్ళుంటుందో ఊహించటం సాధ్యం కాదు. ఢిల్లీ ఓటర్లు 35 శాతం ఓట్లు 31 సీట్లతో భా.జ.పా.నూ, 30 శాతం ఓట్లు 28 సీట్లతో ఆ.ఆ.పా.నూ గెలిపించటానికి ముఖ్యకారణం ఢిల్లీని కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి విడిపించాలనే!

 

ఇన్నాళ్ళూ అవినీతికి వ్యతిరేకమంటూ వచ్చిన ఆమ్ఆద్మీ, ఈరోజు అధికారానికి దాసోహం అనటం ఆ పార్టీ విశేషంగా ఆకర్షించిన మధ్యతరగతి వర్గానికి చెంపపెట్టు. దానికితోడు, ఏ కాంగ్రెస్‌నైతే సాగనంపారో, అదే కాంగ్రెస్ దొడ్డితలుపులు తీసుకొని రాగలదని, ఆమ్ఆద్మీనే ఆ తలుపులు తీసిపెడతాడని ఊహించి కూడా ఉండరు!

 

ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే, ఆ.ఆ.పా. ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బేషరతు మద్దతు ఇస్తామని తరీక్ అహ్మద్ ప్రకటిస్తే, ఆమ్ఆద్మీని చూసి చాలానే నేర్చుకోవాలని రాహుల్ ప్రకటించాడు. ఆమ్ఆద్మీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యిందనే వార్తల మధ్య, తమ మద్దతు బేషరతు కాదనీ, అంశాలవారీ మద్దతేనని షీలాదీక్షిత్ ప్రకటించటం, ఆమ్ఆద్మీకి మద్దతు నిరసిస్తూ, ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు, రాబోయే కాలంలో ఆడబోయే నాటకాలకు నాందీ వాక్యం పలకటమే!

 

రోజుకో మాటతో రాజకీయ నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నాలలో అరవింద్‌కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్‌కు తీసిపోలేదు. కాంగ్రెస్, భా.జ.పా.లు రెండు అవినీతి పార్టీలని, ఆ రెంటికి దూరంగా ఉంటామని ప్రకటించి పది రోజులు కాకుండానే ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని నిర్ణయించటం ఢిల్లీలోని ఆమ్‌జనతాకు మింగుడుపడదు. పేలవమైన పద్ధెనిమిది షరతులతో ఆ రెండు పార్టీలకు పత్రాలు పంపటం కూడా ప్రజలను మభ్యపెట్టటానికే అన్నది ఇప్పుడు తేటతెల్లం. ఆ పద్ధెనిమిది షరతుల్లో ముఖ్యమైన కరెంటు బిల్లులో 50 శాతం కోత, రోజుకు 700 లీటర్ల మంచినీటి సరఫరా లేకపోవటం ఆశ్చర్యకరం. నిర్ణయాలలో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని చూపించటానికే, తీసుకోబోయిన ఆ నిర్ణయానికి 25 లక్షలమందితో సర్వేలని, ఎస్సెమ్మెస్‌లనే నాటకానికి కూడా తెరదీసాడు. రాజకీయాల్లో పారదర్శకత మీద లెక్చర్లు ఇచ్చిన పెద్దమనిషి తమ ఈ నిర్ణయాన్ని మాత్రం ఏమాత్రమూ పారదర్శకత లేకుండా తీసుకున్నాడనేది కూడా నిజం.

 

ఇలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆ.ఆ.పా. కామన్‌వెల్త్ కుంభకోణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయించగలదా? ఒకవేళ చేసినా, ఆ.ఆ.పా. ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు కొనసాగించగలదా? మద్దతు విరమిస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఎలాగూ ఏర్పడుతుంది కదా! ఆ ఎన్నికలేవో ఇప్పుడే వెంటనే తేలిస్తే సరిపోదా? ఆ.ఆ.పా. చింతనా శిబిరాలలో ఇవేమీ చర్చించలేదా? మొన్నటి ఒక ఇంటర్వ్యూలో ఆ.ఆ.పా. నేత ప్రశాంత్ భూషణ్ కాంగ్రెస్ ఇచ్చే సమర్ధన ఎన్నాళ్ళు కొనసాగుతుందో అనే అనుమానాన్ని అప్పటికే వెలిబుచ్చాడు. అయినా, కాంగ్రెస్ మద్దతు తీసుకోవటంలోని ఆంతర్యం ఏమిటి?

 

ఇవన్నీ చూస్తుంటే, అసలు ఆమ్ఆద్మీపార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, ప్రజలకు అర్ధవంతమైన పరిపాలన ఇవ్వాలని మొదలుపెట్టారా, లేక రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనయినా నరేంద్రమోడీ గెలవకుండా ఉండటానికి కాంగ్రెస్ రచించిన వ్యూహంలో భాగమా అనే అనుమానాలు పొడచూపుతున్నాయి. నోటి తీట తీర్చుకోటానికి నరేంద్రమోడీని ఎన్ని మాటలైనా అనటానికి సాహసించే దిగ్విజయ్‌సింగే మోడీ ప్రభుత్వంలో అవినీతి మంత్రులు ఉన్నారని అన్నాడే కానీ, మోడీయే అవినీతిపరుడని ఏనాడూ అనలేదు! 2002 ను బూచిలా చూపించి, నరేంద్ర మోడీ మతవిద్వేషాన్ని ప్రదర్శిస్తాడనే అన్ని పార్టీలు అంగలారుస్తూ ఉన్నాయి కానీ, మోడీ అవినీతిపరుడని అవి ఎప్పుడూ అనలేదు. అటువంటిది, నరేంద్ర మోడీ అవినీతిపరుడని మొట్టమొదటిసారిగా ప్రకటించింది ఆ.ఆ.పా.! అలానే, ఢిల్లీ ఎన్నికల్లో 28 సీట్లు నెగ్గగానే, రాబోయే ఎన్నికల్లో గుజరాత్‌లోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని అరవింద్‌కేజ్రీవాల్ ప్రకటించాడు కానీ, మరే ఇతర రాష్ట్రాన్ని ప్రస్తావించలేదు.

 

తననో లౌకికవాదిగా నిరూపించుకోటానికి ఢిల్లీ ఎన్నికల ముందు మౌలానా తకీర్ రాజాతో సమావేశమవ్వటం నుంచి, ఓ స్టింగ్ఆపరేషనులో చిక్కిన తన అనుయాయులను రక్షించుకోటానికి అంతర్గత కమిటీ ఏర్పాటు వరకు, ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్-భా.జ.పా. దొందూదొందే అనటం నుంచి, నేడు కాంగ్రెస్ మద్దతు కూడగట్టటం వరకూ, అరవింద్‌కేజ్రీవాల్ వేస్తున్న ప్రతి అడుగు కాంగ్రెస్ బాటలోనే! ఇవి కాకతాళీయమా, లేక మరేవైనా ‘ప్రధాన’ కారణాలున్నాయా? ఏదేమైనా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా భావించబడ్డ పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి అవినీతి అంశాన్ని అటకెక్కించి, చిలుకపలుకుల్లా లౌకికవాదాన్ని పలవరించినా ఆశ్చర్యంలేదు. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పక్షంగా మారినా ఆశ్చర్యం అంతకన్నా ఉండబోదు.