చిటపటలు-06 "దానవీరశూర మన్మోహన్" (25-May-2011)
1971 ఎన్నికలప్పుడు "గరీబీ హటావో" అనే నినాదంతో ఇందిరాగాంధి అధికారంలోకి వచ్చింది. ఇందిర అడుగుజాడల్లోనే రాజీవ్ గాంధీ కూడా "గరీబీ హటావో" అంటూ ప్రయత్నించాడు. ఆ వారసత్వంలోనే, ప్రస్తుత ప్రధాని మన్ మోహన్ సింగ్ కూడా ఉన్నారని మనకు తెలుసు. ముందుగా "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు" కదా, అందుకే గామోసు 2జి స్కాము, కామన్ వెల్త్ స్కాముల ద్వారా ముందుగా తన ప్రభుత్వంలోని నాయకుల, అధికారుల దరిద్రాన్ని వదిలించేసారు. ఇప్పుడా దరిద్రాన్ని ఉద్ధరించే ప్రణాళికను ఆఫ్రికా దేశాలకు కూడా విస్తరింపచేస్తున్నారు. అక్కడి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 22,500 కోట్ల ఋణాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.
దరిద్రమంటే గుర్తొచ్చింది... మన ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం, ప్రస్తుతం రోజుకు ఇరవై రూపాయలు (నెలకు 600, సంవత్సరానికి 7200 రూపాయలు) సంపాదించేవాడు దరిద్రుడు కాదు. కాకపోతే, రోజుకు ఇరవై రూపాయలు కూడా ఆదాయం లేని దరిద్రులు; సురేష్ టెండూల్కర్ కమిటీ లెక్కల ప్రకారం 37 % ఉంటే, అర్జున్ సేన్ గుప్తా అనే పెద్దమనిషి (National Commission for Enterprises in the Unorganised Sector) లెక్కల ప్రకారం 77% మంది. తక్కువ శాతం ఉంది కాబట్టి, సురేష్ టెండూల్కర్ కమిటీ రిపోర్టు మన ప్రణాళికా సంఘం స్వీకరించిందట.
ఒక్క 2జి స్కాములోనే, లక్షా ఎనభై వేల కోట్ల అవినీతి జరిగిన తర్వాత ఈ దేశం దరిద్రుల దేశం ఎలా అవుతుందని పాలక ప్రతిపక్ష ప్రతినిధులు తర్కించుకుంటు సిగపట్లకు కూడా దిగుతున్నారట! అయినా, ఆఫ్రికా దేశాలకు ఆయన ప్రకటించిన ఋణం 22,500 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనే ఆశ్చర్య దేనికి? మనిషికి 1500 రూపాయల చొప్పున 120 కోట్ల మంది ప్రజలు అడుక్కునే రాజాకు 180000 కోట్ల ముష్టి వేయగలిగినప్పుడు ఇదో లెక్కా?
అన్నట్లు ఇందులో మరో ముష్టి కోణం. అడుక్కునేవాడికి అరవై కూరలు. మన దేశంలో అడుక్కునేవాడి ఆదాయం కూడా రోజుకు కనీసం అరవై పైమాటగానే ఉంటుందని ఓ అంచనా. వాడి ఆదాయం రోజుకు ఇరవై కన్నా మూడింతలు ఎక్కువే కాబట్టి, వాడు దరిద్రుడు కాదు. ఇకనేం, అడుక్కునేవాళ్ళ దగ్గర గీక్కోటానికి ఆదాయ పన్ను చట్టం కూడా ప్రభుత్వం సవరించేస్తుందేమో, ఎవరికి ఎరుక? అలా గీక్కునే డబ్బుతో ఆర్కిటికాలోనో, అంటార్కిటాలోనో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయొచ్చు.
చిటపటలు-07 "ఎన్నెన్ని సిగ్గులు" (01-June-2011)
విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెలికితీయాలని డిమాండ్ చేస్తూ, కోటి మంది ప్రజలతో, ఒక్క గోచీతో అర్ధనగ్నంగా నిరాహార దీక్ష చేయాలని బాబా రాందేవ్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. సుసంపన్నమైన భారతదేశానికి ఈ నల్లధనం ఎంతవరకు అవసరం అని విచారిస్తూ... నల్లధనం కోసం వెంపర్లాడే ఇటువంటి దేశంలో పుట్టినందుకు రాహుల్ బాబు సిగ్గుపడుతుంటే, బాబాతో సిబాల్ సంప్రదింపులు జరపటం అమానుషం.
* * *
జన లోక్ పాల్ బిల్లు పరిధిలోకి ప్రధానిని తీసుకురావాల్సిందేనని అన్నా హజారే పట్టుబట్టి కూర్చున్నారని తెలుసు కదా! రబ్బర్ ముద్ర ప్రధానిని గుంపులో గోవిందంలా తోసేస్తే నష్టమేముందని రాహుల్ బాబు చిదంబరం చెవిలో ఊదుతున్నాడట! రేపు తమరు ప్రధాని అయితే కధెలా నడుస్తుందని సిబాల్ చిందులేస్తే, సిగ్గు పడుతూ రాష్ట్రపతినౌతానన్నాడట రాహుల్ బాబు!
* * *
ఉగ్రవాదాన్ని ఏదో ఒక కోణం నుంచి కాకుండా అన్ని కోణాల నుంచి ఎడాపెడా ఎదుర్కోవాలని జర్మని ఛాన్సలర్ ఎదురుగా మన ప్రధాని కంకణం కట్టుకున్నాడని రాహుల్ సిగ్గు పడ్డాడట. సిగ్గెందుకు పడ్డారని ఆరాతీస్తే, ఇంతాకాలం తొడుక్కున గాజులు చాలలేదనా ఇప్పుడు కంకణాలు తొడుకున్నాడని ఎక్కెసెక్కాలాడాడట!
చిటపటలు-08 "మంత్రదండం" (07-June-2011)
ఏమైందో ఏమిటో మన ప్రధానికి.... మొన్నేమో తీవ్రవాదాన్ని ఎడాపెడా ఎదుర్కునేందుకు మరోసారి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నిన్నేమో అవినీతిని అంతమొందించటానికి తన దగ్గర మంత్రదండమేదీ లేదని చెబుతున్నారు! మిస్టర్ ప్రైం మినిస్టర్ సార్, మంత్రదండం సంగతి తర్వాత. అసలు మీ కాళ్ళు చేతులూ ఆడుతున్నాయా అని అనుమానం. కాళ్ళూ చేతులూ కట్టేసి మిమ్మల్నేదో కుర్చీలో కుదేసారని లోకులు పలు కాకులై కావు కావుమంటున్నాయి మరి. ఇంతకి మంత్రదండం పది జనపథ్ లో ఉన్నదనైతే మీరు అన్యాపదేశంగా చెప్పటం లేదు కదా! ఏదేమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు సన్మానం చేయాల్సిందే.
* * *
మంత్రదండమంటే గుర్తొచ్చింది. అదేదో డిగ్గీరాజా దిగ్విజయ్ సింగ్ దగ్గర ఉన్నట్లుంది. మొన్న అన్నా హజారే, నిన్న రాందేవ్ బాబా, చివరికి నిన్నంటే నిన్న ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదిని చెప్పుతో కొడతానని బెదిరించిన వ్యక్తి వెనుక ఆరెస్సెస్స్ ఉందని పరిశోధనలో తేల్చేసారు. ఆ దండమేదో ప్రధానికి ఇచ్చి పుణ్యం కట్టుకోవచ్చు కదా డిగ్గీరాజా.
అయినా, జనాలు చెప్పులు పుచ్చుకొని కాంగ్రెస్ నాయకుల వెంటే ఎందుకు పడుతున్నారో! చిదంబరం, సురేష్ కల్మాడి తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా జనార్ధన్ ద్వివేదీ. రాంలీలా మైదాన్ లో లాఠీలతోను, తుపాకులతోనూ ఏదో సుతారంగా డిల్లీ పోలీసులు అదిలించారనే నెపంతో చెప్పుతో కొడతానని ఓ అనామకుడు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిని బెదిరించటం ఎంత అమానుషం... ఎంత అనాగరికం. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసారంటే చేయరు మరి. వాళ్ళేమైనా సామాన్య సన్యాసులా, సామాన్య ప్రజలా, బెదిరించగానే చీరలు సల్వార్ కమీజులు ధరించి పారిపోవటానికి.
* * *
పిచ్చోడిని పిచ్చోడంటే కోపం వస్తుందా రాదా! దొంగనైనా సరే దొంగ అంటే చిరాకు వేస్తుందా వేయదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మంత్రులని మోసగాళ్ళు అనేయటమేనా అన్నా హజారే సాబ్? కపిల్ సిబ్బల్ మనోభావాలు ఎంతలా గాయపడ్డాయో ఇప్పటికైనా మీకు అర్ధమయ్యిందా? మాట్లాడటం రాకపోతే డిగ్గీరాజా దగ్గరో, మనీష్ తివారి దగ్గరో నేర్చుకోండి. నోరు పారేసుకుంటే కాంగ్రెసోళ్ళు ఇక మీదట ఊరుకోరట. ఏరిపారేస్తారట!
చిటపటలు-09 "డిగ్గీ మంత్రదండం రాజా" (08-June-2011)
మంత్రి పదవి లేకపోయినా, తన దగ్గర మంత్రదండం ఉన్నదని నిరూపిస్తూ డిగ్గీరాజా ఇప్పటిదాకా ఎన్నెన్నో మహిమలు చూపించారని మనకు తెలుసు కదా! ఇప్పుడు లేటెస్టుగా, బాబా రాందేవ్ అనుచరుడు బాలకృష్ణ దగ్గర చట్టవ్యతిరేకంగా పాస్ పోర్టులు ఉన్నాయని, అతను భారతీయుడు ఎంతమాత్రం కాదని, నేపాల్ నుంచి పారిపోయి వచ్చిన నేరస్థుడని, అతని దగ్గర తుపాకి కూడా ఉన్నదని దండ మహిమతో డిగ్గీరాజా నిన్న ప్రెస్ కాంఫరెన్సులో ఓ రీలు వేసేసారు. అంతకు ముందు అలానే, కాషాయంలో ఉన్న బాబా రాందేవ్ ఓ వ్యాపారస్తుడని, చట్ట వ్యతిరేకంగా కోట్ల డబ్బు కూడబెట్టాడని, హరిద్వార్ లో ఉన్న ఆశ్రమం కూడా ఆక్రమించి కట్టిందని ఓ రీలు చూపించారు.
ఇలా సీరియల్సులా కాకుండా ఒక్కసారే డిగ్గీరాజా ప్రభుత్వానికి సినిమా చూపిస్తే ఓ పనైపోతుందిగా! ఈయన మంత్రదండ మహిమలకు చెవులు వాచిపోయినవాళ్ళు మాత్రం డిగ్గీరాజాకో మంత్రి పదవి పడేస్తే మంత్రదండం మూసుకు కూర్చుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ కాకుల్లా నోరుపారేసుకుంటున్నారుట.
* * *
ఈ నిర్వాకంలో కేంద్ర ప్రభుత్వానికే కాక, ఢిల్లీ పోలీసులకు కూడా మంత్రందండం అవసరం చాలా ఉన్నదని తెలుస్తుంది. రాంలీల మైదానంలో దాడి చేసిన రోజు, బాబాకు అనుమతి ఇచ్చింది రాజకీయ ఒత్తిడివల్ల అని, ఇప్పుడు కూడా రాజకీయ ఒత్తిడివల్లే భగ్నం చేసామని పోలీసులు చెప్పారు. ఆ మర్నాడు బాబా ప్రాణాలకి ముప్పు పొంచి ఉన్నదనే కారణం చెప్పారు. ఇప్పుడేమో, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నందు వల్ల ఆపేసామని చెబుతున్నారు. ఈ "చిదంబర" రహస్యం కాకులకెలా తెలుస్తాయి, కపిల్ సిబ్బల్ కూడా చెప్పకపోతే!
* * *
కపిల్ సిబ్బలీయం మరో కొత్త ప్రశ్న సంధించింది. కాషాయం వేసుకొని కాసుల కోసం కక్కుర్తిపడే సన్యాసికి రాజకీయాలెందుకు అని. బాబా మీద దాడి వల్ల తాము హిందువులకు వ్యతిరేకమని పడబోయే ముద్ర నుంచి తప్పించుకోవచ్చని ఊహించి ఆమేరకు పూరీనో ద్వారకానో శంకరాచార్యను కలిసి, ఆయనతో కూడా అదే ప్రశ్న వేయించింది. ఆ ప్రశ్నే శంకరాచార్యులవారికి వర్తించదా అని కాకులు గోల పెట్టటం విశేషం. యోగా చేసుకునే సన్యాసికి రాజకీయాలు అనవసరమైనప్పుడు, రాజకీయ సన్నాసులకి సత్యసాయిబాబాలతోను, శంకరాచార్యులతోను పనేముంది అని అడుగుతాననుకున్నారా? నేను అడగనంటే అడగను. ఆ విషయమేదో మంత్రదండాన్నే అడిగేయండి.
చిటపటలు-10 "గాంధీ తాత, సోనియా మాత, రాహుల్ బాబా" (10-June-2011)
నిన్న ఎన్.డి.టీవి బర్ఖాదత్ మన మంత్రదండాల డిగ్గీరాజాను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో డిగ్గీరాజా మంత్రదండంతో తెలిసిన రహస్యాలను లాజికల్ గా కూడా పరిష్కరించేసారు! అన్నాహజారే, రాందేవ్ బాబాలను వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సేస్సే అని ఎలా తెల్సిందని అడిగితే ఆయన తార్కిగంగా చెప్పిన విషయం విన్న వాళ్ళకి ఒళ్ళు గగుర్పొడిచే ఉంటుంది.
అన్నాహజారే నిరాహార దీక్ష చేసిన వేదిక మీద "భారత మాత" చిత్రపటం ఉందిట. అలానే, రాందేవ్ బాబా దీక్షా సమయంలో చేసిన ప్రసంగాల్లో పదే పదే "భారత్ మాతాకి జై" అని నినాదాలు చెసాడట. ఒక్క ఆరెస్సెస్ వాళ్ళు తప్పించి మరెవరూ భారతమాత చిత్రపటాన్ని ప్రదర్శించటం కానీ, భారత్ మాతాకి జై అనే నినాదాలు కానీ చేయరని.. కాబట్టి అన్నా, బాబాల వెనుక ఆరెస్సెస్సే ఉన్నదని తీర్మానించారు. నిజమే, ఎక్కడో అంగారక గ్రహం మీద నుంచి ఊడిపడ్డ మతోన్మాద ఆరెస్సెస్ కు అవినితీ మీద అందోళనలు చేసే హక్కు మనం ఎందుకివ్వాలి.
అసలైన సందేశాన్ని మాత్రం కాకులు పలురకాలుగా విశ్లేషిస్తున్నాయని సమాచారం. ఆ విషయాలేమిటంటే, మన రాజకీయ నాయకులకు పంతాలు పట్టింపులపై ఉన్నంత ఆసక్తి ఫలితాలపై ఉండదు. ఇక నుంచి దేశంలో ఎవరు ఏ ఉద్యమం జరపాలన్నా అక్కడ ఓ గాంధీ తాత ఫొటో పెడితేనే ఆ ఆందోళనకు ఓ అంథెంటిసిటి వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే, సోనియా మాత ఫొటో, రాహుల్ బాబా ఫొటో పెడితే, ఉద్యమం ఫలించి తీరుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలన్నీ ఈ విషయాన్ని గ్రహించాలి.
* * *
డిగ్గీరాజా ఏమైనా అంటే అన్నాడని విలవిల్లాడిపోతా కానీ, ఆయన మాటల్లో నిజం ఎందుకని గుర్తించలేకపోతున్నాం? ఢిలీ పోలీసులు రాందేవ్ బాబాను తన్ని తరిమేస్తే, భా.జ.పా. అదో పండుగలా జరుపుకోవటం ఏమిటి? పెళ్ళి ఊరేగింపుల్లోలా డాన్సులు చేయటం ఏమిటి? అందులోను, బాపూజి సమాధి దగ్గర! గాంధీజీ ఆత్మ ఎంత క్షోభించి ఉంటుంది? సమయం, సందర్భం, స్థలం పట్టించుకోకపోతే ఎలా?
ఇదేమైనా ఎన్నికల సీజనా ఎక్కడపడితే అక్కడ గానాబజానాలు మొదలేయటానికి, తొడలు గొట్టి మీసాలు మెలేయటానికి? పోనీ, చేసే డాన్సైనా సక్రమంగా ఏడ్చిందా అంటే అదీ లేదు. పాటైనా షీలాకి జవానీనో, మున్ని బద్నామో అయినా కాదు. పోనీ ఇందిరాగాంధి లాగా నెత్తిన కడవలో కుండలో పెట్టుకొని చేసారా అంటే అదీ లేదు. కనీసం సోనియాలానో మిచెలీ ఒబామాలానో సక్రమంగా స్టెప్పులైనా ఉన్నాయా అంటే అదీ లేదు. దేని కోసం ఇంత సంబరం చేసుకోవటం? మన్మోహన్ పిలక గుప్పిట్లోకొచ్చిందనేగా ఈ హడావుడీ అంటా. మరి, నీ పిలక నా చేతిలో ఉందని వెక్కిరిస్తే చిన్న పిల్లోడికైనా కోపం రాదా ఎంటి?