17, మార్చి 2011, గురువారం

మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం

 మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం (17-March-2011)


లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి మిగిలిన నిందితులు బతికే ఉంటారో లేదో చెప్పటం కూడా కష్టమే.

 

మునుపు స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణంలోని ప్రధాన నిందితుడు హర్షద్ మెహతా జైల్లోనే చచ్చే దాకా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏమిటో మనకు తెలీను కూడా తెలీదు. స్టాంపు పేపర్ల కుంభకోణంలోని నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ, సత్యం రాజు కేసుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దశాబ్దాల తరబడి జైల్లోనే మురిగిపోయి చావకుండా, ముందుగానే చచ్చినందుకు స్పెక్ట్రం సాదిక్ ని అదృష్టవంతుడనాలేమో!

 

విచిత్రం ఏమిటంటే, వీళ్ళని పావులుగా ఆడించిన రాజకీయ నాయకులు మాత్రం కనుచూపు మేరల్లో కనబడరు. ఇక మిగతా కుంభకోణాల విషయానికి వస్తే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లాంటి రాజకీయ వ్యక్తుల మీద ఈగ కూడా వాలదు. పొరపాటున లాలు ప్రసాద్ యాదవ్ లాంటి వారిపై ఈగలు వాలినా, దులపరించుకుని బయటకు తేలిగ్గానే వచ్చేస్తారు.

ఒక సామాన్యుడైనా, కోట్ల కొద్ది డబ్బు సంపాదించినవాడైనా సరే, రాజకీయ నాయకుడు కానంతవరకు, ఈ దేశంలో మనలేడు అన్నదానికి ఇవి ఉదాహరణలు. బహుశా అందుకేనేమో అంబానీలు, మాల్యాలు కోట్ల డబ్బు వెదజల్లి మరీ, అధికార పార్టీల ప్రాపకానికి పడిగాపులు కాస్తు ఉంటారు.

2జి స్పెక్ట్రం కి వద్దాం. ఇంత తీవ్రాతితీవ్రమైన కుంభకోణాన్ని రాజకీయ లాభం కోసం మన పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో చూస్తే మతి పోతుంది. ఈ కుంభకోణం నేపధ్యంలోనే, దాదాపు గత ఏడేళ్ళుగా కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డి.ఎం.కె., మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటామనే బెదిరింపులకు దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు గురించి మొదలైన ఆవేశకావేషాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే బెదిరింపులకు కారణమయ్యిందట! వ్రతం చెడినా ఫలితం దక్కిందనుకోటానికి కూడా ఆస్కారం లేకుండా కాంగ్రెస్ ఒత్తిళ్ళకు తప్పనిసరిగా తలొగ్గి అడిగిన సీట్లు ధారపోసింది డి.ఎం.కె.

 

2జి స్పెక్ట్రం కుంభకోణం, దరిమిలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న సి.బి.ఐ. దర్యాప్తు నేపథ్యంలో కేవలం కొన్ని అసెంబ్లీ సీట్ల సర్దుబాటు కుదరని కారణంగా డి.ఎం.కె. ఈ బెదిరింపులకు పాల్పడిందంటే నమ్మేదెవరు? గతంలో ముఖ్యమైన మంత్రిత్వశాఖల కోసం ఇవే పాచికలు విసిరి కేంద్రాన్ని లొంగదీసుకున్న డి.ఎం.కె. ఈరోజు విఫలమవ్వటానికి కారణం బహిరంగ రహస్యమే.

అమ్మ అడుక్కోకుండానే, మద్దతు ఇస్తా తీసుకొమ్మని అడుక్కున్న ములాయం వలన, మా గంతకు తగ్గ బొంత డి.ఎం.కె. కాకపోతే, అన్నా డి.ఎం.కె. అని కాంగ్రెస్ ప్రచారం చేసిన ఊహాగానాల వలన, మొత్తానికి కరుణానిధి అమ్మకు దాసోహం అనేయక తప్పలేదు.

అవకాశం దొరికిందే తడవుగా వేల, లక్షల కోట్ల కుంభకోణాలకి పాల్పడే డి.ఎం.కె.లాంటి పార్టీలకు, సంకీర్ణ ప్రభుత్వంలోని ఈ భాగస్వామ్య పక్షాల అవినీతిని చూడనట్టు నటించి, ఈరోజు ఎన్నికల సర్దుబాట్లకుగాను, వారి అవినీతిని అడ్డంపెట్టుకొని పెద్దన్న పాత్ర పోషిస్తు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ కు ప్రజలు ఎప్పటికైనా బుద్ధి చెబుతారా? ప్రజల బుద్ధి కూడా గడ్డి తిని, ఈ పార్టీలనే మళ్ళీ గెలిపిస్తే, ఈసారి ఇదే అవినీతిని అడ్డం పెట్టుకొని తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెస్ పేచీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో!

దేశ క్షేమం, ప్రజా సంక్షేమం ప్రధానం కాకుండా, తమతమ అవినీతిని కాపాడుకునే అధికారమే పరమావధిగా కొనసాగుతున్న ఈ రాజకీయాలు మరెన్ని ప్రజాస్వామ్య అగాధాలను మనకు చూపించనున్నాయో!



11, మార్చి 2011, శుక్రవారం

మిలియన్ మిస్టేక్స్

మిలియన్ మిస్టేక్స్ (11-March-2011)

ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం, ఏకాభిప్రాయం కోసం కృషిచేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పటం, సంకీర్ణ ప్రభుత్వపు ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణా ఉన్నదని అబద్ధపు ప్రచారాలు చేయటం, ఆసుపత్రిలో నిరాహార దీక్షలు, చండీ హోమాలు, ఆంధ్రా బిర్యాని కబుర్లు... చెప్పుకుంటూ పోతే నిన్నటి తాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం వరకు పదిలక్షల రకాలుగా ప్రజలని మోసం చేసాడు. నిరుటి కేంద్రప్రభుత్వపు ప్రకటన తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్ళిన ఉద్యమాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకోటానికి కె.సి.ఆర్. ఆడుతున్న నీచపుటెత్తుల చదరంగం ఇది.

ఇంతవరకూ ఈ తెలంగాణా ఉద్యమంలో నిస్వార్ధంగా బలిదానానికి సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేడు. బలిదానం సంగతి తర్వాత, నిబద్ధతగా రాజీనామాలకు సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేకపోవటం తెలంగాణా దౌర్భాగ్యం. పట్టుమని పది గంటలు నిరాహార దీక్ష చేయలేని నాయకుడు, విద్యార్ధులు ఆత్మాహుతి చేసుకుంటే, వారి బలిదానాన్ని తన రాజకీయ స్వార్ధానికి ఉపయోగించాలనుకోవటం ఘోరం,

ప్రాంతీయ అసమానతలు ఉన్న మాట వాస్తవమే. అది సాకుగా తీసుకొని ప్రాంతాల మధ్య విబేధాలకు ఆజ్యం పోయటంలో అటు సమైక్య ఆంధ్ర నాయకుల, ఇటు తెలంగాణా నాయకులు సరిసమానమైన పాత్రలు పోషించారనేది కూడా వాస్తవమే. నోరు అదుపులో పెట్టుకోలేని నాయకులు, ఉద్యమాన్ని అదుపులో ఉంచగలరనుకోవటం మన మూర్ఖత్వం. ఈ అరాచక రాజకీయంలో ప్రజలు పాచికలై తమ సంస్కృతిని తామే ధ్వంసం చేసుకోవటం హేయం.

దురదృష్టం ఏమిటంటే, ప్రత్యేక తెలంగాణా ఓ రాజకీయ ప్రక్రియ. ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమే ఈ ఉద్యమం. కానీ, తెలంగాణా ప్రజా నాయకుల (?) అనైక్యతే ఈ ప్రక్రియకు నిజమైన అడ్డంకి. ఈ నాయకులను ఏరివేసి, తమ ఆకాంక్షలకు అనుగుణం నడుచుకునే నాయకుడిని ప్రజలు ఎన్నుకోగలిగినప్పుడే తెలంగాణా కల సాకారమౌతుంది. లేదంటే, ఈ నాయకుల తప్పిదాల వల్ల తెలంగాణా కోలుకోని విధంగా విధ్వంసమౌతుంది.

పెచ్చుమీరిన మూర్ఖపు ఆవేశానికి, చారిత్రక విధ్వంసానికి ప్రతిరూపంగా టాంక్ బండ్ పై కూల్చబడిన ఈ విగ్రహాలను పునరుద్ధరించకుండా మూగసాక్షిలా మిగల్చాలి. ఎప్పటికైనా, తమ కాళ్ళను తామే నరుక్కునే ఉద్యమకారులకు కనువిప్పు కలుగుతుందేమో!


7, మార్చి 2011, సోమవారం

ఒకేఒక్కడు - ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర - ఓ పరిచయం

 ఒకేఒక్కడు - ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర - ఓ పరిచయం (7-March-2011)


ఈమధ్య "చిరంజీవి ఓ చిరుజీవి" అన్న వ్యాసం వ్రాసే సమయంలో ఎన్.టి.ఆర్. బొమ్మ కోసం వెతుకుతుంటే, అన్న ఎన్.టి.ఆర్. కాం అనే వెబ్ సైటులో ఐ.వెంకట్రావ్ అనే జర్నలిస్టు వ్రాసిన ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర కనిపించింది.. మొట్టమొదటిసారిగా, ఎన్.టి.ఆర్. కు సంబంధించిన జీవిత విశేషాలు ఆ పుస్తకం ద్వారా చదివాను.

స్థూలంగా ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా చదవాలి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు ఏ ఏ ఆశయాలతో సినీజీవితంలోకి అడుగు పెట్టాడో, తన నవరస నటనా వైదుష్యంతో ఆంధ్రుల గుండెల్లో నిల్చిపోయాడో అనేది ఒక భాగమైతే; ఏ ఏ ఆదర్శాలతో జనహితాన్ని కోరుతూ ఓ ప్రభంజనంలా రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి, అనిలానలమై రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎలా దహించివేశాడో, ఆప్తుల హితవులు పక్కన పెట్టి ఓ అసమగ్రమైన పుస్తకంలా ఎలా మిగిలిపోయాడో అనేది రెండవభాగం.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఎన్.టి.ఆర్. పై సహజంగానే చాలా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎటువంటి నేపధ్యము లేకుండానే, మొదట సినిమాలలోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి దూకిన ఎన్.టి.ఆర్. సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని సరిపోలిస్తే, రాజకీయ జీవితంలోనే చాలా ఆటుపోట్లని చవిచూసాడు. ఆయనకు, సినీ జీవితం పూలపానుపు కాకపోయినా, పుట్టుకతో ఆయన ఒక కళాకారుడు కనుక తొందరగానే నిచ్చెనలన్నీ ఎక్కగలిగాడు. ఇటు, ఒక నటరత్నగా, ఒక నటసార్వభౌముడుగా ప్రజల మనసుల్లో పదిలంగా ఉన్న ఆయన ఇమేజ్ రాజకీయాల్లో మొదటి మెట్టు ఎక్కటానికి ఉపయోగపడిందే కానీ, ఆ తర్వాత ఆటుపోట్ల నుంచి తప్పించటానికి ఏవిధంగాను ఉపయోగపడలేదు.

సినీ జీవితంలో ఒక మొండివాడుగా (ఒకే చెయ్యి నాలుగు సార్లు విరిగినా పట్టించుకోని) కనిపించే ఆయన వ్యక్తిత్వం, రాజకీయాల్లోను, జీవిత చరమాంకం వచ్చేటప్పటికి జగమొండిగా మారిన ఓ వృద్ధుడిగా పరిణమిస్తుంది ఈ పుస్తకంలో. నిజానికి, అక్కడక్కడా ఇప్పటి తెలుగుదేశం కరపత్రంలా (ప్రో చంద్రబాబు) ఈ పుస్తకం కనిపించినా, ఎన్.టి.ఆర్. పరంగా ప్రజలకు తెలియని కొన్ని కోణాలను ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఎన్.టి.ఆర్ తన పరిపాలన ఆరంభంలో తీసుకొన్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వెనుక ఉన్న అసలైన కారణాలు కూడా పాఠకులకు ఎన్.టి.ఆర్.పై ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ముఖ్యంగా పరిశీలించదగ్గ, సరిపోల్చ దగ్గ విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - ఏ పరిస్థితుల నేపధ్యంలో నాదెండ్ల భాస్కర రావు ఎన్.టి.ఆర్. ను "వెన్నుపోటు" పొడిచాడు? రెండు - ఎన్.టి.ఆర్. ను పదవీచ్యుతుడిని చేయటానికి చంద్రబాబుకు ఉన్న కారణాలేమిటి? విచిత్రం ఏమిటంటే, ఈ రెంటికీ కారణం ఒక్కటే. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్.టి.ఆర్. కుటుంబం పోషించిన పాత్ర.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కాలేక, తెలుగుదేశంలోనైనా ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో పార్టీలో చేరిన నాదెండ్ల, ఎన్.టి.ఆర్. తన ఇద్దరు అల్లుళ్ళకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గగనమౌతుందేమో అన్న భయంతో "వెన్నుపోటు" పొడిస్తే;

లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్. కొత్త భార్యగా మాత్రమే ఉండకుండా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి, తనను ఏకాకిని చేస్తున్నదని, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎన్.టి.ఆర్. ను పదవి నుంచి తప్పించటం మినహా వేరే మార్గం లేదని చంద్రబాబు భావించాడు.

వీరిద్దరిలో ఎవరు తక్కువ తప్పు చేసారు, ఎవరు పెద్ద తప్పు చేసారనేది ఇప్పుడు మనం తీరిగ్గా విశ్లేషించుకోగలమే కానీ, కేవలం తన జనాకర్షణతో పార్టీని పెట్టి అందలం ఎక్కించిన ఎన్.టి.ఆర్. దృష్టిలో ఎవరు పెద్ద నేరస్తులో ఈ పుస్తకం చదివి మనం నిర్ణయించుకోవచ్చు.

ఏదేమైనా, ఓ ప్రభంజనంలా సాగిన ఓ మహానటుని, ఓ మహానాయకుని జీవితం అసంపూర్తిగా, అసంతృప్తిగా ముగిసిందనేది వాస్తవం.



5, మార్చి 2011, శనివారం

ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే...

 ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే... (5-March-2011)


ఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా తక్కువ. అసలు లేరనే చెప్పుకోవచ్చు. తమ మంత్రిత్వశాఖల్లో బయల్పడిన అవినీతికి అధికారులను బాధ్యులుగా చేసి, తమ పదవులు కాపాడుకున్నవారే ఎక్కువ. కేసులు పెట్టినా, వాటిని నానబెట్టేలా అధికారాన్ని ఉపయోగిస్తూ మంత్రులుగా కొనసాగిన వారసత్వం ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నది.

ఛీఫ్ విజిలెన్స్ కమిషనరుగా పి.జె.థామస్ నియామకాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి తనదే బాధ్యతగా మన ప్రధాని ప్రకటించారు! ఒక అవినీతి అధికారిని అందలం ఎక్కించినందుకు బాధ్యత వహించిన మన ప్రధానిని అభినందించాలా? లేక, ఆచరణలో నైతిక బాధ్యత వహించనందుకు అభిశంసించాలా? ప్రభుత్వంలోని ఒక అధికారి అవినీతికి పాల్పడి, ఆనక దానికి బాధ్యత వహిస్తే క్షమించి వదిలేస్తుందా ప్రభుత్వం? మరి, మన ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదా?

ఇక 2 జి స్పెక్ట్రం కుంభకోణం విషయానికి వస్తే, సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో కొన్ని విషయాలలో రాజీ పడక తప్పని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయంగా ఆయన ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు! ఈ ప్రధానికి దేశ శ్రేయస్సు ముఖ్యమా? తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ముఖ్యమా? ఇప్పటి వరకూ, మిస్టర్ క్లీన్ గా భావిస్తున్న పెద్దమనిషి దేశ శ్రేయస్సును పణంగా పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మన దౌర్భాగ్యం.

అసలు ఈ ప్రధాని మిస్టర్ క్లీన్ గా ఎలా పరిగణించబడుతున్నారో కూడా అర్ధం కాని విషయం. నిన్న మొన్నటిదాకా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా భావించిన "హర్షద్ మెహతా" ఉదంతం ఈ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందే. ఆ తర్వాత, సత్యం, మొన్నటి కామన్ వెల్త్ క్రీడలల్లో జరిగిన వేల కోట్ల అవినీతి, నిన్నటి లక్షల కోట్లలో జరిగిన స్పెక్ట్రం కుంభకోణం.. ఇవన్నీ ఈ పెద్దమనిషి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగినవే... జరుగుతున్నవే.

వేటికీ స్పందించని ఈ ప్రధాని, ఈరోజు సింపుల్ గా బాధ్యత వహిస్తున్నానని ప్రకటించటంలో ఔచిత్యం ఏమిటి? బాధ్యత వహించే పెద్దమనిషి ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? జరిగిన అవినీతి మీద విచారణ జరిపించి, వేరెవరినో బాధ్యులు చేసి, చేతులు దులుపుకోవటమేనా సత్ప్రవర్తన? ఒక ప్రధానిగా సరైన సమయంలో స్పందించని వ్యక్తి కేవలం బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పుకోవటంతో సరిపోతుందా?

వెన్నెముక లేని ఇటువంటి ప్రధానుల వల్ల దేశం మరింత దిగజారిపోయే ప్రమాదమే ఉంటుంది. నామమాత్రపు ప్రధానిగా ఉన్న ఈ ధృతరాష్ట్రుడు, ఆయన పనిచేస్తున్న పార్టీకి ఉపయోగమేమో కానీ, దేశానికి శ్రేయస్కరం కాదు.