17, మే 2011, మంగళవారం

కమ్యూ"నిజం" కాలం చేసిందా?

 కమ్యూ"నిజం" కాలం చేసిందా? (17-May-2011)

సామాజిక పరిణామ క్రమంలో రకరకాలుగా ఏర్పడే అసమానతలను తొలగిస్తూ సంఘజీవిగా ఉన్న మనిషి సామాజిక జీవనవిధానాన్ని సంస్కరించే ప్రయత్నాన్ని స్థూలంగా కమ్యూనిజమని మనం అభివర్ణించుకోవచ్చు. ప్రతి సమాజంలోనూ పాలించేవారు, పాలింపబడే వారు ఉంటారు. వీరినే, పీడించేవారు (బూర్జువా వర్గం), పీడింపబడేవారుగా (శ్రామిక వర్గం) కార్ల్ మార్క్స్ ప్రస్తావిస్తాడు. పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి కమ్యూనిస్టు వ్యవస్థకు ఆయన కోరుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయమనే మార్పు వర్గపోరాటాలు, విప్లవాల ద్వారానే సాధ్యం. ఏదేమైనా, వ్యక్తి స్వేచ్ఛకన్నా సామాజిక ప్రయోజనానికే కమ్యూనిజం ప్రాధాన్యతనిచ్చింది. ఆ ప్రాధాన్యతా క్రమంలో, దాదాపు అన్ని కమ్యూనిస్టు ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరించటం జరుగుతున్నది. ప్రజాస్వామ్య పరిధుల్లో సామాజిక న్యాయం ఆచరణాత్మకం కాదని వీరి అభిప్రాయం.

పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల ఓటమిని ఈ నేపధ్యంలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మాటకొస్తే, అన్నాదురై ఆశయాలతో అంటకాగిన డి.ఎం.కె. ఓటమి కూడా ఈ నేపధ్యంలోనే చర్చించుకోవాలి. ముందుగా మనది ప్రజాస్వామ్య దేశం. సామాజిక న్యాయాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధిద్దామనుకునే దేశం. మార్క్స్, లెనిన్ లు కమ్యూనిస్టులకు ఎలా పూజనీయులో, గాంధీ, జే.పీ.లు నూరేళ్ళ కాంగ్రెస్ నుండి, లాలూ ప్రసాద్ ఆర్జేడి వరకు అలానే పూజనీయులు. నిన్న మొన్నటి జగన్ పార్టీ నుంచి, భా.జ.పా. వరకూ అందరూ సామాజిక న్యాయమే తమ పార్టీ పరమార్ధంగా ప్రకటిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి, కమ్యూనిస్టులను కూడా కలుపుకొని, మన దేశంలోని పార్టీలన్నీ ప్రజాస్వామ్య సోషలిస్టులే! ఆశయాలు ఆచరణలో శూన్యమైనప్పుడు, సిద్ధాంతాలు కారల్ మార్క్స్ వైనా, గాంధీవైనా కాగితం పూలే.

మనకు స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దానికి 1957లో దేశంలోనే మొట్ట మొదటి ప్రజలు ఎన్నుకున్న కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ నేతృత్వంలో ఏర్పడింది. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 1977 లో పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు బెంగాల్ లో కమ్యూనిస్టుల ప్రభ అప్రతిహతంగా సాగిపోయింది. 1977 లో "ఆపరేషన్ బర్గా" భూసంస్కరణలతో మొదలైన కమ్యూనిస్టుల ప్రాబల్యం, సింగూర్, నందిగ్రాం లలో చేసిన పాపాలతో ముగిసిపోవటం ఓ విశేషం.

1990 దశకం నుంచే కమ్యూనిస్టుల పతనానికి బీజాలు పడ్డాయి. గోడలకు తగిలించుకున్న సిద్ధాంతాల మోజులో ప్రజల గోడును ఆ ప్రభుత్వం పట్టించుకోవటమే మానేసింది. అంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలలో భూకేటాయింపులను అసంబద్ధంగా అభివర్ణిస్తూ అడుగడుగునా ఎర్ర జెండాలు పాతిన ఎర్రన్నలు, బెంగాల్ లో మాత్రం టాటాల, బహుళజాతి సంస్థల జెండాలు మోయటం ఏ మార్క్సిజమో అర్ధంకాని ప్రజలు గూబలదిరేట్లుగా కమ్యూనిస్టు పాలకులకు బుద్ధి చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా దన్నుగా నిలచిన రైతులు, మధ్యతరగతి ప్రజలు; ప్రజల కోసం కన్నా, తమ పార్టీ కోసమే ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు నడుపుతున్నారన్న నిజాన్ని గ్రహించారు. పేరుగొప్ప సిద్ధాంతాలైనా, అవకాశవాద రాజకీయాలతో ప్రజా సంక్షేమాన్ని మరచిన కమ్యూనిస్టులకు మిగతా రాజకీయ పక్షాలకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. మూడున్నర దశాబ్దాల పరిపాలన తర్వాత కూడా ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ఎటువంటి మార్పు లేనందువల్లే, ప్రజలు ప్రభుత్వాన్ని మార్చేసారు.

పార్టీ సంస్థలుగా మారిన ప్రభుత్వరంగ సంస్థలు, దయాదాక్షిణ్యం లేకుండా కొనసాగించిన భూఆక్రమణలు, ప్రతిఘటించిన రైతులపై కాల్పులు, బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు, జంగల్ మహల్ ఆదివాసీల సమస్యలు... చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్టుల వైఫల్యాలు ఒక్క బెంగాల్ లోనే కోకొల్లలు. లౌకిక, సామ్యవాద సిద్ధాంతాల పేరుతో అడ్డగోలు రాజకీయాలాడుతూ, పొలిట్ బ్యూరో సమావేశాల్లో తమ పతనానికి పోస్టుమార్టం చేసుకుంటే సరిపోదు. 41% శాతం ఓట్లు వచ్చాయి కాబట్టి, ప్రజలు మమ్మల్ని ఇంకా ఆదరిస్తూనే ఉన్నారనే భ్రమల్లో ఉంటే కడుతున్న సమాధిని ప్రజలు త్వరలోనే పూర్తిచేస్తారు.

ఆశయాలను, ఆదర్శాలను సిద్ధాంతాల వరకే పరిమితం చేసి, ఆచరణలో అలసత్వం చూపిస్తే, ఏ పార్టీకైనా ఈ ముప్పు తప్పదు. కానీ, సిద్ధాంతాల పునాదుల మీద నిలబడ్డ పార్టీగా గతంలో ఆచరణాత్మకంగా వ్యవహరించిన నిష్ట కమ్యూనిస్టులకు ఇప్పుడు అవసరం.



16, మే 2011, సోమవారం

ఎన్నికలు - మరో ప్రహసనం

 ఎన్నికలు - మరో ప్రహసనం (16-May-2011)


దాదాపు నెల రోజుల క్రితం అవినీతికి వ్యతిరేకంగా అన్నహజారే ఉద్యమం మొదలేసారు. దాదాపు అదే సమయంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. ఈ నేపధ్యంలో జరగబోయే ఎన్నికలు మరింత ఆసక్తిని కలిగించాయనేది నిర్వివాదాంశం. 

 

గత్యంతరంలేని పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలు అన్నా హజారేకు మద్దతు తెలపడం, వెను వెంటనే కేంద్ర ప్రభుత్వం అన్నా కోర్కెలకు అనుగుణంగా స్పందించటం జరిగిపోయాయి. ఎన్నికల ఫలితాలు గమనిస్తే, ఒక్క అస్సాం మినహాయించి, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయా రాష్ట్రాలలోని అధికార పార్టీలకు తిలోదకాలు ఇచ్చేసారు.

అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వేసిన ఓట్లుగా భావించాలా అంటే చెప్పటం కష్టం. ఎందుకంటే, పశ్చిమ బెంగాల్ లో యు.పి.ఎ. భాగస్వామ్య పార్టీ తృణమూల్ ను ప్రజలు ఆదరిస్తే, తమిళనాడులో డి.ఎం.కె.ను ప్రజలు తీసి అవతల పడేసారు. అస్సాంలో కాంగ్రెస్ కు మళ్ళీ పట్టం కడితే, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఫ్రంటు ఆటూ ఇటూ దేకి చిట్టచివరికి అధికారం కైవసం చేసుకున్నామనిపించింది బొటాబొటీ మెజారిటీతో.

కేంద్రంలో అవినీతిమయమైన యు.పి.ఎ. ప్రభుత్వాని కన్నా, రాష్ట్రంలోని అవకాశవాద, అసమర్ధ కమ్యూనిస్టు ప్రభుత్వమే అత్యంత ప్రమాదకారిగా భావించి పశ్చిమ బెంగాల్ ప్రజలు కమ్యూనిస్టుల భరతం పట్టారనుకుంటే,, కేంద్రంలో బందిపోట్ల మాదిరిగా దోచుకున్న కరుణానిధి పార్టీకన్నా, రాష్ట్రంలో జేబుదొంగలాంటి జయలలిత పార్టీనే మేలని తమిళనాడు ప్రజలు అభిప్రాయపడినట్లు అనుకోవచ్చేమో.

ఏది ఏమైనా, ఎన్నికలు మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టకుండా ఓ ప్రహసనంలా మాత్రం తయరయ్యాయని చెప్పవచ్చు. ఒక రూపాయికి కిలో బియ్యం ఇస్తామని ఒక పార్టీ ప్రకటిస్తే, అదే రూపాయికి అయిదు కిలోలు బియ్యం ఇస్తామని మరో పార్టీ ప్రకటించటం; ఒక పార్టీ కొందరికి కంప్యూటర్లు ఇస్తామంటే, మరో పార్టీ అందరికీ ఇస్తామని ప్రకటించటం ఎన్నికలను పరిహాసాస్పదం చేసేవే. పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలు, ఉచిత వరాలందించే కరపత్రాలుగా తయారయ్యాయి. 

ఇన్ని ఉచితంగా అందించే ప్రభుత్వాలు, పెరుగుతున్న ధరలను ఎందుకు నియంత్రించలేవో మనం అడగం! ఈ విషయంలో పార్టీలను విమర్శించటం కన్నా, ప్రజలుగా మన దివలాకోరుతనాన్ని మనం ముందుగా ప్రశ్నించుకోవాలి.

మన దురదృష్టం కొద్దీ, ప్రస్తుత పార్టీలన్నీ కాంగ్రెస్ తానులో గుడ్డలే. ప్రజల మేలు కోరే ప్రధానులు, ముఖ్యమంత్రుల కన్నా, వారి వారి పదవులను, ప్రభుత్వాలను కాపాడుకొనే "మేధావులే" ఎక్కువ. అవినీతి వల్ల, ఈసారి పదవులు కోల్పోయినా, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వపు అవినీతికి వ్యతిరేకంగా మళ్ళీ మనకు పట్టం కడతారనే ఈ పార్టీల ధీమా కూడా!

మన ఆలోచనా ధోరణులలో విప్లవాత్మకమైన మార్పులు రానంతవరకూ ఈ పార్టీలు మనని, మన ప్రజాస్వామ్యాన్ని పరిహాసాపాత్రంగా దిగజారుస్తూనే ఉంటాయి.



చిటపటలు 1 - 5

చిటపటలు-01 (2-May-2011) పాపం మన రాజకీయ నాయకులు! 

వీళ్ళ బ్రతుకులు అరిటాకులైతే, బంధువులు మాత్రం ముళ్ళే. పకడ్బంది ప్రణాళికలతో ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా అవినీతి ఆరోపణలు వీళ్ళ వీపు విమానం మోత మోగిస్తూనే ఉన్నాయి. 

ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో మరో కోణం ఈ చేదు నిజాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా వివరించింది. ఈయనెప్పుడో మహారాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో, ఈయన అత్తగారు ఓ ట్రాఫిక్ పోలీసు కమిషనరు నుంచి అక్షరాలా అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్నదిట.. అదీ ఆదర్శ్ సొసైటీలో ఓ ఫ్లాటు కొనుగోలుకు. 

విచిత్రం కాకపోతే మరేమిటి, అత్త తీసుకున్న అప్పుకు అల్లుడిని బాధ్యుడినెలా చేస్తారని కదూ మీ ప్రశ్న. అప్పిచ్చిన ఆ పోలీసు అధికారికి ఆదర్శ్ సొసైటీలో ఫ్లాటు కేటాయింపబడేట్లుగా ఈ రెవెన్యూ మంత్రిగారు చొరవ చూపించారట! అరవైఐదు లక్షలు అప్పు తీసుకున్న అత్తగారు బానే ఉన్నారు... అరవైఐదు లక్షలు అప్పు ఇచ్చిన పోలీసు అధికారి బానే ఉన్నాడు... మధ్యలో నా ఉద్యోగానికి ఎసరొచ్చిందని చిటపటలాడిపోతు తలపట్టుకు కూర్చున్నాడట అరిటాకు సారీ.. అశోక్ చవాన్.   

చిటపటలు 02 - "చంటబ్బాయ్ ఛాలెంజ్" (3-May-2011) 

కొత్త కాంగ్రెసోడు కాకాల బాకా ఆపడని కొత్త సామెత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు పంచెలూడదీసి పరుగెత్తిస్తామన్న పులి, ఈరోజు కాంగ్రెస్ కండువాలో దూరి కేక పుట్టిస్తున్నదని కడపలోని ప్రతి గడప కోడై కూస్తున్నదట. జగన్ పై భీకరంగా విమర్శలు గుప్పిస్తూ...ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తానన్న జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడట చిరంజీవి. 

నువ్వు ఆరు నెలల్లో కూలదోస్తే, నేను ఆరు నెలల్లో తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తానని తొడలు కొట్టి మరీ ఎవరెవరికో పూలు పెడుతున్నాడని అభిజ్ఞవర్గాల భోగట్ట. ఆయనే ఉంటే మంగలెందుకని సామెత. ప్ర.రా.పా. కాంగ్రెస్ లో కలిసిందన్న ధీమాతోనే కదా జగన్ కు కాంగ్రెస్ కు చెక్ పెట్టింది. పదారు మంది ఎమ్మేల్యేలతో నిలబడలేకే కదా కాంగ్రెస్ బాకాలా మారింది, ఇక ఒకవేళ జగన్ కూలదోసాడనే అనుకుందాం, అస్తు పిస్తు 16 మంది ఎమ్మెల్యేలతో ఈయన నిలబడేదేముందిట, నిలబెట్టేదేముందిట!

రాజకీయాల్లో తనింకా "చంటబ్బాయే" అని చిరంజీవి మాటిమాటికి నిరూపిస్తూనే ఉన్నాడు.   

చిటపటలు-03 "పాపం పాకిస్తానూ అరిటాకే!" (7-May-2011) 

తీవ్రవాదులకి పాకిస్తాన్ స్వర్గధామం అని ప్రపంచమంతా ఆడిపోసుకుంటున్నది. అసలైన వింతలు ఎలాగుంటాయంటే; పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా నెంబర్ వన్ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడట! అలానే, పాకిస్తాన్ లో పాకిస్తాన్ కు తెలియకుండా అమెరికా సైనిక దాడి చేసి వాడిని మట్టుబెట్టింది. 

ఇక పాకిస్తాన్ తీవ్రవాదులకి స్వర్గధామం ఎలా అయ్యింది. జన్నత్ కు దారి పాకిస్తాన్ నుంచే కదా ఉంది! నిజానికి, తీవ్రవాదులకి "మేరా భారత్ మహాన్" నిజమైన భూతల స్వర్గం. ఇక్కడ చూడండి అబూ సలేం హాయిగా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడో. కసబ్ సంగతి, అఫ్జల్ గురు సంగతి ఇక చెప్పనవసరం లేదు. కోరినన్ని బిరియానీలు, బాలీవుడ్ సినిమాలూ! 

ఈ విషయం తెలీకే, లాడేన్ చావగానే, భయంతో మూటా ముల్లె సర్దుకొని దావూద్, ఛోటా షకీల్ కరాచీ నుంచి ఉడాయించారట! హాయిగా భారత్ కు వస్తే, జీవితాంతం కేసుల మీద కేసులు నడుస్తాయి. మన ప్రభుత్వం వాళ్ళ మీద ఈగ కూడా వాలనీయదు. ఏమిటో ఈ పిచ్చి వెధవలు! ఎప్పుడు తెలుసుకొంటారో ఏమో!   

చిటపటలు-04 "ఓదార్పు యాత్రలు" (12-May-2011) 

చూడగా చూడగా, తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనే ఓదార్పు యాత్రలు చేపట్టాలని భావిస్తున్నట్లుంది కాంగ్రెస్. తాను భారతీయుడినని చెప్పుకోటానికి కూడా సిగ్గు"పడుతూ లేస్తూ" నిన్న తెల్లవారుఝామునే యు.పి.లోని గ్రేటర్ నోయిడాలో భూసేకరణ బాధితులను పరామర్శించి ధర్నాలో పాల్గోటానికి వెళ్ళాడట యువరాజు! 

పాపం యు.పి., బీహార్, గుజరాత్, కర్నాటక లాంటి కాంగ్రేసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అయ్యవారు భారతీయుడైనందుకు సిగ్గుపడుతున్నట్లున్నాడు. ఆంధ్ర, రాజస్థాన్, మహారాష్ట్రల్లో మాత్రం గర్విస్తున్నట్లున్నాడు. ఈ యువరాజు డిగ్గీరాజాను (దిగ్విజయ్ సింగ్)ను రాజగురువుగా నియమించుకున్నట్లున్నాడు. మొన్ననే ఈ రాజగురువు,"ఒసామాజీ"కు సరైన అపరకర్మలు చేయలేదని కన్నీరుమున్నీరయ్యారు కూడా. బహుశా పాకిస్తాన్ కో, సౌదీ కో కూడా యువరాజులుంగారిని ఓదార్పు యాత్రలకు తీసుకెళ్తాడేమో ఈ రాజగురువు, భారతీయుడిగా సిగ్గుపడేలా చేస్తూ! 

బాబూ... డిగ్గీరాజా టోపీలు బాగా పెడ్తాడుట... జర సంభాల్ కే చల్.... 

PS: ఓదార్పుయాత్రల కనిపెట్టుదారుడైన వై.ఎస్. జగన్ "ఓదార్పు" పై పేటెంట్ దాఖలు చేసే రోజు ఎంతో దూరం లేదని అనిపించడంలో ఎలాంటి అసంబద్ధతా లేదని అనిపిస్తోంది!   

చిటపటలు-05 "వంకల డొంకతిరుగుళ్ళు" (16-May-2011) 

ఎన్నికల ఫలితాలొచ్చిన ప్రతిసారీ మన నాయకులు వంకల కోసం వెదుకుతూ చెప్పే డొంకతిరుగుడు సమాధానాలు బలే విచిత్రంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని : 

తమిళనాడు ఫలితాలపై కామ్రేడే ఏచూరి సీతారాం : "అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసారు". ఆ కామ్రేడే, పశ్చిమ బెంగాల్ ఫలితాలపై : "ప్రజలు మార్పు కోరుకున్నారు". పైగా "ఈ ఓటమి వామపక్ష సిద్ధాంతాల, కార్యక్రమాల ఓటమి కాదు" తమిళనాడైనా, పశ్చిమ బెంగాలైనా ప్రజలు మార్పు కోరారన్నది ఆయనగారేం చెప్పక్కరలేదు. ఫలితాలు చూస్తే అందరికీ అర్ధమౌతున్నది. అవినీతి ప్రభుత్వం మారాలని తమిళనాడులో ప్రజలు ఓటు వేసారనుకుంటే, పశ్చిమ బెంగాలులో ఏం మారాలని ప్రజలు ఓట్లు వేసారో ఆయనకు చెప్పే తీరిక ఇప్పుడు లేదట... పొలిట్ బ్యూరో సమావేశాల్లో పోస్టుమార్టం చేసుకుంటారట! 

సిద్ధాంతాలే కాలదోషం పట్టాయని లోకమంతా కోడై కూస్తున్నా కామ్రేడ్ల చెవుల చిలుము ఎప్పటికి వదిలేనో! 

* * *

పశ్చిమ బెంగాల్ ఫలితాలపై సి.పి.ఐ. నేత గురుదాస్ దాస్ గుప్త "ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. రాష్ట్రంలో మేము చేసింది సరిపోలేదు". గౌరవించక చేసేదేముంది కామ్రెడ్, ఫలితాలపై నెత్తీ నోరు బాదుకుంటే ఇప్పుడిక ఉపయోగం ఏముంది? 

బెంగాల్ లో కమ్యూనిస్టులు చేసింది సరిపోక కాదు, అంతా ఎక్కువై వెగటు పుట్టి ప్రజలు పీకి పాతరేసారు కామ్రెడ్. 

* * * 

అస్సాం, బెంగాల్ ఫలితాలపై, దిగ్విజయ్ సింగ్ నుంచి మనీష్ తివారి వరకు కాంగ్రెసీయులంతా : "యు.పి.ఎ. ప్రభుత్వ విధానాలే విజయానికి సోపానం". మరి తమిళనాడు, పుదుచ్చేరిల సంగతేంటి సార్ అంటే, అయిదు రాష్ట్రాల్లో భా.జ.పా. ఉనికి కూడా లేదు అని డొంకలో పడిపోయాడీ పెద్దమనిషి! 

* * *

ఈ ఎన్నికల ఫలితాలను బట్టి, వైయస్సార్ కు నిజమైన వారసులెవరని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే, "వచ్చే ఎన్నికల్లో యాభైవేల మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుంది" అంటూ తుమ్మితే ఊగిపోయే కుర్చీలో కూర్చొని సమాధానమిచ్చారట కె.కె.రెడ్డి గారు. 

* * *

కడప, పులివెందుల ఉప ఎన్నికలపై కొందరు కాంగ్రెస్ నేతలు, చంద్రబాబు : "ఓటుకు రెండు వేల రూపాయలు జగన్ పంచాడు, మద్యం ఏరులై పారించాడు, అందుకే గెలిచాడు". ఓటుకు రెండు వేలంటే, అయిదు లక్షల మెజారిటీ అంటే దాదాపు వంద కోట్లన్నమాట! కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెసుదే కదా ప్రభుత్వం. నోట్లు పంచుతుంటే చూస్తూ ఊరుకున్నారే? పాపం నోట్లో వేలు పెట్టినా కొరకలేని వెంగళాయిలు!