చిటపటలు-21 "చెవిలో పూలు" (13-February-2013)
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మన గవర్నర్ గారు లాంఛనంగా తన ప్రసంగంతో ప్రారంభించేసారట. ఆయన ప్రసంగంపై రాజకీయ పక్షాలు మండిపడ్డాయి.
కమ్యూనిస్టులు : ప్రజలపై పన్నులు మోపి ఆదాయం పెరిగిందని చెప్పుకోవటం, అవినీతిలో మునిగిన ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేయటం, ఓవరాల్ ఇటువంటివేమీ పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగం మసి పూసి మారేడుకాయను చేసిందని కమ్యూనిస్టులందరు తమ నిరసనను చెవులో పూలు పెట్టుకోవటంద్వారా ప్రదర్శించారట!
అది చూసి గవర్నర్ ఏదో బాధపడిపోతారని, పడకపోతే ఈసారి చెవిలో పూలు కాకుండా గుండు చేయించుకొని నిరసన చేద్దామనుకునే ఆలోచన చేస్తున్నారేమో మన కమ్యూనిస్టులు. వాళ్ళు ఓ విషయం మర్చిపోయినట్లున్నారు. చెవిలో పూలు పెట్టుకోటానికే మన గవర్నరు గారు వారానికోసారి తిరుపతి వెళ్తుంటారు కదా. కమ్యూనిస్టుల చెవిలో పూలు చూసి ఈయన బాగా ఆనందపడే ఉంటారు.
తె.రా.స. : గవర్నర్ ప్రసంగంలో తెలంగాణా అంశం లేకపోతే నిరసన ప్రదర్శిస్తామని తెరాస ముందుగానే హెచ్చరించింది. ఊహించినట్లుగానే గవర్నర్ తెలంగాణా అంశం ప్రస్తావించలేదు. మరి తెరాస నేతలు కమ్యూనిస్టుల ప్రేరణతో ఎక్కడ ఏం పెట్టుకుంటారోనని ప్రజలు హడలిపోతున్నారట! ఐ మీన్ తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారోనని నాలుగు కోట్ల ఆకాంక్షలు కంగారు పడుతున్నాయని భోగట్టా!
* * *
అయినా చెవిలో పూలు పెట్టటంలో సెకండ్ టు నన్ దిగ్విజయ్ సింగైతే, ఇప్పుడిప్పుడే డిగ్గిరాజాకు దడ పుట్టిస్తున్నాడట సల్మాన్ ఖుర్షీద్. ఓ.బి.సి. రిజర్వేషన్లలో ముస్లీములకు 9 శాతం ఉపకోటా కల్పిస్తామని దురద పుట్టినప్పుడల్లా ఈయన పూలు పెట్టేస్తుంటే, యు.పి. ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించకూడదని ఎన్నికల కమిటీ లాలించి, మందలించి, కాళ్లావేళ్ళా పడి బ్రతిమాలి, ఊరుకుంది.
ఆయనకా దురద తీరలేదు, పూలు పెట్టటమూ మానలేదు, ఎన్నికల కమిటీ పరువూ నిలవలేదు. ఇకపైగా, నా ముక్కు, నా దురద నా ఇష్టం. నా పార్టీ మానిఫెస్టో పెద్దగా చదివితే మీకేంటి ప్రాబ్లం అని కాలీ ఫ్లవర్లు కాబేజీల కోసం ఎదురుచూస్తున్నాడట! చివరాఖరికి ఎన్నికల కమిషన్ ఆ పూలు ఓ ఫిర్యాదు పత్రంతోపాటుగా రాష్ట్రపతికి పంపితే, ఆమె అవే పూలు అవే ఫిర్యాదు పత్రం ప్రధానికి పంపిందట! జనాలందరికీ ఆల్రెడీ అన్నేసి పూలు పెట్టేసాక ప్రధాని ఆ పూలు పత్రం మడిచెక్కడ పడేస్తారో చాలా ఆసక్తిగా ఉందా లేదా?
చిటపటలు-22 "దగ్గులు తుమ్ములు" (16-May-2012)
ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల వారు ఖళ్ళుఖళ్ళు మంటుంటే, తిరుపతి నియోజకవర్గం హోల్ మొత్తంగా చెవులు చూపిస్తున్నదట పూలేమీ పెట్టుకోలేదని!
* * *
చంటబ్బాయ్ దగ్గులు ఇలా ఉంటే, వీహెచ్ మాత్రం గాండ్రించేస్తున్నాడు. జగన్ లాంటోళ్ళను వదిలేస్తే, ప్రజల ఇళ్ళల్లో చెంబులు, తప్పేళాలు కూడా దోచుకునేస్తారని ప్రజలు జాగ్రత్త పడాలని సలహాలిస్తున్నాడు. దేశంలో కాంగ్రెస్ పడి ఎనిమిదేళ్ళౌతుంటే ఇంకా దోచుకోటానికి ఎవరికి ఏం మిగిలి ఉంటుంది?
* * *
కాంగ్రెస్ అధినేత్రి సోనియా జీ లో ఓ గొప్ప గుణం ఉందట! ఆ పార్టీ నేతలపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఆయా నేతలని ఆవిడ, ఇతర కాంగ్రెస్ నాయకులు గాలికి వదిలేయరట! ఆరు నూరైనా అండగా నిలబడతారట! పొరుగింటి పుల్లకూర రుచిని నోరు ఊరేలా యెడ్యూరప్ప చప్పరిస్తుంటే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లు గుడ్లురిమి చూస్తున్నారట, ఎ.కె.రాజా, కణిమొళి కారాలు మిరియాలు నూరేస్తున్నారట! ఇంతకి యెడ్యూరప్ప దగ్గుతున్నాడో, తుమ్ముతున్నాడో మరేదేమైనా చేస్తున్నాడో అర్ధం కాక, అటు కర్ణాటక కాంగ్రెసీయులు, భా.జ.పా.లు తలలు బాదుకుంటున్నాయని భోగట్టా.
చిటపటలు - 23 "పార్లమెంటు పండగ" (17-May-2012)
అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు యాదవ్, కణిమొళి సాక్షిగా హామీలు గుప్పించేసారు. పార్లమెంటు ప్రతిష్టపై పిడకలు విసురుతున్న అన్నాను, పౌరసమాజాన్ని ఆక్షేపించేసారు. ఆ ఆవేశమంతా గోళీసోడాలా వెంటనే తుస్సుమంది.
ఇరవై నాలుగ్గంటలు గడవక ముండే అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసేసుకున్నారు! మొత్తానికి కాకుల సాక్షిగా కలకాలం పరిఢవిల్లుతుంది మన ఘనప్రజాస్వామ్యం అని జనాలకి ఓ భరోసానిచ్చింది ఈ అరవై ఏళ్ళ పండగ.
బై ద వే, క్రిమినల్సు, అవినీతిపరులు కూడా ఈ నెలలో పండగ పండగ చేసుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం మాఫియా లీడర్ అబూ సలేం పైన అభియోగింపబడ్డ మోకా ను రద్దు చేసేసారట! నిన్ననే 2జి స్పెక్ట్రం కేసులో బెయిల్ పొంది ఎ.రాజా బయటకు వచ్చేసాడు. ఈ కేసుకు సంబంధించి తీహారు జైల్లో ప్రస్తుతానికైతే ఎవ్వరూ మిగల్లేదు. ఇవిలా ఉంటే, పార్లమెంటులో మన ప్రజా ప్రతినిధులు మాత్రం ఐ.పి.ఎల్. లో మ్యాచ్ ఫిక్సింగుల గురించి, యు.ఎస్.ఎ.లో కాళి మాత పేరు మీద అమ్ముతున్న బీయరు గురించి తీరిగ్గా తన్నుకు చస్తున్నారు!
చిటపటలు - 24 "పేకాటలు జోకర్లు" (06-December-2012)
పేకాటలో జోకర్ల ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన అవసరంలేదు. రమ్మీ లాంటి ఆటల్లో సెకెండ్ సీక్వెన్సుకు, ఫోర్త్ కార్డుకు, ట్రిప్లెట్లకు... ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా గట్టెక్కించేస్తాయ్ జోకర్లు.
ఒక్క పేకాటే కాదు, మన రాజకీయాల్లో కూడా జోకర్ల పాత్ర ఎంతో ప్రభావవంతమైనదే. ముఖ్యంగా ఎస్పీ, బిఎస్పీ, ఆరెల్డీ లాంటి పార్టీలు పేకాటలో జోకర్లకన్నా ప్రతిభావంతమైన పాత్రను మన రాజకీయాల్లో పోషిస్తున్నాయి. చిల్లర వర్తకంలో ఎఫ్.డి.ఐ. విషయానికే వస్తే, దీనివల్ల రైతులకు, చిన్నవ్యాపారులకు, సాథారణ ప్రజానీకానికి కలుగబోయే కష్టాలన్నీ అంకెల్లో వర్ణించి మరీ ఎస్పీ, బిఎస్పీలు కన్నీరు కార్చేసాయి. విసిగి వేసారి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించాయి.
ఎస్పీ బాబాయిల్ని, బిఎస్పీ పిన్నులని నిన్నంతా టీవీ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు చేసారు. సుఖంగా ఉన్న చిల్లర వర్తకులని చూసి ప్రభుత్వం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నదని మళ్ళీ కన్నీరుమున్నీరుగా విలపించేసారు. బాబాయిలు, పిన్నులు మరి ఇంత ఛండాలమైన బిల్లును లోక్ సభలో వ్యతిరేకిస్తూ ఓటు వేస్తే బాగుండేది కదా అంటే, అలా చేస్తే భా.జ.పా. లాంటి మతతత్వ పార్టీలకు చేయూత నిచ్చినట్లౌతుందని, అది దేశ లౌకికత్వానికి ముప్పని టీవీ యాంకర్లను, చూస్తున్న ప్రజానీకాన్ని ఉర్రూతలూగించారు!
అసలు విషయం అది కాదని, భా.జ.పా.లాంటి పార్టీల్లోని కాకులు కోళ్ళై కూసాయి. వాళ్ళ అనుమానం ప్రకారం, ములాయం తోక, మాయావతి పిలక అవినీతి రూపంలో కాంగ్రెస్ చేతుల్లో చిక్కుకుపోయింది. అటు కాంగ్రెస్, వాళ్ళిద్దరినీ సి.బి.ఐ. గొలుసుతో కట్టేసి, మార్నింగ్ వాకులకు వెళ్ళినప్పుడు, ఈవినింగ్ వాకులకు వెళ్ళినప్పుడు వెంట తిప్పుకుంటున్నదట!
ఏదేమైనా, ఇటువంటి జోకర్ పార్టీలు మాత్రం, ఒక కాలు వాళ్ళ రాష్ట్రంలో, మరోకాలు పార్లమెంటులో, మూడో కాలు మూడో ఫ్రంటులో పెట్టి, నాలుగో కాలెత్తి ప్రజల మీద పన్నీరు చల్లుతున్నామని పోజులు మాత్రం ఇస్తుంటాయి. వీటిని జోకర్లనాలో, జంతువులనాలో బేతాళ ప్రశ్న!
* * *
జోకర్లంటే గుర్తుకొచ్చింది. నిన్ననే ఓ పెద్ద జోకు మన తెలుగు వార్తాపత్రికల్లో వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, అందుకు గాను మన రాష్ట్రం వేదికగా ఓ భారీ బహిరంగ సభ జరగబోతున్నదట! దేశంలో అవినీతి క్యానసరులా పాకుతున్నదని, దాన్ని వెంటనే వదలగొట్టాలని, కాంగ్రెస్ శ్రేణులకు సోనియా ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా ఈ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారట. ఇంకా పెద్ద జోకేమిటంటే, ఆ సభకు గాను పందిళ్ళు వేయటం దగ్గర నుంచి, మందిని తోలుకొచ్చి సభను ఆసాంతం నిర్వహించే బాధ్యత శ్రీ బొత్స గారిదేట!
అసలు ఇటు రాష్ట్రాల్లోను, అటు కేంద్రంలోనూ "అవినీతి మంత్రిత్వశాఖ" ఏర్పాటు చేసి కల్మాడి, చవాన్ లాంటి ప్రబుద్ధులను అందలం ఎక్కించేస్తే అవినీతనేది బయటకు కనపడకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో కదా. ఎవరైనా, ఈ సలహా మన ప్రధానామాత్యులకో, కాంగ్రెస్ పెద్దలకో చేరవేస్తే బాగుణ్ణు.
చిటపటలు-25 "మరుగుదొడ్లు - మహా నాయకులు" (19-December-2012)
ఈరోజు (19 డిసెంబర్) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు(ము). మరుగుదొడ్లే మానవాభివృద్ధికి సూచికలని, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో అది ప్రజల అవసరమే కాక, ప్రతి మనిషికీ ఉన్న హక్కు అని అప్పుడెప్పుడో శ్రీ జైరాం రమేష్ గారు సూచించారు కూడా. ఆయనే ఆ మంత్రిగా కంటిన్యూ అయ్యుంటే, మనిషికో మరుగుదొడ్డి పథకం కూడా “ఎవరో గాంధీ” పేరు మీద మొదలయ్యేదేమో! మరుగుదొడ్లు, పార్లమెంటు అనగానే గుర్తుకొస్తుంది. రెండు మూడు నెలల క్రితం అసీం త్రివేది అనే కార్టూనిస్టు, పార్లమెంటును మరుగుదొడ్డిగా చిత్రీకరించినందుకు దేశద్రోహ నేరంపై అరెస్టు కూడా అయ్యాడు. ఆ తర్వాత, ఆ కేసు ఆగిపోయిందనుకోండి.
మరుగుదొడ్ల గురించి జైరాం రమేష్ గారి మాటల్లో ఎలానూ చెప్పుకున్నాం కాబట్టి, ఇక మన నాయకుల గురించి చెప్పుకుందాం. మరుగుదొడ్లకి, మన నాయకులకి సంబంధం ఏమిటనుకుంటున్నారా? మన నాయకులు చాలాసార్లు మాట్లాడరు, విసర్జిస్తూ ఉంటారు. దాన్నే, నోటి దూల, నోటి దురద, నోటికి తీట, వాచాలత అని కూడా అంటారు. అలా విసర్జించే ప్రకటనలనే పదార్ధాలు ఎంత గబ్బుకొడుతూ ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు. ఏదేమైనా, మరుగుదొడ్ల మహోత్సవం సందర్భంగా మన నాయకుల కొన్ని ప్రకటనలు చదువుకొని, మన మరుగుదొడ్లే పరిశుభ్రంగా ఉన్నందుకు ఆనందిద్దాం.
ఎన్.టీ.ఆర్.కు ముందు ఎలా ఉండేదో అంతగా తెలీదు కానీ, రాజకీయాల్లో గబ్బు ప్రకటనలకు మాత్రం మన అన్నగారు ఇతోధికంగా ఊపునందించారు. కాంగ్రెస్ వాళ్ళు కుక్కమూతిపిందెలనీ, మోచేతి నీళ్ళు తాగే వెధవలనీ, రాజీవ్ గాంధి నపుంసకుడని....ఇలా. ఆ వెంటనే జలగం వెంగళ్రావు కూడా ఎన్.టీ.ఆర్.ని ఫుట్బాల్ కొట్టినట్లుగా కొట్టేస్తానని చిందులు వేసేసారు. అలా కొనసాగుతూ వచ్చిన మన నాయకుల నోటి తీట మరుగుదొడ్లని మరిపించటమేమో కానీ, మన పార్లమెంటరీ సంప్రదాయాలని భ్రష్టుపట్టిస్తున్నది. మచ్చుకు కొన్ని తీటలు...
ముందుగా తె.రా.స. అధినేత శ్రీమాన్ చంద్రశేఖర్ రావు గారు. ఆంధ్రోళ్ళని చీల్చేస్తాం, చెండాడేస్తాం నుంచి మొదలై, "ఆంధ్రోళ్ళ బిర్యాని పేడ లెక్కుంటుంది" అనేవరకు వచ్చింది! మహానుభావుడు, పేడ రుచి ఎలా తెలిసిందో, ఆంధ్రా పొడే గిట్టని వ్యక్తి, ఆంధ్రోళ్ళ బిర్యాని ఎలా తిన్నాడో అని ఎవ్వరూ అడగలేదు!
సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి శ్రీ నారాయణగారు. వీరికీ నోరు తెగ పూస్తూనే ఉంటుంది. నిన్నంటే నిన్ననే ఆయనా నోరు ఇలా పారేసుకున్నారు ....28న తెలంగాణాపై జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకు అనుకూలంగా ఒక్కటే సమాధానం చెప్పాలని, అలా కాక రెండు వేరువేరు అభిప్రాయాలు చెబితే నాలుకలు కోసేస్తానని ఇతర పార్టీల ప్రతినిధులని హెచ్చరించారు!
మొన్నామధ్య ఎఫ్.డి.ఐ. పై రాజ్యసభలో జరిగిన చర్చలో, తన ఉపన్యాసానికి అడ్డు పడుతున్నారని ఓ మహిళా ఎం.పీ.ని "బేవకూఫ్" అనేసారట భా.జ.పా. నాయకుడు వెంకయ్య నాయుడుగారు!
"పెద్ద సింహాల్లా మాట్లాడుతారు కానీ, కుక్కల్లా కాంగ్రెస్, సోనియాల కాళ్ళు మాత్రం నాకుతూనే ఉంటారు" - అంటూ లాలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లను ఉద్దేశించి, సాక్షాత్తు భా.జ.పా. అధ్యక్షుడు శ్రీమాన్ నితిన్ గడ్కారి 2010లో నోటి దూల ప్రదర్శించారు.
ఐ.క్యు. విషయంలో స్వామి వివేకానంద, మాఫియా లీడర్ దావూద్ ఒకరికొకరు తీసిపోరని కూడా ఈ మాననీయులే వాక్రుచ్చింది!
"నేను కేంద్ర న్యాయశాఖా మంత్రిని, పెన్నుతోనే కాదు రక్తంతో కూడా రాయటం వచ్చు. దమ్ముంటే ఫరూకాబాద్ రా, తిరిగి ఎలా వెళతావో నేనూ చూస్తా"... ఇదేదో సినిమాలో తొడలు కొట్టి, మీసం మెలేస్తూ కటకటాల రుద్రయ్యో, సమరసింహారెడ్డో వేసిన పొలికేక కాదు. సాక్షాత్తు, అప్పటి కేంద్ర న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహిస్తూ చేసిన శపథం!
"అమ్మాయిలు వేసుకునే దుస్తులవల్లే మానభంగాలు జరుగుతున్నాయి" అని ఓ మహాశయుడు సెలవిస్తే, "పిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తే మానభంగాలనేవే ఉండవు" అని మరో మహానుభావుడు ప్రకటిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అటు దేశస్థాయిలో దిగ్విజయ్ సింగులు, కపిల్ సిబల్సు, మనీష్ తివారీలు, మణిశంకర్ అయ్యర్లు, ములాయంలు, లలూలు కూడా ఇతోధికంగా నోటి దూల ప్రదర్శిస్తుంటే, ఇటు రాష్ట్రస్థాయిలో కేకేలు, కాకాలు, వి.హెచ్.లు, సర్వేలు, శంకర్రావులు, సత్యనారాయణలు, కె.సి.ఆర్.లు, హరీష్ రావులు... బోల్డు మంది బోల్డు రకాలుగా నోటి దురద తీర్చుకుంటూ కనిపిస్తారు... సారీ వినిపిస్తూ ఉంటారు.
అదీ చాలకపోతే, జనాలని చితకబాదుతూ చేతి తీట కూడా తీర్చుకునే నాయకులు కూడా ఉన్నారు వీరిలో కొందరు.
ఏదేమైనా, మరుగుదొడ్లనైతే ఫినాయిల్ తో కడిగి, చీపురుతో చిమ్మేసుకుంటాం. మరి వీళ్ళని, వీళ్ళ నోళ్ళనీ..... ఎందుకులే బాబు ఇప్పటికే 'పోటా'నో, 'మోకా'నో పెట్టేసుంటారు నామీద!