30, డిసెంబర్ 2011, శుక్రవారం

పార్లమెంటు పంజరంలో ప్రజాస్వామ్యం బందీ

పార్లమెంటు పంజరంలో ప్రజాస్వామ్యం బందీ (30-December-2011)


• అన్నాకు పార్లమెంటుపై ఏమాత్రమూ గౌరవం లేదు.

• పార్లమెంటు కన్నా తానే అధికుడినని అనుకుంటున్నాడు.

• బయటి వ్యక్తుల ఒత్తిళ్ళతో చట్టసభలు పనిచేయటమా!

• చట్టసభల సభ్యుల ఆత్మగౌరవాన్ని అన్నా అవమానిస్తున్నాడు.

• అన్నాది అసలు ప్రజా ఉద్యమమా రాజకీయ ఉద్యమమా?

• ప్రజాస్వామ్యపు విలువలపై ఏ మాత్రమూ విశ్వాసంలేని నియంత అన్నా.

• దమ్ముంటే ఎన్నికల్లో గెల్చి పార్లమెంటుకు రండి.

***

ప్రజాస్వామ్యానికి, అధికారానికి, రాజకీయ పార్టీలకు పర్యాయపదమైన అవినీతి పీచమణచటానికి పటిష్టమైన ఓ వ్యవస్థ కావాలని ఉద్యమించిన అన్నాపై మన రాజకీయ పార్టీలు అన్నిరకాల దాడులు చేసాయి. అన్నాయే ఓ అవినీతిపరుడని కొందరు, అన్నా టీం సభ్యులందరూ అన్నాను వాడుకుంటున్నారని మరి కొందరు, అన్నా వెనుక ఆరెస్సెస్ లాంటి సంస్థల అండదండలున్నాయని మరి కొందరు ప్రజల దృష్టి మరల్చటానికి చేయని ప్రయత్నం లేదు.

అన్నా ఉద్యమంలో ప్రజా ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రమేయమే ఉన్నదని ఆరోపిస్తున్నారు. అన్నాకు ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలే దానికి కారణమట! ఈ ఉద్యమం వెనుక ఆరెస్సెస్ ఉంటే వచ్చిన సమస్య ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవకులు ఈ దేశ పౌరులు కాదా? వారికి ఉద్యమాలలో పాలు పంచుకునే హక్కు లేదా? ఆ హక్కు టోకెన్ సమ్మెలు చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే పరిమితమా?

సరే, మాటవరసకు రాజకీయ కారణాలతోనే అన్నా ఉద్యమం చేసారనుకుందాం. మరి, ఏ కారణాలతో లోక్ పాల్ పరిధిలోకి సి.బి.ఐ.ను తీసుకురాలేమంటున్నది మన ప్రభుత్వం? ఆ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు లేవని, ప్రజా ప్రయోజనాలే ఉన్నాయని నిరూపించగలరా?

ప్రజలు ఎన్నుకోనిదే ప్రతినిధులు ఉండరు. ప్రతినిధులు లేనిదే చట్టసభలు ఉండవు. అటువంటప్పుడు, చట్టసభలలో చేసే చట్టాలలో ప్రజా ప్రమేయం ఉండరాదని మన ప్రతినిధులు ఎలా తీర్మానిస్తున్నారో ఎవరైనా వివరించగలరా? ఇకపైగా, నిరసనలు, ఉద్యమాల ద్వారా చట్టసభలపై ఒత్తిడి పెంచి పార్లమెంటు ప్రతిష్ట మసకబారుస్తున్నారని చేసే ఆరోపణల విలువెంత?

అసలు పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తున్నది ఎవరు? ప్రజలా, ప్రజా ప్రతినిధులా? ప్రజాస్వామ్యానికి గుండె కాయ లాంటి పార్లమెంటు మీద 13-డిసెంబర్-2001 నాడు తీవ్రవాదుల దాడి జరిగింది. దశాబ్ద కాలమైనా కూడా నిందితుడికి శిక్ష అమలు జరపలేదు. దానివల్ల పార్లమెంటు ప్రతిష్ట ఎంత ఇనుమడించింది.

తీవ్రవాదాన్ని కట్టుదిట్టం చేసేందుకు ఒక ప్రభుత్వం అదే పార్లమెంటులో "పోటా" అనే చట్టాన్ని చేస్తే, ఆ తర్వాత వచ్చిన మరో ప్రభుత్వం అదే పార్లమెంటులో ఆ చట్టాన్ని పీకి పారేసింది. అంటే, ఆ చట్టం చేసిన ప్రభుత్వానిదైనా తప్పుడు నిర్ణయం అయ్యుండాలి, లేదంటే ఆ చట్టాన్ని తీసేసిన ప్రభుత్వానిదైనా తప్పుడు నిర్ణయం అయ్యుండాలి. ఇటువంటి ఉదంతాలు పార్లమెంటు ప్రతిష్టకు తిలోదకాలు ఇవ్వటంలేదనే భావించాలా? తప్పుడు నిర్ణయాలు తీసుకునే చట్టసభలు ఎవరికి జవాబుదారీ?

అన్నాను పక్కన పెట్టటానికి, అన్నా ఉద్యమంతో ప్రభావితులైన ప్రజలను మభ్య పెట్టటానికి లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టటం తప్ప గత్యంతరంలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది. మన చేతులకు మనం సంకెళ్ళు వేసుకోవటమా అంటూ లాలు యాదవ్, తదితరులు తమ తమ ప్రేలాపనలతో నిస్సిగ్గుగా లోక్ పాల్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పగలిగితే, ఆ మాత్రం ధైర్యం చేయలేని పాలక, ఇతర ప్రతిపక్షాలు పార్లమెంటులో లోక్ పాల్ బిల్లుకు శల్య సారధ్యం వహించటానికి నిశ్చయించాయని ఇప్పుడు స్పష్టమౌతున్నది.

పౌర సమాజం చేసిన ప్రతిపాదనలను కనీసమాత్రంగా కూడా చర్చించకుండానే తుంగలో తొక్కేసినప్పుడే లోక్ పాల్ పై ప్రభుత్వపు నిజాయితీ తెలిసొచ్చింది. ఆపైన, ప్రతిపక్షాలు వ్యతిరేకత చూపించే అంశాలు (రాష్ట్రాలలో లోకాయుక్త, లోక్ పాల్ నియామకంలో రిజర్వేషనులు) చొప్పించి లోక్ పాల్ బిల్లుకు మరోసారి పురిటిలోనే సంధి కొట్టించింది ఈ ప్రభుత్వం. నిజానికి, లోక్ సభలో బిల్లు పాసైనందుకు బెంగపడి ఉంటాడు ప్రధాని. అదృష్టం కొద్దీ కాగల కార్యాన్ని పెద్దల సభ తీర్చేసి ఆ బెంగను కూడా తీర్చేసింది.

ఏదేమైనా కర్రా విరగలేదు, పాము చావలేదు. పార్లమెంటు పంజరంలో ప్రజాస్వామ్యం బందీగానే మిగిలిపోయింది.


15, ఆగస్టు 2011, సోమవారం

మన స్వాతంత్ర్యం మేడిపండు

 మన స్వాతంత్ర్యం మేడిపండు (15-August-2011)


మన స్వాతంత్ర్యానికి 64 ఏళ్ళు నిండాయి. ప్రపంచంలోనే ఘనతరమైన ప్రజాస్వామ్యం మనదని దరువులు వేసుకుంటూ అవినీతి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రైతు సంక్షేమం గురించి, ధరల నియంత్రణ గురించి అరవై నాలుగేళ్ళుగా మనం వింటున్న ప్రసంగాలనే మరోసారి వినిపించారు మన ప్రధాని. ఈ దేశంలో నిజంగానే స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామా మనం?

దేశ ప్రధాని, బుల్లెట్ ప్రూఫ్ గది నుండి బిక్కుబిక్కుమంటూ జెండా ఎగురవేసి, ప్రసంగాలు చేయటం మనకు లభించిన స్వాతంత్ర్యమా లేక దౌర్భాగ్యమా? ప్రధాని పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుడు ఏ స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ఈ దేశంలో బతుకు వెళ్ళదీస్తున్నాడో తేలికగానే అర్ధమౌతుంది.

మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా నిలవాల్సిన వ్యవస్థలు (చట్ట సభలు, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఆఖరికి మీడియా కూడా) పీకల్లోతు అవినీతిలో మునిగిపోయి ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించటానికి అనుమతులు కూడా దొరకని స్వాతంత్ర్యం మనది!

ఉద్యోగావకాశాల గురించి తర్వాత, కనీస విద్యావకాశాలు కూడా అందరికీ లభించని స్వాతంత్ర్యం మనది. ప్రజలకు కూడు గూడు గుడ్డ వంటి కనీస అవసరాలను కూడా తీర్చలేని స్వాతంత్ర్యం మనది. రైతే దేశానికి వెన్నెముక అన్న ప్రసంగాల మోతలో, కనీస ధరల కోసం రైతులు చేసే ఆక్రోశాలు వినిపించని స్వాతంత్ర్యం మనది. కనీస ధరలు కల్పించకపోయినా ఫర్వాలేదు, పారిశ్రామికీకరణ పేరుతో రైతుల భూములు దోచే స్వాతంత్ర్యం మనది.

పొద్దున్నే నిద్ర లేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకూ ఈ దేశంలో సగటు మనిషి పద్మవ్యూహంలో జీవితాన్ని వెళ్ళబోస్తున్నాడు. ఎక్కడి స్వాతంత్ర్యం? అసలు ఈ దేశంలో ఎక్కడ, ఎవరికి స్వాతంత్ర్యం ఉందంటారు?

ఈ దేశంలో డబ్బు, అధికారం మాత్రమే మనకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వగల ముడిపదార్ధాలు. మన రాజకీయ నాయకుల్లాగా నీతి, నిజాయితీ, నిబద్ధతలు వదిలేసి నిస్సిగ్గుగా స్వేచ్ఛా వాయువులు పీల్చేద్దాం. మరో మహాత్ముడు పుట్టి మరో స్వాతంత్ర్య పోరాటం చేసేదాకా, చైతన్యరహితంగా జీవితాలు వెళ్ళబుచ్చుదాం. సంవత్సరానికోసారి, మువ్వన్నెల జెండాల రెపరెపల మాటున మన మూర్ఖత్వానికి ముసుగులు వేస్తూనే ఉందాం.



25, జులై 2011, సోమవారం

చిటపటలు 10 - 15

 చిటపటలు-11 "సాం బేర్ బేరియన్స్" (13-June-2011)

ఆస్తికుడైనా, నాస్తికుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడని కరుణానిధి నిరూపించాడు. మునుపు "రామసేతు" వివాదం చెలరేగినప్పుడు "రాముడు ఎవరు? ఆయనేమన్నా ఇంజనీరా? అసలు రాముడనే వ్యక్తి ఉన్నాడనటానికి ఆధారాలు ఉన్నాయా"? అని ప్రశ్నించిన కరుణానిధి ఇప్పుడు మాత్రం "రాముడంతటివాడికే పదవీ వియోగం తప్పలేదు, ఇక నేనెంత" అని నిట్టూరుస్తున్నాడట.

జనాల మధ్య జోకర్లు ఉండటం సహజమే. కానీ, కళా రాజకీయ రంగాల్లో ఉన్నది మాత్రం జోకర్లే అని కూడా పెదవి విరిచాట్ట! ఎన్నేళ్ళ తర్వాత అద్దంలో తన మొహం చూసుకున్నాడో ఈ కళాకారుడు ఉరఫ్ రాజకీయ నాయకుడు అని అన్నాడిఎంకె వాళ్ళు గుసగుసలాడుతున్నారట!

* * *

తమిళనాడులో ఈయన ఇలా బేర్ బేర్ మని ఏడుస్తుంటే, ఢిల్లీ తిహార్ జైల్లో మాత్రం ఖైదీలంతా కరుణానిధి పేరుతో పండగపండగ చేసుకుంటున్నారట. పంజాబీ తిండి తింటూ నోళ్ళు చవి చచ్చిపోతున్న సమయంలో ఆపద్బాంధవుడులా స్పెక్ట్రం రాజా జైల్లోకొచ్చాడు. ఈయన పుణ్యమా అని, ఇతర నేరస్థులు, అధికారులు కూడా రోజుకో వెరైటీతో ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, ఊతప్పాలు లాగిస్తూ లొట్టలేస్తున్నారట. ఇక కనిమొళి వచ్చిందే తడవుగా వంటవాళ్ళకి దక్షిణాది వంటలు కూడా నేర్పేసారట. వీళ్ళిద్దరినీ జైల్లోనే కాకుల్లా కలకాలం జీవించమని తీహార్ ఖైదీలే కాదు, అధికారులు కూడా ఆశీర్వదిస్తున్నారుట!

 

చిటపటలు-12 "ఆరెస్సెస్ ఎద్దు" (16-June-2011)


మొన్న ఎవరో కాంగ్రెస్ నాయకుడు జనార్ధ ద్వివేదీ మీదకు చెప్పు తీసుకొని కొడతానని వెంటపడితే, అడ్డమైన ప్రతివాడికి కాంగ్రెసంటే చాలా లోకువయ్యిందని డిగ్గీరాజా ఆవేశపడ్డారు. మంత్రదండం మహిమతో అలా చేయించింది ఆరెస్సెస్సే అని కూడా కనిపెట్టేసారు. నిన్నటిదాకా, జనాలే చెప్పులు తీసుకొని కాంగ్రెసీయుల వెంటపడితే, ఇప్పుడు మేము సైతం అంటూ ఎద్దులు కూడా వెంటపడి వెనక్కాళ్లతో కొడుతున్నాయట. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓ పశువు చేతిలో.. సారీ సారీ పశువు కాళ్ళకు బలిపశువయ్యారు. ఇక, ఈ ఎద్దు వెనకాల (సారీ వెనకాల తన్నులు తింది మనోహర్ గారు కదా....) ముందు ఉన్నది ఆరెస్సెస్సే అని డిగ్గీరాజా కనిపెట్టటమే ఆలస్యం.

భా.జ.పా. వాళ్ళు ఆ ఎద్దును సత్కరించనున్నారని సమాచారం!



* * *

తెలంగాణాపై కాంగ్రెస్ పోషిస్తున్నది నాన్న పాత్ర అని కొత్త పి.సి.సి. ఛీఫ్ బొత్స సత్యనారాయణ గారు ప్రకటించారు. ఇంతవరకూ పోషించిన అమ్మ పాత్రల నుంచి నాన్న పాత్రలకు కాంగ్రెస్ జంపింగ్ చేయటంలో మతలబు మనకు అర్ధమైతే డిగ్గీరాజాలు మంత్ర దండాలు దేనికి? ఒక్క తెలంగాణా ఏమిటి, దేశం మొత్తానికి ఇక కాంగ్రెస్ నాన్న పాత్రే పోషించబోతుందని ఇవ్వాళో రేపో డిగ్గీరాజా కూడా మంత్రదండం సహాయంతో తేల్చేస్తే గానీ డాడీ కోసం దేశం దిక్కులు చూడటం ఆపదేమో!

ఇంత చేసీ, దేశానికి కాబోయే నాన్న మాత్రం చొక్కా మడుస్తూ, సిగ్గుపడుతున్నారట... "చా! నాకింకా పెళ్ళే కాలేదు నాన్న అవ్వటమేమిటంటూ..

 

చిటపటలు-13 "కమ్యూనిస్టు శంఖాలు" (21-June-2011)


అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, నల్లధనం వాపసు తీసుకురావాలని రాందేవ్ బాబాలు కాంగ్రెస్ ముందు శంఖాలు ఊదుతున్న సంగతి తెలిసిందే. ఆ చప్పుళ్ళకి కాంగ్రెసీయులైతే బెదరలేదు కానీ, కమ్యూనిస్టులకు మాత్రం బల్బులు వెలిగినట్లున్నాయి. జులై 15 నుంచి 21 దాకా ఆ శంఖాలూదే పని ఊరూవాడల్లో తామే చేస్తామని ప్రకటించారు. అవినీతి, నల్లధనంతో పాటు పనిలో పనిగా ఎన్నికల సంస్కరణలు కూడా జరగాలనే డిమాండుతో ఏడు రోజుల ఉద్యమం చేస్తారట! వేసంకాలం ఓ వారం రోజులు సెలవు పెట్టి గుండు కొట్టించుకోటానికి మనం తిరుపతి వెళ్ళినట్లు, పాపం వీళ్ళ మొక్కులు వీళ్ళకి ఉంటాయి కాబోలు.

* * *

మల్కాజ్ గిరి ఎం.పి. సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి శంకర్రావ్ నీకు పిచ్చంటే నీకే పిచ్చని కిందామీద పడుతున్నారట. ఎవరు పెద్ద పిచ్చోళ్ళో డిగ్గీరాజా మంత్రదండమే చెప్పాలి. అన్నట్లు, రాహుల్ ప్రధానయ్యేదాకా మఠం వేసుకొని మూల కూర్చోమని డిగ్గీరాజాకు బుద్ధి చెబుతూ గడ్డి పెట్టిందట సోనియమ్మ మంత్రదండాన్ని మెడకు చుట్టేస్తూ..

* * *

కాంగ్రెసీయుల పంచెలూడదీసి మరీ కొడతామని మొన్న ఎన్నికల్లో బీరాలు పోయినా, కాంగ్రెస్ పంచె కట్టుకోవటం తనకిప్పుడు గర్వంగా ఉందని చంటబ్బాయ్ ప్రకటించాడు. పంచె కట్టగానే, సమాచార హక్కు, విద్యా హక్కు, ఉపాధి హామీ అన్నీ లభించేసాయని కూడా గర్వించాడు. సమాచార హక్కు వల్ల పంచె సౌకర్యంగా ఉంటుందనే విషయం తెలిసిందని, రెండేళ్ళల్లో నేర్చుకున్నది కూడా పంచెలోని సౌలభ్యం ఎలా ఉంటుందోనని, ఇక జులైలో తనకు కేంద్రంలో ఉపాధి కలగటమే తరువాయి అని సోనియమ్మ మీద అభిమానాన్ని ఆవేశంగా ప్రకటించాడు.

పనిలో పనిగా, జగన్ వెనకాల ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికవ్వాలని ఎడమ తొడ కొట్టి మరీ ఛాలెంజ్ చేసాడట చంటబ్బాయ్. కుడి తొడ ఆల్రెడీ వాచిపోయినట్లుందిగా కడప, పులివెందుల ఎన్నికల్లో అని టింకర్రావు గొణుక్కుంటున్నట్లుగా కూడా తెలిసింది. 

 

చిటపటలు-14 "మేధావులు, కొశ్శినీలు" (24-June-2011)


రాష్ట్ర కాంగ్రెస్ లో మేధోమధనం జరగాలని వి.హెచ్. ముఖ్యమంత్రికి, పి.సి.సి. అధ్యక్షుడికి లేఖలు వ్రాసారుట! కాంగ్రెస్ లో మేధావులంటే చేతికి మంత్రదండమైనా ఇస్తారు లేదంటే, కాళ్ళు చేతులు కట్టి కుర్చీలో కూర్చోబెడతారుగానీ వాళ్ళతో మేధోమధనం ఎక్కడైనా చేస్తారా? కాంగ్రెస్ లో, అందునా రాష్ట్ర కాంగ్రెస్ లో మేధావులా అని జనాలు జుట్టు పీక్కొని విస్తుపోయేలోపు హనుమన్న వాళ్ళెవరో చెప్పేస్తే బాగుండు. ఈలోపు కాకులైన లోకుల ఊహాగానాల్లో మాత్రం కాకా, కేకే, శంకర్రావ్, సర్వే లే మేధావులని అమ్మనా-అయ్యనా బూతుల సాక్షిగా ప్రకటించేస్తున్నారు.

బై ద వే, రాష్ట్ర కాంగ్రెస్ మేధావుల లిస్టులో ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తిపోసుకుంటూ లేటెస్టుగా లగడపాటి, పొన్నం ప్రభాకర్ చేరారని భోగట్టా.


* * * 

తెలంగాణా కోసం ఏమైనా చేస్తాం... ప్రాణాలైనా పణంగా పెడతాం... తెలంగాణా వచ్చుడో, కె.సి.ఆర్ చచ్చుడో లాంటి ఎన్నెన్నో బీరాలు గత 6-7 సంవత్సరాలుగా వింటూ వచ్చాం. అడిగినవాడికి, అడగనివాడికి, వినేవాడికి, విననివాడికి చెవులు చిల్లులు పడేట్లు తెలంగాణా వాదం వినిపించే కె.సి.ఆర్. గత రెండేళ్ళల్లో కేవలం 11 కొండు రోజులు మాత్రమే లోక్ సభ సమావేశాలకు హాజరయ్యారుట! ఆ పదకొండు రోజుల్లోనూ కనీసం ఒక్కసారైనా నోరు మెదపలేదట! గంతకు తగ్గ బొంతలా విజయశాంతి కూడా హాజరు విషయంలో ఏమీ తీసిపోలేదని సమాచారం. ఈవిడ కూడా పార్లమెంటులో మూతి బిగించుకునే కూర్చుందట! వీరికి తోడు మరో ఏడు మంది రాష్ట్ర ఎంపీలు ఈ రెండేళ్ళు పార్లమెంటులో ఆవులిస్తూనే గడిపేసారట! కూసే వాడొచ్చి మేసే వాడిని చెడగొట్టాడని, ఆ పార్టీకి ఒకే ఒక్క ఎంపీగా ఉన్నా 512 కొశ్శెనులు వేసాడని అసదుద్దీన్ ఒవైసీ మీద గుంభనంగానే అగ్గి మీద గుగ్గిలాలౌతున్నాయట ఈ తొమ్మిది గ్రహాలు!

బ్రేవో అసదుద్దీన్! అడగందే అమ్మైనా పెట్టదు ఈ రోజుల్లో... అడిగినా పెట్టని అమ్మ కొలువైన పార్లమెంటులో, సిగ్గు పడకుండా కొశ్శెనీలు అడుగుతూనే ఉండాలి.

 

చిటపటలు-15 "చితకబాదుడు రాజకీయాలు" (25-July-2011)

ఈమధ్య (21 జులై 2011)టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావ్ గారు ఆంధ్రా భవన్ లో ఓ అధికారిని (కె. చంద్ర రావు) చితకబాదారట! కారణం ఈయన చెప్పిన మాట ఆ అధికారి వినలేదట.

మొన్నెప్పుడో (8 ఏప్రిల్ 2011) ఆంధ్ర ప్రభుత్వంలో మంత్రి శంకర రావు గారు తన అసిస్టెంటు నెవరినో (అతని పేరు వెంకటేష్ ట) మీడియా ప్రతినిధుల ఎదురుగానే లెంపకాయ కొట్టారట. కారణం, మంత్రిగారు మీటింగులో ఉన్నప్పుడు మొబైల్ మోగితే ఆ మొబైల్ తీయలేదట!

అంతకు మునుపు ఎప్పుడో (1 జులై 2009) కాంగ్రెస్ ఎం.పి. మంధా జగన్నాధం సార్ ఎవరో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బాంక్ మేనేజర్ (రవీందర్ రెడ్డి) దళితులకు మాత్రమే ఋణాలు ఇవ్వటంలేదని కాలర్ పట్టుకొని మరీ చెంప ఛెళ్ళుమనిపించాడట.

వీళ్ళు చెప్పిన పనులు చేయలేదని అధికారులను చితకబాదేస్తున్నారు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. మరి ప్రజల కోసం పనిచేయనందుకు ప్రజలేం చేయాలో పశువునడిగినా చెబ్తుంది. కావాలంటే ఈ ఫొటో చూడండి.

అప్పుడప్పుడు బూట్ సత్కారాలతో సరిపెట్టేస్తే పనులయ్యేట్లు లేవు. ఏం చేయాలో మీరు ఓ కామెంటేసి చెప్పండి.


14, జూన్ 2011, మంగళవారం

రమ్మని, పొగ పెట్టటం దేనికి?

రమ్మని, పొగ పెట్టటం దేనికి? (14-June-2011)

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నిరాహార దీక్ష చేసిన దరిమిలా, కేంద్ర ప్రభుత్వం పౌర సమాజ ప్రతినిధులకు లోక్ పాల్ బిల్లు రూపొందించటానికి ఏర్పడిన సంయుక్త ముసాయిదా కమీటిలో చోటు కల్పించి దాదాపు రెండు నెలలు కావొస్తున్నది. ఒక్కడుగా నిరాహార దీక్ష మొదలేసిన అన్నా హజారేకు ప్రజల నుంచి లభించిన స్పందనకు సహజంగానే ప్రభుత్వం అప్పుడు సానుకూలంగా స్పందించింది. మరి ఈ రెండు నెలలలో ఏ మిన్ను విరిగి మీద పడుతున్నదని ప్రభుత్వం భావిస్తూ పౌర సమాజ ప్రతినిధులను పొమ్మనకుండా పొగ పెడుతున్నదో! దానికిగాను ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వాదనలు కూడా అర్ధరహితంగానే ఉన్నాయి.

కేవలం అయిదారువేలమంది దన్నుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అన్నాహజారే బ్లాక్ మెయిల్ చేస్తున్నారట! ఈయన ఒత్తిళ్ళకు లొంగితే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలౌతుందట! అంతే కాదు, దేశప్రధానిని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువస్తే దేశప్రతిష్ట మంట కలసి పోతుందట!

సో కాల్డ్ ప్రజాప్రతినిధుల, ప్రజా ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా అన్నా హజారే చేసిన దీక్షకు దేశమంతటా లక్షలాదిగా ప్రజలు ఇచ్చిన మద్దతుతో అప్పుడు నోట మాటరాని పరిస్థితి కేంద్రానిది. కక్కలేని, మింగలేని పరిస్థితుల్లో తప్పనిసరై, పౌరసమాజ ప్రతినిధులకు ముసాయిదా కమిటీలో చోటు కల్పించారు. ఆ మాత్రానికే పొంగిపోయి పౌరసమాజ ప్రతినిధులు ప్రభుత్వం మాటలకు గంగిరెద్దుల్లా తలలూపుతారని భావించి ఉంటుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి, పార్టీలకు కాకుండా ప్రజలకే బాధ్యత వహిస్తున్న పౌరసమాజ ప్రతినిధులు ససేమిరా అనటంతో, ఒక్కో ప్రతినిధి మీద తమ పార్టీ ప్రతినిధులతో ఆరోపణల మాయాజాలం పరచి ఊపిరాడని పరిస్థితి కల్పించింది. అయినా దిగిరాని పౌరసమాజ ప్రతినిధులకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రచార పర్వాన్ని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో మొదలుపెట్టింది ప్రభుత్వం.

పౌరసమాజ ప్రతినిధులకు అయిదారువేల మంది కూడా మద్దతు లేదనుకుంటే, వారికి ముసాయిదా కమిటీలో చోటెందుకు కల్పించారు?

దేశప్రధానిని లోక్ పాల్ బిల్లు పరిధిలోకి తీసుకువస్తే దేశ ప్రతిష్ట ఎలా మంట గలుస్తుందో చెప్పగలదా ప్రభుత్వం? రేపు ఏ ఇటలీ వ్యక్తో, ఇరాక్ వ్యక్తో దేశ ప్రధాని అయితే పరిస్థితేమిటి? పౌరసమాజ ప్రతినిధులు చెబుతున్నట్లు రేపు మధు కోడా లాంటి వ్యక్తి ప్రధానైతే పరిస్థితి ఏమిటి? అందరూ మంచివాడనుకుంటున్న మన్మోహన్ సింగే, 2జి స్కాంకు సంబంధించి "సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో తప్పని పరిస్థితులుగా" అభివర్ణించినప్పుడు జవాబుదారితనం ఎక్కడ నుంచి వస్తుంది?

తాము ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రధాని, మంత్రిమండలి జవాబుదారితనం లేకుండా అవినీతికి పాల్పడుతుంటే, పోరాటం చేయకుండా రాబోయే ఎన్నికల దాకా వారిని భరించటం ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు తోడ్పడుతుందా?

ఉద్యమించిన ప్రతి వ్యక్తిని ఆరెస్సెస్ తోనో, ప్రతిపక్ష పార్టీతోనో ముడిపెట్టి మతవాదిగా చిత్రించటంలోని ఔచిత్యం ఏమిటి? ఇంకా దారుణం ఏమిటంటే, భారతమాత కటౌట్ పెట్టుకున్నందుకు గాను, అన్నా హజారేను ఆరెస్సెస్ వ్యక్తిగా ముద్రవేయటం!

ప్రభుత్వాలకు అవినీతి నిర్మూలన మీద చిత్తశుద్ధనేదే ఉంటే, ఆరు దశాబ్దాలుగా లోక్ పాల్ బిల్లు వెలుగుకు నోచుకోకపోవటం ఏమిటి? 


2జి స్కాం కు సంబంధించి దాదాపు రెండు సంవత్సరాలు సి.బి.ఐ. ఎలా విచారణ చేపట్టిందో అందరికీ తెలుసు. ఆ అవినీతి మీద లోకమంతా కోడై కూస్తున్నా, "సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో ఈమాత్రం రాజీ పడక తప్పదు" అని స్వయానా ప్రధానే అవినీతిని వెనకేసుకురావటం ఆ అవినీతిలో ప్రధాని ప్రమేయాన్ని ప్రశ్నించక మానదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతున్నందువల్లే రాజా, కణిమొళి అరెస్టు కాబడ్డారనేది కూడా దాచలేని వాస్తవం.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చటం తప్పించి, ఆదర్శ్ కుంభకోణంలో ప్రభుత్వం ఇంతవరకూ తీసుకున్న చర్యలేమీ లేవు.

కామన్ వెల్త్ కుంభకోణంలో సురేష్ కల్మాడి పాత్రపై, గతంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రులుగా పనిచేసిన సునీల్ దత్, మణిశంకర్ అయ్యర్, ఎమ్మెస్ గిల్, గత ఆరేడు సంవత్సరాలుగా ప్రధాని చెవిన ఇల్లు కట్టుకొని చెప్పినా వినకుండా, వేల కోట్ల రూపాయలు ఆయన ఆరగించిన తర్వాత తీరిగ్గా అరెస్టు చేయటం చిత్తశుద్ధా?

వేలకోట్ల కామన్ వెల్త్ కుంభకోణంలో ఒక్క కల్మాడిని బాధ్యుడిని చేస్తే సరిపోతుందా? లక్షల కోట్ల కుంభకోణంలో నలుగురైదుగురిని బాధ్యుల్ని చేస్తే సరిపోతుందా? ఆ సొమ్ము తిన్నది వాళ్ళేనా? మరెవరి ప్రమేయమూ లేదా?

లోక్ పాల్ బిల్లు పరిధి ప్రధానికి కూడా విస్తరింప చేస్తే పై ప్రశ్నలకి ప్రధాని బిక్క మొహం వేయాల్సివస్తుందనేది ఒక కారణమైతే, రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానిగా యువరాజుకు ఇబ్బందులు రాకూడదని కాంగ్రెస్ తీసుకుంటున్న ముందు జాగ్రత్తలే ఇవి.

ఏదేమైనా, నిర్మొహమాటంగా ప్రవర్తిస్తున్న పౌరసమాజ ప్రతినిధుల తీరు ప్రభుత్వానికి కంటగింపుగా ఉన్నదనేది వాస్తవం. అందుకే ఏదో కారణంతో వాళ్ళంతట వాళ్ళే ముసాయిదా కమిటీ నుంచి వైదొలగేలా పన్నాగాలు పన్నుతోంది. ఆ తర్వాత తమ ఇష్టానుసారంగా బిల్లు రూపొందించి అవినీతిని నియంత్రించటంలో తమ నిబద్ధతను ప్రజలకు చాటి చెప్పాలని భావిస్తున్నట్లుగా ఉంది. 


10, జూన్ 2011, శుక్రవారం

పోయినోళ్ళందరూ మంచోళ్ళా?

 పోయినోళ్ళందరూ మంచోళ్ళా? (10-June-2011)

"పోయినోళ్ళందరూ మంచోళ్ళు..." అన్నాడు ఓ సినీకవి. అందుకే, బతికున్న రోజుల్లో ఎవడు ఎన్ని వెధవ పనులు చేసినా, వాడు చచ్చిపోయాడని తెలిసినప్పుడు మాత్రం అయ్యో పాపం అనేస్తాం మనం. వాడి చావు, మన మనసుల్లో నిల్చిపోయిన వాడి పాపాలను తుడిచేస్తుంది.

వాల్ పోస్టర్లకు మెరుగులు దిద్దే స్థాయి నుంచి ఓ అరుదైన, అద్భుతమైన చిత్రకారుడుగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన మక్బూల్ ఫిదా హుస్సేన్, తొంభై ఆరేళ్ళ పండు వయసులో దేశం కాని దేశంలో తలదాల్చుకోవాల్సి రావటం, అక్కడే మరణించటం కేవలం స్వయంకృతం. మతాలకతీతంగా దేశప్రజల ప్రేమాభిమానాలని చూరగొన్న కళాకారులకు దేశంలో కొదవలేదు. ముఖ్యంగా హిందువుల గౌరవాభిమానాలను చూరగొన్న ముస్లీం కళాకారులు చాలామందే ఉన్నారు. ఉదా. భారతరత్న బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, ఉస్తాద్ అల్లారఖా. ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. వీరిని ఆదరించినట్లే, హుస్సేన్ ను కూడా ఈ దేశ ప్రజలు మతానికి అతీతంగా ఆదరించారు.

మహానుభావులైన ఆ కళాకారులకి, ఇతనికి ఉన్న తేడా ఏమిటంటే... కళ పేరుతో, వికృతమైన వేషాలు వాళ్ళు ఏనాడు వేయలేదు. ప్రజల మనోభావాలతో ఆడుకోలేదు. ఇక్కడ ఓ ఉదంతం మనం చెప్పుకోవాలి. ముదిమి మీద పడింది. మిమ్మల్ని ఢిల్లీలోనో, ముంబాయిలోనో పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, వారణాసి వదిలి వచ్చేయండని శ్రీ బిస్మిల్లా ఖాన్ ని ప్రాధేయపడితే, ఆయన ఇచ్చిన సమాధానం గగుర్పొడుస్తుంది. నేనిక్కడ షెహనాయ్ వాయించకపోతే, కాశీ విశ్వనాధుడికి మేలుకొలుపు ఎలా అవుతుందయ్యా... పోయేదాకా నేనిక్కడే ఉండాలి. విశ్వనాధునికి మేలుకొలుపు చేస్తూనే ఉండాలి అన్నాడట.

ఎన్ని వెర్రి వేషాలు వేసినా, మన ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ లతో ఎమ్మెఫ్ హుస్సేన్ ను సత్కరించింది. ఆ గౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు ఇతను. కళ పేరుతో, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో హద్దులు మీరిన స్వాతంత్ర్యంతో, అడ్డగోలు స్వేచ్ఛతో దేవతల చిత్రాలను నగ్నంగా చిత్రీకరించాడు. ప్రతిఘటించినవారిని రెచ్చగొట్టే విధంగా ఆయా చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి సమూహాల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లటానికి దోహదపడ్డాడు. మాటవరసకైనా పశ్చాత్తాపం ప్రకటించకుండా, తన మీది కేసులన్నీ ఎత్తివేయాలని ప్రాధేయపడి, భంగపడి, మాతృదేశాన్ని విడనాడాడు.

ఏదేమైనా, ఒక అద్భుతమైన చిత్రకారుడు, చిత్రకళను సి గ్రేడ్ సినిమా వాల్ పోస్టర్ల స్థాయికి దిగజార్చి మరీ పోయాడు. పోయినోడే కాబట్టి మంచోడు అనగలమా?


చిటపటలు 6 - 10

 చిటపటలు-06 "దానవీరశూర మన్మోహన్" (25-May-2011)

1971 ఎన్నికలప్పుడు "గరీబీ హటావో" అనే నినాదంతో ఇందిరాగాంధి అధికారంలోకి వచ్చింది. ఇందిర అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా "గరీబీ హటావో" అంటూ ప్రయత్నించాడు. ఆ వారసత్వంలోనే, ప్రస్తుత ప్రధాని మన్ మోహన్ సింగ్ కూడా ఉన్నారని మనకు తెలుసు. ముందుగా "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు" కదా, అందుకే గామోసు 2జి స్కాము, కామన్ వెల్త్ స్కాముల ద్వారా ముందుగా తన ప్రభుత్వంలోని నాయకుల, అధికారుల దరిద్రాన్ని వదిలించేసారు. ఇప్పుడా దరిద్రాన్ని ఉద్ధరించే ప్రణాళికను ఆఫ్రికా దేశాలకు కూడా విస్తరింపచేస్తున్నారు. అక్కడి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 22,500 కోట్ల ఋణాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.

దరిద్రమంటే గుర్తొచ్చింది... మన ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం, ప్రస్తుతం రోజుకు ఇరవై రూపాయలు (నెలకు 600, సంవత్సరానికి 7200 రూపాయలు) సంపాదించేవాడు దరిద్రుడు కాదు. కాకపోతే, రోజుకు ఇరవై రూపాయలు కూడా ఆదాయం లేని దరిద్రులు; సురేష్ టెండూల్కర్ కమిటీ లెక్కల ప్రకారం 37 % ఉంటే, అర్జున్ సేన్ గుప్తా అనే పెద్దమనిషి (National Commission for Enterprises in the Unorganised Sector) లెక్కల ప్రకారం 77% మంది. తక్కువ శాతం ఉంది కాబట్టి, సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్టు మన ప్రణాళికా సంఘం స్వీకరించిందట.

ఒక్క 2జి స్కాములోనే, లక్షా ఎనభై వేల కోట్ల అవినీతి జరిగిన తర్వాత ఈ దేశం దరిద్రుల దేశం ఎలా అవుతుందని పాలక ప్రతిపక్ష ప్రతినిధులు తర్కించుకుంటు సిగపట్లకు కూడా దిగుతున్నారట! అయినా, ఆఫ్రికా దేశాలకు ఆయన ప్రకటించిన ఋణం 22,500 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనే ఆశ్చర్య దేనికి? మనిషికి 1500 రూపాయల చొప్పున 120 కోట్ల మంది ప్రజలు అడుక్కునే రాజాకు 180000 కోట్ల ముష్టి వేయగలిగినప్పుడు ఇదో లెక్కా?

అన్నట్లు ఇందులో మరో ముష్టి కోణం. అడుక్కునేవాడికి అరవై కూరలు. మన దేశంలో అడుక్కునేవాడి ఆదాయం కూడా రోజుకు కనీసం అరవై పైమాటగానే ఉంటుందని ఓ అంచనా. వాడి ఆదాయం రోజుకు ఇరవై కన్నా మూడింతలు ఎక్కువే కాబట్టి, వాడు దరిద్రుడు కాదు. ఇకనేం, అడుక్కునేవాళ్ళ దగ్గర గీక్కోటానికి ఆదాయ పన్ను చట్టం కూడా ప్రభుత్వం సవరించేస్తుందేమో, ఎవరికి ఎరుక? అలా గీక్కునే డబ్బుతో ఆర్కిటికాలోనో, అంటార్కిటాలోనో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయొచ్చు. 

 

చిటపటలు-07 "ఎన్నెన్ని సిగ్గులు" (01-June-2011)

విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తూ, కోటి మంది ప్రజలతో, ఒక్క గోచీతో అర్ధనగ్నంగా నిరాహార దీక్ష చేయాలని బాబా రాందేవ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. సుసంపన్నమైన భారతదేశానికి ఈ నల్లధనం ఎంతవరకు అవసరం అని విచారిస్తూ... నల్లధనం కోసం వెంపర్లాడే ఇటువంటి దేశంలో పుట్టినందుకు రాహుల్ బాబు సిగ్గుపడుతుంటే, బాబాతో సిబాల్ సంప్రదింపులు జరపటం అమానుషం.

* * *

జన లోక్ పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానిని తీసుకురావాల్సిందేనని అన్నా హజారే పట్టుబట్టి కూర్చున్నారని తెలుసు కదా! రబ్బర్ ముద్ర ప్రధానిని గుంపులో గోవిందంలా తోసేస్తే నష్టమేముందని రాహుల్ బాబు చిదంబరం చెవిలో ఊదుతున్నాడట! రేపు తమరు ప్రధాని అయితే కధెలా నడుస్తుందని సిబాల్ చిందులేస్తే, సిగ్గు పడుతూ రాష్ట్రపతినౌతానన్నాడట రాహుల్ బాబు!

* * *

ఉగ్రవాదాన్ని ఏదో ఒక కోణం నుంచి కాకుండా అన్ని కోణాల నుంచి ఎడాపెడా ఎదుర్కోవాలని జర్మని ఛాన్సలర్ ఎదురుగా మన ప్రధాని కంకణం కట్టుకున్నాడని రాహుల్ సిగ్గు పడ్డాడట. సిగ్గెందుకు పడ్డారని ఆరాతీస్తే, ఇంతాకాలం తొడుక్కున గాజులు చాలలేదనా ఇప్పుడు కంకణాలు తొడుకున్నాడని ఎక్కెసెక్కాలాడాడట!

 

చిటపటలు-08 "మంత్రదండం" (07-June-2011)

ఏమైందో ఏమిటో మన ప్రధానికి.... మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు చేతులూ ఆడుతున్నాయా అని అనుమానం. కాళ్ళూ చేతులూ కట్టేసి మిమ్మల్నేదో కుర్చీలో కుదేసారని లోకులు పలు కాకులై కావు కావుమంటున్నాయి మరి. ఇంతకి మంత్రదండం పది జనపథ్ లో ఉన్నదనైతే మీరు అన్యాపదేశంగా చెప్పటం లేదు కదా! ఏదేమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు సన్మానం చేయాల్సిందే.

* * *

మంత్రదండమంటే గుర్తొచ్చింది. అదేదో డిగ్గీరాజా దిగ్విజయ్ సింగ్ దగ్గర ఉన్నట్లుంది. మొన్న అన్నా హజారే, నిన్న రాందేవ్ బాబా, చివరికి నిన్నంటే నిన్న ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదిని చెప్పుతో కొడతానని బెదిరించిన వ్యక్తి వెనుక ఆరెస్సెస్స్ ఉందని పరిశోధనలో తేల్చేసారు. ఆ దండమేదో ప్రధానికి ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా డిగ్గీరాజా.

అయినా, జనాలు చెప్పులు పుచ్చుకొని కాంగ్రెస్ నాయకుల వెంటే ఎందుకు పడుతున్నారో! చిదంబరం, సురేష్ కల్మాడి తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా జనార్ధన్ ద్వివేదీ. రాంలీలా మైదాన్ లో లాఠీలతోను, తుపాకులతోనూ ఏదో సుతారంగా డిల్లీ పోలీసులు అదిలించారనే నెపంతో చెప్పుతో కొడతానని ఓ అనామకుడు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిని బెదిరించటం ఎంత అమానుషం... ఎంత అనాగరికం. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసారంటే చేయరు మరి. వాళ్ళేమైనా సామాన్య సన్యాసులా, సామాన్య ప్రజలా, బెదిరించగానే చీరలు సల్వార్ కమీజులు ధరించి పారిపోవటానికి.

* * *

పిచ్చోడిని పిచ్చోడంటే కోపం వస్తుందా రాదా! దొంగనైనా సరే దొంగ అంటే చిరాకు వేస్తుందా వేయదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రులని మోసగాళ్ళు అనేయటమేనా అన్నా హజారే సాబ్? కపిల్ సిబ్బల్ మనోభావాలు ఎంతలా గాయపడ్డాయో ఇప్పటికైనా మీకు అర్ధమయ్యిందా? మాట్లాడటం రాకపోతే డిగ్గీరాజా దగ్గరో, మనీష్ తివారి దగ్గరో నేర్చుకోండి. నోరు పారేసుకుంటే కాంగ్రెసోళ్ళు ఇక మీదట ఊరుకోరట. ఏరిపారేస్తారట!

 

చిటపటలు-09 "డిగ్గీ మంత్రదండం రాజా" (08-June-2011)


మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం కాదని, నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన నేరస్థుడని, అతని దగ్గర తుపాకి కూడా ఉన్నదని దండ మహిమతో డిగ్గీరాజా నిన్న ప్రెస్ కాంఫరెన్సులో ఓ రీలు వేసేసారు. అంతకు ముందు అలానే, కాషాయంలో ఉన్న బాబా రాందేవ్ ఓ వ్యాపారస్తుడని, చట్ట వ్యతిరేకంగా కోట్ల డబ్బు కూడబెట్టాడని, హరిద్వార్ లో ఉన్న ఆశ్రమం కూడా ఆక్రమించి కట్టిందని ఓ రీలు చూపించారు.

ఇలా సీరియల్సులా కాకుండా ఒక్కసారే డిగ్గీరాజా ప్రభుత్వానికి సినిమా చూపిస్తే ఓ పనైపోతుందిగా! ఈయన మంత్రదండ మహిమలకు చెవులు వాచిపోయినవాళ్ళు మాత్రం డిగ్గీరాజాకో మంత్రి పదవి పడేస్తే మంత్రదండం మూసుకు కూర్చుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కాకుల్లా నోరుపారేసుకుంటున్నారుట.

* * *

ఈ నిర్వాకంలో కేంద్ర ప్రభుత్వానికే కాక, ఢిల్లీ పోలీసులకు కూడా మంత్రందండం అవసరం చాలా ఉన్నదని తెలుస్తుంది. రాంలీల మైదానంలో దాడి చేసిన రోజు, బాబాకు అనుమతి ఇచ్చింది రాజకీయ ఒత్తిడివల్ల అని, ఇప్పుడు కూడా రాజకీయ ఒత్తిడివల్లే భగ్నం చేసామని పోలీసులు చెప్పారు. ఆ మర్నాడు బాబా ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్నదనే కారణం చెప్పారు. ఇప్పుడేమో, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నందు వల్ల ఆపేసామని చెబుతున్నారు. ఈ "చిదంబర" రహస్యం కాకులకెలా తెలుస్తాయి, కపిల్ సిబ్బల్ కూడా చెప్పకపోతే!

* * *

కపిల్ సిబ్బలీయం మరో కొత్త ప్రశ్న సంధించింది. కాషాయం వేసుకొని కాసుల కోసం కక్కుర్తిపడే సన్యాసికి రాజకీయాలెందుకు అని. బాబా మీద దాడి వల్ల తాము హిందువులకు వ్యతిరేకమని పడబోయే ముద్ర నుంచి తప్పించుకోవచ్చని ఊహించి ఆమేరకు పూరీనో ద్వారకానో శంకరాచార్యను కలిసి, ఆయనతో కూడా అదే ప్రశ్న వేయించింది. ఆ ప్రశ్నే శంకరాచార్యులవారికి వర్తించదా అని కాకులు గోల పెట్టటం విశేషం. యోగా చేసుకునే సన్యాసికి రాజకీయాలు అనవసరమైనప్పుడు, రాజకీయ సన్నాసులకి సత్యసాయిబాబాలతోను, శంకరాచార్యులతోను పనేముంది అని అడుగుతాననుకున్నారా? నేను అడగనంటే అడగను. ఆ విషయమేదో మంత్రదండాన్నే అడిగేయండి.

 

చిటపటలు-10 "గాంధీ తాత, సోనియా మాత, రాహుల్ బాబా" (10-June-2011)

నిన్న ఎన్.డి.టీవి బర్ఖాదత్ మన మంత్రదండాల డిగ్గీరాజాను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో డిగ్గీరాజా మంత్రదండంతో తెలిసిన రహస్యాలను లాజికల్ గా కూడా పరిష్కరించేసారు! అన్నాహజారే, రాందేవ్ బాబాలను వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సేస్సే అని ఎలా తెల్సిందని అడిగితే ఆయన తార్కిగంగా చెప్పిన విషయం విన్న వాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచే ఉంటుంది.

అన్నాహజారే నిరాహార దీక్ష చేసిన వేదిక మీద "భారత మాత" చిత్రపటం ఉందిట. అలానే, రాందేవ్ బాబా దీక్షా సమయంలో చేసిన ప్రసంగాల్లో పదే పదే "భారత్ మాతాకి జై" అని నినాదాలు చెసాడట. ఒక్క ఆరెస్సెస్ వాళ్ళు తప్పించి మరెవరూ భారతమాత చిత్రపటాన్ని ప్రదర్శించటం కానీ, భారత్ మాతాకి జై అనే నినాదాలు కానీ చేయరని.. కాబట్టి అన్నా, బాబాల వెనుక ఆరెస్సెస్సే ఉన్నదని తీర్మానించారు. నిజమే, ఎక్కడో అంగారక గ్రహం మీద నుంచి ఊడిపడ్డ మతోన్మాద ఆరెస్సెస్ కు అవినితీ మీద అందోళనలు చేసే హక్కు మనం ఎందుకివ్వాలి.

అసలైన సందేశాన్ని మాత్రం కాకులు పలురకాలుగా విశ్లేషిస్తున్నాయని సమాచారం. ఆ విషయాలేమిటంటే, మన రాజకీయ నాయకులకు పంతాలు పట్టింపులపై ఉన్నంత ఆసక్తి ఫలితాలపై ఉండదు. ఇక నుంచి దేశంలో ఎవరు ఏ ఉద్యమం జరపాలన్నా అక్కడ ఓ గాంధీ తాత ఫొటో పెడితేనే ఆ ఆందోళనకు ఓ అంథెంటిసిటి వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే, సోనియా మాత ఫొటో, రాహుల్ బాబా ఫొటో పెడితే, ఉద్యమం ఫలించి తీరుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ఈ విషయాన్ని గ్రహించాలి.

 

* * *

 

డిగ్గీరాజా ఏమైనా అంటే అన్నాడని విలవిల్లాడిపోతా కానీ, ఆయన మాటల్లో నిజం ఎందుకని గుర్తించలేకపోతున్నాం? ఢిలీ పోలీసులు రాందేవ్ బాబాను తన్ని తరిమేస్తే, భా.జ.పా. అదో పండుగలా జరుపుకోవటం ఏమిటి? పెళ్ళి ఊరేగింపుల్లోలా డాన్సులు చేయటం ఏమిటి? అందులోను, బాపూజి సమాధి దగ్గర! గాంధీజీ ఆత్మ ఎంత క్షోభించి ఉంటుంది? సమయం, సందర్భం, స్థలం పట్టించుకోకపోతే ఎలా?

ఇదేమైనా ఎన్నికల సీజనా ఎక్కడపడితే అక్కడ గానాబజానాలు మొదలేయటానికి, తొడలు గొట్టి మీసాలు మెలేయటానికి? పోనీ, చేసే డాన్సైనా సక్రమంగా ఏడ్చిందా అంటే అదీ లేదు. పాటైనా షీలాకి జవానీనో, మున్ని బద్నామో అయినా కాదు. పోనీ ఇందిరాగాంధి లాగా నెత్తిన కడవలో కుండలో పెట్టుకొని చేసారా అంటే అదీ లేదు. కనీసం సోనియాలానో మిచెలీ ఒబామాలానో సక్రమంగా స్టెప్పులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. దేని కోసం ఇంత సంబరం చేసుకోవటం? మన్మోహన్ పిలక గుప్పిట్లోకొచ్చిందనేగా ఈ హడావుడీ అంటా. మరి, నీ పిలక నా చేతిలో ఉందని వెక్కిరిస్తే చిన్న పిల్లోడికైనా కోపం రాదా ఎంటి?


17, మే 2011, మంగళవారం

కమ్యూ"నిజం" కాలం చేసిందా?

 కమ్యూ"నిజం" కాలం చేసిందా? (17-May-2011)

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక వర్గం) కార్ల్ మార్క్స్ ప్రస్తావిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్టు వ్యవస్థకు ఆయన కోరుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయమనే మార్పు వర్గపోరాటాలు, విప్లవాల ద్వారానే సాధ్యం. ఏదేమైనా, వ్యక్తి స్వేచ్ఛకన్నా సామాజిక ప్రయోజనానికే కమ్యూనిజం ప్రాధాన్యతనిచ్చింది. ఆ ప్రాధాన్యతా క్రమంలో, దాదాపు అన్ని కమ్యూనిస్టు ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించటం జరుగుతున్నది. ప్రజాస్వామ్య పరిధుల్లో సామాజిక న్యాయం ఆచరణాత్మకం కాదని వీరి అభిప్రాయం.

పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల ఓటమిని ఈ నేపధ్యంలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే, అన్నాదురై ఆశయాలతో అంటకాగిన డి.ఎం.కె. ఓటమి కూడా ఈ నేపధ్యంలోనే చర్చించుకోవాలి. ముందుగా మనది ప్రజాస్వామ్య దేశం. సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధిద్దామనుకునే దేశం. మార్క్స్, లెనిన్ లు కమ్యూనిస్టులకు ఎలా పూజనీయులో, గాంధీ, జే.పీ.లు నూరేళ్ళ కాంగ్రెస్ నుండి, లాలూ ప్రసాద్ ఆర్జేడి వరకు అలానే పూజనీయులు. నిన్న మొన్నటి జగన్ పార్టీ నుంచి, భా.జ.పా. వరకూ అందరూ సామాజిక న్యాయమే తమ పార్టీ పరమార్ధంగా ప్రకటిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని, మన దేశంలోని పార్టీలన్నీ ప్రజాస్వామ్య సోషలిస్టులే! ఆశయాలు ఆచరణలో శూన్యమైనప్పుడు, సిద్ధాంతాలు కారల్ మార్క్స్ వైనా, గాంధీవైనా కాగితం పూలే.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దానికి 1957లో దేశంలోనే మొట్ట మొదటి ప్రజలు ఎన్నుకున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 1977 లో పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు బెంగాల్ లో కమ్యూనిస్టుల ప్రభ అప్రతిహతంగా సాగిపోయింది. 1977 లో "ఆపరేషన్ బర్గా" భూసంస్కరణలతో మొదలైన కమ్యూనిస్టుల ప్రాబల్యం, సింగూర్, నందిగ్రాం లలో చేసిన పాపాలతో ముగిసిపోవటం ఓ విశేషం.

1990 దశకం నుంచే కమ్యూనిస్టుల పతనానికి బీజాలు పడ్డాయి. గోడలకు తగిలించుకున్న సిద్ధాంతాల మోజులో ప్రజల గోడును ఆ ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసింది. అంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో భూకేటాయింపులను అసంబద్ధంగా అభివర్ణిస్తూ అడుగడుగునా ఎర్ర జెండాలు పాతిన ఎర్రన్నలు, బెంగాల్ లో మాత్రం టాటాల, బహుళజాతి సంస్థల జెండాలు మోయటం ఏ మార్క్సిజమో అర్ధంకాని ప్రజలు గూబలదిరేట్లుగా కమ్యూనిస్టు పాలకులకు బుద్ధి చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా దన్నుగా నిలచిన రైతులు, మధ్యతరగతి ప్రజలు; ప్రజల కోసం కన్నా, తమ పార్టీ కోసమే ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు నడుపుతున్నారన్న నిజాన్ని గ్రహించారు. పేరుగొప్ప సిద్ధాంతాలైనా, అవకాశవాద రాజకీయాలతో ప్రజా సంక్షేమాన్ని మరచిన కమ్యూనిస్టులకు మిగతా రాజకీయ పక్షాలకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. మూడున్నర దశాబ్దాల పరిపాలన తర్వాత కూడా ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎటువంటి మార్పు లేనందువల్లే, ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేసారు.

పార్టీ సంస్థలుగా మారిన ప్రభుత్వరంగ సంస్థలు, దయాదాక్షిణ్యం లేకుండా కొనసాగించిన భూఆక్రమణలు, ప్రతిఘటించిన రైతులపై కాల్పులు, బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు, జంగల్ మహల్ ఆదివాసీల సమస్యలు... చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్టుల వైఫల్యాలు ఒక్క బెంగాల్ లోనే కోకొల్లలు. లౌకిక, సామ్యవాద సిద్ధాంతాల పేరుతో అడ్డగోలు రాజకీయాలాడుతూ, పొలిట్ బ్యూరో సమావేశాల్లో తమ పతనానికి పోస్టుమార్టం చేసుకుంటే సరిపోదు. 41% శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి, ప్రజలు మమ్మల్ని ఇంకా ఆదరిస్తూనే ఉన్నారనే భ్రమల్లో ఉంటే కడుతున్న సమాధిని ప్రజలు త్వరలోనే పూర్తిచేస్తారు.

ఆశయాలను, ఆదర్శాలను సిద్ధాంతాల వరకే పరిమితం చేసి, ఆచరణలో అలసత్వం చూపిస్తే, ఏ పార్టీకైనా ఈ ముప్పు తప్పదు. కానీ, సిద్ధాంతాల పునాదుల మీద నిలబడ్డ పార్టీగా గతంలో ఆచరణాత్మకంగా వ్యవహరించిన నిష్ట కమ్యూనిస్టులకు ఇప్పుడు అవసరం.



16, మే 2011, సోమవారం

ఎన్నికలు - మరో ప్రహసనం

 ఎన్నికలు - మరో ప్రహసనం (16-May-2011)


దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం. 

 

గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు అన్నా హజారేకు మద్దతు తెలపడం, వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం అన్నా కోర్కెలకు అనుగుణంగా స్పందించటం జరిగిపోయాయి. ఎన్నికల ఫలితాలు గమనిస్తే, ఒక్క అస్సాం మినహాయించి, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయా రాష్ట్రాలలోని అధికార పార్టీలకు తిలోదకాలు ఇచ్చేసారు.

అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వేసిన ఓట్లుగా భావించాలా అంటే చెప్పటం కష్టం. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్ లో యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీ తృణమూల్ ను ప్రజలు ఆదరిస్తే, తమిళనాడులో డి.ఎం.కె.ను ప్రజలు తీసి అవతల పడేసారు. అస్సాంలో కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కడితే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంటు ఆటూ ఇటూ దేకి చిట్టచివరికి అధికారం కైవసం చేసుకున్నామనిపించింది బొటాబొటీ మెజారిటీతో.

కేంద్రంలో అవినీతిమయమైన యు.పి.ఎ. ప్రభుత్వాని కన్నా, రాష్ట్రంలోని అవకాశవాద, అసమర్ధ కమ్యూనిస్టు ప్రభుత్వమే అత్యంత ప్రమాదకారిగా భావించి పశ్చిమ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టుల భరతం పట్టారనుకుంటే,, కేంద్రంలో బందిపోట్ల మాదిరిగా దోచుకున్న కరుణానిధి పార్టీకన్నా, రాష్ట్రంలో జేబుదొంగలాంటి జయలలిత పార్టీనే మేలని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడినట్లు అనుకోవచ్చేమో.

ఏది ఏమైనా, ఎన్నికలు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టకుండా ఓ ప్రహసనంలా మాత్రం తయరయ్యాయని చెప్పవచ్చు. ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తామని ఒక పార్టీ ప్రకటిస్తే, అదే రూపాయికి అయిదు కిలోలు బియ్యం ఇస్తామని మరో పార్టీ ప్రకటించటం; ఒక పార్టీ కొందరికి కంప్యూటర్లు ఇస్తామంటే, మరో పార్టీ అందరికీ ఇస్తామని ప్రకటించటం ఎన్నికలను పరిహాసాస్పదం చేసేవే. పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలు, ఉచిత వరాలందించే కరపత్రాలుగా తయారయ్యాయి. 

ఇన్ని ఉచితంగా అందించే ప్రభుత్వాలు, పెరుగుతున్న ధరలను ఎందుకు నియంత్రించలేవో మనం అడగం! ఈ విషయంలో పార్టీలను విమర్శించటం కన్నా, ప్రజలుగా మన దివలాకోరుతనాన్ని మనం ముందుగా ప్రశ్నించుకోవాలి.

మన దురదృష్టం కొద్దీ, ప్రస్తుత పార్టీలన్నీ కాంగ్రెస్ తానులో గుడ్డలే. ప్రజల మేలు కోరే ప్రధానులు, ముఖ్యమంత్రుల కన్నా, వారి వారి పదవులను, ప్రభుత్వాలను కాపాడుకొనే "మేధావులే" ఎక్కువ. అవినీతి వల్ల, ఈసారి పదవులు కోల్పోయినా, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వపు అవినీతికి వ్యతిరేకంగా మళ్ళీ మనకు పట్టం కడతారనే ఈ పార్టీల ధీమా కూడా!

మన ఆలోచనా ధోరణులలో విప్లవాత్మకమైన మార్పులు రానంతవరకూ ఈ పార్టీలు మనని, మన ప్రజాస్వామ్యాన్ని పరిహాసాపాత్రంగా దిగజారుస్తూనే ఉంటాయి.



చిటపటలు 1 - 5

చిటపటలు-01 (2-May-2011) పాపం మన రాజకీయ నాయకులు! 

వీళ్ళ బ్రతుకులు అరిటాకులైతే, బంధువులు మాత్రం ముళ్ళే. పకడ్బంది ప్రణాళికలతో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి. 

ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మరో కోణం ఈ చేదు నిజాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా వివరించింది. ఈయనెప్పుడో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో, ఈయన అత్తగారు ఓ ట్రాఫిక్ పోలీసు కమిషనరు నుంచి అక్షరాలా అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్నదిట.. అదీ ఆదర్శ్ సొసైటీలో ఓ ఫ్లాటు కొనుగోలుకు. 

విచిత్రం కాకపోతే మరేమిటి, అత్త తీసుకున్న అప్పుకు అల్లుడిని బాధ్యుడినెలా చేస్తారని కదూ మీ ప్రశ్న. అప్పిచ్చిన ఆ పోలీసు అధికారికి ఆదర్శ్ సొసైటీలో ఫ్లాటు కేటాయింపబడేట్లుగా ఈ రెవెన్యూ మంత్రిగారు చొరవ చూపించారట! అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్న అత్తగారు బానే ఉన్నారు... అరవైఐదు లక్షలు అప్పు ఇచ్చిన పోలీసు అధికారి బానే ఉన్నాడు... మధ్యలో నా ఉద్యోగానికి ఎసరొచ్చిందని చిటపటలాడిపోతు తలపట్టుకు కూర్చున్నాడట అరిటాకు సారీ.. అశోక్ చవాన్.   

చిటపటలు 02 - "చంటబ్బాయ్ ఛాలెంజ్" (3-May-2011) 

కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట. జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ...ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తానన్న జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడట చిరంజీవి. 

నువ్వు ఆరు నెలల్లో కూలదోస్తే, నేను ఆరు నెలల్లో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని తొడలు కొట్టి మరీ ఎవరెవరికో పూలు పెడుతున్నాడని అభిజ్ఞవర్గాల భోగట్ట. ఆయనే ఉంటే మంగలెందుకని సామెత. ప్ర.రా.పా. కాంగ్రెస్ లో కలిసిందన్న ధీమాతోనే కదా జగన్ కు కాంగ్రెస్ కు చెక్ పెట్టింది. పదారు మంది ఎమ్మేల్యేలతో నిలబడలేకే కదా కాంగ్రెస్ బాకాలా మారింది, ఇక ఒకవేళ జగన్ కూలదోసాడనే అనుకుందాం, అస్తు పిస్తు 16 మంది ఎమ్మెల్యేలతో ఈయన నిలబడేదేముందిట, నిలబెట్టేదేముందిట!

రాజకీయాల్లో తనింకా "చంటబ్బాయే" అని చిరంజీవి మాటిమాటికి నిరూపిస్తూనే ఉన్నాడు.   

చిటపటలు-03 "పాపం పాకిస్తానూ అరిటాకే!" (7-May-2011) 

తీవ్రవాదులకి పాకిస్తాన్ స్వర్గధామం అని ప్రపంచమంతా ఆడిపోసుకుంటున్నది. అసలైన వింతలు ఎలాగుంటాయంటే; పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా నెంబర్ వన్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడట! అలానే, పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా అమెరికా సైనిక దాడి చేసి వాడిని మట్టుబెట్టింది. 

ఇక పాకిస్తాన్ తీవ్రవాదులకి స్వర్గధామం ఎలా అయ్యింది. జన్నత్ కు దారి పాకిస్తాన్ నుంచే కదా ఉంది! నిజానికి, తీవ్రవాదులకి "మేరా భారత్ మహాన్" నిజమైన భూతల స్వర్గం. ఇక్కడ చూడండి అబూ సలేం హాయిగా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడో. కసబ్ సంగతి, అఫ్జల్ గురు సంగతి ఇక చెప్పనవసరం లేదు. కోరినన్ని బిరియానీలు, బాలీవుడ్ సినిమాలూ! 

ఈ విషయం తెలీకే, లాడేన్ చావగానే, భయంతో మూటా ముల్లె సర్దుకొని దావూద్, ఛోటా షకీల్ కరాచీ నుంచి ఉడాయించారట! హాయిగా భారత్ కు వస్తే, జీవితాంతం కేసుల మీద కేసులు నడుస్తాయి. మన ప్రభుత్వం వాళ్ళ మీద ఈగ కూడా వాలనీయదు. ఏమిటో ఈ పిచ్చి వెధవలు! ఎప్పుడు తెలుసుకొంటారో ఏమో!   

చిటపటలు-04 "ఓదార్పు యాత్రలు" (12-May-2011) 

చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు"పడుతూ లేస్తూ" నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు! 

పాపం యు.పి., బీహార్, గుజరాత్, కర్నాటక లాంటి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అయ్యవారు భారతీయుడైనందుకు సిగ్గుపడుతున్నట్లున్నాడు. ఆంధ్ర, రాజస్థాన్, మహారాష్ట్రల్లో మాత్రం గర్విస్తున్నట్లున్నాడు. ఈ యువరాజు డిగ్గీరాజాను (దిగ్విజయ్ సింగ్)ను రాజగురువుగా నియమించుకున్నట్లున్నాడు. మొన్ననే ఈ రాజగురువు,"ఒసామాజీ"కు సరైన అపరకర్మలు చేయలేదని కన్నీరుమున్నీరయ్యారు కూడా. బహుశా పాకిస్తాన్ కో, సౌదీ కో కూడా యువరాజులుంగారిని ఓదార్పు యాత్రలకు తీసుకెళ్తాడేమో ఈ రాజగురువు, భారతీయుడిగా సిగ్గుపడేలా చేస్తూ! 

బాబూ... డిగ్గీరాజా టోపీలు బాగా పెడ్తాడుట... జర సంభాల్ కే చల్.... 

PS: ఓదార్పుయాత్రల కనిపెట్టుదారుడైన వై.ఎస్. జగన్ "ఓదార్పు" పై పేటెంట్ దాఖలు చేసే రోజు ఎంతో దూరం లేదని అనిపించడంలో ఎలాంటి అసంబద్ధతా లేదని అనిపిస్తోంది!   

చిటపటలు-05 "వంకల డొంకతిరుగుళ్ళు" (16-May-2011) 

ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన నాయకులు వంకల కోసం వెదుకుతూ చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు బలే విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని : 

తమిళనాడు ఫలితాలపై కామ్రేడే ఏచూరి సీతారాం : "అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు". ఆ కామ్రేడే, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై : "ప్రజలు మార్పు కోరుకున్నారు". పైగా "ఈ ఓటమి వామపక్ష సిద్ధాంతాల, కార్యక్రమాల ఓటమి కాదు" తమిళనాడైనా, పశ్చిమ బెంగాలైనా ప్రజలు మార్పు కోరారన్నది ఆయనగారేం చెప్పక్కరలేదు. ఫలితాలు చూస్తే అందరికీ అర్ధమౌతున్నది. అవినీతి ప్రభుత్వం మారాలని తమిళనాడులో ప్రజలు ఓటు వేసారనుకుంటే, పశ్చిమ బెంగాలులో ఏం మారాలని ప్రజలు ఓట్లు వేసారో ఆయనకు చెప్పే తీరిక ఇప్పుడు లేదట... పొలిట్ బ్యూరో సమావేశాల్లో పోస్టుమార్టం చేసుకుంటారట! 

సిద్ధాంతాలే కాలదోషం పట్టాయని లోకమంతా కోడై కూస్తున్నా కామ్రేడ్ల చెవుల చిలుము ఎప్పటికి వదిలేనో! 

* * *

పశ్చిమ బెంగాల్ ఫలితాలపై సి.పి.ఐ. నేత గురుదాస్ దాస్ గుప్త "ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో మేము చేసింది సరిపోలేదు". గౌరవించక చేసేదేముంది కామ్రెడ్, ఫలితాలపై నెత్తీ నోరు బాదుకుంటే ఇప్పుడిక ఉపయోగం ఏముంది? 

బెంగాల్ లో కమ్యూనిస్టులు చేసింది సరిపోక కాదు, అంతా ఎక్కువై వెగటు పుట్టి ప్రజలు పీకి పాతరేసారు కామ్రెడ్. 

* * * 

అస్సాం, బెంగాల్ ఫలితాలపై, దిగ్విజయ్ సింగ్ నుంచి మనీష్ తివారి వరకు కాంగ్రెసీయులంతా : "యు.పి.ఎ. ప్రభుత్వ విధానాలే విజయానికి సోపానం". మరి తమిళనాడు, పుదుచ్చేరిల సంగతేంటి సార్ అంటే, అయిదు రాష్ట్రాల్లో భా.జ.పా. ఉనికి కూడా లేదు అని డొంకలో పడిపోయాడీ పెద్దమనిషి! 

* * *

ఈ ఎన్నికల ఫలితాలను బట్టి, వైయస్సార్ కు నిజమైన వారసులెవరని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే, "వచ్చే ఎన్నికల్లో యాభైవేల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది" అంటూ తుమ్మితే ఊగిపోయే కుర్చీలో కూర్చొని సమాధానమిచ్చారట కె.కె.రెడ్డి గారు. 

* * *

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కొందరు కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు : "ఓటుకు రెండు వేల రూపాయలు జగన్ పంచాడు, మద్యం ఏరులై పారించాడు, అందుకే గెలిచాడు". ఓటుకు రెండు వేలంటే, అయిదు లక్షల మెజారిటీ అంటే దాదాపు వంద కోట్లన్నమాట! కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసుదే కదా ప్రభుత్వం. నోట్లు పంచుతుంటే చూస్తూ ఊరుకున్నారే? పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేని వెంగళాయిలు!

17, మార్చి 2011, గురువారం

మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం

 మరిన్ని అగాధాల్లో మనదైన ప్రజాస్వామ్యం (17-March-2011)


లక్ష కోట్లపైగా జరిగిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలోని ఒక నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు దశాబ్దాలపాటు ఈ కేసుని లాక్కుని పీక్కునే అవకాశం కూడా తన ఆత్మహత్యతో కలిగించాడు. అదసలు ఆత్మహత్యో, హత్యో తేలేసరికే ఓ దశాబ్దం పట్టవచ్చు. అప్పటికి మిగిలిన నిందితులు బతికే ఉంటారో లేదో చెప్పటం కూడా కష్టమే.

 

మునుపు స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణంలోని ప్రధాన నిందితుడు హర్షద్ మెహతా జైల్లోనే చచ్చే దాకా కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఏమిటో మనకు తెలీను కూడా తెలీదు. స్టాంపు పేపర్ల కుంభకోణంలోని నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ, సత్యం రాజు కేసుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దశాబ్దాల తరబడి జైల్లోనే మురిగిపోయి చావకుండా, ముందుగానే చచ్చినందుకు స్పెక్ట్రం సాదిక్ ని అదృష్టవంతుడనాలేమో!

 

విచిత్రం ఏమిటంటే, వీళ్ళని పావులుగా ఆడించిన రాజకీయ నాయకులు మాత్రం కనుచూపు మేరల్లో కనబడరు. ఇక మిగతా కుంభకోణాల విషయానికి వస్తే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లాంటి రాజకీయ వ్యక్తుల మీద ఈగ కూడా వాలదు. పొరపాటున లాలు ప్రసాద్ యాదవ్ లాంటి వారిపై ఈగలు వాలినా, దులపరించుకుని బయటకు తేలిగ్గానే వచ్చేస్తారు.

ఒక సామాన్యుడైనా, కోట్ల కొద్ది డబ్బు సంపాదించినవాడైనా సరే, రాజకీయ నాయకుడు కానంతవరకు, ఈ దేశంలో మనలేడు అన్నదానికి ఇవి ఉదాహరణలు. బహుశా అందుకేనేమో అంబానీలు, మాల్యాలు కోట్ల డబ్బు వెదజల్లి మరీ, అధికార పార్టీల ప్రాపకానికి పడిగాపులు కాస్తు ఉంటారు.

2జి స్పెక్ట్రం కి వద్దాం. ఇంత తీవ్రాతితీవ్రమైన కుంభకోణాన్ని రాజకీయ లాభం కోసం మన పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో చూస్తే మతి పోతుంది. ఈ కుంభకోణం నేపధ్యంలోనే, దాదాపు గత ఏడేళ్ళుగా కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డి.ఎం.కె., మరోసారి మద్దతు ఉపసంహరించుకుంటామనే బెదిరింపులకు దిగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు గురించి మొదలైన ఆవేశకావేషాలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే బెదిరింపులకు కారణమయ్యిందట! వ్రతం చెడినా ఫలితం దక్కిందనుకోటానికి కూడా ఆస్కారం లేకుండా కాంగ్రెస్ ఒత్తిళ్ళకు తప్పనిసరిగా తలొగ్గి అడిగిన సీట్లు ధారపోసింది డి.ఎం.కె.

 

2జి స్పెక్ట్రం కుంభకోణం, దరిమిలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న సి.బి.ఐ. దర్యాప్తు నేపథ్యంలో కేవలం కొన్ని అసెంబ్లీ సీట్ల సర్దుబాటు కుదరని కారణంగా డి.ఎం.కె. ఈ బెదిరింపులకు పాల్పడిందంటే నమ్మేదెవరు? గతంలో ముఖ్యమైన మంత్రిత్వశాఖల కోసం ఇవే పాచికలు విసిరి కేంద్రాన్ని లొంగదీసుకున్న డి.ఎం.కె. ఈరోజు విఫలమవ్వటానికి కారణం బహిరంగ రహస్యమే.

అమ్మ అడుక్కోకుండానే, మద్దతు ఇస్తా తీసుకొమ్మని అడుక్కున్న ములాయం వలన, మా గంతకు తగ్గ బొంత డి.ఎం.కె. కాకపోతే, అన్నా డి.ఎం.కె. అని కాంగ్రెస్ ప్రచారం చేసిన ఊహాగానాల వలన, మొత్తానికి కరుణానిధి అమ్మకు దాసోహం అనేయక తప్పలేదు.

అవకాశం దొరికిందే తడవుగా వేల, లక్షల కోట్ల కుంభకోణాలకి పాల్పడే డి.ఎం.కె.లాంటి పార్టీలకు, సంకీర్ణ ప్రభుత్వంలోని ఈ భాగస్వామ్య పక్షాల అవినీతిని చూడనట్టు నటించి, ఈరోజు ఎన్నికల సర్దుబాట్లకుగాను, వారి అవినీతిని అడ్డంపెట్టుకొని పెద్దన్న పాత్ర పోషిస్తు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ కు ప్రజలు ఎప్పటికైనా బుద్ధి చెబుతారా? ప్రజల బుద్ధి కూడా గడ్డి తిని, ఈ పార్టీలనే మళ్ళీ గెలిపిస్తే, ఈసారి ఇదే అవినీతిని అడ్డం పెట్టుకొని తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కావాలని కాంగ్రెస్ పేచీ పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో!

దేశ క్షేమం, ప్రజా సంక్షేమం ప్రధానం కాకుండా, తమతమ అవినీతిని కాపాడుకునే అధికారమే పరమావధిగా కొనసాగుతున్న ఈ రాజకీయాలు మరెన్ని ప్రజాస్వామ్య అగాధాలను మనకు చూపించనున్నాయో!



11, మార్చి 2011, శుక్రవారం

మిలియన్ మిస్టేక్స్

మిలియన్ మిస్టేక్స్ (11-March-2011)

ఏ ప్రజా ఉద్యమమైనా ఒకానొక స్థాయిలో హింసాయుతంగా పరిణమించటం సర్వసాధారణం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటం ఒక ఎత్తైతే, లూటీలు మానభంగాలకు పాల్పడటం మరో ఎత్తు. వీటిని మించి, మన సంస్కృతిని మనం ధ్వంసం చేసుకోవటం మూర్ఖత్వం. ప్రజా ఉద్యమాలు హింసాయుతంగా మారటానికి గల కారణాలు విశ్లేషిస్తే, నాలుగు ముఖ్య విషయాలు గమనించొచ్చు. ప్రభుత్వాలు ఉద్యమానికి సానుకూలంగా స్పందించకపోవటం, బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచటానికి ప్రయత్నించటం, ఉద్యమంలో అసాంఘిక శక్తుల ప్రవేశం, అసమర్ధ నాయకత్వం ముఖ్యమైన కారణాలు.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పెడదోవ పట్టటానికి ఇవన్నీ కారణాలే. ఇదివరలో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమం హింసాయుతంగా మారటానికి పొట్టి శ్రీరాములు బలిదానం దోహదపడింది. అంతవరకు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం శాంతియుతంగానే కొనసాగింది. ప్రస్తుతం, అటువంటి బలిదానాలేవీ లేకుండానే ఉద్యమం పెడదోవ పట్టిందంటే కారణం అసమర్ధులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటం. నిన్నటి టాంక్ బండ్ విధ్వంసానికి కొన్ని నిముషాల ముందే, ఉద్యమకారుల చేత శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని కె.సి.ఆర్. ప్రతిజ్ఞ చేయించటం, జరగబోయే విధ్వంసాన్ని చూచాయగా చెప్పినట్లే. ముందస్తు ప్రణాళికతో చేయబడిన విధ్వంసమే ఇది. అందుకే, కె.సి.ఆర్. తనకు ఎలిబీగా ఉద్యమకారుల చేత ప్రతిజ్ఞ చేయించటం.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మరోసారి మొదలు పెట్టినప్పటి నుంచి కె.సి.ఆర్. చేసింది ఉద్యమం కాదు, మోసం. సామూహిక జన మోసం. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, పదవుల కోసం వెంపర్లాడటం, ఏకాభిప్రాయం కోసం కృషిచేస్తున్నానని కల్లబొల్లి కబుర్లు చెప్పటం, సంకీర్ణ ప్రభుత్వపు ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణా ఉన్నదని అబద్ధపు ప్రచారాలు చేయటం, ఆసుపత్రిలో నిరాహార దీక్షలు, చండీ హోమాలు, ఆంధ్రా బిర్యాని కబుర్లు... చెప్పుకుంటూ పోతే నిన్నటి తాంక్ బండ్ విగ్రహాల విధ్వంసం వరకు పదిలక్షల రకాలుగా ప్రజలని మోసం చేసాడు. నిరుటి కేంద్రప్రభుత్వపు ప్రకటన తర్వాత ప్రజల చేతుల్లోకి వెళ్ళిన ఉద్యమాన్ని తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకోటానికి కె.సి.ఆర్. ఆడుతున్న నీచపుటెత్తుల చదరంగం ఇది.

ఇంతవరకూ ఈ తెలంగాణా ఉద్యమంలో నిస్వార్ధంగా బలిదానానికి సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేడు. బలిదానం సంగతి తర్వాత, నిబద్ధతగా రాజీనామాలకు సిద్ధపడ్డ ఒక్క నాయకుడు లేకపోవటం తెలంగాణా దౌర్భాగ్యం. పట్టుమని పది గంటలు నిరాహార దీక్ష చేయలేని నాయకుడు, విద్యార్ధులు ఆత్మాహుతి చేసుకుంటే, వారి బలిదానాన్ని తన రాజకీయ స్వార్ధానికి ఉపయోగించాలనుకోవటం ఘోరం,

ప్రాంతీయ అసమానతలు ఉన్న మాట వాస్తవమే. అది సాకుగా తీసుకొని ప్రాంతాల మధ్య విబేధాలకు ఆజ్యం పోయటంలో అటు సమైక్య ఆంధ్ర నాయకుల, ఇటు తెలంగాణా నాయకులు సరిసమానమైన పాత్రలు పోషించారనేది కూడా వాస్తవమే. నోరు అదుపులో పెట్టుకోలేని నాయకులు, ఉద్యమాన్ని అదుపులో ఉంచగలరనుకోవటం మన మూర్ఖత్వం. ఈ అరాచక రాజకీయంలో ప్రజలు పాచికలై తమ సంస్కృతిని తామే ధ్వంసం చేసుకోవటం హేయం.

దురదృష్టం ఏమిటంటే, ప్రత్యేక తెలంగాణా ఓ రాజకీయ ప్రక్రియ. ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమే ఈ ఉద్యమం. కానీ, తెలంగాణా ప్రజా నాయకుల (?) అనైక్యతే ఈ ప్రక్రియకు నిజమైన అడ్డంకి. ఈ నాయకులను ఏరివేసి, తమ ఆకాంక్షలకు అనుగుణం నడుచుకునే నాయకుడిని ప్రజలు ఎన్నుకోగలిగినప్పుడే తెలంగాణా కల సాకారమౌతుంది. లేదంటే, ఈ నాయకుల తప్పిదాల వల్ల తెలంగాణా కోలుకోని విధంగా విధ్వంసమౌతుంది.

పెచ్చుమీరిన మూర్ఖపు ఆవేశానికి, చారిత్రక విధ్వంసానికి ప్రతిరూపంగా టాంక్ బండ్ పై కూల్చబడిన ఈ విగ్రహాలను పునరుద్ధరించకుండా మూగసాక్షిలా మిగల్చాలి. ఎప్పటికైనా, తమ కాళ్ళను తామే నరుక్కునే ఉద్యమకారులకు కనువిప్పు కలుగుతుందేమో!


7, మార్చి 2011, సోమవారం

ఒకేఒక్కడు - ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర - ఓ పరిచయం

 ఒకేఒక్కడు - ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర - ఓ పరిచయం (7-March-2011)


ఈమధ్య "చిరంజీవి ఓ చిరుజీవి" అన్న వ్యాసం వ్రాసే సమయంలో ఎన్.టి.ఆర్. బొమ్మ కోసం వెతుకుతుంటే, అన్న ఎన్.టి.ఆర్. కాం అనే వెబ్ సైటులో ఐ.వెంకట్రావ్ అనే జర్నలిస్టు వ్రాసిన ఎన్.టి.ఆర్. జీవితచరిత్ర కనిపించింది.. మొట్టమొదటిసారిగా, ఎన్.టి.ఆర్. కు సంబంధించిన జీవిత విశేషాలు ఆ పుస్తకం ద్వారా చదివాను.

స్థూలంగా ఈ పుస్తకాన్ని రెండు భాగాలుగా చదవాలి. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఓ యువకుడు ఏ ఏ ఆశయాలతో సినీజీవితంలోకి అడుగు పెట్టాడో, తన నవరస నటనా వైదుష్యంతో ఆంధ్రుల గుండెల్లో నిల్చిపోయాడో అనేది ఒక భాగమైతే; ఏ ఏ ఆదర్శాలతో జనహితాన్ని కోరుతూ ఓ ప్రభంజనంలా రాజకీయాల్లో ప్రవేశించిన వ్యక్తి, అనిలానలమై రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఎలా దహించివేశాడో, ఆప్తుల హితవులు పక్కన పెట్టి ఓ అసమగ్రమైన పుస్తకంలా ఎలా మిగిలిపోయాడో అనేది రెండవభాగం.

ఈ పుస్తకం చదివిన తర్వాత ఎన్.టి.ఆర్. పై సహజంగానే చాలా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఎటువంటి నేపధ్యము లేకుండానే, మొదట సినిమాలలోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి దూకిన ఎన్.టి.ఆర్. సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని సరిపోలిస్తే, రాజకీయ జీవితంలోనే చాలా ఆటుపోట్లని చవిచూసాడు. ఆయనకు, సినీ జీవితం పూలపానుపు కాకపోయినా, పుట్టుకతో ఆయన ఒక కళాకారుడు కనుక తొందరగానే నిచ్చెనలన్నీ ఎక్కగలిగాడు. ఇటు, ఒక నటరత్నగా, ఒక నటసార్వభౌముడుగా ప్రజల మనసుల్లో పదిలంగా ఉన్న ఆయన ఇమేజ్ రాజకీయాల్లో మొదటి మెట్టు ఎక్కటానికి ఉపయోగపడిందే కానీ, ఆ తర్వాత ఆటుపోట్ల నుంచి తప్పించటానికి ఏవిధంగాను ఉపయోగపడలేదు.

సినీ జీవితంలో ఒక మొండివాడుగా (ఒకే చెయ్యి నాలుగు సార్లు విరిగినా పట్టించుకోని) కనిపించే ఆయన వ్యక్తిత్వం, రాజకీయాల్లోను, జీవిత చరమాంకం వచ్చేటప్పటికి జగమొండిగా మారిన ఓ వృద్ధుడిగా పరిణమిస్తుంది ఈ పుస్తకంలో. నిజానికి, అక్కడక్కడా ఇప్పటి తెలుగుదేశం కరపత్రంలా (ప్రో చంద్రబాబు) ఈ పుస్తకం కనిపించినా, ఎన్.టి.ఆర్. పరంగా ప్రజలకు తెలియని కొన్ని కోణాలను ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. ఎన్.టి.ఆర్ తన పరిపాలన ఆరంభంలో తీసుకొన్న కొన్ని వివాదాస్పద నిర్ణయాల వెనుక ఉన్న అసలైన కారణాలు కూడా పాఠకులకు ఎన్.టి.ఆర్.పై ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ముఖ్యంగా పరిశీలించదగ్గ, సరిపోల్చ దగ్గ విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - ఏ పరిస్థితుల నేపధ్యంలో నాదెండ్ల భాస్కర రావు ఎన్.టి.ఆర్. ను "వెన్నుపోటు" పొడిచాడు? రెండు - ఎన్.టి.ఆర్. ను పదవీచ్యుతుడిని చేయటానికి చంద్రబాబుకు ఉన్న కారణాలేమిటి? విచిత్రం ఏమిటంటే, ఈ రెంటికీ కారణం ఒక్కటే. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలలో ఎన్.టి.ఆర్. కుటుంబం పోషించిన పాత్ర.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కాలేక, తెలుగుదేశంలోనైనా ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో పార్టీలో చేరిన నాదెండ్ల, ఎన్.టి.ఆర్. తన ఇద్దరు అల్లుళ్ళకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని, తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం గగనమౌతుందేమో అన్న భయంతో "వెన్నుపోటు" పొడిస్తే;

లక్ష్మీ పార్వతి ఎన్.టి.ఆర్. కొత్త భార్యగా మాత్రమే ఉండకుండా, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో వేళ్ళు పెట్టి, తనను ఏకాకిని చేస్తున్నదని, పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటానికి ఎన్.టి.ఆర్. ను పదవి నుంచి తప్పించటం మినహా వేరే మార్గం లేదని చంద్రబాబు భావించాడు.

వీరిద్దరిలో ఎవరు తక్కువ తప్పు చేసారు, ఎవరు పెద్ద తప్పు చేసారనేది ఇప్పుడు మనం తీరిగ్గా విశ్లేషించుకోగలమే కానీ, కేవలం తన జనాకర్షణతో పార్టీని పెట్టి అందలం ఎక్కించిన ఎన్.టి.ఆర్. దృష్టిలో ఎవరు పెద్ద నేరస్తులో ఈ పుస్తకం చదివి మనం నిర్ణయించుకోవచ్చు.

ఏదేమైనా, ఓ ప్రభంజనంలా సాగిన ఓ మహానటుని, ఓ మహానాయకుని జీవితం అసంపూర్తిగా, అసంతృప్తిగా ముగిసిందనేది వాస్తవం.



5, మార్చి 2011, శనివారం

ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే...

 ధృతరాష్ట్రుడు ప్రధాని అయితే... (5-March-2011)


ఒకప్పుడు, తను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యత వహిస్తూ, రైల్వే మంత్రిగా తన పదవికి రాజీనామా చేసి లాల్ బహాదూర్ శాస్త్రి ఓ సత్సంప్రదాయానికి నాంది పలికారు. ఆ తర్వాత అలా నైతికబాధ్యత వహించిన మంత్రులు చాలా తక్కువ. అసలు లేరనే చెప్పుకోవచ్చు. తమ మంత్రిత్వశాఖల్లో బయల్పడిన అవినీతికి అధికారులను బాధ్యులుగా చేసి, తమ పదవులు కాపాడుకున్నవారే ఎక్కువ. కేసులు పెట్టినా, వాటిని నానబెట్టేలా అధికారాన్ని ఉపయోగిస్తూ మంత్రులుగా కొనసాగిన వారసత్వం ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నది.

ఛీఫ్ విజిలెన్స్ కమిషనరుగా పి.జె.థామస్ నియామకాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, ఆ నిర్ణయానికి తనదే బాధ్యతగా మన ప్రధాని ప్రకటించారు! ఒక అవినీతి అధికారిని అందలం ఎక్కించినందుకు బాధ్యత వహించిన మన ప్రధానిని అభినందించాలా? లేక, ఆచరణలో నైతిక బాధ్యత వహించనందుకు అభిశంసించాలా? ప్రభుత్వంలోని ఒక అధికారి అవినీతికి పాల్పడి, ఆనక దానికి బాధ్యత వహిస్తే క్షమించి వదిలేస్తుందా ప్రభుత్వం? మరి, మన ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదా?

ఇక 2 జి స్పెక్ట్రం కుంభకోణం విషయానికి వస్తే, సంకీర్ణ ప్రభుత్వం నడపటంలో కొన్ని విషయాలలో రాజీ పడక తప్పని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయంగా ఆయన ఈ కుంభకోణాన్ని ప్రస్తావించారు! ఈ ప్రధానికి దేశ శ్రేయస్సు ముఖ్యమా? తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ముఖ్యమా? ఇప్పటి వరకూ, మిస్టర్ క్లీన్ గా భావిస్తున్న పెద్దమనిషి దేశ శ్రేయస్సును పణంగా పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మన దౌర్భాగ్యం.

అసలు ఈ ప్రధాని మిస్టర్ క్లీన్ గా ఎలా పరిగణించబడుతున్నారో కూడా అర్ధం కాని విషయం. నిన్న మొన్నటిదాకా దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా భావించిన "హర్షద్ మెహతా" ఉదంతం ఈ పెద్దమనిషి ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందే. ఆ తర్వాత, సత్యం, మొన్నటి కామన్ వెల్త్ క్రీడలల్లో జరిగిన వేల కోట్ల అవినీతి, నిన్నటి లక్షల కోట్లలో జరిగిన స్పెక్ట్రం కుంభకోణం.. ఇవన్నీ ఈ పెద్దమనిషి ప్రధానిగా ఉన్న సమయంలో జరిగినవే... జరుగుతున్నవే.

వేటికీ స్పందించని ఈ ప్రధాని, ఈరోజు సింపుల్ గా బాధ్యత వహిస్తున్నానని ప్రకటించటంలో ఔచిత్యం ఏమిటి? బాధ్యత వహించే పెద్దమనిషి ఇంకా ఆ పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? జరిగిన అవినీతి మీద విచారణ జరిపించి, వేరెవరినో బాధ్యులు చేసి, చేతులు దులుపుకోవటమేనా సత్ప్రవర్తన? ఒక ప్రధానిగా సరైన సమయంలో స్పందించని వ్యక్తి కేవలం బాధ్యత వహిస్తున్నట్లుగా చెప్పుకోవటంతో సరిపోతుందా?

వెన్నెముక లేని ఇటువంటి ప్రధానుల వల్ల దేశం మరింత దిగజారిపోయే ప్రమాదమే ఉంటుంది. నామమాత్రపు ప్రధానిగా ఉన్న ఈ ధృతరాష్ట్రుడు, ఆయన పనిచేస్తున్న పార్టీకి ఉపయోగమేమో కానీ, దేశానికి శ్రేయస్కరం కాదు.



18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

చిరంజీవి కాదు ఓ "చిరు జీవి"


చిరంజీవి కాదు ఓ "చిరు జీవి" (18-February-2011)

మూడు దశాబ్దాల సినిజీవితంలో, దాదాపు రెండు దశాబ్దాలు చిరంజీవి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా, చేసిందే డాన్సుగా తెలుగు వెండితెర వెలుగులు చిమ్మింది. రెండు సంవత్సరాల రాజకీయ జీవితం మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ముగిసింది. రఫ్ఫాడించేస్తానన్న చిరంజీవి ఇప్పుడు హస్తం పార్టీతో చేతులు కలిపేసాడు. ఇంతవరకూ, ఎవరి విశ్లేషణలు వారు చేసుకొని, చివరికి చిరంజీవి ప్రజాదోహ్రం చేసాడని ఆరోపిస్తున్నాయి అన్ని పార్టీలు.

విచిత్రం ఏమిటంటే, గత ఎన్నికలలో గెలుచుకుంది 18 అసెంబ్లీ సీట్లే అయినా, 16 శాతం వరకు ఓట్లను చీల్చగలిగింది ప్రజారాజ్యం. తను బాగుపడిందేదీ లేకపోయినా, మా పొట్టలను కొట్టింది ఈ ప్రజారాజ్యం అని అప్పట్లో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలు వాపోయారు కూడా. సామాజిక న్యాయమే పరమార్ధంగా పెద్దయెత్తున మొదలైన ప్రజారాజ్యం ఈరోజు చతికిలపడటానికి కారణం ఏమిటి? రాజకీయ పరిణతి లేని చిరంజీవా? వ్యాపారంతో రాజకీయాలు చేయాలనుకుని ఒంటెద్దు పోకడలతో పార్టీని నడిపిన బావమరిదా? ఉన్న పార్టీలలో ఉనికి ఏమాత్రమూ లేకపోయినా, పదవుల కోసం ప్రజారాజ్యంలోకి పాక్కుంటూ వచ్చిన పాత నాయకులా?
 
ఈ సందర్భంగా చిరంజీవి ప్రజారాజ్యాన్ని, అప్పటి ఎన్ టి ఆర్ తెలుగుదేశంతో సరిపోల్చటం తప్పు కాదు. అప్పటి రాజకీయాలలోని శూన్యత, ప్రత్యామ్నాయంలేని పార్టీగా కాంగ్రెస్ కొనసాగించిన దుష్పరిపాలన నేపధ్యంలో "తెలుగువాడి ఆత్మగౌరవం" ఒక నినాదమై సహజంగానే ప్రజలను ఆకర్షించింది. నిర్లిప్తంగా నిర్వికారంగా నిద్రాణమై ఉన్న తెలుగుజాతి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.

ఎన్ టి ఆర్ సామాజిక న్యాయమంటూ నంగి మాటలు మాట్లాడలేదు. తెలుగుజాతి ఆత్మగౌరవమంటూ గర్జించాడు. కొత్త రాజకీయాలంటూ దిక్కులు చూడలేదు, రాత్రికి రాత్రి కొత్త నాయకులను తయారుచేసాడు. ఎన్నికలలో వారికి దన్నుగా తాను నిలిచాడే కానీ, వారి డబ్బుతో తాను నుంచోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పెకిలించివేయాలనే లక్ష్యంతో, స్థిరచిత్తంతో అడుగులు వేసాడే కానీ, ఒకడుగు ముందుకువేసి రెండు అడుగులు వెనక్కు తగ్గే తరహాలో కాదు.
 
ఎన్ టీ ఆర్ కు పూర్తి విరుద్ధమైన తరహాలో చిరంజీవి రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఏ ప్రశ్నకైనా, కప్పదాటు సమాధానాలే కానీ, ఖచ్చితమైన సమాధానం ఏనాడు చిరంజీవి ఇవ్వలేదు. తన పార్టీవారే, తననే తిట్టిపోస్తున్నా, తమలో తామే కోట్లాడుకుంటున్నా ఒక సామాన్య ప్రేక్షకుడిలా దిక్కులు చూసాడే కానీ, ఒక నాయకుడుగా దిశానిర్దేశం చేయలేకపోయాడు. రాజకీయ అవగాహన, విషయ పరిజ్ఞాన లేమి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.
 
చిరంజీవిని ఒక సాధారణ నాయకుడిగా మాత్రమే గమనిస్తే, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయటం "ప్రాప్తకాలజ్ఞత"గా కనిపిస్తుంది. ఒక దశాబ్దంపైగా రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసిన ఎన్ టి ఆర్ కు చివరిలో పట్టిన గతి, తనకు రెండు సంవత్సరాలలో పట్టకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. 

16 శాతం ఓట్లు వచ్చినా, దక్కింది 18 సీట్లే. పదవుల కోసం వేరే పార్టీలను వదిలి వచ్చిన నేతలు, పదవుల కోసం పార్టీని చీల్చగలరని అర్ధమయ్యుంటుంది. అసెంబ్లీలో ఏమాత్రమూ అవకాశం లేకపోయినా, నాదెండ్ల భాస్కర రావును ఎగదోసి, ఎన్ టి ఆర్ ను దించటానికి ప్రయత్నించిన కాంగ్రెస్, రేపు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడుకోటానికి ప్రజారాజ్యాన్ని కూడా చీల్చగలదని చిరంజీవి నమ్మి ఉంటారు.

ఏదేమైనా, వెండి తెర మీది అసాధారణ నాయకుడు ఒక సాధారణ నేతలానే తన శేష రాజకీయ జీవితాన్ని గడపాలని నిర్ణయించుకోవటం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచిస్తుందో!