రాజకీయ జోక్యం లేకుండా దేశంలోని ఏ పురస్కారమూ ఎవరికీ దక్కవనేది అందరికీ తెలిసిన విషయమే. చిరంజీవికి పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారో అందరూ గ్రహించగలిగిన విషయమే. చిరంజీవికి పద్మభూషణ్ ఇచ్చినందుకు, పద్మశ్రీలు తెచ్చుకున్న నటులూ మనకు ఎరికే!
సామాజిక, సారస్వత, సాంస్కృతిక రంగాల్లో విశిష్టసేవలందించినవారికి లభించాల్సిన పురస్కారాలు, రాజకీయ ఒత్తిళ్ళకు గురై ఎలా ప్రాముఖ్యతను కోల్పోతున్నాయో వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో సీట్లు, ఆ పైన పదవులు పంచుతున్నట్లుగా, పద్మ అవార్డుల పంపకం జరుగుతున్నదనేది నిష్టూరమైనా నిజం. ఆ జబ్బే ఇప్పుడు దేశ అత్యున్నత పురస్కారమైన 'భారతరత్న'కు అంటుకుంది.
డా.సర్వేపల్లి రాథాకృష్ణన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రు, గోవిందవల్లభ్ పంత్, డా. రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావె, రాజగోపాలాచారి, మదర్ థెరెస్సా, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, అబ్దుల్ కలాం, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్.
ప్రతి భారతీయుడు గర్వించదగ్గ నాయకులు, కళాకారులు, సంఘసేవకులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు. అందుకే వీరి పేర్ల ముందు భారతరత్న మెరిసిపోతుంది. వీరి వల్ల భారతరత్న అవార్డుకు గౌరవం పెరిగింది.
పైన ఉదహరించిన పేర్ల పక్క కాన్షీరాం, ఎంటీఆర్, వాజ్ పేయ్, జ్యోతిబసు అన్న పేర్లు ఏరకంగానైనా నిలువగలవా! ఆ మాట కొస్తే, భారతరత్నలతో అలంకరింపబడిన ఇందిరాగాంధి, రాజీవ్ గాంధి లాంటి పేర్లు మాత్రం ఎలా నిలుస్తాయో ఆలోచించాలి.
అసలు సంఘసేవ చేసారన్న నెపంతో రాజకీయ నాయకులకు భారతరత్న ఇవ్వటం మొదలేయటమే పెద్ద తప్పిదం. పటేల్, రాజేంద్రప్రసాద్, రాజాజీ, జయప్రకాష్, మొరార్జీ దేశాయ్ లాంటి నేతలకు, స్వాతంత్ర్య పోరాటంలో వారు పోషించిన పాత్రకు, దేశ సమగ్రతను, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారు పాటించిన సామాజిక విలువలకు, పరిపాలనాదక్షతకు 'భారతరత్న'తో సత్కరించటం సముచితం.
కేవలమూ గాంధీ ఇంటి పేరు కలిగి ఉండటం 'భారతరత్న'కు ఓ అర్హతగా భావించి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు కూడా ఆ సమున్నతమైన పురస్కారాన్ని కట్టబెట్టినప్పుడే 'భారతరత్న'కు విలువ తగ్గింది.
అడుక్కు తెచ్చుకునే అవార్డుగా భారతరత్న భ్రష్టుపట్టింది ఎంజీఆర్ ను అప్పుడు ఎంపిక చేయటంతోనే, ఇంకా కొత్తగా అయ్యేదేం ఉన్నదంటే చెప్పేదేమీలేదు. పేదల పెన్నిధిగా లాలు ప్రసాద్ యాదవ్, దళితసోదరిగా మాయావతి, రైతుజనబాంధవుడుగా రాజశేఖర్ రెడ్డి, స్టేట్స్ మన్ గా చంద్రబాబు భారతరత్నకు పోటీపడే రోజు తొందరలోనే వస్తుంది.
అసలామాటకొస్తే, ఓ 'ఇండియన్ ఐడల్' లా, మరో 'ఛాయిస్ ఆఫ్ ఇండియా'గా, ఎస్. ఎం. ఎస్. ల ద్వారా ప్రజలే భారతరత్నను ఎన్నుకునే అవకాశం ఇస్తే పోలా?
"India has produced a legacy of brave hearts since times immemorial. Probably there is not enough space to measure their sacrifices. However, we cannot close our eyes to those people who have made our country proud by excelling in their own fields and bringing us international recognition. Bharat Ratna is the highest civilian honour, given for exceptional service towards advancement of Art, Literature and Science, and in recognition of Public Service of the highest order."
ఏ స్ఫూర్తితో 'భారతరత్న'లను సత్కరించాలనుకున్నారో చూస్తే, ఆ సత్కారాన్ని అర్హతలేనివారెందరు అందుకున్నారో అర్ధమౌతుంది.